
గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్..
ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దేశంలో గుజరాత్ మినహా ఏ రాష్ట్రానికి కూడా మోదీ సహకరించడం లేదు
పెట్టుబడులు ఏమొచ్చినా గుజరాత్‌కే వెళ్లాలంటున్నారు
మోదీతో వ్యక్తిగత విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే విభేదిస్తున్నా..
హైదరాబాద్ అభివృద్ధి 450 ఏళ్ల క్రితమే మొదలైంది
ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత
దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించి ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నం
ఇక్కడ అధికారం లేనందునే నియోజకవర్గాల పునర్విభజన ప్రయత్నం
అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు.. ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్‌లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.
మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్‌లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్‌లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం.
చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా?
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది.
బీసీలకు బీజేపీ అన్యాయం
జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.
బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ...
కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్‌ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే..
అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత.
ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా..
అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు.
దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం
ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి.
హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి..
ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి.