అప్పుల సొమ్ము ఆర్భాటాల పాలు | CAG revealed in the Preliminary Report about state government | Sakshi
Sakshi News home page

అప్పుల సొమ్ము ఆర్భాటాల పాలు

Published Tue, Jul 24 2018 4:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

CAG revealed in the Preliminary Report about state government - Sakshi

సాక్షి, అమరావతి: ఎవరైనా అప్పులు ఎందుకు చేస్తారు.. వ్యాపారం చేసి ఆదాయం గడించడానికో, తప్పని అవసరాలకో చేస్తారు. అప్పులు చేసి సోకులు చేస్తే ఏమవుతుంది? తీర్చలేక తలకు భారమవుతుంది. ఆ తర్వాత దివాలాకు దారి తీస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. ఆదాయం పెంచడానికి గత నాలుగేళ్ల నుంచి తీసుకుంటున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో కూడా రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. నిత్యం చేబదుళ్లు, ఓవర్‌డ్రాఫ్టుల్లోనే కొనసాగించింది.

అప్పుడు కూడా ఇంతే. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారాన్నీ ప్రజలపై మోపుతున్న వైనాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ప్రాథమిక ఖాతాల్లో బయటపెట్టింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల కల్పనకు రూ. 21,959 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం రూ. 14,089 కోట్లే ఖర్చు చేసినట్లు కాగ్‌ ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఇది 2016–17 ఆర్థిక సంవత్సరం కంటే కూడా తక్కువని పేర్కొంది. ఆ ఏడాది రూ. 15,484 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. 

క్షీణిస్తున్న క్రమశిక్షణ: ప్రస్తుతం చేసిన అప్పుల్లో కొంత వాటా గతంలో చేసిన అప్పులు, ఆ అప్పులపై వడ్డీలు చెల్లించడంతో పాటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నేతల ఆర్భాటాలకు, రెవెన్యూ రంగాలపైన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం చేస్తోంది. దీంతో నానాటికి ఆర్థిక క్రమశిక్షణ క్షీణిస్తోంది. బడ్జెట్‌ ప్రతిపాదనలకు వాస్తవ వ్యయాలకు కూడా పొంతన లేకుండా పోతోంది. బడ్జెట్‌ ప్రతిపాదనలను గౌరవించకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

రెవెన్యూ, ద్రవ్యలోటు అదపులేకుండా పోతోందని, ఏటికేడు లోటు పెరిగిపోవడమే తప్ప తగ్గడం లేదని కాగ్‌ లెక్కల్లో తేలింది. రెవెన్యూ లోటు రూ. 22,844 కోట్లకు చేరిందని, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి కన్నా ఎక్కువగా ఉందని కాగ్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంత్సరంలో రెవెన్యూ లోటు రూ. 20,250 కోట్లుగా ఉంది. అలాగే బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు రూ. 23,054 కోట్లుగా పేర్కొన్నారు. వాస్తవంగా రూ. 39,663 కోట్లు ద్రవ్యలోటు ఏర్పడింది. ఇది కూడా 2016–17 ఆర్థిక సంవత్సరం (రూ. 34,269 కోట్లు) కన్నా ఎక్కువగా ఉందని అకౌంట్స్‌ స్పష్టం చేశాయి. 

రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం
ఆర్థిక క్రమశిక్షణ తప్పడం రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ పరిస్థితులకు పాలకుల తప్పిదమే కారణమని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పనులను వదిలేసి ప్రైవేట్‌ సంస్థలు చేయాల్సిన పనులను చేయడంతో రెవెన్యూ రంగాలకు వ్యయం ఎక్కువగా అవుతోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేబుల్‌ టీవీ సెట్‌టాప్‌ బాక్సులు, టవర్లు ఏర్పాటు వంటి వాటికి ప్రభుత్వం  ప్రైవేట్‌ సంస్థలకు నిధులు ఇస్తుండటమే ఉదాహరణ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement