టీటీడీపై మరోసారి ఎల్లో మీడియా కుట్ర | Yellow media conspiracy once again on TTD | Sakshi
Sakshi News home page

టీటీడీపై మరోసారి ఎల్లో మీడియా కుట్ర

Published Wed, Mar 31 2021 3:08 AM | Last Updated on Wed, Mar 31 2021 11:23 AM

Yellow media conspiracy once again on TTD - Sakshi

సాక్షి, అమరావతి/తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానాల (టీటీడీ)పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మరోసారి బెడిసి కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిజోరం రాష్ట్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్‌ బలగాలు జప్తు చేయగా, దాదాపు నెలన్నర తర్వాత ఆ సంఘటనను టీటీడీకి ఆపాదిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయడం విస్మయ పరుస్తోంది. కాగా జప్తు చేసిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్‌ శాఖ పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేయడంతో ఇది ఎల్లో మీడియా కుట్ర అని స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న మిజోరాం నుంచి మయన్మార్‌కు 120 బస్తాలలో ఓ వాహనం ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్‌ బలగాలు జప్తు చేశాయి. ఐజ్వాల్‌కు చెందిన ముంగ్సీయన్‌ సింగ్‌ అనే వ్యక్తి జీపులో వీటిని తీసుకెళ్తుండగా, అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడిగితే లేవని చెప్పాడు. దాంతో మొత్తం రూ.18,17,089 విలువైన 3,240 కేజీల తలనీలాలను జప్తు చేశారు. ముంగ్సీయన్‌ సింగ్‌ను పోలీసులు విచారించగా ఐజ్వాల్‌లో మరుయతి అనే మహిళ తో ఆ తలనీలాలను తన వాహనంలో మయన్మార్‌కు రవాణా చేసేందుకు కిరాయికి ఒప్పుకున్నానని చెప్పారు. దాంతో అతన్ని అరెస్టు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దేశంలో ఎన్నో దేవాలయాలు, ప్రైవేట్‌ ప్రదేశాల్లో తలనీలాలు సమర్పిస్తుండగా, అవి టీటీడీకి చెందినవే అని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో ఆ తలనీలాలతో టీటీడీకి సంబంధం ఉన్నట్టు తమ విచారణలో వెల్లడి కాలేదని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది.

మాకు సంబంధం లేదు : టీటీడీ
మిజోరాంలో జప్తు చేసిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను ఈ– టెండర్ల ద్వారా వేలం నిర్వహించి విక్రయిస్తుంటామని తెలిపింది. టెండర్‌లో ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన బిడ్డర్‌ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తున్నామని వివరించింది.  కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలో ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదని తెలిపింది. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతుంటాయని, టీటీడీ కూడా ప్రతి 3 నెలలకోసారి ఈ–టెండర్‌ ద్వారా తలనీలాలు విక్రయించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని పేర్కొంది. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తెలిపింది. 

ఎల్లో మీడియాపై భక్తుల ఆగ్రహం
వాస్తవాలు ఇలా ఉంటే ఎల్లో మీడియా మాత్రం ఆ తలనీలాలు టీటీడీకి చెందినవని దుష్ప్రచారానికి ఒడిగట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతో తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బతీసేందుకు, భక్తుల మనోభావాలకు భంగం కలిగించేందుకు ఎల్లో మీడియా కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై బుదర జల్లేందుకు టీటీడీపై దుష్ప్రచారం చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఓ రాజకీయ వ్యూహంగా మార్చుకున్నాయని, ఇందుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టీటీడీపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు
భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్‌ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్‌ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై మంగళవారం రాత్రి తిరుపతి ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీకి చెందిన రామ రాజ్యం మళ్లీ మొదలైంది (టీడీపీ పొలిటికల్‌ వింగ్‌), గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా వ్యక్తులు, సంస్థలు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం, షేర్‌ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ అధికారులు ఆధారాలు సమర్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement