FRBM
-
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఆర్థికంగా ఏపీ బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని.. ద్రవ్య లోటు, అప్పులు భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది.అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని.. మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని వెల్లడించింది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది.వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపడుతోందని.. తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందని నివేదిక తెలిపింది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచి్చంది. ఏపీ అప్పు రూ.4.85 లక్షల కోట్లుఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి(ఎఫ్ఆర్బీఎం) అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. -
రాష్ట్రంలో ప్రగతి పరుగులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం)ను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నందునే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్లో భాగంగా ద్రవ్య విధానాన్ని మంత్రి వెల్లడించారు. ద్రవ్య విధాన వ్యూహపత్రాన్ని సభకు సమర్పించారు. ‘కోవిడ్ తరువాత పరిస్థితుల్లో రాష్ట్రం పురోగమనంలో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయ వనరులు 21.1 శాతం అద్భుత ప్రగతి కనబరుస్తున్నట్లు సవరించిన బడ్జెట్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోనూ పన్నుల వసూళ్లు ఆశించిన దానికంటే అధికంగా ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 5.06 శాతం పెరుగుతుంది. జీఎస్డీపీలో ద్రవ్యలోటు 4 శాతం ఉంటుందని 2022–23 బడ్జెట్లో అంచనా వేశాం. కానీ, ఆర్థిక ప్రగతి కారణంగా 3.21 శాతానికి తగ్గింది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. అనేక కొత్త పథకాలు, భారీ కమిట్మెంట్స్తో వ్యయం అధికంగా ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ.2,980 కోట్లుగా ఉంటుంది. 2022–23 ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 25.9 శాతం ఉంటాయని అంచనా వేసినా. సవరించిన బడ్జెట్ అంచనాల్లో అది 24.33 శాతంగానే ఉండనుంది’అని హరీశ్ తెలిపారు. పన్నుల ఆదాయమే వెన్నుదన్ను ‘రాష్ట్రానికి పన్నుల ఆదాయమే వెన్నుదన్నుగా ఉంది. అందులో భాగంగా పన్ను వసూళ్లలో ఎలాంటి లోపాలు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, సామాన్యులపై భారం వేయకుండా ఎక్కడెక్కడ పన్నులు ఇంకా వసూలు అయ్యే అవకాశం ఉందో వాటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఆదాయం మరింత పెంచుకుంటాం. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మార్కెట్ ధరల స్థిరీకరణ, స్టాంపు డ్యూటీ పెంపుతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడులు రూ.1.31 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశాం. పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఇక పన్నేతర ఆదాయ కూడా పెరుగుతోంది. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని విక్రయించడం వల్ల ఆదా యం పొందుతున్నాం..’అని మంత్రి వివరించారు. కేంద్రం కంటే బెస్ట్ ‘స్థిర, ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి కేంద్రంతో పోలిస్తే అభివృద్ధి అధికంగా ఉంది. 2020–21 కోవిడ్ సమయంలో అభివృద్ధి తిరోగమంలో ఉన్నా కేంద్రంతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఆ సంవత్సరం కేంద్రం 6.6 శాతం తిరోగమనంలో ఉంటే.. రాష్ట్రం 4.9 శాతం తిరోగమనంలో ఉంది. ఆ మరుసటి సంవత్సరం నుంచి ఆర్థిక పురోగతి సాధ్యమైంది. తిరోగమనం నుంచి పురోగతి వైపు మళ్లడమే కాకుండా ఏకంగా 10.9 శాతం పెరుగుదల సాధ్యమైంది. సెకండరీ సెక్టార్‌లోని ఉత్పత్తి, విద్యుత్, నీటి సరఫరా, నిర్మా ణం రంగం పురోగతిలో ఉంది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, గనులు, క్వారీ కూడా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించాయి. నిరంతర విద్యుత్, చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు వంటి పథకాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి’అని హరీశ్ తెలిపారు. -
ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారమే బడ్జెట్ అమలు: బుగ్గన
సాక్షి, అమరావతి: బడ్జెట్ అమలు కోసం ద్రవ్య మండలి (ఫిస్కల్ కౌన్సిల్) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తోసిపుచ్చారు. కాగ్, ఆర్థిక సంఘం, గణాంకాల సంస్థలు ఉండగా కౌన్సిల్ అవసరం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పార్లమెం ట్లో ప్రకటించడాన్ని గుర్తుచేశారు. కరోనా ఏడాదైన 2020–21ని పదేపదే సాధారణ సంవత్సరాలతో పోలుస్తూ విమర్శలకు దిగటాన్ని తప్పుబట్టారు. కోవిడ్ మహమ్మారితో 2020–21లో ప్రపంచంతోపాటు దేశంలోనూ ఆర్థిక స్థూల ఉత్పత్తి భారీ గా పతనమైందన్నారు. ఇదే క్రమంలో మన రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా బాగా దెబ్బతిందన్నారు. 2020– 21లో రాష్ట్ర ఆదాయం సుమారు రూ.8,000 కోట్లు తగ్గిపోగా మరోపక్క కోవిడ్ నియంత్రణ, చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.7,120 కోట్లు వ్యయం చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారమే బడ్జెట్‌ను అమలు చేస్తున్నామన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ బుగ్గన శుక్రవారం మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ.. పేదలకు రూ.1.20 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయాలపై టీడీపీ విమర్శలు అర్ధరహితం. 2020 – 21 తొలి ఆర్నెళ్లలో మూల ధన వ్యయం తక్కువగా చేశారనే విమర్శలు తప్పు. ఇవి గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. టీడీపీ హయాంలో మూల ధన వ్యయం ఎంత చేశారో చెప్పాలి. పేదలకు గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకున్న చరిత్ర టీడీపీదే. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సంక్షేమం కోసం నగదు బదిలీతో రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశంలో సంక్షేమానికి ఇంత భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడా లేదు. పేదలకు సంక్షేమ పథకాల వల్ల ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. చదవండి: (చట్టాలు చేయకుండా నిలువరించలేరు) విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం టీడీపీ దృష్టిలో ఆర్థికాభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రైవేట్ సంస్థలతో ఎంవోయూలకు పరిమితం కావడమే. వాటితో లేనిది ఉన్నట్లు చూపించి మార్కెటింగ్ చేసుకున్నారు. విద్య, వైద్య రంగాలను నీరుగార్చి వాగ్దానాలను మరిచి మోసగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టిలో ఆర్థికాభివృద్ధి అంటే.. రైతన్నల సంక్షేమం, మూలధన నిర్మాణం, విద్య, వైద్య రంగాల్ని మెరుగుపరచడం, మహిళా సాధికారత, వికేంద్రీకరణ, పారిశ్రామి కీక రణ, ఉద్యోగాల కల్పన. పేదలు మంచి చదువులు చదివి అన్నిరంగాల్లో ముందుండటం టీడీపీకి ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వినూత్న కార్యక్రమా లను కేంద్రంతో సహా ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని అక్కడ కూడా అమలు చేస్తుంటే టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. గత సర్కారు హయాంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. -
FRBM Limit: 5 శాతానికి పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్బీఎం చట్టం కింద రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే పరిమితిని 4 నుంచి 5 శాతానికి పెంచాలని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ అమలవుతోందని, దీని కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ 44వ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సచివాలయం నుంచి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ఒక్క మే నెలలోనే తెలంగాణ రూ.4,100 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని హరీశ్‌రావు చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచితే రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. త్వరగా వ్యాక్సిన్ ఇవ్వండి కోవిడ్ థర్డ్‌వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం వీలున్నంత త్వరగా ఉచిత వ్యాక్సినేషన్‌ను చేపట్టాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునైనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్సహా ఇతర వైద్య సామగ్రిపై జీఎస్టీ విధింపు విషయంలో మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు హరీశ్ మద్దతు పలికారు. చదవండి: నాలాల వెంబడి ఇళ్లలోని పేదలకు డబుల్ ఇళ్లు -
Telangana: అప్పులకు ‘ఆలంబన’
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో రుణ పరిమితి పెంపు కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆలంబనగా నిలుస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 5 శాతం వరకు రుణం పొందొచ్చని వెసులుబాటు కలి్పంచింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు రూ.60 వేల కోట్ల అప్పులు తీసుకోవచ్చని అంచనా వేస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11.05 లక్షల కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా మేరకు అందులో 5 శాతం అంటే రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు అప్పులు తీసుకునే అవకాశముందని లెక్కలు కడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మొత్తం రూ.47,500 కోట్లను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సమీకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అదనంగా మరో రూ.7,500 నుంచి రూ.12,500 కోట్ల వరకు తీసుకునే వెసులుబాటు కలగనుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ లోనూ ఊరట.. ప్రతి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కు వెళ్లేందుకు 36 రోజుల సమయం అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఓడీని ఆర్బీఐ సవరించింది. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల కాలంలో 50 రోజుల పాటు ఓడీకి వెళ్లొచ్చు. అలాగే గతంలో వరుసగా 14 రోజులు మాత్రమే ఓడీకి వెళ్లే వీలుండగా, ఇప్పుడు అది 21 రోజులకు పొడిగించింది. ఈ వెసులుబాటు అన్ని రాష్ట్రాలకు సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది. దీంతో కష్టకాలంలో ఓడీలు ఉపయోగపడతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. ముఖ్యంగా వేతనాలు, వడ్డీల చెల్లింపు లాంటి తక్షణావసరాలకు ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే మొదటి త్రైమాసికానికి గాను బాండ్ల అమ్మకాల ద్వారా రూ.9 వేల కోట్ల సమీకరణకు ప్రణాళిక రూపొందించుకోగా, మిగిలిన నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఈ నెలాఖరుకు తేలుతాయని, మేలో ఆదాయ, వ్యయ అంచనాల ఆధారంగా, వచ్చే త్రైమాసికానికి కూడా నిధుల సమీకరణ ప్రణాళిక రూపొందిస్తామని చెబుతున్నారు. -
జవాబుదారీతనం
-
జవాబుదారీతనం
నగర, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం.. తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలి. ఈ సేవలు అందనప్పుడు వాటికి ఫీజులు అడగడం సరికాదు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలి. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అన్నదాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పౌరుల సమస్యల పట్ల జవాబుదారీతనం ఉండాలని, నాణ్యమైన సేవలు అందించడమే పరిపాలనలో ప్రమాణం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం – ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) పరిమితిని పెంచాలన్న రాష్ట్రాల కోరికపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు సంబంధించి సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మున్సిపాల్టీలు–కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్, కార్మిక రంగాల్లో కేంద్రం.. రాష్ట్రాలకు సూచించిన సంస్కరణల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధిపై సీఎం జగన్ మాట్లాడుతూ.. పౌరుల సమస్యల పరిష్కారం, నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం పంపిన సంస్కరణల మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం – దేశంలో ఎక్కడైనా సరే రేషన్ పొందేలా కేంద్రం వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం ఉందని, రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. – ఈ విధానంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. బియ్యం కార్డులు, వాటి లబ్ధిదారులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు. నవశకం ద్వారా తీసుకున్న దరఖాస్తులు, వాటిలో అర్హులుగా గుర్తించిన వారితో కలుపుకుని దాదాపు 1.39 కోట్ల మందికి బియ్యం కార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రత కూడా ముఖ్యం – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. రెడ్ టేపిజానికి దూరంగా సింగిల్ విండో విధానాలు అనుసరిస్తూ, అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. – రెన్యువల్స్ విషయంలో పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రత కూడా ముఖ్యమని, వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. – పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో గ్యాస్ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. – పరిశ్రమల్లో కాలుష్యంపైగానీ, భద్రతపైన గానీ ఫిర్యాదు లేదా సమాచారం రాగానే స్పందించేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. కాలుష్య తనిఖీలతోపాటు కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని ఆదేశించారు. కార్మికులకు పనికి తగ్గ వేతనం లభించాలి – కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నిర్దేశించిన సంస్కరణలపై సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్ లాంటి విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి, వేగంగా నడిపించడానికి.. మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ఈ సంస్కరణలు తీసుకు రావాలని కేంద్రం చెబుతోందని అధికారులు వివరించారు. – ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టం చేశారు. వారి పనికి తగ్గ వేతనం లభించేలా చూడాలన్నారు. రబీ నుంచి రైతులకు సంపూర్ణంగా నాణ్యమైన విద్యుత్ – విద్యుత్ రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలని.. ఏసీఎస్– ఏఆర్ఆర్ మధ్య ఉన్న తేడాను తగ్గించాలన్న కేంద్రం సూచనలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగంలో తీసుకున్న చర్యలపై సమావేశంలో ప్రస్తావించారు. – మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువని అధికారులు వివరించారు. డిస్కంలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించుకుంటూ వాటిని కష్టాల నుంచి బయటకు పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. – ఉచిత విద్యుత్ రూపంలో ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకునేందుకు, పగటి పూటే 9 గంటల కరెంటు ఇచ్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 10 వేల మెగావాట్ల సోలార్ కరెంటు ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. దీనివల్ల తక్కువ ధరకే ప్రభుత్వానికి విద్యుత్ వస్తుందని, దీన్ని రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. – పగటి పూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించి 82 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయయని సీఎం చెప్పారు. మిగిలిన పనులు కూడా పూర్తి అయితే రబీ నుంచి నూటికి నూరు శాతం సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని అన్నారు. విద్యుత్ సంస్కరణల విషయంలో మనం చాలా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. – సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, కార్మిక, పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలంటూ రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో, దీనికోసం కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా, ఒన్ నేషన్–ఒన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మున్సిపాల్టీలు– కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్‌రంగం.. ఈ నాలుగు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పిన సంస్కరణలను అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని సహా ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, కార్మిక, పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 1. దేశంలో ఎక్కడైనా సరే రేషన్ పొందేలా కేంద్రం ఒన్ నేషన్-ఒన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం ఉందని, రేషన్ పంపిణీలో పారదర్శకతకోసం బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ విధానంలో రాష్ట్రం ముందు ఉందన్నారు. బియ్యం కార్డులు, వాటి లబ్ధిదారులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు. నవశకం ద్వారా తీసుకున్న దరఖాస్తులు, వాటిలో అర్హులుగా గుర్తించిన వారితో కలుపుకొని దాదాపు 1.39 కోట్ల మందికి బియ్యం కార్డులు ఉన్నాయని స్పష్టంచేశారు. (కోవిడ్ సంక్షోభమున్నా అవకాశాలను సృష్టిస్తాం) 2. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. రెడ్‌టేపిజానికి దూరంగా సింగిల్ విండో విధానాలు అనుసరిస్తూ, అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. అలాగే రెన్యువల్స్ విషయంలో కూడా పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. 3. పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రతకూడా ముఖ్యమని, వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో గ్యాస్ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. పరిశ్రమల్లో కాలుష్యంపైనగాని, భద్రతపైన గాని ఫిర్యాదు లేదా సమాచారం రాగానే స్పందించేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టంచేశారు. కాలుష్య తనిఖీలతోపాటు కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. (మార్కెటింగ్ కేంద్రాలుగా ఆర్బీకేలు..) 4. అలాగే కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నిర్దేశించిన సంస్కరణలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్ లాంటి విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి వేగంగా నడిపించడానికి, మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం ఈ సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్రం చెప్తోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టంచేశారు. వారి పనికి తగ్గ వేతనం లభించేలా చూడాలన్నారు. 5. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధికోసం సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మీదట సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు ఉండాలని స్పష్టంచేశారు. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం.. తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందనప్పుడు– వీటికి ఫీజులు అడగడం సరికాదన్నారు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. (కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు) 6. విద్యుత్‌రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలని, అలాగే ఏసీఎస్ – ఏఆర్ఆర్ మధ్య ఉన్న తేడాను తగ్గించాలన్న కేంద్రం సూచనలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌రంగంలో తీసుకున్న చర్యలపై సమావేశంలో ప్రస్తావించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువని అధికారులు వివరించారు. డిస్కంలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించుకుంటూ వాటిని కష్టాలనుంచి బయటకు పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అంతేకాక ఉచిత విద్యుత్ రూపంలో ప్రభుత్వంపైన భారాన్ని తగ్గించుకునేందుకు, పగటిపూటే 9 గంటల కరెంటు ఇచ్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 10వేల మెగావాట్ల సోలార్ కరెంటు ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. దీనివల్ల తక్కువ ధరకే ప్రభుత్వానికి విద్యుత్ వస్తుందని, దీన్ని రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఇప్పటికే దీనికి సంబంధించి 82శాతానికి పైగా పనులు పూర్తయ్యాయయని, మిగిలిన పనులు కూడా పూర్తయితే రబీ నుంచి నూటికి నూరు శాతం సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్‌సంస్కరణల విషయంలో మనం చాలా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. కేంద్రం పంపిన సంస్కరణల మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
ప్రజలకిస్తే రాష్ట్రానికి ఇచ్చినట్లు కాదా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంతా బోగస్ అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకమైనవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన స్థాయి దిగజారి మాట్లాడారని, ఆయన వాడిన పదజాలం, మాటలను తెలంగాణ ప్రజలు హర్షించరని పేర్కొ న్నారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ అనేక విమర్శలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీనుంచి ఆన్లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.75 కోట్ల మందికి 25 కిలోల బియ్యం ఇవ్వడం బోగస్ అంటారా అని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగా తెలంగాణకు ఆస్పత్రులు రావా? లాభం చేకూరదా? ముందుగా ప్రకటించిన ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా? అని ప్రశ్నించారు. ప్రజలకిస్తే రాష్ట్రానికి ఇచ్చినట్లు కాదా? రాష్ట్ర అకౌంట్లో వేస్తేనే ప్రజలకిచ్చినట్లా అని ప్రశ్నించారు. కేంద్రానికి ఆ ఆలోచన లేదు రాష్ట్రాలు, దేశం బాగుండాలని ఎఫ్ఆర్బీఎంలో సంస్కరణలు అమలు చేయా లని కేంద్రం అడుగుతోంది తప్ప ఎవరి నెత్తినో కత్తి పెట్టే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. సంకుచిత భావనతో కేసీఆర్ ఉన్నా రన్నారు. తాము చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమని సీఎం కేసీఆర్ రైతుల్ని బెదిరించడం ఫ్యూడలిజం, నియంతృత్వం కాదా? అని ప్రశ్నించారు. సబ్సిడీలు ఇవ్వొ ద్దని చెప్పడం లేదని, లెక్కలు స్పష్టంగా ఉండాలని, ఎవరికి ఎంత ఎలా ఇస్తున్నారో వెల్లడించాలని కేంద్రం అడుగుతోందని పేర్కొ న్నారు. దుబారా ఉండొద్దని, అవి నీతిని నిర్మూలించాలని చెబుతోందన్నారు. సంస్కరణలు అంటే ఇవేనన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో ప్రజల కష్టాలు చూడాలే తప్ప రాజకీయాలు వద్దని హితవు పలికారు. ప్రజల కోసం కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే విమర్శిస్తూ బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పశు సంపద కోసం పెట్టే డబ్బు, మత్స్య కార్మికుల కోసం వెచ్చించే డబ్బు తెలంగాణకు రాదా? మీరు నిర్మించిన శీతల గిడ్డంగుల్లో కేంద్ర డబ్బు ఉందో లేదో లెక్క చెప్పగలరా అని ప్రశ్నించారు. శాంతి భద్రత అంశం రాష్ట్ర పరిధిలోనిదని, బైంసా ఘటన విషయంలో రాష్ట్రం అడిగితే పారామిలటరీని పంపిస్తామన్నారు. -
కేంద్రానికి అదనంగా రూ.5 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2–2.5 శాతం లేదా రూ.4–5 లక్షల కోట్ల మేర అదనంగా రుణాలు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మార్కెట్ నుంచి కాకుండా ఆర్బీఐ నుంచి నేరుగా రుణాల రూపంలో తీసుకోవాలని, ఇందుకోసం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)ను సవరించాలని గార్గ్ సూచించారు. స్వయం ఉపాధి ఆధారిత వ్యాపారాలు, చిన్న వ్యాపారస్థులకు రూ.2 లక్షల కోట్ల మేర సాయం అందించాలని అభిప్రాయపడ్డారు. వృద్ధి 2 శాతమే: ఇక్రా కరోనా ప్రభావంలో 2020–21లో భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2 శాతమే ఉంటుందని ఇక్రా రేటింగ్స్ అంచనావేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ జీడీపీలో వృద్ధిలేకపోగా 4.5 శాతం క్షీణత నమోదయ్యే వీలుంది. అయితే క్రమంగా కోలుకుని 2020–21లో 2 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చు’’ అని పేర్కొంది. -
3 నెలలు.. రూ.9 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం మొద టి త్రైమాసికంలో బాండ్లు, సెక్యూరిటీల వేలం ద్వారా రూ.9వేల కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం వేలంలో పాల్గొనే షెడ్యూల్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 నుంచి జూన్ 30 వరకు 6 దఫాల్లో ప్రభుత్వం ఈ నిధులను సమకూర్చుకోనుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున రాష్ట్ర సొంత రాబడులు తగ్గిపోయిన పరిస్థితుల్లో ఆర్బీఐ నిర్వహించే వేలం ద్వారా సమకూరనున్న ఈ నిధులతోనే నెట్టుకురావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల వారీ షెడ్యూల్ ఆర్బీఐ నిర్వహించే బాండ్లు, సెక్యూరిటీల వే లం ద్వారా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి రూ.1,27,205 కోట్ల మేర మార్కెట్ అప్పులు సమకూర్చుకుంటాయని ఆర్బీఐ అంచనా వేసింది. ఈనెల ఏడో తేదీ నుంచి వేలం షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో రాష్ట్రాలకు దఫాలవారీగా ఆర్బీఐ అవకాశం కల్పించింది. వేజ్ అండ్ మీన్స్కూ అవకాశం ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం ప్రకారం ఓవర్‌డ్రాఫ్ట్, వేజ్ అండ్ మీన్స్కు వెళ్లి అప్పులు తెచ్చుకోవడం అంత సులువు కాదు. ఆర్థిక సంవత్సరంలో పరిమిత శాతంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలా నిధులు సమకూర్చుకునే వీలుంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాలు వేజ్ అండ్ మీన్స్ కింద తీసుకునే అడ్వాన్సులను 30 శాతానికి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ వెసులుబాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది. వాస్తవానికి, దీనిపై ఆర్బీఐ చైర్మన్ సుధీర్ శ్రీవాస్తవ నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఇంతవరకు ఎలాంటి సిఫారసులు చేయకపోయినా, ప్రస్తుతం కరోనా తదనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. మన రాష్ట్రం వేలం షెడ్యూల్.. సమకూర్చుకునే నిధులు -
తలలన్నీ తాకట్టే
సాక్షి, అమరావతి: నలభై ఏళ్ల రాజకీయ, పరిపాలనా అనుభవం తన సొంతమని నిత్యం గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ట్ర ప్రజల మెడకు అప్పుల గుదిబండ తగిలించారు. అప్పుడే పుట్టిన శిశువులతో సహా ఒక్కొక్కరి తలపై ఏకంగా రూ.75 వేల అప్పుల భారాన్ని మోపారు. రాష్ట్రాన్ని రుణాల ఊబిలో ముంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, బడ్జెట్ బయట పరిమితికి మించి మరీ అప్పులు తీసుకొస్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేసి తీసుకొస్తున్న రూ.వేల కోట్లతో ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తున్నారా? అంటే అదీ లేదు. రుణాలను ఆస్తుల కల్పనకు కాకుండా పప్పు బెల్లాలకు, కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు కొట్టేయడానికి, శంకుస్థాపనలకు, ప్రత్యేక విమానాల్లో తిరగడానికి, తనకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే కార్యక్ర మాలు, ఈవెంట్లు, ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ప్రయోజనం లేని పనులకు ఒకవైపు సొమ్మంతా హారతి కర్పూరం అవుతుం డగా, మరోవైపు ప్రజల నెత్తిన అప్పుల కొండ పెరిగిపోతోంది. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల అప్పు రూ.96 వేల కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అప్పులు ఏకంగా రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని సాక్షాత్తూ అకౌంటెంట్ జనరల్ ప్రిలిమినరీ అకౌంట్స్‌లో స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటికే బడ్జెట్ బయట రూ.95,000 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో పరిమితికి మించి మరో రూ.30 వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. బడ్జెట్లో ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పులు చేసేందుకు నిబంధనలు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన దొంగ లెక్కలతో గతంలో ఇచ్చిన గ్యారెంటీలను చూపకుండా దాచేస్తూ బడ్జెట్ బయట పరిమితికి మించి ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఎన్నికల ముందు దొరికిన చోటల్లా రుణాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆరాటపడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం నిబంధనలకు మించి బడ్జెట్ బయట రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఆర్బీఐ నిబంధనలను సైతం ఉల్లంఘిస్తోందని పేర్కొంటున్నాయి. అప్పుల కోసం బ్యాంకులతో సీఎంవో చర్చలు బడ్జెట్ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయంలో 90 శాతం మేర అప్పులు చేసేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు వీలుంది. అయితే, ఆ పరిమితికి మించి టీడీపీ ప్రభుత్వం బడ్జెట్ బయట అప్పులకు గ్యారెంటీ ఇచ్చేసింది. నిబంధనల మేరకు రూ.94,555.89 కోట్ల అప్పులకు మాత్రమే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఆ పరిమితికి మించి అదనంగా రూ.1,154.25 కోట్లకు గ్యారెంటీ ఇచ్చి బడ్జెట్ బయట అప్పులు చేశారు. అంటే బడ్జెట్ బయట మొత్తం అప్పులు రూ.95,709 కోట్లకు చేరాయి. ఇప్పుడు కొత్తగా రెండు నెలల్లోనే రూ.29,465 కోట్ల మేర అప్పులు తెచ్చేందుకుప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వాణిజ్య బ్యాంకుల పెద్దలతో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) కార్యాలయం స్వయంగా చర్చలు జరుపుతోంది. ఈ అప్పులు తెస్తే నిబంధనలకు విరుద్ధంగా బడ్జెట్ బయట రూ.30,619.25 కోట్ల అప్పులు చేసినట్లవుతుందని, ఇలా చేయడం రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిమితి పట్టదా? 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బడ్జెట్ బయట చేసిన అప్పులు రూ.37,489.56 కోట్లు కాగా, 2018 డిసెంబర్ నాటికి ఆ అప్పులు రూ.47,379.56 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిబంధనల మేరకు రూ.47,176.33 కోట్ల మేరకు మాత్రమే బడ్జెట్ బయట అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండగా, దానికి మించి ఇప్పటిదాకా రూ.48,330.58 కోట్ల అప్పులకు గ్యారెంటీ ఇచ్చేసింది. అంటే ఇప్పటికే పరిమితికి మించి బడ్జెట్ బయట రూ.1,154.25 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినట్లయ్యింది. కమీషన్ల కోసమే అప్పులు ఎన్నికలకు రెండు నెలల ముందు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చేసి బడ్జెట్ బయట రూ.29,465 కోట్ల అప్పులు చేసేందుకు టీడీపీ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు ఫైళ్లను సిద్ధం చేసింది. వాణిజ్య బ్యాంకులతో బేరసారాలు సాగిస్తూ ఎంత ఎక్కువ వడ్డీకైనా సరే అప్పులు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారులు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. ఇలా తెస్తున్న అప్పులను కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు, ఎన్నికల ముందు అనుత్పాదక రంగాలకు వెచ్చించడానికే ముఖ్యమంత్రి తాపత్రాయ పడుతుండడం గమనార్హం. ఆర్థిక అత్యవసర స్థితిలోకి రాష్ట్రం రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాలకు చెందిన అప్పు రూ.96,000 కోట్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ కేవలం అప్పులే రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని అకౌంటెంట్ జనరల్ ప్రిలిమినరీ అకౌంట్స్‌లో తెలియజేశారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో సర్కారు గ్యారెంటీతో తెచ్చే అప్పులను ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుందని ‘కాగ్’ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తీసుకురావడంతో ప్రభుత్వానికి ఒక కొత్త అప్పులు పుట్టే వెసులుబాటు కూడా లేకుండాపోతోందని, ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తున్నారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భయపెడుతున్న అప్పుల భూతం ఇప్పుడే పుట్టిన శిశువులను సైతం చంద్రబాబు వదలడం లేదు. వారిపైనా అప్పుల భారం మోపుతున్నారు. వచ్చే రెండు నెలల్లో చేయనున్న రూ.30 వేల కోట్ల అప్పులతో కలిపి రాష్ట్రంపై మొత్తం అప్పుల భారం రూ.3.85 లక్షల కోట్లకు చేరనుంది. అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలపై రూ.75 వేల చొప్పున అప్పు ఉంటుందన్నమాట. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు గద్దెనెక్కి నాలుగున్నరేళ్లుగా దాటినా ఉద్యోగం, నిరుద్యోగ భృతి అనేవి ఊసే లేకుండా పోయాయి. ఈ నాలుగున్నరేళ్లలో భృతి కింద ఒక్కో కుటుంబానికి రూ.లక్షకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు ఎప్పుడిస్తారో బాబు చెప్పడం లేదు. పైగా విచ్చలవిడిగా అప్పులు తెస్తూ ఆ భారాన్ని ప్రజల పైనే మోపుతున్నారు. బాబు నిర్వాకం వల్ల ఒక్కో కుటుంబంపై సగటున రూ.2.50 లక్షల అప్పుల భారం పడింది. రాజధాని భూములు తాకట్టు పెట్టి రూ.10,000 కోట్ల అప్పు రాజధాని నిర్మాణం కోసమంటూ అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రూ.10,000 కోట్ల అప్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిద్వారా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రాజధాని భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతోపాటు సెక్యూరిటీగా పెట్టి సీఆర్డీఏ అప్పులు చేయనుంది. రూ.10,000 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జీవో జారీ చేసింది. అయితే, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ ఆస్తులను చూపించకపోతే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి లేదా సెక్యూరిటీగా చూపించి అప్పులు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇప్పటికే బాండ్ల పేరుతో సీఆర్డీఏ రూ.2,000 కోట్ల అప్పులు చేసింది. ప్రభుత్వ క్వార్టర్స్ నిర్మాణం కోసం మరో రూ.3,307 కోట్ల అప్పులు తెచ్చింది. అలాగే ఇంకో రూ.5,940 కోట్ల అప్పులు చేసేందుకు ఆర్థిక శాఖ ఇటీవల ఆమోముద్ర వేసింది. -
మిగులు కాదు.. లోటురాష్ట్రమే
సాక్షి, హైదరాబాద్:‘తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,386 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. రెవెన్యూ మిగులును రూ.6,778 కోట్లు ఎక్కువ చేసి చూపించింది. అంటే రాష్ట్రం రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటులో ఉంది’భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పద్దులు నమోదు చేయటంలోనే ఈ తప్పులు చేసిందని అంశాల వారీగా కాగ్ వేలెత్తి చూపింది. ‘ఉదయ్ పద్దులో రూ.3,750 కోట్లను గ్రాంటుకు బదులు ఈక్విటీగా చూపించింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు అప్పుగా తెచ్చుకున్న రూ.1,500 కోట్లు రాబడిలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.528 కోట్ల రెవెన్యూ వ్యయం రుణంగా చూపించి ఖర్చు తక్కువ కనబడేలా చేసింది’అని జమా ఖర్చుల పద్దులో ప్రభుత్వం చేసిన గిమ్మిక్కులను కాగ్ బయటపెట్టింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అజాయబ్సింగ్ ఈ నివేదికలను మీడియాకు విడుదల చేశారు. ఆదాయ వ్యయాల పరిశీలనతో పాటు వివిధ రంగాల వారీగా తమ ఆడిట్లో వెల్లడైన అంశాలను పొందుపరిచినట్లు విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు స్థానిక సంస్థలు, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, సామాన్య, సామాజిక రంగాలపై విడుదల చేసిన నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది. రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని వేలెత్తి చూపింది. హద్దు మీరిన ద్రవ్యలోటు.. ద్రవ్యలోటు ఆందోళనకరంగా పెరిగిపోయిందని కాగ్ స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం నిర్దేశించిన 3.5 శాతం దాటిపోయిందని గుర్తించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉందని, ఉదయ్ పథకం కింద విద్యుత్తు సంస్థలకు బదిలీ చేసిన డబ్బును మినహాయిస్తే 4.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. అప్పుగా తెచ్చిన నిధులను రెవెన్యూ రాబడుల్లో జమ చేసి, ద్రవ్య లోటును రూ.2,500 కోట్ల మేరకు తక్కువ చేసి చూపించిందని రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. ఉదయ్ బాండ్ల ద్వారా రూ.8,931 కోట్లు అప్పు తెచ్చుకుంటే, కేవలం రూ.7,500 కోట్లు డిస్కంలకు విడుదల చేసిందని పేర్కొంది. డిస్కంల మిగతా రుణాలకు కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదయ్ పథకం నిర్దేశించినప్పటికీ.. వాటిని జారీ చేయలేదని తప్పుబట్టింది. ఖర్చెక్కువ.. అభివృద్ధి తక్కువ.. రెవెన్యూ రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని కాగ్ వేలెత్తి చూపింది. ‘రాష్ట్రం మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం 69 శాతంగా నమోదైంది. దీంతో మౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతమే మిగిలి ఉంది’అని కాగ్ ప్రస్తావించింది. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.6,184 కోట్లు అధికంగా ఖర్చయితే క్రమబద్ధీకరించలేదని తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులకు పొంతన లేకపోవటంతో కొన్ని శాఖల్లో భారీగా మిగులు, కొన్నింటిలో కేటాయింపులకు మించి ఖర్చులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. గ్రాంట్లకు మించి ఖర్చు చేసిన కేసులు తీవ్ర ఉల్లంఘనలేనని, ఇవి శాసనసభ అభీష్టానికి విఘాతం కలిగిస్తాయని, వెంటనే బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 2016–17లో బడ్జెట్ కేటాయింపులను మించి చేసిన అధిక ఖర్చు రూ.21,161 కోట్లుగా గుర్తించింది. 16 గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్లలో చేసిన అధిక వ్యయం రాజ్యాంగం ప్రకారం క్రమబద్ధీకరించాలని సూచించింది. కేటాయింపులే.. ఖర్చుల్లేవు.. ఎస్సీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో 60 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 58 శాతం వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందని కాగ్ వెల్లడించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐటీడీఏ జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు, రాష్ట్రంలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాలేదని గుర్తించింది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలకు నిర్దేశించిన రూ.265 కోట్లు ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులు పాటించకపోవటం, ఆర్థిక నియంత్రణ లోపించిందని పలు ఉదాహరణలను కాగ్ ప్రస్తావించింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన వెబ్సైట్లో ఉన్న నిల్వలకు, లెడ్జర్లో ఉన్న నిల్వలకు వ్యత్యాసముంది. 28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల్లో రూ.19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాల్లో భారీ మొత్తాలు ఉంచి రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ, ఆర్థిక నిర్వహణలు సరిగా లేవని స్పష్టంచేస్తోందని కాగ్ అభిప్రాయపడింది. పథకాల అమలుకు డ్రా చేసిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు(యూసీలు) సమర్పించలేదని, కొన్ని శాఖలు నిధులు వినియోగించకుండానే యూసీలు సమర్పించాయని గుర్తించింది. అప్పుల కుప్పలపై ఆందోళన ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులను తీర్చేందుకే వినియోగిస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–22 సంవత్సరాల మధ్య రూ.14,896 కోట్లు, 2022–24 మధ్య రూ.22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉందని, ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. మరిన్ని అప్పులు చేయకుండా ఉండేందుకు సముచితమైన చెల్లింపుల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే.. వచ్చే ఏడేళ్లలో 49 శాతం రుణాలు.. అంటే రూ.56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015–16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా, 2016–17లో ఇది 32.16 శాతానికి పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22 శాతంగా ఉండాలి. కానీ ఇవి 10.40 శాతానికి పెరిగాయని కాగ్ గుర్తించింది. -
రాష్ట్రానికి రుణ పరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి రుణ పరిమితి పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతం మేరకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.3574 కోట్లు నికర అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఎఫ్ఆర్బీఎం సీలింగ్ ప్రకారం వివిధ రుణ సంస్థల నుంచి రూ.21,445 కోట్లు అప్పులు తెచ్చుకునే వీలుంది. పెంచిన పరిమితితో ఈ సీలింగ్ రూ.25,019 కోట్లకు చేరుతుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్రాలు స్థూల ఉత్పత్తి ఆదాయం (జీఎస్డీపీ)లో 3 శాతం మించి అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదు. కానీ భారీగా రెవిన్యూ, మిగులు ఆదాయమున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించే వెసులుబాటు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణతో పాటు కీలకమైన మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెవిన్యూ మిగులు ఉండటం, రాష్ట్ర రెవిన్యూలో వడ్డీల చెల్లింపు పది శాతానికి మించకుండా ఉండటం, ఇప్పటికే తీసుకున్న అప్పులు సైతం జీఎస్డీపీలో 25 శాతం మించకూడదనే నిబంధనలను పొందుపరిచింది. ఈ మూడు అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం సూచించిన అర్హతలన్నీ సాధించిందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం గత ఏడాది ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం మేరకు పెంచింది. ఈ ఏడాది సైతం ఆదాయ వృద్ధి అదేతీరుగా కొనసాగటం, వడ్డీల చెల్లింపులు, అప్పులు నిబంధనలకు లోబడి ఉండటంతో కేంద్రం మరోసారి ఈ పరిమితిని సడలించింది. -
జైట్లీకి ఎఫ్ఆర్బీఎం నివేదిక
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ.. బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట సవరణలపై ఎన్కే సింగ్ కమిటీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన మీదట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం నాలుగు వాల్యూమ్స్‌గా నివేదికను అందించినట్లు సింగ్ తెలిపారు. మొదటిదానిలో ద్రవ్య విధానం, మార్గదర్శ ప్రణాళిక మొదలైనవి ఉన్నాయి. రెండో దానిలో అంతర్జాతీయ అనుభవాలు, మూడో వాల్యూమ్‌లో కేంద్రం–రాష్ట్రాల సంబంధిత ఆర్థిక అంశాలను ప్రస్తావించినట్లు సింగ్ పేర్కొన్నారు. నాలుగోదానిలో ద్రవ్య విధానంపై దేశ, విదేశ నిపుణుల అభిప్రాయాలు మొదలైన అంశాలు ఉన్నట్లు వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలో సవరణలు సూచించేందుకు 2016 మేలో మాజీ రెవెన్యూ కార్యదర్శి సింగ్ సారథ్యంలో కేంద్రం అయిదుగురు సభ్యుల కమిటీని వేసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమీత్ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్ రథిన్ రాయ్ ఇందులో ఉన్నారు. తమ వంతుగా నివేదిక సమర్పించడం పూర్తయ్యిందని, దాన్ని బహిర్గతం చేయాలా లేదా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని సింగ్ పేర్కొన్నారు. -
ఎఫ్ఆర్బీఎం పెంచమనటం.. కమీషన్ల కోసమే!
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం (ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్)చట్టంలో జీఎస్డీపీపై ఉన్న పరిమితిని మూడు నుంచి నాలుగు శాతం పెంచమని కేంద్రాన్ని కోరటంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభ్యంతరం తెలిపారు. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చి కమీషన్ల కొట్టేయాలనే ఉద్దేశంతోనే పరిమితిని పెంచాలని కోరుతోందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. వాస్తవానికి ఉన్న జీఎస్డీపీపై మూడు శాతం పరిమితి వరకు రుణాలు తీసుకోవచ్చని, దాన్ని నాలుగు శాతం పెంచమని కోరటం వెనుక కమీషన్ల కుట్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర గణాంకాలను మార్చి ప్రచారం చేసి ఎక్కువ అప్పులు తీసుకువచ్చి ఎక్కువ పనులు ద్వారా కమీషన్లు కాజేయాలనే ఏకైక దృక్పథంతో చంద్రబాబు, యనమలలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే ఈ గణాంకాలను నమ్మబోమని ఆర్బీఐ చెప్పడంపై ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. మతి భ్రమించిన బాబు: దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తకి మతి భ్రమించిందని, నోబెల్ బహుమతి సాధిస్తే వంద కోట్లు ఇస్తామనడమే ఇందుకు నిదర్శనమని అంబటి విమర్శించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవకాశాలు, వసతులు కల్పించాలని హితవు పలికారు. నోబెల్ గురించి 2015 ఫిజిక్స్‌లో నోబెల్ విజేత, జపనీస్ శాస్త్రవేత్త తక్కాకి కజితను చంద్రబాబు సలహా కోరితే.. వర్క్‌హార్డ్ అని చెప్పారని తెలిపారు. మంచి పనులు ఎలాగూ చేయలేమని చంద్రబాబుకు అర్థమైందేమో.. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మగాళ్లు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలోని 50 వేల పాఠశాలల్లో రోజూ గంట పాటు పాఠాలు బోధించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లే ఆయన ఉపన్యాసాలను తట్టుకోలేకపోతున్నారని, ఇక రోజూ గంట పాటు క్లాస్ తీసుకుంటే చిన్నపిల్లలు ఏమైపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. -
ఎఫ్ఆర్బీఎం చట్టంపై వచ్చే నెలలో నివేదిక!
ఆర్బీఐ సలహాల అనంతరం కేంద్రానికి అందజేత అయితే బడ్జెట్ తరువాతే నివేదిక అంశాలు బహిర్గతం న్యూఢిల్లీ: ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) చట్టం పనితరు సమీక్షకు నియమించిన కమిటీ వచ్చే నెల 13వ తేదీన నివేదికను సమర్పించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే తన నివేదికను కేంద్రానికి సమర్పించే ముందు కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయాలను కూడా తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. మాజీ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఎన్కే సింగ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఎఫ్ఆర్బీఎం యాక్ట్ సమీక్షా కమిటీని కేంద్రం మే నెలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 12 సంవత్సరాల నుంచీ ఎఫ్ఆర్బీఎం యాక్ట్ అమలు జరుగుతోంది. ముఖ్యాంశం ద్రవ్యలోటే..! ద్రవ్యలోటును వార్షికంగా ఒక స్థిరమైన లక్ష్యంగా నిర్దారించుకోకుండా, ఒక శ్రేణిని నిర్ణయించుకోవడంపై సాధ్యాసాధ్యాలు సమీక్షా అంశాల్లో ఒకటి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం – చేసే వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, ఈ లోపే ఎన్కే సింగ్ కమిటీ సిఫారసులు కేంద్రానికి చేరనుండడం గమనార్హం. నిజానికి ఈ కమిటీ తన నివేదికను ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికే సమర్పించాల్సి ఉంది. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసులను, వ్యయ నిర్వహణ కమిషన్ పనితీరును సమీక్షించాలన్న అదనపు బాధ్యతల రీత్యా కమిటీ కాలపరిమితిని కేంద్రం పొడిగించింది. కాగా వచ్చే నెల మొదట్లోనే నివేదిక సమర్పించినా, బడ్జెట్ వరకూ ఈ నివేదిక అంశాలు వెల్లడికాబోవని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఐదుగురు సభ్యుల్లో... ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ఐదుగురు సభ్యుల కమిటీలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుమిత్ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, అప్పటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ (ప్రస్తుత గవర్నర్) ఉర్జిత్ పటేల్, ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్ రతన్ రాయ్‌లు ఉన్నారు. 2015–16లో ద్రవ్యలోటు 3.9 శాతం (జీడీపీతో పోల్చిచూస్తే). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ లక్ష్యాన్ని 3.5 శాతంగా ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించింది. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్న దృష్ట్యా 2016–17 బడ్జెట్ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందన్న అంచనాలు ఆర్థికవేత్తల నుంచి వెలువడ్డాయి. అయితే అరుణ్‌జైట్లీ 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే కట్టుబడి ఉన్నట్లు తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో స్పష్టం చేశారు. -
అదనంగా రూ.1,561 కోట్ల రుణ పరిమితి
ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి 3.25 శాతానికి పెంచిన కేంద్రం * రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ అంచనాల్లో కోత * వార్షిక రుణాల పరిమితి రూ.20,293 కోట్లు! సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) చట్టం కింద రాష్ట్ర రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇంతకు ముందు 3 శాతంగా ఉన్న పరిమితిని 3.25 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1,561 కోట్ల మేర రుణాలు తెచ్చుకునే వెసులుబాటు లభిం చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.50 శాతానికి పెంచాలని కోరినా.. 3.25 శాతానికే పెంచడం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. ఇప్పటివరకు 3 శాతం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో గరిష్టంగా 3 శాతం మేర రుణాలు తెచ్చుకోవచ్చు. అయితే కొత్త రాష్ట్రం కావటంతో 3.5 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రధాని మోదీని కలసి విజ్ఞప్తి చేయడంతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రానికి, నీతి ఆయోగ్‌కు లేఖలు కూడా రాశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు అవసరమైన నిధుల కోసం రుణ పరిమితిని పెంచాలని కోరారు. మరోవైపు దేశంలో గుజరాత్ తర్వాత రెవెన్యూ మిగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని.. రెవెన్యూ మిగులు రాష్ట్రాలకు రుణ పరిమితిని పెంచాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందున ఎఫ్ఆర్బీఎం సడలింపునకు అవసరమైన అర్హతలు తెలంగాణకు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచేందుకు ఏప్రిల్‌లో పచ్చజెండా ఊపిన కేంద్ర కేబినెట్.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. రుణ అంచనాలకు గండి ఎఫ్ఆర్బీఎం పరిమితి ఆశించినంత పెరగకపోవడంతో ప్రభుత్వం వేసుకున్న రుణ అంచనా తగ్గిపోయింది. 2016-17 బడ్జెట్లో సర్కారు రూ.23,467.29 కోట్లు ద్రవ్యలోటు చూపింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 3.5 శాతంగా లెక్కగట్టి, ఆ మేరకు రుణాలు తెచ్చుకుంటామని ప్రతిపాదించింది. కానీ కేంద్రం నిర్ణయంతో 0.25 శాతం మేర రుణ అంచనా తగ్గనుంది. గతేడాదితో పోలిస్తే కేవలం రూ.1,561 కోట్లు అదనంగా రుణం తెచ్చుకునే వెసులుబాటు లభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇప్పటికే జీఎస్డీపీ గణాంకాలను కేంద్రం సవరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకున్న రుణాల్లో రూ.1,613 కోట్ల మేర కోత పడింది. 2016-17లో జీఎస్డీపీ పెరుగుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.23,467.29 కోట్ల ద్రవ్యలోటు చూపింది. కానీ జీఎస్డీపీని ఎక్కువగా అంచనా వేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనిని కేంద్రమే సరిచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో అంచనాలను సవరించారు. తాజా లెక్కలు, ఎఫ్ఆర్బీఎం పరిమితి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణాల పరిమితి రూ.20,293 కోట్లకు పరిమితమవుతుందని తెలుస్తోంది. ఏమిటీ ఎఫ్ఆర్బీఎం? అప్పుల ఊబి నుంచి బయటపడటం, దేశం లో ద్రవ్యలోటును తగ్గించడం, స్థూల ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన బడ్జెట్లకు రూపకల్పన చేయడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2003లో ఎఫ్ఆర్బీఎం చట్టం-2003ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రాలన్నీ ఆ చట్టం నిర్దేశించిన పరిమితికి లోబడే అప్పులు చేయాలి. ఇప్పటివరకు రాష్ట్రాలన్నీ తమ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గరిష్టంగా 3% మేరకు అప్పులు తెచ్చుకోవచ్చు. తాజాగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.25 శాతానికి పెంచారు. మిగతా రాష్ట్రాలకు పాత పరిమితే వర్తిస్తుంది. -
ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచిన కేంద్రం
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచుతూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ తాజా పెంపుతో రూ. 2,300 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి వెసులుబాటు కలుగనుంది. అయితే గత కొంతకాలంగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. -
సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తోంది: వైఎస్ జగన్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు తారుమరు చేసిందని, అందుకే 2014-15 లెక్కలు చూపించలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పబ్లిక్ డిపాజిట్స్‌ను ప్రభుత్వం ఎడాపెడా వాడేస్తుందని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్) పరిధిని దాటి వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. నిబంధలనలకు లోబడి ఎఫ్ఆర్బీఎంను కేవలం మూడు శాతం వరకే అప్పులు తీసుకోవచ్చని వైఎస్ జగన్ అన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం 8శాతం వరకూ అప్పులు చేసిందన్నారు. ఇది ప్రభుత్వమా? లేక ప్రైవేట్ రంగ సంస్థనా?అని ఆయన వ్యాఖ్యానించారు. పబ్లిక్ డిపాజిట్స్‌ను ఇష్టారాజ్యంగా వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదన్నారు. సభను 10 నిమిషాలు వాయిదా వేసి...గంటన్నర వరకూ ఎందుకు సమావేశపరచలేదని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. బడ్జెట్‌పై ప్రతిపక్షానికి కేవలం అరగంట సమయం ఇవ్వడం సమంజసమేనా అన్నారు. తమ సభ్యులు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా, అవకాశం లేకపోయిందన్నారు. -
ఎఫ్ఆర్ బీఎం పరిమితి సడలింపునకు ఓకే
