
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకేం లాభం?
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అసదుద్దీన్ ఒవైసీనే బిగ్‌బాస్
ఆ పార్టీలతో బీజేపీకి దోస్తీ ఉందన్నవాళ్లను చెప్పుతో కొట్టండి
మీడియా చిట్‌చాట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టం.
సర్కార్‌కు ఇంకా మూడున్నరేళ్లకు పైగా గడువు ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతి నిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... భూముల విక్రయం, అప్పులు చేయడం, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు.
కేసులు ఎదుర్కునేందుకూ సిద్ధం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల కూల్చివేత, భూమి చదునుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లు నరికిన పరిస్థితి గతంలో ఎక్కడా జరగలేదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంలో ఎవరో ఏఐతో చేసిన నకిలీ ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టారని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. హెచ్‌సీయూ అంశంపై గతంలో తాను ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌కు కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో కేసులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ భూముల విక్రయం వెనక బీజేపీ ఎంపీ ఉంటే, అతడి పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు అసదుద్దీన్ బిగ్‌బాస్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిగ్‌బాస్ అని, ఆయనే ఈ రెండు పార్టీలను నియంత్రిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 19న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భూబకాసు రులు నిరసనలు నిర్వహిస్తున్నారని ఎంఐఎం సభను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర కార్పొరేటర్లను కూడా కలిసి ఓట్లు అడుగుతామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలిసి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఇకపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో బీజేపీకి దోస్తీ ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని ప్రజలకు సూచించారు.