అవసరాల కోసం రుణం తీసుకోవాలని భావించిన సర్కారు
హైదరాబాద్‌లో 400 ఎకరాల భూముల తాకట్టుకు నిర్ణయం
అనుభవం కలిగిన మర్చంట్ బ్యాంకర్లకు బాధ్యత అప్పగింత
రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామంటూ ఆర్థిక సంస్థల మెలిక
ఆర్‌బీఐ అభ్యంతరాలు,ఎఫ్‌ఆర్‌బీఎం లింకుతో సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు.
మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం
మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.
వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఫైనాన్స్ సంస్థల షరతులు
అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్‌ఆర్‌బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment