
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండానే ఆర్భాటాలు చేస్తూ, జాతికి అంకితం ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం డయాఫ్రమ్ వాల్ కట్టి, జాతికి అంకితం ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హితవు పలికారు. ప్రజలపై భారం మోపకుండా పోలవరాన్ని పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి, రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు.
ప్రజాస్పందనను చూసే..
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక పోలవరం పనులు ప్రారంభించి 39 శాతం పూర్తి చేశారు. కాలువలు సైతం ఆయన హయాంలోనే చాలా వరకు పూర్తయ్యాయి.పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లభించిన ప్రజాస్పందనను చూసి జనం దృష్టిని మళ్లించేందుకే పోలవరం పునాదిని జాతికి అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు హంగామా చేశారు. డయాఫ్రం వాల్ కట్టి తానేదో ఘనకార్యం చేసిన ట్లుగా ప్రజలను మాయ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టును ఆయన పూర్తి చేయలేరు. వైఎస్ ప్రారంభించిన పోలవరాన్ని వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి పూర్తి చేస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యం’’ అని మేకపాటి పునరుద్ఘాటించారు. తమ రాజీనామాలను ఆమోదిస్తామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టంగా హామీ ఇచ్చారని, అన్నమాట ప్రకారం ఆమోదిస్తారని ఆశిస్తున్నామని మేకపాటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment