సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తోంది: వైఎస్ జగన్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు తారుమరు చేసిందని, అందుకే 2014-15 లెక్కలు చూపించలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పబ్లిక్ డిపాజిట్స్ను ప్రభుత్వం ఎడాపెడా వాడేస్తుందని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్) పరిధిని దాటి వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. నిబంధలనలకు లోబడి ఎఫ్ఆర్బీఎంను కేవలం మూడు శాతం వరకే అప్పులు తీసుకోవచ్చని వైఎస్ జగన్ అన్నారు.
కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం 8శాతం వరకూ అప్పులు చేసిందన్నారు. ఇది ప్రభుత్వమా? లేక ప్రైవేట్ రంగ సంస్థనా?అని ఆయన వ్యాఖ్యానించారు. పబ్లిక్ డిపాజిట్స్ను ఇష్టారాజ్యంగా వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదన్నారు. సభను 10 నిమిషాలు వాయిదా వేసి...గంటన్నర వరకూ ఎందుకు సమావేశపరచలేదని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. బడ్జెట్పై ప్రతిపక్షానికి కేవలం అరగంట సమయం ఇవ్వడం సమంజసమేనా అన్నారు. తమ సభ్యులు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా, అవకాశం లేకపోయిందన్నారు.