
సర్వేలో వెల్లడి
సాక్షి, చెన్నై: విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్ సినీమా షూటింగ్ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు.
ఆ పార్టీ వర్గాలు విజయ్ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది.
అలాగే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్ చేసుకుంటుండడం గమనార్హం.