
స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలు వెల్లడిస్తున్నఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ ఖురేషి
కిలోల కొద్దీ గంజాయి ప్రత్యేక ప్యాకింగ్
కీలక ఆధారాలతో కూడిన వీడియోలు సేకరించిన ఎక్సైజ్‌శాఖ
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్‌గిరి కేంద్రంగా కొన్ని ముఠాలు గంజాయి ప్రాసెసింగ్ చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ కీలక ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి అంతా మల్కన్‌గిరి అటవీ ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలు.. అక్కడే ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. మల్కనగిరి నుంచి గంజాయిని హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేయగా, అసలు విషయం వెలుగుచూసింది.
⇒ ఉప్పల్ హెచ్‌సీఎల్ మల్లాపూర్‌లో జరిపిన సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందికి చిక్కిన నిందితులు వివేక్‌రెడ్డి, మధుకిరణ్‌ల ఫోన్లలో ఈ మేరకు కీలక వీడియోలు లభించాయి. వీటిల్లో టన్నుల కొద్ది గంజాయిని కుప్పగా పోసి కొందరు వాటిని ప్యాకింగ్ చేస్తూ..గంజాయి రవాణా గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గంజాయి ముఠా కార్యకలాపాలను క్షణ్ణంగా వివరించే ఇలాంటి వీడియోలు దర్యాప్తు బృందాలకు చిక్కడం ఇదే తొలిసారి అని మల్కాజ్‌గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
ప్రాసెసింగ్ నుంచి ప్యాకింగ్ దాకా
అటవీ ప్రాంతంలో సేకరించిన గంజాయిని ఎండబెట్టిన తర్వాత అంతా ఒక్కచోటకు తెస్తారు. కుప్పలుగా పోసి..దానిని కిలోల చొప్పున అవసరం మేరకు ఎన్ని కిలోల ప్యాకెట్లు కావాలంటే అంత బరువు తూచి ఒక కవర్‌లో పెడతారు. ఈ కవర్లను చతురస్రాకార డబ్బాల్లో కూర్చి వీలైనంత వరకు ముద్దగా మార్చుతున్నారు. ఆ తర్వాత ఆ చతురస్రాకార బాక్స్‌ల్లోని గంజాయిని ప్రెసింగ్ రాడ్ కింద పెట్టి పదిమంది తిప్పుతూ వీలైనంత మేరకు తక్కువ పరిమాణంలో కనిపించేలా ముద్దలా అయ్యేలా చేస్తున్నారు. దీనిపై ప్లాస్టర్‌తో సీల్ చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల బరువు ఎక్కువగా ఉన్నా..ప్యాకెట్ సైజు కుదించబడడంతోపాటు, గంజాయి రవాణా సమయంలో వాసన రాకుండా చేస్తున్నారు. దీన్ని దళారులు, గంజాయి ముఠాలతో డీల్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలం, రాజమండ్రి మార్గాల్లో రోడ్డు మార్గంలో, లేదంటే ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రైలు మార్గంలో దేశంలోని పలు పట్టణాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి.
రూ.53 లక్షల విలువైన గంజాయి సీజ్
మల్లాపూర్‌లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని ఎక్సైజ్‌శాఖ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.53 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆబ్కారీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, మల్కాజ్‌గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా ముఠాకు చెందిన దగ్గుమల్లి మధు కిరణ్ , కట్ల వివేక్‌రెడ్డిలను అరెస్టు చేయగా, ఏ–1 మల్కన్‌గిరి జిల్లాకు చెందిన రాంబాబు పరారీలో ఉన్నట్టు తెలిపారు.