
జగన్‌పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే
అసెంబ్లీ వేదికగా అంగీకరించిన కూటమి సర్కారు
రూ.14 లక్షల కోట్లు.. రూ.10 లక్షల కోట్ల అప్పులంటూ తప్పుడు ప్రచారం
గత సర్కారులో బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి రూ.6.46 లక్షల కోట్లే
2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.4.91 లక్షల కోట్లు
2023–24 మార్చి నాటికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు
కాగ్, ఆర్‌బీఐతో పాటు మాజీ సీఎం జగన్ చెపుతున్నవి ఈ లెక్కలే
వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి కేశవ్ ఇదే సమాధానం
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులపై ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలే చెప్పామని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. ఒకసారి రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.10 లక్షల కోట్లంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ అసెంబ్లీలో, బయట నిస్సిగ్గుగా అవాస్తవాలు చెబుతున్నారు.
అయితే శుక్రవారం అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మత్స్యరాస విశ్వేశ్వర రాజు రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లిఖిత పూర్వకంగా సమాధానం చెబుతూ 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి మొత్తం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇదే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ సీఎం చంద్రబాబు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అబద్ధాలు చెప్పారు.
ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర అప్పులు 2023–24 మార్చి నాటికి బడ్జెట్‌లో రూ.4.91 లక్షల కోట్లు, గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు.. మొత్తంగా రూ.6.46 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. తద్వారా సీఎం చంద్రబాబు ఇంకా రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని అర్థమైందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
దుష్ప్రచారమే లక్ష్యం
కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో 2024 డిసెంబర్ నాటికే ఏకంగా రూ.71 వేల కోట్లకు పైగా అప్పు చేసినట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు. 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.4,91,734.11 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి బడ్జెట్ అప్పులు రూ.5,63,376.96 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు రూ.91,252.58 కోట్లు ఉన్నాయన్నారు.
అన్నీ కలుపుకుంటే కూడా మొత్తం అప్పులు రూ.10 లక్షల కోట్లు లేవని తేలింది. అయినా సరే సీఎం చంద్రబాబు పదే పదే రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని చెబుతుండటం వెనుక గత దుష్ప్రచారమే కారణం. అప్పుడు అలా చెప్పినందున, ఇప్పుడు మరో రకంగా చెబితే బాగోదనే ఇలా మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


రాష్ట్ర అప్పులు రూ.6.46 కోట్లేనని అప్పటి సీఎం వైఎస్ జగన్‌తోపాటు, కాగ్, ఆర్‌బీఐ నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు మంత్రి కేశవ్ కూడా ఇదే చెప్పారు. ఇదంతా ప్రజలను నమ్మించాలనే మోసపూరిత వ్యవహారం తప్ప మరొకటి కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.