Irrigation Projects: పనుల్లో వేగం పెరగాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Water Resources Department | Sakshi
Sakshi News home page

Irrigation Projects: పనుల్లో వేగం పెరగాలి: సీఎం జగన్‌

Published Sat, Oct 2 2021 3:28 AM | Last Updated on Sat, Oct 2 2021 7:03 AM

CM YS Jagan Review Meeting On Water Resources Department - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం, వెలిగొండ, వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2తో పాటు అన్ని ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సకాలంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

స్పిల్‌ వేను పూర్తి చేసి.. గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశామని చెప్పారు.  దిగువ కాఫర్‌ డ్యాం పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని.. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి.. ఈసీఆర్‌ఎఫ్‌ పనులను ప్రారంభించి.. గడువులోగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించామని వివరించారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పోలవరం కాలువల ద్వారా నీళ్లందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,033 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు
కేంద్రంతో చర్చించి పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా చర్యలు చేపట్టాలి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌తో సమన్వయం చేసుకుని.. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడటం ద్వారా గడువులోగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ ఒక్క నిర్వాసితుడికి ఇబ్బంది లేకుండా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా పునరావాసం కల్పించాలి.

నవంబర్‌లో నెల్లూరు బ్యారేజీ పూర్తి
పెన్నా నదిపై నెల్లూరు బ్యారేజీని నవంబర్‌లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి. ఆలోగా సంగం బ్యారేజీని కూడా పూర్తి చేయాలి. తద్వారా పెన్నా డెల్టాకు సమర్థవంతంగా నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలి.
గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తి చేసి.. గాలేరు–నగరి వరద కాలువకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ పనుల్లో మరింత వేగం పెంచాలి. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌ నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.  
వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌–2 పనులను మే నాటికి పూర్తి చేసి, ప్రాజెక్టును రైతులకు అందుబాటులోకి తేవాలి.
నేరడి బ్యారేజీపై ఒడిశాతో సంప్రదింపులు 
నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలి.
తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్‌లో çపూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించేందుకు సంబంధించిన పనులను తక్షణమే పూర్తి చేయాలి. 
మహేంద్ర తనయ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుని.. శరవేగంగా పూర్తి చేయాలి.
గులాబ్‌ తుపాను, అనంతరం వర్షాల వల్ల సాగునీటి కాలువలు దెబ్బతిని ఉంటే.. వాటికి సత్వరమే మరమ్మతులు చేయాలి.

ఏలేరు–తాండవ అనుసంధానంపై ప్రత్యేక దృష్టి 
కొల్లేరు సరస్సును పరిరక్షించేందుకు గోదావరి, కృష్ణా డెల్టాల్లో చేపట్టిన రెగ్యులేటర్ల పనులను ప్రాధాన్యంగా తీసుకుని.. వేగంగా పూర్తి చేయాలి.
తాండవ–ఏలేరు అనుసంధానం పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులు వేగంగా జరిగేలా చూడాలి.
కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన 2 బ్యారేజీలు, ఎగువన మరో బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలి.
ఈ సమీక్ష సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement