బాబు పాలనలో పెరిగిన అప్పులు.. తగ్గిన రెవెన్యూ రాబడి
కుండబద్దలు కొట్టిన కాగ్ గణాంకాలు
రూ.6,047 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి
అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడీ అదేదారి
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలోనూ భారీగా తగ్గుదల
డిసెంబర్ నాటికే ఏకంగా రూ.73,875 కోట్ల అప్పులు
రెవెన్యూ లోటు రూ.64,444 కోట్లు.. ద్రవ్య లోటు రూ.73,635 కోట్లు
ఈ లెక్కన వృద్ధి రేటు పెరుగుదల అంతా ఊహాజనితం
రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండిపోయారు. గోబెల్స్‌కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్‌లో చెప్పినదానికి మించి అప్పులు చేస్తుండటం కళ్లెదుటే కనిపిస్తుంటే.. అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు.
రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోవడం.. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం.. కేంద్ర గ్రాంట్లు తగ్గడం.. అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవర పెడుతుంటే, బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్.. రయ్.. అని పరుగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేవో దావోస్‌లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం వెల్లడించింది.
గత ఏడాది (2023) డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది. బడ్జెట్‌లో పేర్కొన్న దాని కన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరో పక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది.
ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సంక్షోభం లేకపోయినా తగ్గిన రాబడి
కోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాది ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది (2023) డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రజల దగ్గర డబ్బులేక పోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రూ.6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం రూ.993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది.
ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్‌లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది.
రాబడి తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది?
రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి, ఈ ఏడాది బడ్జెట్‌లో అంచనాలకు మించి.. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్‌లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా రూ.64,444 కోట్లకు చేరింది.
ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొనగా, డిసెంబర్ నాటికే రూ.73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతోందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment