
కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ చర్చలు
ఎన్నికల అజెండా అంశాలపై సుదీర్ఘ మంతనాలు
17న పట్నాలో మరోమారు భేటీ
నితీశ్‌ను బీజేపీ హైజాక్ చేసిందని తేజస్వి విసుర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న బిహార్ శాసనసభ ఎన్నికలపై విపక్షాల ‘ఇండియా’ కూటమి ఇప్పటికే తమ వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. జనతాదళ్(యూ) నేతృత్వంలోని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న కసితో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) తన మిత్రపక్షాలనైన కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో తొలిదశ చర్చలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో పాటు బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్, ఆర్జేడీ నాయకులు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో పొత్తులు, సీట్ల పంపకాలు, ఎన్నికల అజెండా తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అధికారమే లక్ష్యంగా..
గత 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ–జేడీయూలు ఎన్డీఏ కూటమిగా, ఆర్‌జేడీ–కాంగ్రెస్‌లు మహాఘట్‌బంధన్ కూటమిగా బరిలో దిగాయి. 243 స్థానాలున్న బిహార్‌లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలను కైవలం చేసుకుంది. మహాఘట్‌బంధన్ కూటమి 110 స్థానాలను దక్కించుకుంది. దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీశ్ కుమార్ (Nitish Kumar) 2022లో బీజేపీతో విభేదించి మహాఘట్‌బంధన్‌లో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.
అనంతరం మళ్లీ 2024లో మహాఘట్‌బంధన్‌తో బంధం తెంచుకుని తిరిగి బీజేపీ చెంతనచేరారు. కమలదళం దన్నుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తాను కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరి అతిపెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోనని వ్యాఖ్యానించారు. నితీశ్ అంత మోసకారి మరొకరు లేరని, ఆయన విశ్వాస ఘాతకుడంటూ కాంగ్రెస్, ఆర్‌జేడీలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. నితీశ్ అవకాశ వాదానికి గట్టిగా బదులివ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్న రెండు పార్టీలు ఆయన్ను బలంగా ఢీకొట్టాలని భావిస్తున్నాయి.
చదవండి: సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు
ప్రస్తుతం అసెంబ్లీలో 243 స్థానాలకు గానూ బీజేపీకి 78, జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్‌జేడీకి 75, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా, ఈసారి దాదాపు 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఆర్‌జేడీ గత ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ పడగా, ఈ సారి 150కి పైగా స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతోంది. మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంసిద్ధతను మొదలుపెట్టి సీట్ల పంపకాలు, ఎన్నికల ప్రచార అంశాలపై ఆర్జేడీ తొలి దశ చర్చలకు శ్రీకారం చుట్టింది.
నితీశ్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి
ఈ భేటీ అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, ఏప్రిల్ 17న పట్నాలో కాంగ్రెస్ నాయకులతో జరిగే తదుపరి సమావేశంలో మరిన్ని వివరాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని, ఎన్‌డీఏ పాలనలో ఎటువంటి అర్థవంతమైన అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర పార్టీలతో కూడిన మహాఘటబంధన్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ చర్చించి ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఊహాగానాలకు తావివ్వరాదని అన్నారు.