ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ | ACB Caught SI While Taking Bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

May 13 2025 8:25 AM | Updated on May 13 2025 8:25 AM

ACB Caught SI While Taking Bribe

ఓ వ్యక్తిని రిమాండ్‌ చేయకుండా ఉండేందుకు రూ.25 లక్షలు డిమాండ్‌

రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఒత్తిడి 

సూర్యాపేటటౌన్‌: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్‌ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా చేసిన తనిఖీల్లో సరైన ఆధారాలు దొరకడంతో డీఎస్పీ, సీఐపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. 

దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్‌ సెంటర్‌ను నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన్ను రిమాండ్‌కు తరలించకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు డిమాండ్‌ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై ఒత్తిడి చేశారు. 

ఆ ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతను ఇచి్చన ఫిర్యాదును పరిశీలించి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ, సీఐలపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. కేసులో రిమాండ్‌ చేయకుండా ఉండటానికి, అతని స్కానింగ్‌ సెంటర్‌ను భవిష్యత్‌లో సక్రమంగా నడిపించడానికి డబ్బులు డిమాండ్‌ చేసినట్టు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో డబ్బులు డిమాండ్‌ చేసినట్టు తేలడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ కమలాకర్‌రెడ్డి, నల్లగొండ రేంజ్‌ ఏసీబీ టీం సభ్యులు పాల్గొన్నారు.  

లంచం డిమాండ్‌ చేస్తే 1064కు ఫోన్‌ చేయండి  
ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ ఉంటుందని, లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే 1064కు కాల్‌ చేయాలని డీఎస్పీ జగదీశ్‌చందర్‌ తెలిపారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement