
ఐదేళ్ల తర్వాత ప్రజలే తన్ని తరిమేస్తారు.. రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారు: కేటీఆర్
ఆత్మాభిమానం లేని సీఎం.. విమర్శలు వచ్చినా దులుపుకుంటున్నాడు
కంచ గచ్చిబౌలి భూములపై మోదీ స్పందించి విచారణకు ఆదేశించాలి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఎందుకు.. ఐదేళ్ల తర్వాత ప్రజలే తన్ని తరిమేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ఈ ప్రభుత్వ పనితీరు బాగా లేదంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఈ సర్కారును ఎత్తి పడేయమని మమ్మల్ని అడుగుతున్నారు. కొందరు చందాలు వేసుకొని
సర్కారును కూలగొట్టమని అడుగుతున్నారని మాత్రమే మా ఎమ్మెల్యే చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అనే విషయం ప్రజలకు తెలియాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలి. అలా అయితేనే మరో 20 ఏళ్ల వరకు ఎవరూ కాంగ్రెస్‌కు ఓటు వేయరు’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెబుతారు. అవసరమైతే ప్రజలే రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మా పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ల బతుకు అధ్వానంగా ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి
‘కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆత్మాభిమానం లేని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినా రాజీనామా చేయకుండా దులుపుకొని బతుకుతున్నాడు. ఏడాది క్రితం రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ ఇప్పుడు మేల్కొని హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు.
సెంట్రల్ ఎంపవర్ కమిటీ (సీఈసీ) నివేదిక ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు. బీజేపీకి తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో పర్యావరణ విధ్వంసంపై విచారణకు ఆదేశించాలి. లేదా ఆర్‌బీఐ, సీవీసీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలకు అయినా దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలి’అని కేటీఆర్ మండిపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అరాచకం
‘సీబీఐని గతంలో కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే.. ప్రస్తుతం బీజేపీ ఈడీని విచ్చలవిడిగా వాడుతోంది. కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ ఉద్దేశాల మీద తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. చెరువులను కూడా తాకట్టుపెట్టిన వైనం బయట పెట్టింది. అయినా రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మోదీ ఆరాటపడుతున్నాడు.
కేంద్రం స్పందించకుంటే ఈ నెల 27 తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలను కలిసి ఆధారాలు అందజేయడంతోపాటు బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై మోదీ స్పందించకుంటే ఆయనకు వాటా ఉందని అనుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కంటే క్షేత్ర స్థాయిలోనే రేవంత్ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉంది’అని కేటీఆర్ చెప్పారు.