ఏ నిర్వాసితులకైనా ఒక్క పైసా ఇచ్చావా బాబూ! | Anil Kumar Yadav Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏ నిర్వాసితులకైనా ఒక్క పైసా ఇచ్చావా బాబూ!

Published Mon, Nov 16 2020 3:00 AM | Last Updated on Mon, Nov 16 2020 9:32 AM

Anil Kumar Yadav Fires On Chandrababu - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌): ‘ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా ఇచ్చావా చంద్రబాబూ? పునరావాసానికి డబ్బివ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? నీళ్లు ఎలా వస్తాయి? గండికోట, కండలేరు, వెలుగొండ, చిత్రావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? కమీషన్ల కోసం కక్కుర్తిపడటమేతప్ప నిర్వాసితులను ఆదుకోవాలని ఆలోచించావా? అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆర్‌అండ్‌ఆర్‌ అంటూ మాట్లాడతావా?..’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస కల్పన (ఆర్‌అండ్‌ఆర్‌) విషయాల్లో ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు.

నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ప్రాజెక్టు కింద దాదాపు ఏడువేల కుటుంబాలు ఉంటే చంద్రబాబు హయాంలో ఒక్క కుటుంబాన్నీ తరలించలేదని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గండికోట ముంపువాసుల కోసం రూ.900 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వెలిగొండకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్‌ కింద రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. చిత్రావతి రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యానికి చేర్చేందుకు ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.51 కోట్లు ఇచ్చారన్నారు. నెల్లూరు జిల్లాలోని కండలేరు ప్రాజెక్టు విషయంలో కూడా ఇదేవిధంగా చేయబోతున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కింద వచ్చే మార్చి నాటికి మొదటిదశలో 20 వేల ఇళ్లను తరలించనున్నట్లు తెలిపారు. గండికోట, కండలేరు, వెలుగొండ, చిత్రావతి, పోలవరం మొత్తం ప్రాజెక్టులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పూర్తిచేస్తామని చెప్పారు. 

చంద్రబాబుకు కేంద్ర కేబినెట్‌ నోట్‌ చెప్పే ధైర్యం ఉందా?
చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరంపై 2017లో కేంద్ర కేబినెట్‌లో పెట్టిన నోట్‌ సారాంశాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అప్పట్లో కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారే తప్ప పోలవరం అభివృద్ధిపై ఆలోచించలేదని చెప్పారు. కనీసం ఒక్క ఇంటి కన్నా పరిహారం ఇచ్చి తరలించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ఉండలేని వాళ్లు కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదని, కొడుకు లోకేశ్‌ చూస్తే టూరిస్ట్‌లాగా వచ్చి పోతుంటారని విమర్శించారు.

అది ఒక దిక్కుమాలిన పేపర్‌
పోలవరంపై వరుసగా అసత్య కథనాలు రాస్తున్న చెత్తజ్యోతి ఒక దిక్కుమాలిన పేపర్‌ అన్నారు. పోలవరం తగ్గిస్తున్నామని అసత్య కథనాలు రాయడం, వెంటనే టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలు పెట్టడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఆ పత్రికకు ధైర్యం ఉంటే 2017లో కేంద్ర కేబినెట్‌లో పెట్టిన నోట్‌ను ప్రచురించాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే ఆ పత్రికకు విలువలు పూర్తిగా పోయాయన్నారు. ఆ పేపర్‌ టిష్యూ పేపర్‌గా కూడా పనికి రాదని ఆయన పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజీలేదు
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో ఎక్కడా రాజీపడకుండా, ఒక్క అంగుళం కూడా తగ్గకుండా పూర్తిచేస్తామని అనిల్‌కుమార్‌యాదవ్‌ స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు వీళ్లకు ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్లు టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చని పేర్కొన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రారంభమైందని, ఆయన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అనుకున్న సమయానికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement