సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం)ను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నందునే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌లో భాగంగా ద్రవ్య విధానాన్ని మంత్రి వెల్లడించారు. ద్రవ్య విధాన వ్యూహపత్రాన్ని సభకు సమర్పించారు. ‘కోవిడ్ తరువాత పరిస్థితుల్లో రాష్ట్రం పురోగమనంలో ఉంది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయ వనరులు 21.1 శాతం అద్భుత ప్రగతి కనబరుస్తున్నట్లు సవరించిన బడ్జెట్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోనూ పన్నుల వసూళ్లు ఆశించిన దానికంటే అధికంగా ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 5.06 శాతం పెరుగుతుంది.
జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 4 శాతం ఉంటుందని 2022–23 బడ్జెట్‌లో అంచనా వేశాం. కానీ, ఆర్థిక ప్రగతి కారణంగా 3.21 శాతానికి తగ్గింది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. అనేక కొత్త పథకాలు, భారీ కమిట్‌మెంట్స్‌తో వ్యయం అధికంగా ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ.2,980 కోట్లుగా ఉంటుంది. 2022–23 ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 25.9 శాతం ఉంటాయని అంచనా వేసినా. సవరించిన బడ్జెట్ అంచనాల్లో అది 24.33 శాతంగానే ఉండనుంది’అని హరీశ్ తెలిపారు.
పన్నుల ఆదాయమే వెన్నుదన్ను
‘రాష్ట్రానికి పన్నుల ఆదాయమే వెన్నుదన్నుగా ఉంది. అందులో భాగంగా పన్ను వసూళ్లలో ఎలాంటి లోపాలు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, సామాన్యులపై భారం వేయకుండా ఎక్కడెక్కడ పన్నులు ఇంకా వసూలు అయ్యే అవకాశం ఉందో వాటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఆదాయం మరింత పెంచుకుంటాం.
జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మార్కెట్ ధరల స్థిరీకరణ, స్టాంపు డ్యూటీ పెంపుతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడులు రూ.1.31 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశాం. పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఇక పన్నేతర ఆదాయ కూడా పెరుగుతోంది. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని విక్రయించడం వల్ల ఆదా యం పొందుతున్నాం..’అని మంత్రి వివరించారు.
కేంద్రం కంటే బెస్ట్
‘స్థిర, ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి కేంద్రంతో పోలిస్తే అభివృద్ధి అధికంగా ఉంది. 2020–21 కోవిడ్ సమయంలో అభివృద్ధి తిరోగమంలో ఉన్నా కేంద్రంతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఆ సంవత్సరం కేంద్రం 6.6 శాతం తిరోగమనంలో ఉంటే.. రాష్ట్రం 4.9 శాతం తిరోగమనంలో ఉంది. ఆ మరుసటి సంవత్సరం నుంచి ఆర్థిక పురోగతి సాధ్యమైంది.
తిరోగమనం నుంచి పురోగతి వైపు మళ్లడమే కాకుండా ఏకంగా 10.9 శాతం పెరుగుదల సాధ్యమైంది. సెకండరీ సెక్టార్‌లోని ఉత్పత్తి, విద్యుత్, నీటి సరఫరా, నిర్మా ణం రంగం పురోగతిలో ఉంది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, గనులు, క్వారీ కూడా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించాయి. నిరంతర విద్యుత్, చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు వంటి పథకాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి’అని హరీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment