వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం డయా ఫ్రమ్ వాల్ కట్టి గొప్పలు చెబుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలవరాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా రూ. 44,500 కోట్లు కావాలి.. ఈ నిధులు కేంద్రం ఇస్తుందా? అని ఎంపీ మేకపాటి ప్రశ్నించారు. అంతేకాక ఎన్ని మయాలు చేసిన ప్రజలు నమ్మరని బాబు తీరుపై ఆయన మండిపడ్డారు.
పోలవరానికి ఫౌండేషన్ వేసింది దివంగత నేత వైఎస్‌ఆర్ అని ఎంపీ మేకపాటి అన్నారు. గోదావరి నీటిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ఆర్ ప్రారంభించారన్నారు. వైఎస్‌ఆర్ ఉండి ఉంటే.. పోలవరం పూర్తయ్యేదని మేకపాటి పేర్కొన్నారు. ఆయన హయంలోనే 39 శాతం వరకూ పనులు పూర్తి అయ్యాయని ఎంపీ తెలిపారు.
‘మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 58 వేలకోట్లు. పోలవరానికి పెట్టింది రూ. 13,500 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. కేంద్రం పూర్తి చేస్తానంటే.. ఆ బాధ్యతలను సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. చంద్రబాబు వల్లే పోలవరం పనులు నత్తనడకన నడుస్తున్నాయి. పోలవరం ఖర్చు భారం రాష్ట్ర ప్రజలపై పడకూడదు. పోలవరం ప్రాజెక్టు పూర్తికావడంపై చాలా సందేహాలు ఉన్నాయి. 2014లో పోలవరంను మూడేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు అన్నారు. ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చంద్రబాబు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్ని మాయలు చేసిన ప్రజలు నమ్మరు.. మోసం చేయడం చంద్రబాబు ఆపాలని’ ఎంపీ ధ్వజమెత్తారు.
రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని ఎంపీ మేకపాటి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది వైఎస్ జగనే అని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment