
సాక్షి, తిరుపతి: వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమే అంటూ కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. న్యాయం మా వైపు ఉంది. నాపై 100 కేసులు పెట్టినా భయపడను. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటా. మీ పాలనలో జరిగే అరాచకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుంది. దేవుడిని అడ్డుపెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు’’ అంటూ భూమన ధ్వజమెత్తారు.
తప్పుడు కేసులు.. భూమన పోరాటాలను ఆపలేవు: ఎంపీ గురుమూర్తి
తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, భూమన కరుణాకర్‌రెడ్డిపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 30 వేల మహిళలు కనిపించడం లేదని.. వాలంటీర్లు వ్యవస్థ వలనే జరిగిందని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తే మేము కేసు పెట్టలేదు. ఇవాళ వాస్తవంగా గోశాలలో జరిగిన గోవుల మృతిపై ప్రశ్నించిన భూమనపై కేసు నమోదు చేస్తారా..?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’ అని గురమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.