దివ్యాంగుడికి సైతం
సాక్షి, చెన్నై: నాగరిక రాజకీయం అంటూ ముందుకు సాగుతున్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తన పార్టీ రూపు రేఖలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. సూట్ కేసులతో విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిని పక్కన పెట్టి, తన అభిమానిగా చేసిన సేవలకు గుర్తింపు ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నైలో ఓ జిల్లాకు ఆటోడ్రైవర్‌ను కార్యదర్శిగా నియమించారు. కోయంబత్తూరులో దివ్యాంగుడికి జిల్లా కార్యదర్శి పదవి కేటాయించారు. గృహిణిగా ఉన్న తన వీరాభిమానికి రామనాధపురం జిల్లా కార్యదర్శి పదవి అప్పగించారు. వివరాలు..
తమిళగ వెట్రి కళగం ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ, మహానాడు నిర్వహణ అంటూ అన్నీ వినూత్నంగా విజయ్ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న ఆయన ప్రజా ప్రయాణానికి శ్రీకారం చుట్టినా, ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాలతో ప్రజలలోకి చొచ్చుకెళ్లలేదు. ఇందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి. అదే సమయంలో పార్టీ పరంగా జిల్లాల కమిటీల ఏర్పాటును విస్తృతం చేశారు.
రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కొన్ని చోట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా, మరికొన్ని చోట్ల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లాను తీర్చిదిద్ది కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, ఒక కోశాధికారితో పాటూ 10 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులను నియమిస్తున్నారు. ఈ పది మందిలోనూ నలుగురు మహిళలను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా కార్యదర్శులు జాబితాను విడుదల చేశారు. ప్రతి విడతలతోనూ 19 చొప్పున జిల్లాలకు కమిటీలు ఉంటూ వచ్చాయి.
సాధారణ కార్యకర్తలకు గుర్తింపు
ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు తన అభిమాన సంఘాల్లో శ్రమిస్తున్న సాదాసీదా వ్యక్తులను గుర్తించి వారికి పదవులు అప్పగిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా దక్షిణ చెన్నై ఉత్తర జిల్లా కార్యదర్శి టీ నగర్‌కు చెందిన కె. అప్పును నియమించారు. ఈ అప్పు ఆటో డ్రైవర్, రోజు వారి ఆటో నడపడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విజయ్‌ను గుండెల్లో పెట్టుకుని ఆయనే సర్వం అని ముందుకెళ్తూ వచ్చిన అప్పుకు పార్టీలో గుర్తింపు కల్పించారు. జిల్లా కార్యదర్శి పదవి అప్పగించి, రాజకీయ ప్రయాణానికి అవసరమయ్యే అన్ని బాధ్యతలను పార్టీ చూసుకునే దిశగా ఏర్పాట్లు చేయడం విశేషం. అలాగే, కోయంబత్తూరు తూర్పు జిల్లా కార్యదర్శిగా దివ్యాంగుడైన బాబును నియమించారు.
మూడు చక్రాల వాహనంలో తిరుగుతూ విజయ్ కోసం ప్రాణాలరి్పంచేందుకు సిద్ధం అని చెప్పుకుంటూ వచ్చిన బాబును గుర్తించి పదవి అప్పగించడం మరో విశేషం. ఇక, తనకు వీరాభిమానిగా ఉన్న గృహిణి మలర్ వెలి జయబాలను గుర్తించి రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని అప్పగించారు. పదవులు తమకంటే తమకు ఇవ్వాలని అనేక మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తుంటే, తనకు నిజమైన సేవకులుగా ఉండే వారిని గుర్తించి విజయ్ పదవులను అప్పగిస్తుండడం గమనార్హం. విజయ్ అభిమానాన్ని చూస్తారేగానీ, నోట్లను, షూట్ కేసులను కాదు అని ఆటో డ్రైవర్ అప్పు పేర్కొంటున్నారు. తన లాంటి వారికి రాజకీయ గుర్తింపు కలి్పంచే విధంగా పదవి అప్పగించిన విజయ్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా శ్రమిస్తానని దివ్యాంగుడైన బాబు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment