Water Resources Department
-
కృష్ణా జలాల్లో పాత వాటాలే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా పాత వాటాల ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు వెల్లడించింది. తెలంగాణలో కృష్ణా బేసిన్ 71 శాతం ఉందని, ఆ లెక్కన 71 శాతం వాటా తమకు రావాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ 50 శాతం వాటాను కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని.. ఆ ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తుచేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ 66 : 34 వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని పునరుద్ఘాటించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ పాత వాటాల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. నీటి అవసరాలు ఏవైనా ఉంటే త్రిసభ్య కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు 19వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ సర్కారు తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలీమీటర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు..ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి 76 శాతం నీటిని వాడుకుందని.. పెన్నా బేసిన్‌కు నీటిని తరలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌తోపాటు పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించే 11 చోట్ల టెలీమీటర్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 833 టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. వరద సమయంలో ఏ రాష్ట్రం మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని ఆది నుంచి తాము కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే టెలీమీటరు ఏర్పాటుచేశారని.. దాని దిగువన టెలీమీటర్లు ఏర్పాటుచేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం చెబుతామని బోర్డు ఛైర్మన్‌కు చెప్పారు.శ్రీశైలం ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు..ఇక కృష్ణా నదికి 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ దెబ్బతిందని.. తక్షణమే మరమ్మతు చేయకపోతే ఆ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదమని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్‌పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించామని.. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫ్లంజ్పూల్కు మరమ్మతులు చేస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు. ఆలోగా శ్రీశైలం ప్రాజెక్టులో అత్యవసర మరమ్మతులను వచ్చే సీజన్‌లోగా పూర్తిచేస్తామన్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని, నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు.రెండునెలలు చూస్తామని.. సాగర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కాకపోతే అప్పుడు సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనకు జైన్ సానుకూలంగా స్పందించారు. 50 శాతం వాటా అసంబద్ధం..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తెలంగాణ అధికారులు కోరడం అసంబద్ధం. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలను 2015లో కేంద్రం కేటాయించింది.ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు చెబుతారు? ఇదే అంశాన్ని కృష్ణా బోర్డుకు చెప్పాం. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ 66 : 34 నిష్పత్తిలోనే నీటిని పంపిణీ చేయాలని కోరగా బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. – ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ -
కేంద్రం సాయం చేస్తే.. కృష్ణా డెల్టా, సీమకు గోదావరి జలాలు
సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీకి తరలించడం ద్వారా ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం దాదాపు రూ.80వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక పరిస్థితివల్ల చేపట్టే అవకాశంలేనందున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న దాదాపు 3వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను తరలించడం ద్వారా అటు కృష్ణా డెల్టాకు ఇటు రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలిగిస్తామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తీసుకెళ్తామన్నారు. 200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడ నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీకి తరలిస్తామని చంద్రబాబు చెప్పారు. అందుకోసం బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ. సొరంగం నిర్మించి నీటిని తరలిస్తామన్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, నిప్పుల వాగుకు నీళ్లు వెళ్తాయన్నారు. అక్కడ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తామన్నారు. తద్వారా జలహారం కింద రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నీటి అవసరాలను తీరుస్తామన్నారు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనట్లే!?
సాక్షి, అమరావతి : చింతలపూడి ఎత్తిపోతల నుంచి జల్లేరు రిజర్వాయర్‌ను ప్రభుత్వం తొలగించింది. తొలిదశలో ఎత్తిపోతల, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 25.94 లక్షల మందికి తాగునీరు అందించాలని నిర్దేశించింది. ఈ పనులను 2026, జూన్ నాటికి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖాధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల వంటి పథకాలు పూర్తయిన నేపథ్యంలో గోదావరికి వరద వచ్చే రోజులు తగ్గాయని.. నీటి నిల్వకోసం జల్లేరు రిజర్వాయర్‌ను నిర్మించకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందవని తేల్చిచెబుతున్నారు.మెట్టప్రాంతాలను సుభిక్షం చేసేలా..వాస్తవానికి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించి, సుభిక్షం చేయాలనే లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2008, అక్టోబరు 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆయకట్టుకు నీళ్లందించడం కోసం జల్లేరు రిజర్వాయర్ పనులను 8 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. దీంతో గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 2016, సెప్టెంబరు 3న పెంచారు. ఎత్తిపోతల ద్వారా కొత్త, పాత ఆయకట్టు కలిపి 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలంటే జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచాలని ఎస్ఎల్ఎస్సీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) చేసిన ప్రతిపాదనపై 2020, మే 20న గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టింది.ఇప్పటికే రూ.4,122.83 కోట్లు వ్యయంఆ తర్వాత.. గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోసి.. జల్లేరు రిజర్వాయర్‌లో 14 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం పనులకు 2008 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.4,122.83 కోట్లు వెచ్చించింది. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే తొలిదశ పంప్ హౌస్, ప్రధాన కాలువలో 36 కిమీల వరకూ పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువలో 36 కిమీ నుంచి 106.25 కిమీ వరకూ పనుల్లో దాదాపు 50 శాతం పూర్తయ్యాయి. జల్లేరు రిజర్వాయర్ సహా ఈ ఎత్తిపోతల పూర్తవ్వాలంటే ఇంకా రూ.5,198 కోట్లు అవసరం. రిజర్వాయర్ పనుల కోసం 6,880 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇది సవాల్‌గా మారడంతో జల్లేరు రిజర్వాయర్ పనులను తర్వాత చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రిజర్వాయర్ నిర్మిస్తేనే 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమవుతుందని.. రిజర్వాయర్ నిర్మించకపోతే ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖ అధికారులతోపాటు నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తుండటం గమనార్హం. -
బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్!
సాక్షి, అమరావతి: కొత్త డయాఫ్రం వాల్ పనుల సన్నాహాల సాక్షిగా పోలవరంలో 2016–19 మధ్య మరో కమీషన్ల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో తాము చేసిన డయాఫ్రం వాల్ పనులకు సంబంధించి రూ.94 కోట్ల బిల్లులు చెల్లించలేదని.. ఇప్పుడు అవి చెల్లిస్తేనే కొత్త డయాఫ్రం వాల్ పనులను చేపడతామని బావర్ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించామని.. అక్కడి నుంచి బిల్లులు వసూలు చేసుకోవాలంటూ అధికారులు చేసిన సూచనను బావర్ ప్రతినిధులు తోసిపుచ్చుతున్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాటి ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 41) జారీ చేస్తేనే తాము పనులు చేశామని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఎస్క్రో అకౌంట్ ద్వారా తమకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారని పేర్కొంటున్నారు.ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారంటూ ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు 2024 జనవరి 12న మీడియాకు వెల్లడించడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. కమీషన్ల కోసమే ఎస్క్రో అకౌంట్ తుంగలోకి.. పోలవరం ప్రాజెక్టులో వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పగించి చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ద్వారా కాకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. ఎందుకంటే.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే కమీషన్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో 2018 జూన్ నాటికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్‌ను బావర్ సంస్థ పూర్తి చేసింది. చేసిన పనులకు బిల్లుల రూపంలో రూ.56 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.38 కోట్లు వెరసి రూ.94 కోట్ల మేర బిల్లులు బావర్‌కు టీడీపీ ప్రభుత్వం బకాయిపడింది. బావర్ సంస్థ ఇదే అంశాన్ని అప్పట్లో అనేక మార్లు జలవనరుల శాఖ దృష్టికి తెచ్చి బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే తాము ట్రాన్స్ట్రాయ్కు బిల్లులు చెల్లించేశామని, ఆ సంస్థ నుంచి వసూలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ.. అప్పటికే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రంవాల్ ధ్వంసమైంది. డీఆర్ఐకి ఫిర్యాదు చేసినా.. రూ.94 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ అప్పట్లో డీఆర్ఐకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై 2018 నుంచి అనేక మార్లు డీఆర్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందించలేదు. 2014 ఎన్నికల్లో ఖర్చుల కోసం చంద్రబాబు, లోకేష్ తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమను నాశనం చేశారని ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియాకు ఎక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో బావర్ సంస్థకు చెల్లించాల్సిన రూ.94 కోట్ల బిల్లులు ఏ బాబు జేబులోకి చేరాయనే చర్చ కాంట్రాక్టర్లలో జోరుగా సాగుతోంది. -
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్‌ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
కొలిక్కివస్తున్న పోలవరం డిస్ట్రిబ్యూటరీల వ్యయ ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వడానికి రూ.5,338.9 కోట్లు వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అధికారవర్గాలు తేల్చాయి. జలాశయం పనులు పూర్తయ్యేలోగా కాలువలతోపాటు స్ట్రిబ్యూటరీలను కూడా పూర్తి చేసి సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీని ప్రకారం కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఆ మేరకు నిధులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు 8 నెలల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలు మార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ ప్రక్రియను పూర్తి చేసి, స్ట్రిబ్యూటరీలకు భూసేకరణ చేసి, పనులకు టెండర్లు పిలవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా స్ట్రిబ్యూటరీలను పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం పనులు కొలిక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ద్వారా చేసిన చారిత్రక తప్పిదం పోలవరం ప్రాజెక్టులో విధ్వంసానికి కారణమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది. కుడి కాలువలో మిగిలిన పనులతో పాటు ఎడమ కాలువలలో కీలకమైన నిర్మాణాలు, జలాశయంతో కాలువల అనుసంధానం పనులు పూర్తి చేసింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేలి్చ, ప్రాజెక్టును పూర్తి చేసే విధానాన్ని ఖరారు చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని, సమాంతరంగా కొత్తది నిర్మించాలని చెప్పింది. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వరదల్లోనూ డయాఫ్రం వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ డ్యాంను పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.» పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు» కుడి కాలువ పొడవు 178.812 కిలోమీటర్లు.. » ఎడమ కాలువ పొడవు 212.32 కిలోమీటర్లు.. » పూర్తయిన కుడికాలువ పనులు » 100 శాతం ప్రాజెక్టు ద్వారా వినియోగించుకొనే జలాలు 322 టీఎంసీలు » ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు » పూర్తయిన ఎడమ కాలువ పనులు 73.07 శాతం -
బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్)కి ముమ్మాటికీ చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ‘సాక్షి’గా మరోసారి నిర్ధారణ అయింది. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 2018 నాటికే జెట్ గ్రౌటింగ్ వాల్‌కు 27 చోట్ల భారీ చీలికలు⇒ గోదావరిపై గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్ గ్రౌటింగ్ వాల్‌ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.ఆ చారిత్రక తప్పిదం వల్లే..⇒ పోలవరం వద్ద భూభౌగోళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్‌వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్ కమ్రాక్ ఫిల్ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది.⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. ⇒ కానీ.. 2016 డిసెంబర్లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది.⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.ప్రణాళికాబద్ధంగా పనులు..⇒ నాడు చంద్రబాబు సర్కార్ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్ వాల్ జెట్ గౌటింగ్ వాల్ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ⇒ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.⇒ దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిజాలను ప్రతిబింబించిన నివేదిక..ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.సకాలంలో కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..⇒ ఎగువ కాఫర్ డ్యాం పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ దిగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ కాఫర్ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. -
అటు ఎండబెట్టి.. ఇటు ముంచేసి..
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు. » కృష్ణా బేసిన్లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు. » దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు. రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం.. » వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు. » వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది. » ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్కో కంటే ఏపీ జెన్కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది. శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..» ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు » శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు » ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు » సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు » హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీశ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..ఆంధ్రప్రదేశ్..» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు » హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు »కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలుతెలంగాణ..» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు » ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు » గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు -
Telangana: నీళ్లు కష్టం..సాగు నష్టం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఉమ్మడి నల్లగొండలో..నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్‌కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి. ఓఅండ్ఎం పనులు అంతంతే..ఏటా వానాకాలం సీజన్‌కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.నారుమడి ఎండిపోయేలా ఉందికాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాచెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదులింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాగత ఏడాది రూ.50 వేల నష్టంమాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా -
తండ్రి ఆశయం...తనయుడి సాకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలలోని నల్లమల అడవులలో వ్యాపించి ఉన్న కొండల వరుసను వెలుగొండలు అంటారు. ఈ కొండల శ్రేణిలో మధ్య ఖాళీ స్థలంలో వున్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ. పొడవైన సహజమైన ‘నల్లమల సాగర్’ రిజర్వాయర్ నిర్మించి, కృష్ణా నదిలో 43.5 టీఎమ్సీ వరద నీటిని కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమల సాగర్ రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు. తొలుత ఈ ప్రాజెక్టును ‘వెలిగొండ ప్రాజెక్టు’ అని పిలిచారు. జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబరు 27న మార్కాపురానికి 15 కి.మీ. దూరంలో గొట్టిపడియ దగ్గర నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని ‘కొల్లం వాగు’ వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖ చేపట్టింది. 1994 డీపీఆర్‌పై ఆధారపడిన మొదటి దశ ప్రతిపాదనలో 10.7 టీఎమ్సీ నీటిని 45 రోజులలో 7 మీటర్ల వ్యాసం, 85 క్యుమెక్స్ సామర్థ్యం గల సొరంగం కాలువ ద్వారా తరలించాలని తలపెట్టారు. రెండవ దశ పనులలో భాగంగా 9.2 మీటర్ల వ్యాసం, 243 క్యుమెక్స్ సామర్థ్యం గల రెండవ సొరంగ కాలువ జతచేయబడటం వలన 30 రోజుల వరద నీటితోనే జలాశయం నిండే అవకాశం ఏర్పడింది. మార్కాపురం, యర్రగొండ పాలెంల నుంచి పలు సార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని కరువు ప్రాంతాలకు సాగు నీరు, త్రాగునీరు అందించడానికి పోరాటం చేసిన పూల సుబ్బయ్య పేరు మీద ఈ ప్రాజెక్టుకు ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ అనే పేరు పెట్టారు. వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పనులను పరుగులెత్తించారు. 2020లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడమే కాక, కొండంత అవినీతి జరిగింది. వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీపీ పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తు న్నారనే నెపంతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించడం వలన రూ. 49.49 కోట్లు దుర్వినియోగం కాగా, వైఎసార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వలన ప్రభుత్వ ఖజానాకు రూ. 61.67 కోట్లు మిగిలిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో 6.686 కి.మీ (మొదటి సొరంగం 4.331 కి.మీ. రెండవ సొరంగం 2.355 కి.మీ.) తవ్వకం పని మాత్రమే జరిగింది. కాగా వైఎస్సార్, జగన్‌ల పాలనా కాలంలో 31 కిలోమీటర్ల దూరం తవ్వకం జరగడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టరుకు పనులు అప్పగించినా కాంట్రాకరుకు లబ్ధి, ఖజా నాపై భారం పడిందే కానీ పని వేగం మాత్రం పెరగలేదనేది కాదనలేని సత్యం. ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నల్లమల సాగర్ నుంచి ఐదు కాలువల ద్వారా నీటిని నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా బద్వేల్, ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతా లకు మొత్తం 30 మండలాలలోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4,49,000 ఎకరాలకు సాగు నీరు అందించాలన్న స్వర్గీయ డా‘‘ వైఎస్ఆర్ లక్ష్యం నెరవేరుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లా లోని 23 మండలాలకు చెందిన 3.36 లక్షల ఎకరాలకూ, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకూ, కడప జిల్లా లోని రెండు మండలాలకు చెందిన 29 వేల ఎకరాలకూ ఆయకట్టుకు సాగు నీరు, 30 మండ లాల్లోని కరువు పీడిత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటి సౌకర్యం లభిస్తుంది. తండ్రి ఆశయాలను సాకారం చేసిన తన యునిగా, కరవు ప్రాంతాలకు నీరు అందించిన భగీరథునిగా జగన్ ప్రజల మన్ననలు పొందేందుకు మార్చి 5వ తేదీన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేయడం మలి అడుగుగా భావించాలి. లింగమనేని శివరామ ప్రసాద్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 79813 20543 -
కృష్ణా జలాల వివాదంపై నేడు భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నది దిగువ బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే అజెండాగా బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు పరిధిని నిర్దేశించేవరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ(ఆంధ్రప్రదేశ్), సాగర్ నిర్వహణను ఆ ప్రాజెక్టు సీఈ(తెలంగాణ)కి అప్పగించింది. కానీ తమ భూభాగంలో ఉందంటూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నా అప్పటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా దిగువకు నీటిని వదిలేస్తూ.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలం పాజెక్టును ఖాళీ చేస్తూ రాయలసీమ హక్కులను తెలంగాణ హరిస్తూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తరలించిన జలాలను.. కుడి కాలువకు విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులను కాలరాస్తూ వస్తోంది. బోర్డు పరిధి నిర్దేశించినప్పటికీ.. దీనిపై 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలి. కృష్ణా బోర్డు సమావేశంలో ఆ ప్రాజెక్టులను అప్పగించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరగడంతో ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్లో దిగువన నీటి అవసరాలు లేకపోయినా.. శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 17 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసి సాగర్‌కు తరలించిన తెలంగాణ.. వాటిని ఏపీకి విడుదల చేయకుండా మొండికేసింది. దాంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి నవంబర్ 30న ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాగర్ వివాదంతో కదలిన కేంద్రం సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్‌పై యధాస్థితిని కొనసాగిస్తూ.. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతోపాటు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
మీ వైఫల్యం వల్లే.. సాగర్ స్పిల్ వే సగం స్వాధీనం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం రాత్రి లేఖ రాశారు. సాగర్ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాదీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ సర్కార్‌కు శుక్రవారం లేఖ రాసింది. తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్‌కుమార్ బదులిచ్చారు. ఏపీ లేఖలో ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి, సాగర్ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుంది. ► గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయాం. ► సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు. నేడు రెండు రాష్ట్రాలతో కేంద్రం భేటీ కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తదితరులు పాల్గొనే ఈ సమావేశం శనివారం ఉ.11గంటలకు హైబ్రీడ్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్) జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తున్న తీరును ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
సీఆర్పీఎఫ్ పహారాలో ‘సాగర్’
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పహారాలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే నవంబర్ 30 నాటి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేయగా గత నెల 28కి ముందున్న పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీ లేకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చేలా తాగునీటి అవసరాల కోసం రెండో రోజు శుక్రవారం కూడా 3,300 క్యూసెక్కుల నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్‌వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా శుక్రవారం ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్‌లతో కలిసి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. హక్కులు కాపాడుకోవడానికే.. తాము శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం 500 మంది పోలీసులను పంపి సాగర్‌లో సగం స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిందని తెలంగాణ సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండోసారి అని చెప్పారు. సాగర్ కుడి కాలువకు నీటిని తరలించడం వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. దీనిపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అక్టోబర్ 6న కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయిస్తే అదే రోజు అక్రమంగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తెలంగాణ సర్కారు నీటిని తరలించిందని ప్రస్తావించారు. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన నీటిలో 17 టీఎంసీలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసే సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని తెలంగాణ తన అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయకుండా హక్కులను హరిస్తోందన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికే సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నామని తేల్చి చెప్పారు. తెలంగాణ సర్కార్ తీరుతో వివాదాలు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించగా తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటోందని, ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతోందని ప్రస్తావించారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్లే గెజిట్ నోటిఫికేషన్ అమలులో జాప్యం జరుగుతోందని, దీనివల్లే వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని తేల్చి చెప్పారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే తెలంగాణ సర్కార్ తనను ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలోకి అనుమతించలేదని వెల్లడించారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇదే వివాదానికి కారణమవుతోందని ఆనంద్‌మోహన్ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు.. సాగర్ డ్యామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ, పోలీసు సిబ్బందిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)పై రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చలు రెండు రాష్ట్రాల సీఎస్ల వాదనలు, కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కృష్ణా బోర్డు ఛైర్మన్ అభిప్రాయాలను విన్న తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ బల్లా దీనిపై స్పందించారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ సాగర్‌పై స్టేటస్ కో కొనసాగుతుందని ప్రకటించారు. ఈలోగా ఈ వివాదంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటిదాకా సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు దిశానిర్దేశం చేశారు. కొనసాగుతున్న నీటి విడుదల రెండో రోజు సాగర్ కుడికాలువ ద్వారా 3,300 క్యూసెక్కులు దిగువకు సాక్షి, నరసరావుపేట, మాచర్ల, విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న 13 క్రస్ట్‌గేట్లు, హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనపర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీటి హక్కులపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటి విడుదల రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 5వ గేటు నుంచి 2,000 క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1,300ల క్యూసెక్కుల విడుదలను కొనసాగిస్తూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. సాగర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 1,300 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తును పరిశీలించారు. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీకి..ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి జలాల వాటాను తేల్చి, నీటిని పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై న్యాయసలహా, తెలంగాణ సర్కార్ అభిప్రాయం తీసుకుని కొత్త గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌పై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. కానీ.. ప్రస్తుత జల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉత్పన్నమైంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ♦ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించారు. ♦ గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతను తేల్చాలి. ♦ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాలి. దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆయకట్టు హక్కులను పరిరక్షించేలా ఎగువ ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని రూపొందించాలి. ♦ కాళేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలి. ♦ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణను ఆదేశిస్తూ.. దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. ♦ ఉమ్మడి రాష్ట్ర పరిధిలో జీడబ్ల్యూడీటీ (గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరిలో నీటి లభ్యతను నిర్ధారించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాలు తేల్చడానికి ఐఎస్ఆర్డబ్ల్యూడీ (అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు) చట్టం–1956 సెక్షన్–4(1) ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ♦ జీడబ్ల్యూడీటీ అవార్డుతో పాటు విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తుండటాన్ని అనేక సార్లు కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ♦ ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మదింపు చేసి.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదించేవరకూ వాటిని నిలుపుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ♦ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ♦ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైన నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం.. 2020, అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన మేరకు ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గోదావరి జలాలను పంపిణీ చేయాలి. ♦ జీడబ్ల్యూటీడీ అవార్డు ద్వారాగానీ విభజన చట్టం ద్వారాగానీ రెండు రాష్ట్రాలకు ఇప్పటిదాకా గోదావరి జలాలను ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. కానీ.. తెలంగాణ సర్కార్ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా అక్రమంగా కాళేశ్వరం(450 టీఎంసీలు), దేవాదుల మూడో దశ (22 టీఎంసీలు), తుపాకులగూడెం బ్యారేజ్ (100 టీఎంసీలు), సీతారామ ఎత్తిపోతల (100 టీఎంసీలు), వాటర్ గ్రిడ్ (32.58 టీఎంసీలు), లోయర్ పెన్‌గంగపై బ్యారేజ్‌లు (6.55 టీఎంసీలు), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు తరలింపు (3 టీఎంసీలు) ప్రాజెక్టులను చేపట్టింది. నికర జలాల్లో మిగులు లేకుండానే.. ♦జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో పాటు 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తేల్చింది. ♦ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టులకు 659.691 టీఎంసీల కేటాయింపు ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116.20 టీఎంసీలు అవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ డిమాండ్ 775.891 టీఎంసీలు. బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే వరద జలాలపై పూర్తి హక్కు ఉంటుంది. ♦తెలంగాణలో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 471.686 టీఎంసీలను వినియోగించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు అవసరం. అంటే.. తెలంగాణ డిమాండ్ 649.802 టీఎంసీలు. గోదావరిలో 1,430 టీఎంసీల నికర జలాలు ఉంటాయని వ్యాప్కోస్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే.. 1425.693 టీఎంసీలు అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదు. ♦గోదావరి నికర జలాల్లో మిగులు లేకున్నా సరే.. 714.13 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా అక్రమంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలుగుతుంది. ♦ గోదావరి జలాల వినియోగం, పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోయినా తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును 2015లో చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని అనేకసార్లు కోరినా పెడచెవిన పెట్టి.. 2018, జూన్ 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ♦అంతర్రాష్ట్ర జల వివాదం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్టు అథారిటీ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతి చెల్లదు. -
Fact Check: కృష్ణాడెల్టాను ఎండబెట్టింది మీ చంద్రబాబే
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడమే పనిగా పెట్టుకున్న రామోజీ కుక్క తోకలా తన బుద్ధి కూడా వంకరేనని రామోజీరావు ఎప్పటికప్పుడు తన రాతల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే.. కృష్ణాడెల్టా చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 2019, 2020, 2021, 2022లలో ఖరీఫ్‌కే కాదు.. అధికారికంగా రబీ పంటకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల కృష్ణా బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లోనే కాదు.. కృష్ణా డెల్టాలోనూ తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలను రక్షించి.. రైతులకు దన్నుగా నిలవడానికి జలవనరుల శాఖాధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమర్థవంతంగా నీళ్లందించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. పైగా.. పులిచింతల నీటికి గోదావరి (పట్టిసీమ) జలాలను జతచేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందిస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులను వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమిస్తూ.. సమర్థవంతంగా నీళ్లందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తుంటే రామోజీరావు అది చూసి క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. నిజాలను దాచేసి.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలను వల్లెవేస్తూ.. ‘కృష్ణా డెల్టాను ఎండబెట్టేశారు’ అంటూ పెడబొబ్బలు పెడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే తన విషపుత్రిక ఈనాడులో రామోజీ విషం చిమ్మారు. ఇందులోని ప్రతి అక్షరంలో ఆయన అక్కసు తప్ప వీసమెత్తు నిజంలేదు. కృష్ణా డెల్టాకు 85.81 టీఎంసీలు సరఫరా.. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2023–2024 ఖరీఫ్ పంటలకు జూన్ 7న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఆయకట్టులో 9.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటివరకూ 85.81 టీఎంసీల నీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 35.93 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా 29.88 టీఎంసీల గోదావరి జలాలు.. మున్నేరు, పాలేరు, కట్టలేరు, కీసర వాగుల ద్వారా వచ్చిన 20 టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణాడెల్టాకు అందించింది. ముందస్తు ప్రణాళికతో.. నిజానికి.. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతోపాటు రాష్ట్రంలోనూ తక్కువగా వర్షాలు కురిశాయి. కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తగినంత నీటి ప్రవాహం రాకపోవడంతో వాటి నుంచి కృష్ణాడెల్టాకు నీటిని విడుదలచేసే పరిస్థితి ఈ ఏడాది లేదు. దీనిని ముందే గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తూ.. కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా.. ఈ సీజన్ ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టులో 38 టీఎంసీలు ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం రానంతవరకూ కృష్ణా డెల్టాలో పంటలకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో పట్టిసీమ పంపులను జూలై 21న ఆన్‌చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు. వాటికి పులిచింతల నీటిని జతచేసి.. కృష్ణా డెల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రణాళికను అమలుచేయడంవల్లే తెలంగాణలో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా పులిచింతలలో తిరిగి 19 టీఎంసీలను నిల్వచేయగలిగింది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది. అదే పులిచింతల ప్రాజెక్టులో నీటిని ముందుగా వినియోగించుకోకపోయి ఉంటే.. మూసీ ద్వారా వచ్చిన వరద సముద్రం పాలయ్యేది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పంటలు పచ్చగా.. ► ఇక కృష్ణా బేసిన్లోనే కాదు.. కృష్ణా డెల్టాలో కూడా ఆగస్టు, అక్టోబరు నెలల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులు అరుదు. ప్రకృతి సహకరించకపోయినా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారబందీ విధానంలో ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు బాసటగా నిలబడుతోంది. ఇదీ వాస్తవం. కానీ, నీళ్లందకపోవడంవల్ల తూర్పు, పశ్చిమ డెల్టాల్లో కన్నీటి ప్రవాహం అంటూ ప్రభుత్వంపై రామోజీ ఎప్పటిలాగే తన అక్కసు వెళ్లగక్కారు. ► అలాగే, దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పంటలను రక్షించేందుకు వారబందీ విధానాన్ని అమలుచేస్తూ.. ఒక వారంపాటు సగం నిర్ధేశిత ప్రాంతాలకు.. మరో వారం మిగతా సగం నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ విధానంలో నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నప్పుడు మిగతా నిర్దేశిత ప్రాంతాల్లోని కాలువల్లో ప్రవాహం ఉండదు. అప్పుడు చివరి భూములకు రైతులు ఆయిల్ ఇంజన్లతో కాలువల్లో నిలిచి ఉన్న నీటిని తోడిపోసుకుని పంటలు కాపాడుకోవడం అక్కడక్కడ జరుగుతుంది. దీన్నే భూతద్దంలో చూపించి వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయని ‘ఈనాడు’ గగ్గోలు పెట్టింది. ► అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ ఒకేఒక్క పంటకు అరకొరగా నీళ్లందించారు. ఆ సమయంలో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా.. రైతులు నష్టపోయినా రామోజీరావు పెన్నెత్తి మాట అనలేదు. ఎందుకంటే.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాబట్టి. కృష్ణా తూర్పునకు 52.69.. పశ్చిమానికి 33.12 టీఎంసీలు.. కృష్ణా తూర్పు డెల్టాలో 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 5,30,136 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 52.69 టీఎంసీలను సరఫరా చేశారు. వారబందీ విధానాన్ని అమలుచేస్తూ ఆయకట్టుకు నీటిని సమర్థవంతంగా సరఫరా చేస్తున్నారు. ఏలూరు కెనాల్‌కు రోజూ 800 క్యూసెక్కుల నుంచి 1,200 క్యూసెక్కులు ఇప్పటివరకూ సరఫరా చేశారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు ప్రభుత్వం ఇలా అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే.. ► కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలు ఆయకట్టు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉండగా.. పూర్తి ఆయకట్టులో రైతులు పంటలు సాగుచేశారు. వాటికి ఇప్పటివరకూ 33.12 టీఎంసీలు అందించారు. ► పశ్చిమ డెల్టాకు శనివారం 4,808 క్యూసెక్కులను విడుదల చేశారు. పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో టీఎస్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు శనివారం నుంచి వారబందీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. ► అలాగే, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని ఏఎం ఛానల్ పరిధిలోని ఆయకట్టుకు, బాపట్ల జిల్లాలో బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలోని ఆయకట్టుకు సోమవారం నుంచి వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తారు. ► మరోవైపు.. సీఎం జగన్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారబందీ విధానంలో నీళ్లందిస్తూ పంటలను రక్షించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ► ఇక పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు నిల్వఉన్నాయి. గోదావరిలో ప్రవాహాలు ఉన్నంత వరకూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసి.. మరీ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు రివర్ స్లూయిస్ ద్వారా నీరువదిలి.. వాటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది. పులిచింతలతో కృష్ణా డెల్టా సుభిక్షం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు ముందస్తుగా నీళ్లందించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టి.. 2009 నాటికే దానిని చాలావరకూ పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అప్పటి నుంచి నీటిని నిల్వచేస్తున్నారు. 2014లో పూర్తి గరిష్ఠ స్థాయి సామర్థ్యం అయిన 45.77 టీఎంసీలను నిల్వచేయవచ్చు. కానీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణలో ఎత్తిపోతలకు పరిహారం చెల్లించకపోవడంవల్ల ప్రాజెక్టులో అరకొరగా నీటిని నిల్వచేసి.. తక్కువ నీటిని సరఫరా చేసి.. లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టి కృష్ణాడెల్టా రైతుల కడుపుకొట్టారు. కానీ, వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి 2019లోనే పూర్తిస్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వచేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వచేసి.. నాలుగేళ్లుగా డెల్టాలో ఏటా రెండు పంటలకు నీళ్లందించారు. అలాగే, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సమర్థవంతంగా నీళ్లందిస్తుండటానికి ప్రధాన కారణం పులిచింతల ప్రాజెక్టే. -
కృష్ణా జలాలపై తగ్గేదే లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయాలని ఆదేశించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధి విధానాలపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1), బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) చేసిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి నష్టం జరిగిన అంశంపైనా చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర మార్గదర్శకాలు విభజన చట్టం సెక్షన్–89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం స్పష్టం చేస్తుంటే.. దీనిని ఉల్లంఘించేలా కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాజ్–4ను కూడా కేంద్రం ఉల్లంఘించిందని, 2002కు ముందు చేసిన కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని ఈ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపారు. గోదావరి జలాల కేటాయింపులను ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు కేటాయింపులు చేసే అంశాన్ని కూడా కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివరించారు. అదే తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నప్పటికీ, ఆ మేరకు కృష్ణా జలాలను అదనంగా మన రాష్ట్రానికి కేటాయించేలా కేడబ్ల్యూడీటీ–2కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడంపైనా సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. -
ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌లో ప్రకాశం బ్యారేజ్‌కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్‌తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. పురాతన కాలంలో నిరి్మంచి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. -
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందడంలేదు. అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం.. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పర్యావరణ అనుమతితోనే పనులు రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో టీడీపీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావరణ అనుమతితోనే పనులు చేపట్టాలని 2020, అక్టోబర్ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాంతో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
Fact Check: అక్షరం అక్షరంలో అక్కసు..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సీఎం వైఎస్ జగన్‌కు ఆపాదించడం.. వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లుతూ నీతిమాలిన రోత రాతలను అచ్చేయడంలో తనకు అలుపే లేదని రామోజీరావు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటున్నారు. కుక్క తోకలా తన బుద్ధీ ఎప్పటికీ వంకరేనని చాటుకోవడానికి ఆయనకు ఆయనే తెగ పోటీపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోత రాతలను అచ్చేయడాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ‘పోలవరంలో ఇదేం దారుణం?’ శీర్షికన ‘ఈనాడు’లో తాజాగా ప్రచురించిన కథనం. ఆ కథనంలోని ప్రతి అక్షరంలో కాంట్రాక్టర్‌గా తన కొడుకు వియ్యంకుడిని తప్పించారనే కోపం.. డీపీటీ (దోచుకో పంచుకో తినుకో)కి అడ్డుకట్టపడిందనే అక్కసు.. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తుండటంపై అసూయ కన్పించింది తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అసలు నిజాలు ఇవీ.. ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య సీపేజీ (ఊట నీరు) అంచనాలకు మించి 30 రెట్లు అధికంగా వచ్చింది.. వాస్తవం: కమీషన్లకోసం కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు.. రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు. ప్రాజెక్టు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలొచ్చే పనులు చేపట్టి, కమీషన్లు వసూలుచేసుకుని డీపీటీ విధానంలో పంచుకుతిన్నారు. ఈ క్రమంలోనే గోదావరి వరదను మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయకుండానే ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదం చేసింది. ఇందులో మరో ఘోరం ఏమిటంటే.. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పాక్షికంగా నిర్మించి, ఇరువైపులా 650 మీటర్ల ఖాళీ ప్రదేశం.. దిగువ కాఫర్ డ్యామ్‌ను పాక్షికంగా నిర్మించి, రెండు వైపులా 480 మీటర్ల ఖాళీ ప్రదేశం ఉంచింది. కాఫర్ డ్యామ్‌లు అనేవి తాత్కాలిక కట్టడాలు మాత్రమే. వాటి పునాదుల గుండా సీపేజీ రాకుండా సాధారణంగా జెట్ గ్రౌటింగ్ విధానాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో ఎగువ కాపర్ డ్యామ్ పునాదిని పటిష్టపరిచారు. 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. టీడీపీ సర్కార్ ఎగువ కాఫర్ డ్యామ్‌లో వదిలేసిన ఖాళీ ప్రదేశాల గూండా 13.5 మీటర్లు/సెకను అంటే గంటకు దాదాపు 40 కిమీల వేగంతో ఆ వరద ప్రవహించడంవల్ల జెట్ గ్రౌటింగ్ బలహీనపడి సీపేజీ అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగింది. దానివల్లే రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యలోకి సీపేజీ నీరు చేరుతోంది. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ సర్కార్‌దే. కానీ, మీ దోపిడీని కప్పిçపుచ్చుకునే క్రమంలో ఆ చారిత్రక తప్పును వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే ఎలా రామోజీ? ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణాన్ని తమ అనుమతిలేకుండానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ఇది చెయొద్దని చెప్పినా వినడంలేదని నాలుగు రోజుల క్రితం జరిగిన అంతర్గత సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి పీపీఏ అధికారులు తీసుకెళ్లారు. దీనికి ఆయన విస్తుపోయారు.. వాస్తవం: రామోజీరావు జర్నలిజం విలువల పతనానికి ఇది పరాకాష్ట. కేంద్ర జల్‌శక్తి శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించడం సాధారణమే. ఆ క్రమంలోనే గతనెల 29న ఓ సమావేశాన్ని నిర్వహించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తమ మాట వినడంలేదని.. అనుమతులు తీసుకోకుండానే రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు దిగువ కాఫర్ డ్యామ్ కుడి గట్టున బటర్‌ఫ్లై తూము నిర్మిస్తున్నారని పీపీఏ అధికారులు ఫిర్యాదు చేసినట్లు.. దీనికి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి విస్తుపోయినట్లుగా అవాస్తవాలను రామోజీరావు చిత్రీకరించారు. ఆ సమావేశంలో ఏ బల్ల కింద నక్కి విన్నావ్ రామోజీ? అసలు జరిగిన విషయం ఏమిటంటే.. రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యన చేరిన సీపేజీ నీటిని బయటకు పంపే పద్ధతిని సాంకేతికంగా మదింపు చేసి.. నిపుణులతో చర్చించి ఆర్థికంగా తక్కువ భారమయ్యేలా ఓ ప్రతిపాదనను పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దిగువ కాఫర్ డ్యామ్‌కు ఆనుకుని కుడి వైపున ఉన్న తిప్పకు అంచులో పైపు తూములు నిర్మించి.. వాటికి నాన్–రిటర్న్ వాల్వులు అమర్చి.. వాటి ద్వారా సముద్ర మట్టానికి 18 మీటర్ల ఎత్తు వరకు ఉన్న నీటిని గ్రావిటీపై బయటకు పంపి, మిగిలి ఉన్న నీటిని పంపుల ద్వారా తోడిపోసే విధానాన్ని సూచించింది. ఆ ప్రతిపాదనకు అనుమతి వచ్చేలోగా విలువైన సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో పీపీఏకు సమాచారమిచ్చే సన్నాహక పనులనే జలవనరుల శాఖ చేపట్టింది. ఇదీ వాస్తవం. ఈనాడు ఆరోపణ: ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీపై తప్పుడు ఫార్ములాతో తప్పిన అంచనాలు.. వాస్తవం: ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందే సీపేజీపై ఐఐటీ నిపుణులు అంచనా వేసినప్పుడు.. పునాదిని జెట్ గ్రౌటింగ్‌తో పటిష్టవంతం చేస్తే సీపేజీ పరిమితికి లోబడే ఉంటుందని లెక్కించారు. కానీ, టీడీపీ సర్కారు కమీషన్ల కోసం ప్రాజెక్టును పణంగా పెట్టింది. ప్రాజెక్టు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టి.. వాటిని పూర్తిచేయలేక ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల 2019–20లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ కూడా దెబ్బతింది. దీనివల్లే సీపేజీ అధికంగా ఉంది. చంద్రబాబు సర్కార్ తప్పిదాలను వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసేందుకే అభూత కల్పనలతో కథనాన్ని వండివార్చావన్నది వాస్తవం కాదా రామోజీ? -
5 ప్రాధాన్య ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తికావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకు విడుదలైన, ఖర్చుచేసిన నిధులు.. చేసిన, చేయాల్సిన పనులు.. నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను సమీక్షించిన ఆయన గడువు ప్రకారం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అవుకు టన్నెల్, గొట్టా బ్యారేజి నుంచి హిర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చుక్కల భూముల తొలగింపు పనులు వేగవంతం 22–ఎ జాబితా నుంచి చుక్కల భూములను తొలగింపు పనులను వేగవంతం చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో సి.సి.ఎల్.ఎ., ఐ.టి.ఇ.– సి, జి.ఎస్.డబ్లు్య.ఎస్ అధికారులతో సమావేశమయ్యారు. 22–ఎ జాబితా నుంచి చుక్కలు, అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష కింద ధ్రువీకరణపత్రాల జారీ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22–ఎ జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని చెప్పారు. ఆ పనులను వేగవతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సి.సి.ఎల్.ఎ. సాయిప్రసాద్‌ను ఆదేశించారు. అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు పనులపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రామ సేవా ఈనామ్ భూముల విషయంలో దేవదాయ శాఖ క్లియరెన్సు పొందాలని సూచించారు. 20 సంవత్సరాలకు పైబడి అసైన్డు భూములను అనుభవిస్తున్న వారికి ఆ భూమిపై పూర్తి హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అసైన్డు భూములను, ఒరిజనల్ అస్సైనీలను, వారి వారసులను ధ్రువీకరించే పనులనుపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు ఏపీలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ప్రమాదకర రసాయన పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో ప్రతిఏటా తప్పకుండా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే వెంటనే నోటీసులిచ్చి వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. సాల్వెంట్ పరిశ్రమలను నిర్వహించే వ్యక్తుల సామర్థ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్స్‌లు జారీ చేయాలన్నారు. -
గైడ్ బండ్ సమస్య చిన్నదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్లో కొద్దిమేర జారడం చిన్న సమస్యేనని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని నిపుణుల కమిటీ తేల్చింది. గైడ్ బండ్ ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణం కాదని, స్పిల్ వే మీదుగా వరద సులువుగా వెళ్లేలా చేయడానికి నిర్మించింది మాత్రమేనని స్పష్టంచేసింది. గోదావరికి సాధారణంగా ఆగస్టులో భారీ వరదలు వస్తాయని, ఆలోగా గైడ్‌బండ్‌కు తాత్కాలిక ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. తాత్కాలిక దిద్దుబాటు చర్యల ప్రతిపాదనను నాలుగు రోజుల్లోగా పంపితే.. దానిలో మార్పులుంటే చేసి సీడబ్ల్యూసీకి పంపి తక్షణమే ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రతిపాదన మేరకు జూలైలోగా గైడ్ బండ్ తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిపుణుల కమిటీతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ మరోసారి సమావేశమై.. గైడ్ బండ్‌ను పటిష్టం చేయడానికి తాత్కాలిక, శాశ్వత చర్యలపై చర్చించింది. సీడబ్ల్యూసీకి వారంలో నివేదిక గైడ్ బండ్లో కొంత భాగం కాస్త జారడానికి కారణాలపై రాష్ట్ర అధికారులతో నిపుణుల కమిటీ మేధోమథనం జరిపింది. నిపుణుల కమిటీలోని నలుగురు సభ్యులూ.. నాలుగు రకాల అభిప్రాయలు వెల్లడించటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఢిల్లీలో మరోసారి సమావేశమై గైడ్ బండ్ జారడానికి కారణాలపై వారంలోగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇస్తామని పాండ్య తెలిపారు. తాత్కాలిక మరమ్మతుల ప్రతిపాదన ఇదీ గైడ్ బండ్ ఎత్తు 51.32 మీటర్లు. పొడవు సుమారు 134 మీటర్లు. ఇందులో కొన్ని చోట్ల 3 మీటర్లు, కొన్ని చోట్ల ఆరు మీటర్ల మేర కాస్త జారింది. జారిన ప్రదేశాల్లో ఇప్పటికే పెద్ద రాళ్లు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వాటిపైన మళ్లీ పెద్ద పెద్ద రాళ్లు వేసి వాటి మధ్య సిమెంటు మిశ్రమం (స్లర్రీ) పోయాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గాబియన్లు వేయాలని పేర్కొంది. దీనివల్ల వరద ఉద్ధృతిని గైడ్ బండ్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది. సీడబ్ల్యూపీఆర్ఎస్తో మరోసారి అధ్యయనం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా స్పిల్ వేకు ఎగువన ఏర్పడే సుడిగుండాలను నియంత్రించి, వరదను సులువుగా దిగువకు వెళ్లేలా చేయడానికి 2:1 నిష్పత్తిలో గైడ్ బండ్ నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారమే గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొంతమేర జారడంతో సీడబ్ల్యూపీఆర్ఎస్తో మరోసారి అధ్యయనం చేయించాలని నిపుణుల కమిటీ సూచించింది. గైడ్ బండ్‌ను 3:1 నిష్పత్తిలో నిర్మిస్తే స్పిల్ వే వద్ద వరద ప్రవాహం ఎలా ఉంటుందో అధ్యయనం చేయించాలని పేర్కొంది. గైడ్ బండ్ నిర్మాణ ప్రాంతంలో వరద సమయంలో, వరద తగ్గాక మట్టిని సేకరించి, నాణ్యతపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లో అధ్యయనం చేయించాలని పేర్కొంది. వాటి ఆధారంగా గైడ్ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే డిజైన్‌ను రూపొందిస్తామని వెల్లడించింది. -
డిజైన్‌కు తగ్గట్టుగానే పోలవరం గైడ్ బండ్ నిర్మాణం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌కు తగ్గట్టుగా, నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్‌ను నాణ్యంగా నిర్మించినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిపుణుల కమిటీ తేల్చింది. కానీ.. గైడ్ బండ్ కొంత భాగం కాస్త జారిందని, ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విషయంపై మేధోమథనం జరిపింది. మట్టి పరీక్షల నివేదికలను పరిశీలిం చింది. గైడ్ బండ్ జారిన ప్రాంతానికి తాత్కాలిక మరమ్మతులపై నాలుగు రోజుల్లోగా ప్రతిపాదన ఇస్తే.. దాన్ని సరిచూసి సీడబ్ల్యూసీకి నివేదిస్తామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తక్షణం మరమ్మతుల చేయాలని, ఆ తర్వాత గైడ్ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎస్కే సిబాల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) డైరెక్టర్ చిత్ర, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్ సభ్యులుగా సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ మేఘా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. స్పిల్ వే, గేట్లు, స్పిల్ చానల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. గైడ్ బండ్‌ను సమగ్రంగా పరిశీలించింది. పరిమితికి లోబడే ఎగువ కాఫర్ డ్యామ్ లీకేజీలు గతేడాది గోదావరికి భారీ స్థాయిలో వచ్చిన వరదలను దీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచింది. దీన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీలను రీచ్‌లవారీగా ఎప్పటికప్పుడు అధునాతన హైడాల్రిక్ డాప్లర్ టూల్‌తో కొలుస్తున్నామని రాష్ట్ర అధికారులు కమిటీకి వివరించారు. హైడ్రాలిక్ డాప్లర్ టూల్లో రికార్డయిన గణాంకాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని పేర్కొంది. వరదల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ కాఫర్ డ్యామ్ భద్రతను పర్యవేక్షించాలని సూచించింది. యథాస్థితికి తెచ్చే పనులపై సంతృప్తి గత ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసిన దిగువ కాఫర్ డ్యామ్ నాణ్యతపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్ వద్ద వరద ఉధృతికి ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులను పరిశీలించింది. ఈ పనులు పూర్తయ్యాక డయాఫ్రం వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రం వాల్ వేసే పనులు చేపడతామని రాష్ట్ర అధికారులు వివరించారు. శుక్రవారం నిపుణుల కమిటీ మరో సారి రాష్ట్ర అధికారులతో సమావేశమై.. సాంకేతిక అంశాలపై చర్చించనుంది. క్షేత్ర స్థాయి పర్యటన.. అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. -
పోలవరం చకచకా..
గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీలు వదిలేశారు. ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి కీలకమైన డయాఫ్రమ్ వాల్ దారుణంగా దెబ్బతింది. దీని వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడమే కాదు.. వాటిని చక్కదిద్దడం కోసం రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే.. అప్పట్లో ఆ పనులను రామోజీరావు బంధువులకే నామినేషన్ పద్ధతిలో అప్పగించారు కాబట్టి. ఆ తప్పిదాలన్నింటినీ సరిదిద్దుతూ.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. టీడీపీ సర్కార్ హయాంలో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల గోదావరి వరదల ఉధృతికి ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక తిన్నెలు కోతకు గురై ఏర్పడిన అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తయితే.. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వాటి మధ్య గోదావరి వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ (ప్రధాన) డ్యామ్ పనులు చేపట్టి.. గడువులోగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుందని సూచించారు. మంగళవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.. 9.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ దిగి నేరుగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్దకు చేరుకున్నారు. మండుటెండలో కలియతిరుగుతూ.. మండుటెండలో తీవ్రమైన ఉక్కపోత మధ్య సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను ఒక గంటా 40 నిమిషాలపాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గైడ్ వాల్లను పరిశీలిస్తూ.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గత సీజన్లో వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచిన పనులను పరిశీలించారు. టీడీపీ సర్కార్ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్‌లో రెండు వైపులా 800 మీటర్లు ఖాళీ వదిలేసి, అరకొరగా చేసిన పనులను.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 44 మీటర్ల ఎత్తుతో పూర్తయిన ఎగువ కాఫర్ డ్యామ్ పనులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను పరిశీలించారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులను పరిశీలిస్తూ.. దిగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గోదావరి వదరల ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాన్ని పూడ్చి.. 31.5 మీటర్ల ఎత్తుతో ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసిన ఆ డ్యామ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలలో ఇసుకను నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను నిశితంగా పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడంపై అధికారులతో చర్చించారు. సీఎం చొరవ వల్లే నిధులు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్దే మీటింగ్ హాల్లో జల వనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశను పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం జారీ చేసిందని జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపంతో చేపట్టిన పనుల వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి యథా స్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాల కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. బిల్లుల చెల్లింపులో కాంపొంనెంట్(విభాగాల) వారీ విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని అధికారులు వివరించారు. మీ (సీఎం) చొరవ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు గైడ్ వాల్లో ఏర్పడిన చిన్న సమస్యను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్లతోనే గైడ్ వాల్ పనులు చేశామని చెప్పారు. ప్రస్తుత సమస్యను కూడా సీడబ్ల్యూసీకి నివేదించామన్నారు. గైడ్ వాల్లో ఉత్పన్నమైన సమస్యను సరిదిద్దడం పెద్ద విషయం కాదని.. సీడబ్ల్యూసీ అధికారులు పరిశీలించాక.. వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని వివరించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్య మీడియా మన రాష్ట్రంలో ఉందని ఎత్తిచూపారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్ వాల్లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుని సరిదిద్దే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి పినిపే విశ్వరూప్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కీలక పనుల్లో గణనీయమైన ప్రగతి పోలవరం ప్రాజెక్టులోని కీలక పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు పూర్తి చేశామని.. 48 రేడియల్ గేట్లను పూర్తి స్థాయిలో అమర్చామని.. రివర్ స్లూయిస్ గేట్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ పూర్తయిందని చెప్పారు. జల విద్యుత్కేంద్రంలో సొరంగాల తవ్వకం పూర్తయిందని.. అప్రోచ్ ఛానల్ తవ్వకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాన్ని ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు పూర్తయ్యాయన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను నింపడానికి అవసరమైన ఇసుకను వంద శాతం ఆ ప్రాంతానికి తరలించామని చెప్పారు. ఆ ఇసుకను అగాధాలలో నింపే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1 పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్యాప్–2లో యధాస్థితికి తెచ్చే పనులను త్వరగా పూర్తి చేసి.. వీలైనంత తొందరగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్నారు. ఈ పనులు పూర్తయితే.. గ్యాప్–2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి.. వరదల్లోనూ నిర్విఘ్నంగా కొనసాగించడం ద్వారా గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో అగాధాల పూడ్చివేత, కొత్త డయాఫ్రమ్ వాల్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. పునరావాసం కల్పనపై ప్రత్యేక దృష్టి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 నిర్వాసిత కుటుంబాలకుగాను 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించామని చెప్పారు. మరో 8,288 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగంగా చేస్తున్నామన్నారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్‌లోకి 36 గ్రామాలు వస్తాయని తేలిందని, ఆ గ్రామాల్లోని 16,642 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని చెప్పారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక.. షెడ్యూలు ప్రకారం నిర్వాసితులను అక్కడికి తరలించాలని సూచించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకట్టుకునేలా బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. పర్యాటకుల కోసం అధునాతన సదుపాయాలతో హోటల్ ఏర్పాటు చేయాలన్నారు. -
2025 జూన్‌కు పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, 2025 జూన్‌కు ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించి, రైతులకు ఫలాలను అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, సలహాదారు వెదిరె శ్రీరాంలతో కలిసి మంత్రి షెకావత్ సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి (ఇన్చార్జి) శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి షెకావత్‌కు ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని చెప్పారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యధాస్థితికి తెస్తున్నామన్నారు. మళ్లీ వరదలు వచ్చేలోగా ఈ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఈలోగా గ్యాప్–1లో ప్రధాన డ్యామ్ పనులు చేపడతామన్నారు. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా నిర్మించే వాల్ డిజైన్‌ను తక్షణమే ఖరారు చేయాలని సీడబ్ల్యూసీని కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల స్థానంలో లక్ష క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను పూడ్చి, వైబ్రోకాంపాక్షన్ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దశలవారీగా నీటి నిల్వ ప్రాజెక్టులో మూడు దశల్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ఈఎన్సీ చెప్పారు. తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. ఈ స్థాయిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని వివరించారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలు 45.72 మీటర్ల పరిధిలోకే వస్తాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక రెండో, మూడో ఏడాది 45.72 మీటర్ల పరిధిలోని మొత్తం 1,00,006 కుటుంబాలకు పునవాసం కల్పించి.. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునవాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తొలి దశ పూర్తికి రూ.17,144 కోట్లు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు పూర్తి చేసి, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే రూ.17,144 కోట్లు అవసరమని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. సమగ్రంగా 45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ మేరకు నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. తొలి దశ పూర్తికి రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనను పరిశీలించి, నిధులు ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు. ఆ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం ద్వారా పోలవరానికి నిధుల సమస్య లేకుండా చేస్తామని, తద్వారా షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు సమస్యపై సంయుక్త అధ్యయనానికి ఒడిశా సహాయ నిరాకరణ చేయడంపై తాము చర్చిస్తామని మంత్రి షెకావత్ చెప్పారు. అనుమతి లేని ప్రాజెక్టులపై గోదావరి బోర్డులో చర్చ పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు అనుమతి లేకుండా చేపట్టారని, వాటి డీపీఆర్‌లు పంపి, ఆమోదం తీసుకోవాలని రాష్ట అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ... తెలంగాణ కూడా అనుమతి లేకుండా కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ తదితర ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ విషయాన్ని గోదావరి బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలికమైనవేనని, పోలవరం పూర్తయితే ఆ రెండు ఎత్తిపోతలను మూసేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టామన్నారు. అప్పట్లోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. దాంతో.. అనుమతి లేని ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో చర్చిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్‌కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్‌ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్‌కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది.