Excise Department
-
కొత్త కంపెనీలను పిలవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడం కోసం కొత్త కంపెనీలను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం సరఫరా కంపెనీలను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించాలని.. ఇందుకోసం కనీసం నెల రోజులు గడువు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేయాలని.. ఇప్పటికే సరఫరా చేస్తున్న కంపెనీల కోసం సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని స్పష్టం చేశారు.మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ బీర్ల ధరల పెంపు డిమాండ్, బకాయిలు చెల్లించనందున తెలంగాణలో తమ బ్రాండ్ మద్యాన్ని సరఫరా చేయబోమని ప్రభుత్వానికి లేఖ రాసిన అంశంపై చర్చించినట్టు తెలిసింది.కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదుయూబీ కంపెనీ వాదనను అధికారులు వివరించగా.. మద్యం కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో పొరుగునే ఉన్న ఏపీ, మహారా ష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లను పరిశీలించాలని సూచించారు. కంపెనీలకు ఇచ్చే రేట్లను హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణాయక కమిటీ నిర్ధారిస్తుందని, ఆ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. ఆ కమిటీ తన నివేదికను త్వరగా ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా ఎక్సైజ్ బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా క్రమంగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో మద్యం తయారీ, సరఫరా కోసం ఐదు సంస్థలకు అనుమతినిచ్చి, నిలిపివేసిన నేపథ్యంలో ఇప్పుడు వాటి గురించి పరిశీలించాలని సీఎం సూచించినట్టు సమాచారం. అయితే ఈ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు డిస్టిలరీ ఏర్పాటు తోపాటు మద్యం తయారీకి గతంలో అనుమతినిచ్చారు. విమర్శలు రావడంతో అనుమతులను నిలిపివేశారు. ఇప్పుడు సీఎం ఆదేశాలతో పునః పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.హైదరాబాద్ అంతటా భూగర్భ విద్యుత్ కేబుల్స్గ్రేటర్ హైదరాబాద్‌లో, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా పూర్తిగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనితో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడమేకాక, విద్యుత్ అంతరాయాలను కూడా అధిగమించడానికి వీలవుతుందని సూచించారు. దీనికి సంబంధించి వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని నగరంలో వేసే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ దేశంలోనే అత్యు త్తమంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్ మాత్రమే గాక.. వివిధ రకాల కేబుళ్లు కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఆదేశించారు. శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ– 2025’ పాలసీని ఆవిష్కరించిన అనంతరం విద్యుత్ రంగంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లురాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, పాఠశాలలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కంపెనీలను ఆహ్వానించి, ఏ విధానంలో వారికి పనులు అప్పగించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలతో సమావేశమై నివేదిక రూపొందించాలన్నారు. ఇక రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట(పీక్) డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని.. అది ఈసారి 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనితో గరిష్ట విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి, సరఫరా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. -
కేఎఫ్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎ క్సైజ్ శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఝలక్ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్), బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది. అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. తక్షణమే నిలిపివేస్తున్నాం...యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.పలుమార్లు విజ్ఞప్తులుఐదేళ్లుగా బీర్, లిక్కర్ తయారీదారులకు బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్‌కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. వారం రోజులు ఓకే..బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్‌కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. అయితే వైన్‌షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్‌ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్ విధించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్ ఎండీకి యూబీ కంపెనీ లేఖధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ గరీమాసింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్‌కు రాసిన లేఖలో గరీమాసింగ్ స్పష్టం చేశారు.ధరలు పెంచడమే న్యాయం ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్» స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ వర్గాల్లో అలజడి» మార్కెట్లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసేది యూబీనేధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లిబీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
కిక్కుతో వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు. బ్యాంకులు లేకపోయినా వైన్‌షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్‌లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది. -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.డిమాండ్‌కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
మద్యం డిపోల్లో ఉద్యోగులపై వేటు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది సూపర్వైజర్లు, సేల్స్‌మెన్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగుతున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలురాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్ యూనిట్లలోనూ తనిఖీలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫరా రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీహనీట్రాప్ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. -
రమణ కేసు క్లోజ్..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మొత్తం మీద ఒంగోలులోని ఎలైట్ మాల్స్‌లో రూ.2.35 కోట్ల గోల్మాల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా సరికొత్త డ్రామాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అధికార టీడీపీకి చెందిన కీలక నేత రంగప్రవేశం చేసి రమణ ఎపిసోడ్‌కు ముగింపు పలికేందుకు తెరవెనుక మంత్రాంగం జరుపుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఎక్సైజ్ శాఖలో రూ.2.35 కోట్ల ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన దొంగలెవరో తేల్చకుండానే కేసు నీరుగారిపోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జిల్లా తెలుగు దేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక నాయకుడి తరఫున టంగుటూరు నుంచి వచ్చిన పెద్ద మనిషి రెండు రోజులుగా ఇక్కడే తిష్టవేసి జిల్లాలోని పలువురు ఎక్సైజ్ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. పోయిన సొమ్మును రికవరీ చేయడం ద్వారా ఎవరి చేతులకు మట్టి అంటకుండా బయటపడేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. కేసు నమోదైతే రమణ మాత్రమే కాకుండా అతడికి సహకరించిన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, సేల్స్మెన్లకు కూడా శిక్ష పడడం ఖాయమని నచ్చ చెప్పారు. ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఈ కేసు నుంచి బయటపడేందుకు తలా ఒక చేయి వేసేలా ఒప్పందం కుదిర్చారు. ఈ రాజీ ప్రకారం కేసులో ప్రధాన నిందితుడైన రమణ 60 శాతం డబ్బులు చెల్లించేలా, మిగతా సొమ్మును ఇంతకు ముందు ఇక్కడ పనిచేసివెళ్లిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి, సేల్స్మెన్లు వేసుకొని చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు ఎక్సైజ్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలతో సదరు పెద్ద మనిషితో కలసి కొందరు మంగళవారం ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్‌ను కలిసేందుకు విజయవాడ వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ ఆయనను కలిసేందుకు కుదరకపోవడంతో కమిషనర్ కార్యాలయంలో ఇతర అధికారులను కలిసి మాట్లాడి వచ్చినట్లు చెబుతున్నారు. రేపో మాపో కమిషనర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి రికవరీ చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తోంది.తలా పాపం తిలా పిడికెడు...ముందు నుంచి అనుకున్నట్లే భారీ మొత్తంలో ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ మీద పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కేసులో ప్రధాన పాత్రధారిగా చెప్పుకుంటున్న రమణ పరారైనా ఉలుకు లేదు పలుకు లేదు. అతను పరారీలో ఉన్నాడని చెబుతున్నారే కానీ పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ఈ కేసులో రమణతోపాటుగా మిగిలిన ఉద్యోగుల పాత్రపై విచారణ చేసినట్లు కూడా కనిపించలేదు. రమణ భాగోతంపై ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసిన సేల్స్మెన్లు కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేశారు. రమణను అరెస్టు చేయాలని వారు ఆందోళన చేసినా అధికారుల నుంచి పెద్దగా స్పందనలేదు.పెద్ద చేపల సంగతేంటి...ఈ కేసు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్సైజ్ శాఖలో చిరుద్యోగి అయిన కానిస్టేబుల్ రమణ ఒక్కడే ఈ అక్రమానికి పాల్పడడం అంత సులువుకాదని తెలుస్తోంది. పెద్ద చేపల ప్రోత్సాహంతోనే ఆయన కోట్ల రూపాయల స్కాంకి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎస్ఐ, సీఐల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. నిబంధనలకు మించి స్టాకు సరఫరా చేసిన డిపో మేనేజర్ గురించి కూడా అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసు నమోదైతే వారందరూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందన్న భయంతోనే ఎక్సైజ్ శాఖ ఉన్నతోద్యోగులంతా ఒక్కటయ్యారు. తలా కొంచెం వేసుకొని గట్టుమీద పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. -
మద్యం ధరలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచి పెరిగేది ఖరారు కాకపోయినా కచ్చితంగా మద్యం ధరలు పెంచాల్సిన పరిస్థితి ఎక్సైజ్ శాఖకు ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాబడి తగ్గిపోవడం, గత ఏడాదిలో మద్యం ధరలు తగ్గించిన కారణంగా ఏర్పడిన లోటును ఇప్పుడు పూడ్చుకునే యోచనలో ఎక్సైజ్ యంత్రాంగం ఉంది. ఈ మేరకు మద్యం ధరల పెంపు ద్వారా రూ.2వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మద్యం ధరల పెంపుపై ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి క్వార్టర్ లిక్కర్‌కు రూ.20, బీరు సీసాపై రూ.10 పెంచేందుకు ఎక్సైజ్‌శాఖ సర్వం సిద్ధం చేసుకుంది.గత ఏడాది రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయంఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ఆలోచనతో గత ఏడాది ముందస్తుగానే వైన్‌షాపుల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. లైసెన్సు ఫీజులు, దరఖాస్తు రుసుం రూపేణా రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు రూ.2,500 కోట్లు లోటు చూపెడుతోందని, అమ్మకాల వారీగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే తగ్గలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గత ఏడాది మేలో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై రూ.10 తగ్గించడంతో రూ.800 కోట్లు లోటు వచ్చిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మేలో తగ్గించిన రూ.10తో పాటు మరో రూ.10 పెంచితే రూ.1600 కోట్లు, బీర్ల రేటు రూ.10 పెంచడం ద్వారా రూ.300 కలిపి మొత్తం రూ.1900 కోట్ల వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావిస్తోంది. ఇటీవల సీఎం సమక్షంలో రాబడి శాఖలపై జరిగిన సమీక్షలో మద్యం ధరల పెంపు గురించి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్ ఇందుకు అంగీకరించలేదని, ఈ ప్రతిపాదనపై మరోమారు చర్చిద్దామని వాయిదా వేసినట్టు సమాచారం.ఎలైట్ బార్లకు ‘నో’...గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఎలైట్ బార్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సాధారణ బార్అండ్ రెస్టారెంట్లకు తోడు గత మూడు, నాలుగేళ్ల కాలంలో 89 ఎలైట్ బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లైసెన్స్ ఫీజు 10 శాతం అదనంగా ఉండే ఈ షాపుల కోసం మరో 50 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దరఖాస్తులన్నింటిని రద్దు చేయాలని, ఇప్పటివరకు అనుమతి వచ్చిన ఎలైట్ బార్లు మినహా భవిష్యత్‌లో అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో ఎలైట్ వైన్‌షాపుల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. నగరపాలికలతో పాటు కీలకమైన మున్సిపాలిటీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 25 వరకు ఎలైట్ వైన్‌షాపులకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని, ఈ మేరకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఎలైట్ వైన్‌షాపులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!
సాక్షి నెట్వర్క్: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. మంత్రి జనార్ధన్‌రెడ్డి వర్గం బెదిరింపులు..⇒ బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్‌విల్ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. ⇒ డోన్‌లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. ⇒ కోడుమూరులో టీడీపీ ఇన్చార్జీ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్‌గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు. ⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్‌విల్‌కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. ⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్‌విల్‌కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. ⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. కప్పం కట్టలేక షాపు వదిలేసి..చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్‌కు లక్కీడిప్‌లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సోదరుడు విష్ణువర్థన్‌రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. ⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్ తీసే రోజు నేరుగా కలెక్టర్‌కే ఫోన్ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. ⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కడపలో నేరుగా బేరసారాలు..⇒ వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్‌విల్‌కు అప్పగించారని సమాచారం. జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్చార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో లైసెన్స్‌దారు దీక్షితను బెదిరించి గుడ్‌విల్‌కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన రంగనాథ్ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్ నిర్వాహకుడు దినేష్ కుమార్ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. చేయి కలిపితేనే సహకారం..⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్‌లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్‌లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వెనిగండ్ల వర్గం వార్నింగ్‌లు⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్‌కుమార్ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం. ఉదయభాను వర్గం ఒప్పందాలు.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్ విల్ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్‌విల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్‌కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. పల్నాడులో డబ్బులు కడితేనే..⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు. ⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సిండికేట్ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి. ⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ⇒ నరసన్నపేటలో 76వ నెంబర్ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ చేసి గుడ్‌విల్‌కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
సర్కారు వారి కమీషన్ 30%
సర్కారు వారి కమీషన్ 30 శాతం.. ప్రస్తుతం ఇది ఏపీలో ట్రెండింగ్‌లో ఉన్న మాట.. ‘సర్కారు వారి పాట’ అంటే తెలుసు కానీ ‘సర్కారు వారి కమీషన్’ అంటే ఏంటనేది మీ సందేహమా? రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రతి మద్యం షాపు నుంచి అధికార పార్టీ నేతలకు అందే మామూళ్లన్న మాట.. నేడు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్ర ఇది.. ఇది తమను కాదని షాపులు దక్కించుకున్న వారు చెల్లించాల్సిన సొమ్ము గురించి హెచ్చరిక.. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీల హుకుం..సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించారు. వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు. అప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ‘అలా అయితేనే మద్యం దుకాణం నిర్వహించుకోగలరు.. లేదంటే మీ దుకాణం ఉండదు.. మీరూ ఉండరు’ అనే రీతిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది. అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే.. వారినీ బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమీషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. తద్వారా భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ. ఒక వేళ లాటరీలో లైసెన్స్ వస్తే.. ఆ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలన్నది లక్ష్యం. దాంతో సహజంగానే ఆ మద్యం దుకాణం లైసెన్స్ టీడీపీ సిండికేట్‌కే కేటాయిస్తారు. అలా లాటరీ ద్వారా గానీ, ఇతరత్రాగానీ మొత్తం 3,396 మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లోనే ఉండేట్టు సిండికేట్ కుట్రను అమలు చేస్తోంది. నా కొ..ల్లారా.. కమీషన్ ఇవ్వాల్సిందే: జేసీ బూతుపురాణం ⇒ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ మద్యం సిండికేట్ తరఫున టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన శైలిలో మరోసారి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు. అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు 15 శాతం కమీషన్ చెల్లించాలని, దాంతోపాటు తమకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ⇒ అసలు తమ నియోజకవర్గంలో మద్యం, ఇసుక దుకాణాల కోసం దరఖాస్తులు చేయడం ఏమిటని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో చిందులు తొక్కారు. అలా దరఖాస్తు చేసిన వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘నా కొ..ల్లారా.. అందర్నీ కాల్చి పార..’ అంటూ’ పచ్చి బూతులు తిట్టారు. ⇒ రామకృష్ణారెడ్డి.. దాచేపల్లి రామచంద్రారెడ్డి.. వేములపల్లి ప్రకాశ్‌రెడ్డి.. ఇలా పేర్లు చదువుతూ.. ముందు మీకు అవుతుంది. మిమ్మల్ని అసలు ఊర్లోకి రానివ్వను. అసలు ఎవడు సారా అంగడికి అప్లికేషన్ వేసిన నా కొ.. ఎవడు వాడు.. అని వీరంగం వేశారు. ‘ఎవరు సారా అంగడి పెట్టాలన్నా మండలానికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు తనకు (ప్రభాకర్ రెడ్డికి) 20 శాతం వాటా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము చెప్పిందే జరుగుతుందన్నారు. అంతటా అవే బెదిరింపులు ⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో 30 శాతం కమీషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది. సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది. ⇒ నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమీషన్ రేటు 25 శాతం అని ప్రకటించింది. అందుకు సమ్మతిస్తేనే సోమవారం లాటరీ ప్రక్రియలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేశారు. ⇒ ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్‌గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరీ చూపిస్తున్నారు. విశాఖపట్నం– భీమిలి బీచ్‌రోడ్డుతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు తామే దక్కించుకునేలా బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని స్పష్టం చేస్తున్నారు. కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే 30 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వర్గం నేతృత్వంలోని టీడీపీ.. సిండికేట్‌కు నేతృత్వం వహిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు మద్యం దుకాణాలన్నీ తమ సిండికేట్ గుత్తాధిపత్యంలో ఉండాల్సిందేనంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఇతర వ్యాపారులను బెదిరించి బెంబేలెత్తించారు. ఇతరులకు లైసెన్స్ దక్కితే 25 శాతం కమీషన్ చెల్లించాలని రేటు ఫిక్స్ చేశారు. ⇒ విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కనుసన్నల్లోనే టీడీపీ మద్యం సిండికేట్ దందా సాగిస్తోంది. ఇతరులకు లైసెన్స్ దక్కితే 30 శాతం కమీషన్‌గా నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకే బెంబేలెత్తాల్సిన అగత్యం కల్పించారు. ⇒ దెందులూరు, ఉండి నియోజకవర్గాలు మినహా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఏక మొత్తంగా 25 శాతం కమీషన్ ఖరారు చేశారు. ఆ మేరకు చెల్లిస్తేనే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వర్గం మాత్రం తమకు 30 శాతం చెల్లించాలని చెప్పింది. దెందులూరు నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు తమ సిండికేట్‌కు దక్కాల్సిందేనని, ఇతరులకు లాటరీలో లైసెన్సులు దక్కినా దుకాణం ఏర్పాటు చేయనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం తేల్చి చెప్పింది. ⇒ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారిపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సు«దీర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దరఖాస్తుదారులు డిపాజిట్ చేసేందుకు తెచ్చిన డీడీలనూ చింపి వారిని వెనక్కి పంపేశారు. ఇక లాటరీ ద్వారా ఇతరులకు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కితే.. నెలకు రూ.20 లక్షలు కమీషన్‌గా చెల్లించాలని ఎమ్మెల్యే వర్గం రేటు నిర్ణయించింది. అదీ రోజు వారీగా వసూలు చేస్తామంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్వర్గం మరో ఎత్తుగడ వేసింది. దరఖాస్తు చేసిన వారందరూ తమతోపాటు తమ వాహనాల్లోనే లాటరీ నిర్వహించే తిరుపతిలోని శిల్పారామం ప్రాంగణానికి రావాలని ఆదేశించింది. దుకాణానికి 26 దరఖాస్తులే..రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు మొత్తం 89,832 దరఖాస్తులొచ్చాయి. గడువు 11 సాయంత్రం 7 గంటలతో ముగిసింది. కానీ అప్పటికి క్యూలో ఉన్న వారికి కూడా అనుమతించామని చెబుతూ మొత్తం దరఖాస్తుల తాజా గణాంకాలను ఎక్సైజ్ శాఖ ఆదివారం విడుదల చేసింది. 11న మొత్తం దరఖాస్తులు 87,116గా పేర్కొనగా.. ఆదివారం మొత్తం దరఖాస్తులు 89,832 అని ప్రకటించింది. అయినా దుకాణానికి సగటున కేవలం 26.45 దరఖాస్తులే రావడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా∙రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.‘లాటరీ’ అంతా వారి కనుసన్నల్లోనే..మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ లాటరీ ప్రక్రియ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాటరీ తతంగం అంతా తమకు అనుకూలంగా నిర్వహించేలా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. లాటరీ ప్రక్రియ నిర్వహించే కేంద్రం పూర్తిగా టీడీపీ సిండికేట్ సభ్యులతో కిక్కిరిసిపోయేట్టుగా చేయాలని ఆదేశించారు. ఇతరులు ఎవరొచ్చినా బెదిరించి వెనక్కి పంపాలని, అప్పటికీ ఎవరైనా వస్తే ఘర్షణకు దిగేందుకూ వెనుకాడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాలని, ఇతరులపై దాడులు చేయాలని చెప్పడం గమనార్హం. తమకు లైసెన్స్ రానప్పుడు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ సిండికేట్ కుట్ర. రెండు జిల్లాల్లో మంత్రి కొల్లు వర్గం వీరంగం ⇒ ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్‌లో తమదే సింహభాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టిస్తోంది. అందుకే ఏకంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏక మొత్తంగా దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారికి మంత్రి వర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరిస్తుండటం గమనార్హం.⇒ మద్యం దుకాణాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలి.. లేదా మద్యం ఆదాయంలో 25 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 100 శాతం మద్యం దుకాణాలను మంత్రి వర్గీయులే ఏకపక్షంగా దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. కాగా విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో దరఖాస్తులు చేసిన వారికి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. ⇒ తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవ్రీంద వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం గమనార్హం. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంంది. అంటే మంత్రి లోకేశ్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.భారీ దోపిడీకి పక్కా డీల్భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతతో పక్కాగా డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరతో విక్రయించేందుకు ముఖ్య నేత ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. ఒక్కో బాటిల్‌పై మద్యం దుకాణంలో రూ.15 అధికంగా.. బెల్ట్ షాపుల్లో అయితే రూ.25 అధికంగా విక్రయించేందుకు అనుమతించారు. అందులో ఒక్కో బాటిల్‌పై కరకట్ట బంగ్లాకు రూ.3 చొప్పున కప్పం కట్టాలన్నది డీల్‌లో ప్రధాన అంశం. మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యులకు దక్కుతుంది. పక్కాగా డీల్ కుదరడంతో టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు అక్రమాలు, బెదిరింపులకు తెగించింది. -
నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి
బొబ్బిలి: ఆకలిగొన్న పులుల్లా మద్యం షాపు దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న సిండికేట్ వ్యాపారుల మధ్యలోని ఓ బామ్మ వచ్చి తనకూ మద్యం షాపు కావాలంటూ దరఖాస్తు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మద్యం షాపు కోసం దరఖాస్తు చేయడానికి కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధురాలిని చూసిన ఎక్సైజ్ అధికారులు ముసిముసి నవ్వులు నవ్వుతూ ముక్కున వేలేసుకున్నారు. బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో టెండర్ బాక్స్‌లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఓ బామ్మ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దత్తిరాజేరు మండలం పి.లింగాలవలసకు చెందిన పప్పల అచ్చయ్యమ్మ(85) ఎకై ్సజ్ అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతూ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. బొబ్బిలి కార్యాలయానికి సోమవారం సాయంత్రం వచ్చిన ఆ బామ్మకు ఓ బల్ల ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ఎక్సైజ్ అధికారులు కూడా మర్యాద చేయడం విశేషం. -
‘ఎల్లో’ సిండికేట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర తీసిన నేపథ్యంలో ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకు ‘‘ఆఫ్‌లైన్’’ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం పది దరఖాస్తులు అందుతాయి. అలాంటిది మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నా ఒక్కో దుకాణానికి కనీసం మూడు దరఖాస్తులు కూడా రాకపోవటాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఏ స్థాయిలో శాసిస్తోందో వెల్లడవుతోంది. రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకుగానూ ఇప్పటివరకు 8,274 దరఖాస్తులు మాత్రమే అందడం.. అది కూడా దాదాపుగా అంతా ఆఫ్‌లైన్‌లోనే రావడం గమనార్హం. ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్ దోపిడీకి కూటమి ప్రభుత్వం రాచబాట పరిచింది. టీడీపీ సిండికేట్ మినహా ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా ఎత్తుగడ వేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి సమర్పించే దరఖాస్తులకే ప్రాధాన్యమిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ సిండికేట్‌కు కొమ్ముకాస్తోంది. ఇతరులు ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే బెదిరించి వెనక్కి పంపుతున్నారు.సిండికేట్.. ఆన్‘లైన్’రాష్ట్రంలో 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 10వతేదీ వరకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు (ఆఫ్‌లైన్) చేసుకోవడంతోపాటు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని పేర్కొంది. మొదటి రోజైన మంగళవారం 200 దరఖాస్తులు అందగా ఆశ్చర్యకరంగా కేవలం రెండు మాత్రమే ఆన్లైన్లో రావడం గమనార్హం. తాజాగా ఆదివారం నాటికి మొత్తం 8,274 దరఖాస్తులు రాగా వీటిలో 6,520 ఆఫ్‌లైన్‌లోనే స్వీకరించడం గమనార్హం. 1,754 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో అందాయి.ఎక్సైజ్ కార్యాలయాల్లో తిష్టమద్యం దుకాణాల లైసెన్సులన్నీ గంపగుత్తగా టీడీపీ సిండికేట్‌కే దక్కాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆన్లైన్ దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మోకాలడ్డుతోంది. ఎంతోమంది ఆన్లైన్ ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక కారణాలు, సర్వర్ డౌన్ అంటూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదని పేర్కొంటున్నారు. ఇదే అదునుగా టీడీపీ సిండికేట్ సభ్యులు నేరుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. వారంతా ఎక్సైజ్ కార్యాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఇతరులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. తమను కాదని దరఖాస్తు చేసినా లైసెన్సులు రావని, లాటరీ ద్వారా ఎంపిక అన్నది పూర్తిగా బోగస్ అని తేల్చి చెబుతున్నారు.దాడులు.. కేసుల బెదిరింపులుఆఫ్లైన్లో దరఖాస్తు చేస్తామని మొండికేస్తున్న వారిని టీడీపీ సిండికేట్ తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. ‘మమ్మల్ని కాదని దరఖాస్తు చేస్తే ఊళ్లో వ్యాపారం చేయగలవా? నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకు ఇస్తారో చూస్తాం. సొంత దుకాణంలో పెడితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తాం. అక్రమ కేసులు బనాయిస్తాం.. ’ అని ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే హెచ్చరిస్తున్నారు. సిండికేట్‌కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఫోన్ నంబర్లు సేకరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు వెనుకాడుతున్నారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎక్సైజ్ శాఖ ఏ రోజుకు ఆ రోజు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. తద్వారా పారదర్శకతకు పాతరేస్తూ ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
జీఎస్టీ పరిధిలో లేము.. రూపాయి పన్ను ఎగ్గొట్టలేము
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్) పరిధిలో ఎలాంటి పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. తాము ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు నిర్వహించట్లేదని.. మద్యం వ్యాపారుల నుంచి నేరుగా ఆర్థిక శాఖ ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధిలో పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు రూ. 400 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలను పంపాలని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ రాసిన లేఖకు ఇటీవల ఎక్సైజ్ యంత్రాంగం సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం జీఎస్టీ పరిధిలో లేదని... ఈ వ్యాపార లావాదేవీలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)నే వసూలు చేస్తామని జీఎస్టీ శాఖకు పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెప్పాయి.అలా వసూలు చేయడంలో లేదా మద్యం అమ్మకాలకు సంబంధించిన పన్నును ప్రభుత్వానికి చెల్లించడంలో ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేమని స్పష్టం చేసినట్లు చెబుతున్నాయి. అన్ని వ్యాపారాల్లా కాదు.. జీఎస్టీ వసూలుకు సంబంధించి అన్ని వ్యాపారాల్లాగా మద్యం అమ్మకాలు ఉండవని ఎక్సైజ్ శాఖ తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది. మద్యం తయారీదారులు సరఫరా చేసిన మద్యా న్ని బ్రూవరేజస్ కార్పొరేషన్ ద్వారా వైన్ షాపులకు అమ్ముతామని.. అలా విక్రయించే క్రమంలోనే రిటైలర్ల (వైన్‌షాప్స్) నుంచి మార్కెట్లో మద్యం అమ్మకపు రేటుకు పన్ను తీసుకుంటా మని తెలియజేసింది. ఆ పన్ను పోను మద్యం అమ్మకాలపై వైన్ షాపు నిర్వాహకులకు కేవలం కమిషన్ ఇస్తామని... మార్కెట్లో మద్యం అమ్మే ధరపై జీఎస్టీ చెల్లించాలన్న వాదన సమంజసం కాదని వెల్లడించింది. ఈ మేరకు వైన్ షాపుల నుంచి పన్ను వసూలు చేసుకొని ప్రభుత్వానికి బ్రూవరేజస్ కార్పొరేషన్ చెల్లించే వెసులుబాటు వ్యాట్ చట్టం ద్వారా ఉందని తెలియజేసింది.తద్వారా కార్పొరేషన్ పన్ను ఎగవేసిందన్న వాదనలో వాస్తవం లేదని, నగదు లావాదేవీలే నిర్వహించని ప్రభుత్వ సంస్థ.. ప్రభుత్వానికి పన్ను ఎగవేసే వీలుండదని తెలిపింది. తమకూ వివరాలు ఇవ్వాలన్న సీజీఎస్టీ.. బ్రేవరేజెస్ కార్పొరేషన్ సహా 72 కంపెనీలు రూ. 1,400 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ జీఎస్టీ శాఖ జూలైలో కేసులు నమోదు చేసింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పైనా కేసు పెట్టింది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తమకు కూడా పంపాలని కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) విభాగం ఇటీవల రాష్ట్ర జీఎస్టీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. అందులో తమకు కూడా రూ. 700 కోట్ల వాటా వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. -
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్టంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ రెండు ఆర్డినెన్స్‌లను గెజిట్‌లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి వి.సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మార్గదర్శకాలను రూపొందించి న్యాయ శాఖకు పంపారు. వీటికి న్యాయ శాఖ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతితో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌లు చట్ట రూపం దాలుస్తాయి. దాదాపు 3,736 రిటైల్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఎక్సైజ్ శాఖలో ‘డబ్బుల్’ ధమాకా!
సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి ప్రతినిధి, విశాఖ పట్నం: ఎక్సైజ్ శాఖ టీడీపీ నేతలకు కాసుల ఖజానాగా మారింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. సెబ్‌లో ఉన్న ఉద్యోగులను తిరిగి ఎక్సైజ్ శాఖకు పంపుతోంది. దీంతో కోరుకున్న పోస్టులు దక్కించుకునేందుకు అధికారులు.. వీరి ఆరాటాన్ని ‘క్యాష్’ చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ప్రాంతానికి, పోస్టుకో రేటును నిర్ణయించి భారీగా వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్.. లెటర్‌కు, పోస్టింగ్‌కు వేర్వేరుగా టీడీపీ నేతలు డిమాండ్ చేసినంత కప్పం.. అడిగినంత చెల్లించలేకపోతే లూప్‌లైన్ పోస్టింగ్‌లు.. ఇలా అమరావతిలో ఎక్సైజ్‌శాఖ ప్రధాన కార్యాలయంలో రెండు రోజులుగా ఇదే దందా నడుస్తోంది. బేరసారాలతో కొందరు ఇప్పటికే తమకు నచ్చిన చోట పోస్టింగులు దక్కించుకోగా ఇంకొన్ని పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. సెబ్‌కు చెల్లుచీటీ ఇచ్చి.. వసూళ్ల పర్వానికి తెరలేపి.. గత ప్రభుత్వం పల్లెల్లో బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయడానికి, సారా తయారీని అరికట్టడానికి, గంజాయి నిర్మూలనకు సెబ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలకు మద్యం దూరమయ్యేలా చేసేందుకు ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలు నిర్వహించింది. బెల్ట్‌షాపుల కోసం బల్‌్కగా మద్యం బాటిళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో సిబ్బంది అవసరం తగ్గింది. దీంతో సెబ్‌ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందిని అందులోకి పంపారు. బెల్ట్‌షాపులు తగ్గడంతో పల్లెల్లో మద్యం సేవించేవారి సంఖ్య తగ్గిపోయింది. తద్వారా నేరాల సంఖ్య కూడా పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో తిరిగి ఎక్సైజ్ శాఖను ఏర్పాటు చేస్తున్నారు. సెబ్‌లో విలీనమైన ఎక్సైజ్ అధికారులను తిరిగి మాతృశాఖలో నియమించి పాత పంథాలోనే విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి ఎక్సైజ్ స్టేషన్లలో సీఐ, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీటితో పాటు 26 జిల్లాలకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు(ఈఎస్), ఉమ్మడి 13 జిల్లాలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లను నియమించనున్నారు. దీంతో కోరుకున్న చోట పోస్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలను, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. పోస్టుకో రేటు.. డీసీ, ఈఎస్, ఏసీలతో పాటు సీఐల నియామకాల కోసం రెండురోజులుగా అమరావతిలో కసరత్తు జరుగుతోంది. ఎక్సైజ్‌శాఖ యూనియన్ నాయకులు అక్కడే మకాం వేశారు. యూనియన్ కనుసన్నల్లోనే పోస్టింగులు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ కమిషనర్ పోస్టు కావాలంటే స్థానిక మంత్రి లేదా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ లేఖ కావాలంటే రూ.15 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిందే. లేఖ తీసుకొస్తే ఆపై పోస్టింగు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖలోని ఓ ప్రభుత్వ పెద్దకు మరింత ముట్టజెప్పాలి. ఈ క్రమంలో విశాఖపట్నం, గుంటూరు, పశి్చమగోదావరి, విజయవాడ డీసీ పోస్టులకు రూ.30 లక్షలు ధర నిర్ధారించినట్లు తెలుస్తోంది. కొందరు ఇంత కంటే ఎక్కువ ఇచ్చి చేరేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తక్కిన జిల్లాల్లో డీసీ పోస్టులకు రూ.20లక్షలు, ఈఎస్ పోస్టులకు రూ.15లక్షలుగా ధర ఫిక్స్ చేశారు. ఈ మొత్తాలకు తక్కువ కాకుండా ఎవరు ఎక్కువ ఇస్తే వారికి పోస్టింగులు ఇస్తున్నారు. పోస్టింగులకు టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తప్పనిసరి అని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు యూనియన్ నాయకులు సిఫార్సు చేసిన వారికే లేఖలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు డీసీగా మునిచంద్రమోహన్, అనంతపురం డీసీగా నాగమద్దయ్య ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. చిత్తూరు డీసీ పోస్టు మంత్రి నారా లోకేశ్ సిఫార్సు చేసిన వారికే దక్కనున్నట్లు తెలుస్తోంది. కడప డీసీకి పెద్దగా పోటీ లేదని సమాచారం. అలాగే విశాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీరామచంద్రమూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆర్. ప్రసాద్ పేరు ఖరారైందని చెబుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా రామకృష్ణ ఖరారైనట్లు సమాచారం. కానిస్టేబుల్ పోస్టుకు సైతంఎక్సైజ్ స్టేషన్లలో సీఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా ఉంటారు. ఆయన కింద ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రస్తుతం సీఐల పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. సీఐ పోస్టుకు సిఫార్సు లేఖ కావాలంటే రూ.8–10 లక్షలు సంబంధిత టీడీపీ ఎమ్మెల్యేకు ముట్టజెప్పాలని తెలుస్తోంది. రాజధానిలో పోస్టింగ్ కావాలంటే మరో రూ.10 లక్షలు సమర్పించుకోవాల్సిందే. స్టేషన్‌ను బట్టి ఈ ధరల్లో తేడాలు ఉన్నాయి. ఈఎస్‌లు.. లెటర్‌కు రూ.10 లక్షలు, రాజధానిలో పోస్టుకు రూ.15 లక్షలు ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. మొదటగా డీసీలు, ఈఎస్‌లు, సీఐలను నియమించనున్నారు. ఆపై వీరు ఎస్ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకూ నియమించుకోవచ్చు. ఈ నియామకాల్లోనే వీరు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయాలనే యోచనలో కొందరు డీసీలు, ఈఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.కానిస్టేబుల్ పోస్టుకు రూ.లక్ష, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.1.50 లక్షలు, ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షలు ధర నిర్ణయించారు. తాము అడిగినంత చెల్లించలేనివారికి మొబైల్ పార్టీ, థర్డ్‌గ్రేడ్ స్టేషన్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త పాలసీలో భారీ ఆదాయం ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకురానుంది. టెండర్ల ద్వారా లేదా లాటరీ ద్వారా మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించనున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ‘సిండికేట్’ ద్వారా మద్యం ధరలు పెంచి విక్రయాలు సాగించనున్నారు. దీంతో అధికారులకు నెలమామూళ్లు ఇస్తారు. తద్వారా పోస్టింగ్ పెట్టుబడితో పాటు భారీగానే ఆర్జించే అవకాశం ఉంది. పైగా బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా నడిచే అవకాశం ఉంది. దీంతోనే ఆదాయం ఉన్న స్టేషన్ల కోసం భారీగా పెట్టుబడి పెట్టి పోస్టింగులు తెచ్చుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.విశాఖలో భారీ డిమాండ్ విశాఖ ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉంది. డిప్యూటీ కమిషనర్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు ప్రతి చోట విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది. పోస్టును బట్టి రేటు పలుకుతోంది. విశాఖ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ పోస్టు హాట్ సీటుగా మారిపోయింది. ఇక్కడ పోస్టింగ్ కోసం ఆశావహుల సంఖ్యలో కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ముగ్గురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ సూపరింటెండెంట్‌గా పని చేసి వెళ్లిన అధికారి కూడా ఈ కోవలో ఉన్నట్టు సమాచారం. అలాగే పక్క జిల్లాల నుంచి మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఈ పోస్టుకు రూ.30 లక్షలు ముట్టజెప్పేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కీలకమైన ఆ స్థానాలను చేజిక్కించుకుంటే.. ఆ తరువాత జరిగే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ బదిలీల్లో సులువుగా సంపాదించుకోవచ్చని ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.స్టేషన్‌ను బట్టి రేటు సీఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు రేటుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలు కూడా తప్పనిసరి. ఆ సిఫార్సు లేఖలకు స్టేషన్‌ను బట్టి రేటు నిర్ణయించినట్లు సమాచారం. సీఐ పోస్టింగ్‌కు రూ.5 నుంచి రూ.8 లక్షలు, ఎస్ఐకి రూ.2 నుంచి రూ.3 లక్షలు, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు, కానిస్టేబుల్ స్థాయికి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు వసూలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి నేత కీలక పాత్ర పోషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సదరు సీఐ స్థాయి అధికారి లాబీయింగ్‌లో సిద్ధహస్తుడన్న పేరు ఉంది. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది పోస్టింగుల విషయంలో ఎవరైనా ప్రజాప్రతినిధులను కలిస్తే.. సదరు అధికారి ద్వారా రావాలని స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. వెలగపూడిదే రాజ్యం.. విశాఖపట్నం నగర పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా హవా అంతా విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చలాయిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఈసీ వరకూ పోస్టులకూ ఆయనే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. తక్కిన ఎమ్మెల్యేలు ఎవరూ లేఖలు ఇచ్చేందుకు వీల్లేదు. వీరిలో గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉండటం విశేషం. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ యాదవ్ కూడా ఉన్నారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మినహా తక్కిన వారంతా తమ నియోజకవర్గాల్లో పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తుంటే ‘వెలగపూడిని కలవండి’ అని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మద్యం సిండికేట్ మొత్తం వెలగపూడి కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఎక్సైజ్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కూడా.. విశాఖలో మాత్రమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళంలో మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. దీంతో అక్కడ పోస్టింగ్‌లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. విశాఖలో పోస్టింగ్ అవకాశం దక్కని వారు రెండో ఆప్షన్‌గా శ్రీకాకుళంను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ జిల్లా స్థాయిలో పోస్టింగ్ లభిస్తే ఒక వైపు కింది స్థాయి అధికారుల బదిలీల్లోనే కాకుండా మద్యం కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున లాభం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా కూడా ఎక్సైజ్ అధికారులకు హాట్ ఫేవరెట్‌గా మారింది. -
AP: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తొలగించింది. ప్రజా సంబంధిత సేవలందించే 14 శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అనుమతించింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం వచ్చేనెల 5 నుంచి 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా 14 శాఖల్లో బదిలీలు పూర్తవ్వాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో వచ్చే నెల 16 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర ఉద్యోగుల్లో పరిపాలన అవసరాలు లేదా వ్యక్తిగత అభ్యర్థనలపై బదిలీలకు అర్హులు. ఎన్నికల ప్రక్రియ కోసం బదిలీలను బదిలీగా పరిగణించరు. కారుణ్య ప్రాతిపదికన నియమితులైన వితంతువులైన మహిళా ఉద్యోగులు, దృష్టి లోపం గల ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.బదిలీలు జరిగే శాఖలు– రెవెన్యూ (భూపరిపాలన), సెర్ప్‌తో సహా పంచాయత్ రాజ్ – గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, మైనింగ్– జియాలజీ, అన్ని విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవదాయ, రవాణా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, పరిశ్రమలు, ఇంధన, స్టాంపులు–రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ముందు భర్తీ చేయాలినోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీ పోస్టులను ముందుగా భర్తీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనివ్వాలి. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు కోరిన చోటుకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను బదిలీ చేయాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయడానికి వీల్లేదు. బదిలీ దరఖాస్తుల పరిశీలనకుఅంతర్గత కమిటీలుప్రభుత్వ మార్గదర్శకాలు, షరతులకు అనుగుణంగా సంబంధిత అధికారులు బదిలీలను అమలు చేయాలి. జిల్లా, జోనల్, బహుళ జోనల్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలి. ప్రాధాన్యతల విషయంలో దుర్వినియోగం జరగకుండా సంబంధిత శాఖల అంతర్గత కమిటీలు దరఖాస్తులను పరిశీలించి, తగిన సిఫార్సులు చేయాలి. ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం లేకుండా పారదర్శకంగా గడువులోగా బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖాధిపతులు పూర్తి చేయాలి. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.ఈ వర్గాలకు బదిలీల్లో ప్రాధాన్యత– దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న చోటుకి బదిలీ చేయాలని కోరేవారు– గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు– 40 శాతంకన్నా ఎక్కువ వైకల్యం గల ఉద్యోగులు– క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్లకు బదిలీలు కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లల వైద్యం కోసం)– భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, వారిద్దరినీ ఒకే స్టేషన్లో లేదా ఒకరికొకరు సమీపంలో ఉన్న స్టేషన్లలో ఉండేలా బదిలీకి ప్రయత్నించాలి.ఈ మార్గదర్శకాల ప్రకారం జరిగే అన్ని బదిలీలు, ప్రాధాన్య స్టేషన్ల ఎంపికను వినియోగించుకున్న ఉద్యోగుల బదిలీలను అభ్యర్థన బదిలీలుగా పరిగణిస్తారు. -
రమణా.. లోడ్ ఎత్తరా
ఇదేం ఖర్మరా బాబు.. ఎక్సైజోళ్ల బాధ పడలేకుంది. టార్గెట్.. టార్గెట్ అంటూ నిత్యం సంపుతున్నారు. మద్యం అమ్మితే నాలుగు డబ్బులు మిగిలేది మాకే కదా.. ఎంత అమ్మితే అంత వస్తుంది.. కానీ ఇప్పుడు వాళ్లకు సంపాదించి పెట్టాలట.. ఒక్కో షాప్‌నకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. మాకేమైనా అదనంగా వస్తుందా అంటే అది లేదు. రూ.లక్ష మందు సమాను కొంటే రూ.15 వేలు పోతున్నాయి. ఏంటో మరి..! ..ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ వైన్స్ యజమాని ఆవేదన. అతను ఒక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణదారులందరి పరిస్థితి ఇదే.సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్, కరీంనగర్: ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలోనే ఎక్సైజ్ అధికారులకు కష్టాలు వచి్చపడ్డాయి. ఈ ఏడాది జూలై మాసంలో మద్యం అమ్మకాల లక్ష్యాన్ని చేరేందుకు నెల చివరి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు నానాతంటాలు పడ్డారు. ఈ నెల టార్గెట్ పూర్తి కాలేదని, పైఅధికారులు టార్గెట్ పెట్టారని, వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని వైన్‌షాప్‌ల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాస్తవానికి, గత మూడు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రూ.3వేల కోట్లు మించి జరుగుతున్నాయి.జూన్ నెలలో రూ.3,175 కోట్లు దాటింది. కానీ, జూలై నెలలో ఈ అమ్మకాలు రూ.3వేల కోట్లలోపు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానికంగా ఉండే ఎక్సైజ్ అధికారులు రిటైలర్లపై ఒత్తిడి పెంచారు. గోదాముల్లో సరుకు రెడీగా ఉందని, ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ఎంతోకొంత సరుకు తీసుకెళ్లాలంటూ వైన్‌షాప్ యజమానులకు ఫోన్లు చేసినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో చేసేదేమీ లేని పరిస్థితుల్లో వైన్‌షాపుల యజమానులు అందుబాటులో ఉన్న నగదును బట్టి డీడీలు చెల్లించి గోదాముల నుంచి స్టాక్ తీసుకెళ్లారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ ప్రతిసారీ ఈ టార్గెట్లు ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వానికి నిధులు కూడా అవసరమైనందున ఉన్నతాధికారుల సూచన మేరకు సరుకు తీసుకెళ్లాలని వైన్‌షాపులను కోరామే తప్ప ఒత్తిడి తేలేదని, వీలునుబట్టి వైన్‌షాపుల నిర్వాహకులు సరుకు తీసుకెళ్లారే తప్ప...గొంతు మీద కత్తి పెట్టలేదని చెప్పడం గమనార్హం. తలపట్టుకుంటున్న వైన్స్ యజమానులు.. జనాభా ప్రాతిపదికన స్లాబ్‌ల ప్రకారం టెండర్ దక్కించుకున్నామని.. నిరీ్ణత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15 శాతం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో రూ.50 లక్షల స్లాబ్‌తో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి పది పర్యాయాల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసిన మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే రూ.లక్షకు దాదాపు 15 శాతం అంటే రూ.15 వేలు అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం భారంగా మారిందని.. మిత్తీలకే సరిపోని పరిస్థితి ఉందని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా... ఉమ్మడి కరీంనగర్ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్ అధికారులు నాలుగు జిల్లాల్లోని వైన్‌షాపులకు ఒక్కసారిగా సేల్స్ పెంచాలని టార్గెట్ విధించారు. ⇒ కరీంనగర్‌తో సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రతీ వైన్‌షాపునకు రూ.30 లక్షల టార్గెట్ విధించారు. ‘‘మీరు అమ్ముకోండి.. లేదా స్టాక్ మీతోపాటే ఉంచుకోండి.. అవేమీ మాకు చెప్పొద్దు. కానీ, తప్పకుండా ప్రతీషాప్ రూ.30 లక్షల స్టాక్ కొనుగోలు చేయాల్సిందేనని’షరతు పెట్టారు. దీంతో గత్యంతరం లేక కేసులు పెడతారేమోననే భయంతో రూ.30లక్షల స్టాక్ కొనేందుకు సిద్ధమవుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో రూ.30 లక్షల సరుకు తాము కొనలేమని మెజారిటీ వైన్‌షాపుల నిర్వాహకులు చేతులు ఎత్తేయడంతో కనీసం గత ఏడాది విక్రయాలను చేరుకోవాలని మినహాయింపు ఇచ్చారు. ⇒ జగిత్యాల జిల్లాలోనూ వ్యాపారులు తాము రూ.30 లక్షలు చేయలేమని అనడంతో గతేడాది విక్రయాలతో 5–10 శాతం అదనంగా విక్రయించాలని టార్గెట్ పెట్టడంతో అంతా ఓకే అన్నారని సమాచారం. ⇒ పెద్దపల్లి జిల్లాలో రూ.30 లక్షలు స్టాకు కొనలేమని వ్యాపారులు చెప్పడంతో చివరికి గతేడాది విక్రయాల మీద 30 శాతం అదనంగా విక్రయించాల్సిందేని షరతు పెట్టడంతో వ్యాపారులు సమ్మతించారని తెలిసింది. ⇒ దీంతో ప్రతీ వైన్‌షాపు నిర్వాహకుడు రూ.లక్షలాదిగా దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ టార్గెట్ రీచ్ అయ్యేందుకు నానాతంటాలు పడుతున్నారు. -
మందు‘బాబు’ దందానే!
సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ‘పచ్చ’ దయ్యాలు వేదాలు వల్లించాయి! మద్యం సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకుని గతంలో ఐదేళ్లూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు బృందం నీతు లు వల్లిస్తోంది! ఎన్నికల హామీలను అమలు చేయలేక సాకులు అన్వేషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల నాటకంలో బుధవారం మరో అంకానికి తెర తీశారు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం పేరుతో అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. కానీ 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతల మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 వరకు దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో విక్రయాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి.చంద్రబాబు ఆరోపణ: మేం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం దందాకు పాల్పడింది.నిజం ఇదీ: టీడీపీ సిండికేట్ మద్యం దోపిడీకి నిదర్శనాలివిగో..– 2014–19 మధ్య టీడీపీ మద్యం సిండికేట్ చెలరేగడంతో పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారింది. – ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 వరకు జోరుగా విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ దందా.– 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పర్మిట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలు. – ఎమ్మార్పీ కంటే 25 శాతం అధిక ధరలకు అమ్మకాలు. – ఏటా బార్ల సంఖ్య పెంపు.– జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో ఏపీలో 34.9 శాతం మంది పురుషులకు, 0.4 శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది.పచ్చ సిండికేట్ దోపిడీ రూ.12.50 లక్షల కోట్లుమద్యం దందాను వ్యవస్థీకృతం చేసి రూ.12.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబు సర్కారుదే. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్‌ను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకుని బడి, గుడి అనే విచక్షణ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేశారు. పర్మిట్ రూమ్‌ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి మరో 43 వేల బెల్ట్ దుకాణాలను నెలకొల్పి ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టారు.చంద్రబాబు ఆరోపణ : ఊరూ పేరూ లేని బ్రాండ్లు తెచ్చారు..నిజం: అవన్నీ మీరు తెచ్చిన బ్రాండ్లే చంద్రబాబూ!– ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.– గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకూ టీడీపీ సర్కారే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. – హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం బాబు సర్కారు నిర్వాకాలే.ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది.– రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు.– బిరా –91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 14న చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అప్పటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టలేదు. – ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది నిఖార్సైన నిజం!చంద్రబాబు ఆరోపణ: డిస్టిలరీలన్నీ లాక్కున్నారు..నిజం: ఆ డిస్టిలరీలన్నీ మీరు అనుమతిచ్చినవే... మీ వాళ్లవే చంద్రబాబూ!!రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు.మద్యం తయారీ డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుయాయుల గుప్పిట్లోనే ఉన్నాయన్నది నిజం. ఆ డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చిందీ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వమే. ఆ డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్నే గతంలో టీడీపీ హయాంలో విక్రయించారు. అనంతరం వైఎస్సార్సీపీ హయాంలోనూ అదే మద్యాన్నే విక్రయించారు. మరి అందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముందీ? టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదని.. లేదంటే నాసిరకమని దుష్ప్రచారం చేయడం చంద్రబాబు బృందానికి, పచ్చ మీడియాకే చెల్లింది.పచ్చ ముఠాదే మద్యం దందా..రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్యే పుట్టా మధుసూదన్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ది. – శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. – ఎస్పీవై ఆగ్రో ప్రొడక్టŠస్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలోకి ఫిరాయించినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి నాడు చంద్రబాబు అనుమతిచ్చారు. – గత ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు.చంద్రబాబు ఆరోపణ: మేనిఫెస్టోలో హామీని వైఎస్సార్సీపీ ఉల్లంఘించింది..నిజం: దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసింది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాపై ఉక్కు పాదం మోపింది. ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేశారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం దుకాణాల వేళలను కుదిస్తూ ఉ.10 నుంచి రాత్రి 9 వరకే పరిమితంగా విక్రయాలకు అనుమతించారు. 4,380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేశారు. 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించారు. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి.ఏపీలో మద్యం వినియోగం తగ్గింది– కేంద్ర ప్రభుత్వ నివేదికవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. మద్యం అలవాటు 2015–16లో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం ఉంది. 2019–21 మధ్య పురుషుల్లో ఈ అలవాటు 31.2 శాతానికి, మహిళల్లో 0.2 శాతానికి తగ్గినట్లు పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కేంద్ర హోంశాఖ వెల్లడించింది.చంద్రబాబు ఆరోపణ: నాణ్యత లేని మద్యంతో వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింది.నిజం: వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం నాణ్యతపై టీడీపీ గత ఐదేళ్లూ పదేపదే సాగించిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. నాడు మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్జీఎస్ లేబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదికేదీ తాము ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని ఆ లేబొరేటరీ ప్రకటించింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది.– 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షలు తూతూ మంత్రంగా నిర్వహించారు. ఆ ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరించి పరీక్షించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ రూ.12.5 కోట్లతో అత్యాధునిక లేబరేటరీలను ఏర్పాటు చేసింది. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్‌ను పరీక్షించారు.రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలకు ఎప్పుడెప్పుడు అనుమతులు ఇచ్చారంటే...1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 92. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 153. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 144. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 75. సెంటిని బయో ప్రొడక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 96. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 27. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 298. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 179. జీఎస్బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 200810. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 2511. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 2512. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 2313. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 198215. శ్రీకృష్ణా ఎంటర్ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై16. ఎస్ఎన్జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే17. మోహన్ బెవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 197818. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 197020. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31. -
బేవరేజెస్ కార్పొరేషన్ సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్‌శాఖకు చెడ్డపేరు వస్తోందని, కీలక పదవుల్లోని వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎౖMð్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలే తప్ప.. సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ సొంతంగా విధివిధానాలు ఎలా ఖరారు చేస్తుందని మంత్రి అధికారులపై మండిపడ్డారు. తనశాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో శాఖ ప్రతిష్ట దెబ్బతినడమేకాక, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించారు. అనుమతుల అంశంపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదిక ఆధారంగా కఠినచర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘాపెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణవేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారి వెన్నులో వణుకు పుట్టించేలా చర్యలు ఉండాలని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీ, సరఫరా, విక్రేతలు, సప్లయ్ నెట్వర్క్ వారి డేటాబేస్ తయారు చేయాలని, తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసు శాఖ సమన్వయంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు పని చేయాలని తెలిపారు.మాదక ద్రవ్యాలను అరికట్టడమేకాక.. వాటితో కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కలి్పంచేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియో రూపంలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నా రు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్, ఎండీ ఇ.శ్రీధర్, అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం, ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
