
హరహర మహాదేవ అంటూ హర్షధ్వనులతో గొంతెత్తిన కోట్లాది భక్తజనంలో మన భాగ్యనగరవాసులూ ఉన్నారు. గంగమ్మ తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ పుణ్యస్నానాలు ఆచరించిన జన సంద్రంలో భాగమై నగరమూ తడిసి ముద్దయి మురిసింది. తండోపతండాలుగా.. నగరం నుంచి కుంభ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్యతో కూడిన ఆధ్యాత్మిక యాత్రను ప్రణాళికాబద్దంగా డిజైన్ చేసుకుని కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చారు. చాలా మంది వ్యక్తిగత వాహనాలు ఎంచుకోగా, ప్రయాణాల కారణంగా రైళ్లు, బస్సులతో పాటు విమానాల్లో సైతం టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక విమాన యానం ధరలు ఆకాశాన్ని తాకాయి. చివరి రోజైన బుధవారం విమానం టిక్కెట్ ధర రూ.40వేలకు పైగానే ఉండటం రద్దీకి నిదర్శనం.
టాలీవుడ్ తెరవేల్పులు ఎందరో మన నగరం నుంచీ కుంభ్‌మేళాకు తరలివెళ్లారు. సినిమా సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే చిన్నితెర తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా భారీగానే వెళ్లి వచ్చారు. నగరంలో జరిగిన నుమాయిష్ కి లక్షల సంఖ్యలో సందర్శకులు తగ్గిపోవడానికి కుంభ్‌మేళా ఒక కారణమని నిర్వాహకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మహా క్రతువు ముగిసిన వేళ.. నగరం నుంచి కుంభ్‌కి వెళ్లొచ్చిన పలువురు నగరవాసులు తమ జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు.
ఈ అనుభూతి వేరు..
నాన్నగారి అస్తికల నిమజ్జనం కోసం తొలిసారి వెళ్లినప్పటి నుంచి అంటే దాదాపు 15ఏళ్లుగా, కాశీ, త్రివేణీ సంగమంతో నాకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. మనసుకు తోచిన ప్రతీసారీ.. అక్కడకు వెళ్లివస్తుంటా. అయితే ఈ సారి ప్రయాగ్‌కు చేసిన ప్రయాణం చాలా ప్రత్యేకం. కోట్లాది మంది భక్తులతో కలిసి దైవ నామస్మరణ చేస్తూ పుణ్యస్నానాలు చేయడం.. అద్భుతమైన అనుభవం. నాతో పాటు నా స్నేహితుల్లోనూ ఆధ్యాతి్మకత మరింత పెరిగేలా చేసింది కుంభ్ మేళా.
– చంగవల్లి శ్రీనివాస్, స్నేహితులు, దమ్మాయిగూడ
’
అనిర్వచనీయం.. ఆ భావం..
మహాకుంభ్ సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి అరడజను మంది స్నేహితులతో కలిసి వ్యక్తిగత వాహనంలో వెళ్లాం. జనసమ్మర్ధం వల్ల, సమాచారం లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. అయినప్పటికీ త్రివేణీ సంగమంలో స్నానాలతో అవన్నీ మరచిపోయాం. ఆ అనుభూతిని అనిర్వచనీయమైనదనే చెప్పాలి. వెళ్లే దారిలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా అనిపించినా, ప్రయాగ్‌రాజ్ నుంచి తిరిగివస్తున్నప్పుడు మాత్రం మళ్లీ రాలేం కదా అని మనసు భారమైంది. కాశీలో 9గంటలు వేచి దర్శనం చేసుకున్నా కూడా అలసట అనిపించలేదు.
– ఆర్.అరుణ్‌కుమార్, ఎల్బీనగర్
దేవదేవుని స్పర్శతో పులకించి..
నీళ్లను తాకినట్టుగా అనిపించలేదు. ఆ దేవదేవుడే స్పర్శించినట్టు శరీరం పులకించింది. నగరం నుంచి కాశీ అక్కడ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు 23 గంటల పాటు ప్రయాణం. అక్కడకు చేరుకోగానే అంతవరకూ ఆవరించిన ప్రయాణ బడలికలన్నీ చేతితో తీసినట్టు మాయమైపోయాయి. నోస్ ఆఫ్ త్రివేణీ సంగమం అనే ప్రత్యేకమైన ప్రాంతంలో నాగసాధువులూ, అఘోరాలతో కలిసి స్నానాలు ఆచరించడం అసలు ఊహించని విశేషం. ఎక్కడ చూసినా భక్త జనసంద్రమే. అక్కడ ఉట్టిపడిన ఆధ్యాత్మికత నాలో నా ఆలోచనల్లో మార్పులు తెచ్చింది. వెళ్లకుండా ఉంటే ఎంత మిస్సయి ఉండేదానినో అనిపించింది. దైవభక్తి ఎక్కువే.. అయితే ఇంతగా తనువూ మనసూ ఆద్యంతం ఆధ్యాత్మికత ఆవరించడం మున్నెన్నడూ జరగలేదు.
– అర్చన చిగుళ్లపల్లి, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్
Comments
Please login to add a commentAdd a comment