
దుబాయ్‌లో ఉండగా నగర మహిళతో ప్రేమాయణం
ఆమె కోసమే అడ్డదారిలో సరిహద్దులు దాటి సిటీకి..
2018లో అరెస్టు చేసిన నగర సైబర్ క్రైమ్ పోలీసులు
కేసులు తేలినా ఇప్పటికీ డిటెన్షన్ సెంటర్‌లోనే
సాక్షి,హైదరబాద్: కాశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ముష్కర మూకల ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై పోరు కొనసాగుతోంది. ఈ ఘాతుకాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్థానీల వీసాల రద్దు కూడా అందులో ఒకటి. దీంతో వివిధ రకాలైన వీసాలపై నగరంలో ఉన్న 208 మంది పాకిస్థానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంలో తెరపైకి వచ్చే అంశమే హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్‌లో బందీగా ఉన్న పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్. సిటీలో నమోదైన కేసుల విషయం తేలినా.. ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయాడు.
ఢిల్లీ వాసిగా నమ్మించి..
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. 17 ఏళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్థానీ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం నగరానికి వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ ఆమెతో చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ.. అక్కడి నుంచి నగరానికి చేరుకున్నాడు.
ఆ విషయం బయటపడక..
ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన అతగాడు ఆమెను వేధించడంతో మహిళా ఠాణాను ఆశ్రయించింది. దీంతో ఇక్రమ్‌పై వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఇక్రమ్‌ను విచారించి, నోటీసులు జారీ చేశారు. అప్పట్లో తన భర్త పాకిస్థాన్‌కు చెందినవాడని చెప్పకపోవడంతో విషయం బయటకు రాలేదు. పోలీసులు 2018 జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సరిహద్దుల నుంచి వెనక్కు..
సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసు విచారణ, శిక్షా కాలం ముగియడంతో ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు బలవంతంగా తిప్పి పంపాలని (డిపోర్టేషన్) భావించారు. డిపోర్టేషన్‌కు సంబంధించిన పత్రాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు చెప్పిన పాకిస్థాన్ అధికారులు అతడి రాకను అడ్డుకున్నారు. కాగా.. తనపై నమోదైన కేసును భార్యతో రాజీ చేసుకున్న ఇక్రమ్‌ను దాదాపు రెండేళ్లుగా నగరంలోని సీసీఎస్ అదీనంలో ఉన్న డిపోర్టేషన్ సెంటర్‌లో ఉంచారు. ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు పంపడానికి అవసరమైన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా పహల్గాం ఉదంతంతో ఇతడి డిపోర్టేషన్ పక్రియపై సందేహాలు నెలకొన్నాయి.