సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో మద్యం దందా ఇష్టారాజ్యంగా సాగిందని.. లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. ధరలు పెంచి మద్యం విక్రయాలు సాగించినా.. విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా అలాంటి అక్రమాలను ప్రోత్సహించేలా వ్యవహరించిందని కాగ్ ఎత్తి చూపింది. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను, అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్సుదారులు అపరాధ రుసుం చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేనదని, చాలా కేసుల్లో పన్నులు, సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్టయిందని కాగ్ వ్యాఖ్యానించింది.
కాగ్ వెల్లడించిన అక్రమాల్లో కొన్ని ఇలా..
- మద్యం కోటా దస్త్రాలను పరిశీలించగా.. కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు. ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీవీఎస్ డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్, శ్రావణి ఆల్కో బ్రూవరీస్ నుంచి రూ.22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది.
- మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది. దీనివల్ల రుసుముల రూపేణా రూ.13.24 కోట్లు, వడ్డీ రూపేణా రూ.6.02 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది.
- 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో 20,475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను నేర చిట్టాల నివేదికలో పొందుపరచలేదు.
Comments
Please login to add a commentAdd a comment