‘జీఎస్డీపీ పెంపే సంపద సృష్టి!’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) పెంచడమే సంపద సృష్టి అని, దాన్ని చూపించి అప్పులు తేవడంతో పాటు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా అభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే తన విజన్ 2047 అని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై గురువారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పెరిగే జీఎస్డీపీ అంచనాలతో అదనంగా ఎంత అప్పు చేసేది, తద్వారా అదనంగా వ్యయానికి ఎన్ని నిధులు వస్తాయనేది వివరిస్తూ.. ఇదే రీతిలో విజన్–2047 నాటికి ఏటా 15 శాతం వృద్ధితో (ఊహాజనిత) జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే, ఈ ఆర్థిక ఏడాది ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా మేరకు రాష్ట్ర స్తూల ఉత్పత్తి అదనంగా 4.03 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనాల మేరకు 2024–25 ఆర్థిక ఏడాది జీఎస్డీపీ 12.94 శాతం వృద్ధిగా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధి గత ఆర్థిక ఏడాది 7.42 శాతం ఉంటే, ఈ ఆర్థిక ఏడాది ముందస్తు అంచనా మేరకు 6.71 శాతంగా ఉందని చెప్పారు. 2025–26 నుంచి 2029–30 వరకు జీఎస్డీపీ పెంచడం ద్వారా అదనంగా రూ.4,35,867 కోట్ల అప్పు చేస్తానని, తద్వారా అదనంగా వ్యయం చేయడానికి రూ.1,58,987 కోట్లు వస్తాయని చెప్పారు. విజన్–2047 లక్ష్యం తలసరి ఆదాయం రూ.58 లక్షలకు పెంచడమేనని స్పష్టం చేశారు. పెరిగిన తలసరి ఆదాయాన్ని ప్రజలు ఖర్చు చేస్తారని, దాంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు.విజన్–2047పై 16 లక్షల అభిప్రాయాలుకేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్కు కూడా రాని రీతిలో రాష్ట్ర విజన్–2047పై ఏకంగా 16 లక్షల మంది అభిప్రాయాలను తెలిపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి జీఎస్డీపీ రూ.3.47 కోట్లకు చేరుతుందని, ఈ లెక్కన తలసరి ఆదాయం రూ.58.14 లక్షలకు చేరుతుందని వివరించారు. నిరంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఇది సాధ్యమని, లేదంటే తలసరి ఆదాయం రూ.13 లక్షలకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చితేనే తాను చెప్పిన రీతిలో జీఎస్డీపీ ఉంటుందని, లేదంటే అప్పులు చేయడమే మార్గమని అన్నారు. లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చకపోతే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తుందన్నారు. ఇప్పుడు అప్పులు ఇవ్వడం లేదని, బ్యాంకులు గానీ, ఇతర సంస్థలు గానీ అప్పులు ఇవ్వాలంటే విశ్వసనీయత ప్రధానమని చెప్పారు. పీ–4లో భాగంగా రాష్ట్రంలో కుటుంబ సభ్యులందరినీ అనుసంధానం చేస్తూ, ప్రతి ఇంటిని జీయో ట్యాగింగ్ చేసి వారి అకౌంట్లను తీసుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తామని, తద్వారా సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు 150 సేవలు అందిస్తామని చెప్పారు. పీ–4లో జనాభాయే ఆస్తి అని చెప్పారు. పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామన్నారు. తాను పెన్షన్ పెంచడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు చూసుకుంటున్నారని అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు పేదలను పైకి తీసుకురావడానికి ముందు రావాలన్నారు. ఎవరైనా ఒకరిని చంపితే వారికీ అదే గతిరాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్మార్టమ్కు కారణమైన వారికి కూడా పోస్ట్మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టబోమని, రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలేనని, బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టామన్నారు. గంజాయి, డ్రగ్స్, లిక్కర్ దందాలను నిరోధిస్తున్నామని చెప్పారు.