సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మాట మార్చారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన... సభలో కొత్త పల్లవి అందుకున్నారు. పోలవరం నిర్మాణ పనుల్ని తాను అడగలేదని ...నీతి ఆయోగ్ సిఫార్సుతోనే కేంద్రం తనకు అప్పగించిందని చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించిందని క్యాబినెట్‌తో పాటు, అసెంబ్లీలో చెప్పుకున్న చంద్రబాబు...ఇప్పుడిలా మాట మార్చడంపై ఇతర పార్టీ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.....‘హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని అడిగారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు వెనక్కి వెళ్తోంది. నా మీద ఒక్కొక్కర్ని పంపి దాడి చేయిస్తారా?. నేను ఆగస్టు సంక్షోభం, విభజన సంక్షోభం చూశాను. ఇప్పుడు మూడో సంక్షోభం చూస్తున్నాను. సహకరిస్తామన్న మిత్రపక్షం, యుద్ధం చేస్తానంటోంది. పోలవరాన్ని నేను తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నేను తీసుకోలేదు. కేంద్రమే అప్పగించింది. రాత్రి కల వస్తే..పొద్దున్నే కొంతమంది మాట్లాడుతున్నారు. నేను భూసేకరణ, పునరావాసం డబ్బులు ఇస్తానని చెప్పలేదు. పోలవరంలో ఎవరైనా చేతులు పెడితే అవి కాలిపోతాయి. నేను ప్రాజెక్ట్ కోసం లాలూచీ పడ్డట్లు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment