జైట్లీకి ఎఫ్‌ఆర్‌బీఎం నివేదిక
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ.. బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట సవరణలపై ఎన్‌కే సింగ్ కమిటీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన మీదట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం నాలుగు వాల్యూమ్స్‌గా నివేదికను అందించినట్లు సింగ్ తెలిపారు. మొదటిదానిలో ద్రవ్య విధానం, మార్గదర్శ ప్రణాళిక మొదలైనవి ఉన్నాయి. రెండో దానిలో అంతర్జాతీయ అనుభవాలు, మూడో వాల్యూమ్‌లో కేంద్రం–రాష్ట్రాల సంబంధిత ఆర్థిక అంశాలను ప్రస్తావించినట్లు సింగ్ పేర్కొన్నారు.
నాలుగోదానిలో ద్రవ్య విధానంపై దేశ, విదేశ నిపుణుల అభిప్రాయాలు మొదలైన అంశాలు ఉన్నట్లు వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలు సూచించేందుకు 2016 మేలో మాజీ రెవెన్యూ కార్యదర్శి సింగ్ సారథ్యంలో కేంద్రం అయిదుగురు సభ్యుల కమిటీని వేసింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమీత్ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఎన్‌ఐపీఎఫ్‌పీ డైరెక్టర్ రథిన్ రాయ్ ఇందులో ఉన్నారు. తమ వంతుగా నివేదిక సమర్పించడం పూర్తయ్యిందని, దాన్ని బహిర్గతం చేయాలా లేదా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని సింగ్ పేర్కొన్నారు.