Beer Companies: హడావుడిగా అనుమతి.. వెంటనే నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: బీర్ల తయారీ కంపెనీలకు, సర్కారుకు మధ్య వారధిగా ఉండి ఎలాంటి సమస్య రాకుండా చూడాల్సిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్టకు పోయి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. బీర్ల తయారీ కోసం రాష్ట్రంలో అనుమతి పొందిన పాత కంపెనీలతో సమన్వయం చేసుకోకుండా.. కొత్త కంపెనీలకు అనుమతులిచ్చి, ఆ తర్వాత సదరు అనుమతులను నిలిపివేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారుల తీరుతో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. అన్ని డిపోల్లో కలిపి కనీసం 15 రోజుల స్టాక్ ఉండాల్సి ఉండగా, కేవలం రెండున్నర రోజులకు సరిపడా మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. పాత బకాయిలే తలనొప్పి బీర్లు, మద్యం తయారీ కంపెనీలు బేవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం ఇచ్చిన తర్వాత వాటిని డిపోల ద్వారా రిటైలర్లకు అమ్మిన 45 రోజుల్లోగా సదరు తయారీ కంపెనీలకు బేసిక్ ప్రైస్, ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు సరిగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.1,500 కోట్లకు చేరాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను ప్రతి నెలా చెల్లిస్తోంది. కానీ పాత బకాయిలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సదరు కంపెనీలు తమకు పాత బకాయిలు ఇప్పించాలని, లేదంటే బీర్లు సరఫరా చేయలేమని ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెంచారు. వేసవిలో సీజన్ కావడంతో బీర్లు తయారు చేసే బ్రెవరీలతో సమన్వయంతో వ్యవహరించి బీర్లను అందుబాటులోకి తేవాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూటు మార్చారు. పాత కంపెనీలను కాదని, గుట్టుచప్పుడు కాకుండా సోమ్ సహా ఐదు కొత్త బ్రెవరీలకు అనుమతినిచ్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కొత్త బ్రెవరీలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బేర్ మంటున్న బీర్ స్టాక్ ఎక్సైజ్ అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడేలా ఉంది. రాష్ట్రంలో యూబీ (2 యూనిట్లు), అన్హైజర్ బుష్ (ఏబీ–2 యూనిట్లు), కారŠల్స్‌బర్గ్, లీలాసన్స్ కంపెనీలు అనుమతులు పొంది బీర్లు తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే బీర్లలో సింహభాగం యూబీ, ఏబీ కంపెనీలు తయారు చేసేవే. కాగా ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించడం లేదా సదరు కంపెనీలతో సమన్వయం చేసుకుని అవసరమైన మేరకు బీర్లను తయారు చేయించడం ఎక్సైజ్ ఉన్నతాధికారుల విధి. కానీ అలా చేయకుండా కొత్త బ్రెవరీలకు అనుమతినివ్వడం, మళ్లీ నిలిపివేయడంతో బీర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రోజుకు 1.25 లక్షల కేసుల బీర్లు అవసరమవుతాయని అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కలిపి 3 లక్షల కేసులు మాత్రమే స్టాక్ ఉందని తెలుస్తోంది. కాగా కొత్త బ్రెవరీల పేరుతో అనుమతులిచి్చన ఐదు కంపెనీల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన సోమ్ బ్రెవరీస్ వుడ్ పెక్కర్, హంటర్‌తో పాటు మరో బ్రాండ్ తయారు చేస్తుందని, మిగిలినవి కర్జూరా బీర్లతో పాటు బిర్యానీ అనే బ్రాండ్ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. కాగా కొత్తగా అనుమతినిచి్చన కంపెనీల్లో ఒక్కటి కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది వినియోగించే బీర్లు తయారు చేసేవి కాకపోవడం గమనార్హం. -
కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం నాది కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాలకు సంబంధించి తాను ఎలాంటి అను మతులు ఇవ్వలేదని, తన వద్దకు ఎలాంటి దర ఖాస్తులు రాలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, అనుమతులు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ తీసుకున్న నిర్ణయమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త మద్యం బ్రాండ్లను ఎక్సైజ్ శాఖ అనుమతించిందని జరుగుతున్న ప్రచారం తప్పని, రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను రూఢీ చేసుకోకుండా పత్రికలు తప్పుగా ప్రచురించాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) లావాదేవీలన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు. దీనికి టీజీబీసీఎల్ ఎండీ/ఎక్సైజ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారన్నారు. రాష్ట్రంలో గత ఆరువారాలుగా వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఉందని, బీర్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బీసీఎల్ ఎండీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే ఆఫర్‌పై ప్రతిస్పందించారని తెలిపారు. కొత్తగా ఐదు సంస్థలకు బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిసింది. -
మద్యం ప్రియులకు దొరకని బీర్లు
మెదక్: టెండల్లో బుసబుస పొంగే చల్లని బీరు తాగి ఉపశమనం పొందాలనుకునే మందుబాబులకుకష్టకాలమొచ్చింది. వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్ విధించడంతో అటు వైన్‌షాప్ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో మద్యం ప్రియులు దొరికిన దానితోనే సరి పెట్టుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఇండెక్స్ ఆధారంగా 20 నుంచి 25 కేసులు ఇస్తుండగా.. ఇది ఒక రోజుకు కూడా సరిపోదని మద్యం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్‌లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. ఈయేడు ఎక్సైజ్ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొంత మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గతేడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, ఈసారి నాలుగు నెలల కాలంలో రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయి. మందు బాబుల పరేషాన్.. వేసవి ఎండలు ముదరడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం నీటి కొరత, బీర్ల ఉత్పత్తి షరతులు తదితర కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడింది. అలాగే బీరు కాలపరిమితి 6 నెలలు ఉండటంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచలేని పరిస్థితి. గతేడాది నాలుగు నెలల కాలంలో 2,68,763 కేసులు అమ్మగా, ఈయేడు మార్చి 31 వరకు 2,96,977 కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాధారణ బ్రాండ్లు లభిస్తున్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లు దొరకడం లేదు. దీంతో ఇండెక్స్‌కు అనుగుణంగా 20 నుంచి 25 కేసులు లభ్యతను బట్టి ఇస్తున్నారు. అలాగే సామాన్యుడికి అందుబాటు ధర కలిగి, నిత్యం ఎక్కువగా అమ్ముడు పోయే ఓ బ్రాండ్ లిక్కర్ కొరత కారణంగా దానికి కూడా రేషన్ విధించినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. పెరిగిన 10.50 శాతం ఎక్సైజ్ స్టేషన్ల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే గతేడాది నాలుగు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి) నర్సాపూర్‌లో రూ.7,172.2 లక్షలు విక్రయాలు జరుగగా ఈసారి నాలుగు నెలలు రూ.7,888.2 లక్షలు, మెదక్‌లో గతేడాది రూ.6,847.6 లక్షలు ఉండగా, ఈసారి రూ.6,902.4 లక్షలు, రామాయంపేటలో గతేడాది రూ.5,447.9 లక్షలు కాగా, ఈసారి రూ.5,880.2 లక్షలు విక్రయించాయి. మొత్తం మీద గతేడాది నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా 6.18 శాతం మద్యం విక్రయాలు వృద్ధి చెందాయి. అలాగే గతేడాది బీర్లతో పోలీస్తే ఈ నాలుగు నెలల్లోనే బీర్ల వినియోగం 10.50 శాతం పెరిగింది. ప్రతీయేటా వేసవి కాలంలో బీరు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. డిమాండ్ కనుగుణంగా సరఫరా లేక పోవడంతో ప్రధాన బ్రాండ్లపై రేషన్ విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత! -
టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశమే లేకపోవడం గమనార్హం. ఇక.. ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్‌ను బాటిల్స్‌గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్‌గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు వెసలుబాటు కల్పించారు. ఇక.. టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు శివారులో వైన్ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్‌లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
మద్యం ధరలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమ వారం సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడిపైనా దృష్టి పెట్టి పనిచేయాలని కోరారు. ఎలైట్ బార్ల తో పాటు ఎలైట్ షాప్‌ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలని, రాష్ట్రమంతటా ఒకటే నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూ పొందించాలని కోరారు. పోలీస్, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ను కట్టడి చేయాలని ఆదేశించారు. ఇందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి కోరారు. తగిన మార్కెటింగ్ వ్యవస్థ లేని కారణంగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలను వినియోగించుకోలేక పోతున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టలేదని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. సమావేశంలో భాగంగా కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం, చెక్‌పోస్టుల పటిష్టత కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు నిధులను కోరగా కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, స్పిల్ఓవర్ పనులకు టూరిజం శాఖ నిధులను ప్రతిపాదించింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.