
సాక్షి, హైదరాబాద్: బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్‌గాంధీ నాయకత్వంలో మనమంతా దేశంలో బీజేపీని ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో ముందుకు తీసుకుని వెళ్తుంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్’లో బుధవారం సీఎం ప్రసంగించారు.
వల్లభాయ్ పటేల్‌తో హృదయపూర్వక బంధం
‘గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్‌తో మాకు హృదయపూర్వక బంధం ఉంది. వల్లభాయ్ పటేల్ మాకు స్వాతంత్య్రం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒకటే చెబుతున్నా. మేము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం..అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్ అన్నారు.
మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే..
‘రాహుల్‌గాంధీ తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి చూపించింది. మరో హామీ అయిన కులగణనను కూడా పూర్తి చేశాం. కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌పై లోక్‌సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా రాహుల్‌గాంధీని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది.
మరోవైపు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. రెండు కోట్ల మందికి రాకపోయినా మోదీ, అమిత్‌షాలకు మాత్రం పదవులు వచ్చాయి. రైతులు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలపాటు ఆందోళన చేసినా మోదీ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు.
మోదీ మణిపూర్‌లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారు. మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే. కానీ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరిట 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
బీజేపీ ఓటమికి కంకణబద్ధులై వెళ్లాలి
దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడూ లాఠీ ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, మోదీ ఆలోచన విధానాన్ని అడ్డుకునేందుకే మనమంతా ఇక్కడ ఏకమయ్యాం.
ఇక్కడకు వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రతిచోటా ఓడించేలా కంకణబద్ధులై వెళ్లాలి. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని అడ్డుకుని దేశాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.