ఓఎల్‌ఎక్స్‌లో పోస్టుల ఆధారంగా ప్లాన్
దాన్ని ఖరీదు చేస్తానంటూ విక్రేతకు ఎర
వారితో డిలీట్ చేయించి తాను పోస్టింగ్
ఆపై అమాయకుల నుంచి డబ్బు స్వాహా
తెలుగు రాష్ట్రాల్లో 200 మంది బాధితులు
నిందితుడికి చెక్ చెప్పిన పంజగుట్ట కాప్స్
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: యజమాని అతడు కాదు... విక్రయించేది–ఖరీదు చేసేదీ కూడా అతగాడు కానేకాదు... అయినప్పటికీ ఈ–కామర్స్ సైట్‌లో ఫోన్లకు సంబంధించిన పోస్టులు చేసిన వారిని సంప్రదించి డిలీట్ చేయిస్తాడు... ఆపై అవే వివరాలను తాను పోస్టు చేస్తాడు...క్రయవిక్రయాలు చేసే వారిని ఓ ‘ప్లాట్‌ఫామ్’ పైకి తీసుకువస్తాడు..ఆ ఇద్దరినీ కలిపి తాను ‘లాభపడతాడు’. కేవలం ఐఫోన్లనే టార్గెట్‌గా చేసుకుని, ఈ వినూత్న పంథాలో తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని మోసం చేసి రూ.60 లక్షలు స్వాహా చేసిన ఘరానా మోసగాడు మరిశర్ల బాలాజీ నాయుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ఎస్.మోహన్‌కుమార్ ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్ బి.శోభన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్‌లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్...
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన బాలాజీ నాయుడు అక్కడి ఎస్వీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చిన ఇతగాడు తొలినాళ్లల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పని చేశాడు. జల్సాలు, బెట్టింగ్స్, ఆన్‌లైన్ గేమింగ్స్‌కు జీతం డబ్బులు చాలకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరబాట పట్టాడు. ఇందులో భాగంగా వివిధ పేర్లతో సిమ్‌కార్డులు తీసుకునే ఇతగాడు తరచు తన ఫోన్లు మారుస్తూ ఉంటాడు. 2018 నుంచి మోసాలు చేయడం మొదలెట్టిన బాలాజీ ఇప్పటి వరకు 30 ఫోన్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి ఉపకరించే ఈ–కామర్స్ సైట్ ఓఎల్‌ఎక్స్ ఆధారంగా మోసాలు ప్రారంభించాడు. ఆ సైట్/యాప్‌ను ఆద్యంతం గమనించే బాలాజీ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లు పెట్టిన పోస్టుల్ని గుర్తిస్తాడు. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని అందులోని ఫొటోతో పాటు ఇతర వివరాలు కాపీ చేసుకుని భద్రపరుచుకుంటాడు.
వారితో తీయించి తాను పోస్టు చేసి...
ఆపై ఆ పోస్టు చేసిన వ్యక్తిని సంప్రదించే బాలాజీ ఏమాత్రం బేరసారాలు లేకుండా ఆ ఫోన్ తాను ఖరీదు చేస్తున్నట్లు, త్వరలోనే సంప్రదించి కలుస్తానని చెప్తాడు. అలా వారి నమ్మకాన్ని పొంది ఓఎల్‌ఎక్స్ నుంచి పోస్టు తీసేలా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్ద ఉన్న ఫొటో, వివరాలతో తానే ఆ ఫోన్ విక్రయిస్తున్నట్లు అదే ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేసే బాలాజీ..తక్కువ రేటు పొందుపరుస్తాడు. ఈ పోస్టును చూసిన వాళ్లల్లో ఆకర్షితులైన వాళ్లు ఫోన్ ద్వారా బాలాజీని సంప్రదిస్తారు. వారితో బేరసారాలు పూర్తి చేసే అతగాడు..ఫలానా చోట తనను కలిసి, నగదు చెల్లించి, ఫోన్ తీసుకువెళ్లాలని సూచిస్తాడు.
అదే సమయంలో ఫోన్ అసలు యజమానికి సంప్రదించే బాలాజీ అతడినీ ఆ ప్రాంతానికి రమ్మని, నగదు చెల్లించి ఫోన్ తీసుకుంటానని చెప్తాడు. అలా ఫోన్ యజమాని, తన ప్రకటన చూసి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన వ్యక్తి కలుసుకోవడానికి కొద్దిసేపటి ముందు వారిని మరోసారి సంప్రదిస్తాడు. తాను రాలేకపోతున్నానని, తన సోదరుడు వస్తున్నాడని చెప్పి, ఫోన్ రేటు విషయం చెప్తే అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నావు? అని మందలిస్తారంటూ వారికి చెప్తాడు. ఈ కారణంగానే రేటు విషయం చర్చించ వద్దంటూ ఇద్దరికీ చెప్తాడు. ఇలా ఆ ఇద్దరూ కలిసిన తర్వాత ఖరీదు చేసే వ్యక్తిని బుట్టలో వేసుకుని యజమాని వద్ద ఫోన్ చూసిన వెంటనే నగదు తనకు బదిలీ చేసేలా చేస్తాడు. ఆపై తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుంటాడు.
క్రయవిక్రేతలు మాత్రం కొద్దిసేపు ఘర్షణ పడి, అసలు విషయం తెలుసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇలా ఇతగాడు తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని ముంచి రూ.60 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును డప్ఫాబెట్, సారా, రమ్మీటైమ్, రమ్మీ సర్కిల్ వంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టడం, జల్సాలు చేయడం చేసి ఖర్చు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో బాధితులకు నేరుగా ఆయా యాప్స్‌కు సంబంధించిన క్యూర్‌కోడ్స్ పంపి, నేరుగా డబ్బు వాటికే పంపేలా చేశాడు. ఇతగాడిని కటకటాల్లోకి పంపిన పంజగుట్ట పోలీసులు రెండు ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు
స్వాదీనం చేసుకున్నారు. బాలాజీపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 138 ఫిర్యాదులు, తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల పంజగుట్టలో 3, మధురానగర్‌లో మరో 3 కేసులు నమోదు కాగా..మరో 25 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment