
సోషల్ మీడియాలో ఇన్‌స్టా క్వీన్(Insta Queen)గా పేరున్న సీనియర్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీస్ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. ఇంతకాలం ఆమె విలాసాలకు కారణం ఏంటన్న గుట్టు కూడా ఎట్టకేలకు వీడింది.
పంజాబ్‌లో మాదకద్రవ్యాల కట్టడికి అక్కడి ఆప్ ప్రభుత్వం యుధ్ నాశేయన్ విరుధ్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో.. బాదల్ ఫ్లైఓవర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో మరో వ్యక్తితో పాటు అమన్‌దీప్ కౌర్(Amandeep Kaur) కూడా ఉండగా.. వాళ్ల వద్ద 17 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రాథమిక చర్యల కింద మాన్సా పీఎస్ నుంచి బథిండా పోలీస్ లైన్స్‌కు ఎటాచ్ చేశారు.
అయితే.. దర్యాప్తులో డ్రగ్స్ రవాణాలో ఆమె పాత్ర ఉందని తేలడంతో గురువారం డిస్మిస్ చేస్తూ పంజాబ్ పోలీస్ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. police_kaurdeep పేరిట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. థార్ కారులో కూర్చుని.. ఖరీదైన వాచీలను ధరించి పాటలు పాడుతూ ఐఫోన్లలో రీల్స్ చేస్తూ వస్తోంది. ఫాలోవర్స్ తక్కువే అయినా ఆమె ఇచ్చే బిల్డప్‌లకు ఇన్‌స్టా క్వీన్‌గా ఆమెకు ఓ పేరు అయితే ముద్రపడింది. అయితే..
అమన్‌దీప్ కౌర్ ఇంతకు ముందు కూడా వార్తల్లోకి ఎక్కారు. గుర్మీత్ కౌర్ అనే మహిళ ఆమెపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అమన్‌దీప్ దగ్గర రూ.2 కోట్ల విలువైన బంగ్లా.. లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయని ఆరోపించింది. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ ఆంబులెన్స్‌లోనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని ఫేస్‌బుక్‌లో ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి రవాణా చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.