♦ కేబినెట్ నోట్ సిద్ధమైందన్న అధికారులు ♦ ఇది ఆమోదం పొందితే రూ.2,500 కోట్ల రుణానికి వెసులుబాటు ♦ పెండింగ్ అంశాలపై సమీక్షించిన నీతి ఆయోగ్ ♦ హాజరైన కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు సాక్షి, న్యూఢిల్లీ: రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితి సడలింపునకు అనుమతి ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేబినెట్ నోట్ తయారైందని కేంద్ర ఉన్నతాధికారులు చెప్పారు. త్వరలోనే ఆమోదం పొందే అవకాశం ఉందన్నారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3 శాతానికి మించి అప్పులు ఉండరాదని ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశిస్తోంది. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు దీనిని మరో 0.5 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినందున నిబంధనలు సడలించాలని తెలంగాణ ప్రభుత్వం చాలాసార్లు కేంద్రానికి విన్నవించింది. తాజాగా నీతిఆయోగ్ గురువారం కేంద్రం వద్ద తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను చర్చించేందుకు వీలుగా సమీక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరైన ఈ తరహా సమీక్ష సమావేశం ఇదే మొదటిది. ఇకపై నీతిఆయోగ్ అన్ని రాష్ట్రాల పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించనుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్షతన జరిగిన సమీక్షలో వివిధ శాఖల కేంద్ర ఉన్నతాధికారులు, తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు హాజరయ్యారు. ఈ విషయాలను రామచంద్రు మీడియాకు వివరిస్తూ.. ఎఫ్ఆర్బీఎంను కేబినెట్ ఆమోదిస్తే తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ. 2,500 వేల కోట్లు రుణం తీసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన గ్రాంట్లు రూ. 778 కోట్లను కేంద్రం నిరాకరించిందని, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం విడుదల చేశారని ప్రస్తావించారు. దీనిపై పరిశీలిస్తామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. నూతన విధానం ప్రకారం లింకేజీ ఇంధన శాఖకు సంబంధించి విద్యుత్తు ప్లాంట్లకు కోల్ లింకేజీపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదిత, అమలులో ఉన్న యూనిట్లకు కొత్త లింకేజీ విధానం ప్రకారం బొగ్గు బ్లాకులు కేటాయించనున్నట్టు కేంద్ర అధికారులు చెప్పారు. ప్రతిపాదిత నేదునూరు (కరీంనగర్), శంకరపల్లి (రంగారెడ్డి జిల్లా) గ్యాస్ విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపు జరపాలని కోరగా.. దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఇవ్వడం కష్టమని బదులిచ్చారు. విదేశీ మార్కెట్లలో గ్యాస్ ధర తక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరగా, సహకరిస్తామని కేంద్రం చెప్పింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని తాము చేసిన బీపీఎల్ సర్వే ఆధారంగా ఇళ్ల లబ్ధిదారులను గుర్తించాలని రాష్ట్రం కోరగా.. సామాజిక, ఆర్థిక, కుల గణన ఆధారంగానే ఎంపిక చేస్తామని కేంద్రం బదులిచ్చింది. దీనిని మరోసారి పరిశీలించాలని రాష్ట్రం కోరింది. సమావేశంలో ఉన్నతాధికారులు ప్రదీప్ చంద, బీపీ ఆచార్య, దాన కిశోర్, బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
ఉల్టా షాకిచ్చిన కేంద్రం
* విద్యుత్ బాండ్ల బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ * డిస్కంలను రుణ విముక్తి చేసే ప్యాకేజీకి నిర్ణయం * తేల్చిచెప్పిన కేంద్రం... తెలంగాణపై రూ.4,500 కోట్ల భారం * ఎఫ్ఆర్బీఎం పరిమితి సడలించినా.. డిస్కంల అప్పు తీర్చాలనే షరతు సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా... తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉల్టా షాక్ ఇచ్చింది. కొత్త అప్పు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో 4,500 కోట్ల రూపాయల చిక్కుల్లో పడేసింది. విద్యుత్తు బాండ్ల రూపంలో గతంలో డిస్కంలు తీసుకున్న అప్పులను... రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అప్పు సైతం ఎఫ్ఆర్బీఎం పరిమితిలోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ఆర్థిక శాఖ తల పట్టుకుంటోంది. తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.4 లక్షల కోట్లు. ఈ ఏడాదిలో 12 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే వీలుంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్రాలు తెచ్చుకునే అప్పు జీఎస్డీపీలో మూడు శాతానికి మించకూడదు. కానీ.. మిగులు రాష్ట్రమైనందున ఈ రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికీ ఈ పరిమితి సడలించే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఉలుకూ పలుకు లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అశనిపాతంగా మారింది. డిస్కంల రుణవిముక్తి లక్ష్యం ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ (ఎఫ్ఆర్పీ) లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కంల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ ప్యాకేజీలో భాగంగా డిస్కంలపై ఉన్న అప్పుల భారాన్ని తీర్చాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లోని డిస్కంలలో ఉన్న అప్పుల బకాయిలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చార్జీల సబ్సిడీలు, గ్రాంట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిస్కంలు విద్యుత్ బాండ్ల ద్వారా అంతమేరకు నిధులు సమకూర్చుకున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ బాండ్లపై దాదాపు 4,500 కోట్ల రూపాయల అప్పుల భారం పేరుకుపోయింది. అడపాదడపా రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని విడుదల చేస్తోంది. చిక్కుల్లో రాష్ట్ర ఖజానా కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బకాయిల భారం ఇకపై డిస్కంల ఖాతాలో నుంచి.. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి చేరుతుంది. డిస్కంల పరిధిలో ఉండగా ఈ అప్పు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాలేదు. కానీ.. బకాయిల భారం బదిలీతో రాష్ట్ర అప్పుల పరిమితి ఎఫ్ఆర్బీఎం నిబంధనలను దాటిపోయే ప్రమాదముంది. దీంతో తెలంగాణ ఆర్థిక శాఖ తలపట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది మార్కెట్లో బాండ్ల విక్రయం ద్వారా తెచ్చుకున్న అప్పు దాదాపు రూ.10 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో విద్యుత్తు బాండ్ల బకాయిలు ఇందులో చేరితే ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటిపోనుంది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎఫ్ఆర్బీఎం రుణపరిమితిని సడలింపుకు అనుమతించినా.. అంతమేరకు డిస్కంల అప్పుల భారాన్ని తీర్చేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనను తెలంగాణ ఆర్థిక శాఖ ముందుంచినట్లు తెలిసింది. దీంతో ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాక్కున్నట్లుగా కేంద్రం వ్యవహారం ఉందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంచితే.. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుల రుణమాఫీ, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు సర్దుబాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఈలోగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక అంచనాలను తలకిందులు చేసినట్లయిందని.. ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
తెలంగాణకు రెవెన్యూ మిగులు 8,000 కోట్లు
సీమాంధ్రకు 14 వేల కోట్ల లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల సడలింపునకు ఆర్థిక శాఖ లేఖ రెవెన్యూ లోటు లేకపోతేనే కేంద్ర నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెవెన్యూ మిగులుతో ఏర్పాటవుతోంది. రాష్ట్ర విభజన సమయం సమీపిస్తున్నందున ఆర్థిక శాఖ రెండు రాష్ట్రాల ఆదాయం, అప్పులను లెక్కకట్టే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (సమైక్య రాష్ర్టం) ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఆర్ధిక క్రమశిక్షణ కోసం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం తీసుకువచ్చారు. ఆ మేరకు అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించడంతో పాటు రెవెన్యూ లోటు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించకుండా చూశారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలోని నిబంధనలను పాటిస్తేనే, రెవెన్యూ లోటు లేకపోతేనే గ్రాంట్ల రూపంలో కేంద్ర నిధులు ప్రభుత్వాలకు వస్తాయి. ప్రస్తుత సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ మిగుల్లోనే ఉంది. ద్రవ్య లోటు మూడు శాతం లోపే ఉంది. అరుుతే ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. ఈ రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం రూ.8 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉండనుంది. రాజధాని ఇక్కడే ఉండడం, తద్వారా ఆదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విభజనానంతరం కూడా ఇక్కడ మిగులే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే తెలంగాణకు కేంద్ర గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులు వచ్చేవిధంగా రెండు ఆర్ధిక సంవత్సరాల పాటు ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించాలని ఆర్ధిక శాఖ ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ మిగతా అంశాల్లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అమలు చేయడం కష్టసాధ్యమవుతుందని ఆర్థిక శాఖ భావించింది.