
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు.. సోదాఉ చేపట్టారు. అయితే, హరిరాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు. ఇక, ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, టోలీచౌకిలోని హరిరాం ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తిపత్రాలను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి గుర్తింపు.. అలాగే, మూడు బ్యాంక్ లాకర్స్‌ను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా అనధికారిక లావాదేవీలను కూడా గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసును ఏసీబీ బుక్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్‌లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఇక, ఎన్‌డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్‌లో ఎన్‌డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్‌ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.
కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్‌గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.