
పడిపోతున్న కుటుంబ పొదుపు.. పెరుగుతున్న వ్యక్తిగత రుణాలు
2000లో మొత్తం పొదుపులో 84 శాతంగా ఉన్న కుటుంబ పొదుపు
2023 నాటికి 61 శాతానికి పడిపోయిన పొదుపు రేటు
10.01 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిన జీఎస్‌డీపీలో పొదుపు రేటు
21 నుంచి 34 శాతానికి పెరిగిన కన్సూ్యమర్ రుణాలు
అన్‌సెక్యూర్డ్ రుణాలు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి రావడమే ప్రధాన కారణం
ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో సుస్థిర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
వెల్లడించిన బ్లూమే రీసెర్చ్ నివేదిక
సాక్షి, అమరావతి: దేశంలో అప్పుల అప్పారావులు పెరిగిపోతున్నారు. పాత తరం పొదుపు మంత్రాన్ని జపిస్తే.. నేటి తరం పొదుపు కంటే అప్పులే ముద్దంటోంది. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత నుంచి పొదుపు తగ్గించి.. అప్పుచేసి మరీ వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్ పెరుగుతోంది. తాగాజా బ్లూమే రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కుటుంబ పొదుపు భారీగా పతనమై.. ఆ స్థానంలో కన్సూ్యమర్ రుణాలు పెరుగుతున్నాయని పేర్కొంది.
2000 సంవత్సరంలో మొత్తం దేశీయ పొదుపు విలువలో కుటుంబ పొదుపు వాటా 84 శాతంగా ఉంటే.. అది 2022–23 సంవత్సరానికి 61 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశీయ కుటుంబ పొదుపు విలువ రూ.49 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా. వడ్డీ రేట్లు తగ్గిపోవడం, నవతరానికి సులభంగా రుణాలు అందించే సంస్థలు అందుబాటులోకి రావడంతో పొదుపు రేటు పడిపోవడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
2000 సంవత్సరంలో దేశ జీడీపీలో 10.1 శాతంగా ఉండే కుటుంబ పొదుపు విలువ ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో జీడీపీలో కుటుంబ రుణాల విలువ 2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగిపోయిందని బ్లూమే రీసెర్చ్ వెల్లడించింది.
నచ్చితే కొనేయడమే..
ప్రస్తుత తరం ఏదైనా ఒక వస్తువు నచ్చితే జేబులో డబ్బులు లేకపోయినా కొనేస్తోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, లోన్ యాప్స్ విరివిగా రుణాలు ఇస్తుండటంతో ప్రస్తుత తరం వాళ్లు ఖర్చుకు వెనకాడటం లేదు. 2015–16లో మొత్తం రుణాల్లో కన్సూ్యమర్ రుణాల వాటా 21 శాతంగా ఉంటే.. 2023–24 నాటికి 34 శాతానికి చేరిపోయింది. దీనికి విరుద్ధంగా పారిశ్రామిక రుణాలు 42 శాతం నుంచి 34 శాతానికి పడిపోయాయి.
భారతీయులు చేస్తున్న అప్పుల్లో అత్యధికంగా గృహ రుణాలు కాకుండా ఇతర రుణాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పొదుపు–అప్పుల నిష్పత్తి చూస్తే కొంత ఆందోళన కలిగిస్తోందని, దీర్ఘకాలంలో దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని బ్లూమే రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment