అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితుడు
డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన మధ్యవర్తి
ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్‌ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్‌ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్‌స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్‌ఐని ప్రశ్నించడంతో.. ఇన్‌స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు.
ఒక్క కేసే క్లోజ్ చేస్తామని..
కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్‌ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్‌ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్‌ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment