సాక్షి, అమరావతి: గోదావరి గలగలలు.. కృష్ణమ్మ బిరబిరలు.. పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈదఫా ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేసింది. నవంబర్‌లో తుపాన్లు వచ్చేలోగా ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి చేసి రెండో పంటకు నీటిని విడుదల చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాలకుల దూరదృష్టికి వరుణుడు కలిసి రావడంతో గోదావరి డెల్టాకు జూన్ 1న, కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్, గండికోట, చిత్రావతి, వెలిగల్లు, బ్రహ్మంసాగర్ ఆయకట్టుకు జూన్ 10న, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్‌కు జూన్ 30న, సాగర్ కుడి, ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేశారు.
తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), ఎల్లెల్సీ(దిగువ కాలువ), వంశధార, తోటపల్లి సహా అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతన్నలు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి వాణిజ్య పంటలను భారీ ఎత్తున సాగుచేశారు. సాగర్, కుడి ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నారుమడులు పోస్తున్నారు. నెలాఖరుకు ఆయకట్టులో ఖరీఫ్ సాగు పూర్తవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
మూడేళ్ల కంటే మిన్నగా..
రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్సైడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద 7.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలో కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉరకలెత్తుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, సోమశిల లాంటి భారీ ప్రాజెక్టులన్నీ నిండాయి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర బేసిన్‌లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 983.48 టీఎంసీలుకాగా ఇప్పటికే 812.47 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్‌లో పూర్తి సామర్థ్యం మేరకు రిజర్వాయర్లలో 560.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అక్టోబర్ ఆఖరు వరకు నదుల్లో వరద ప్రవాహం కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఏడాది అన్ని బేసిన్‌లలోనూ నీరు భారీగా పెరగనుంది.
రెండో పంటకూ అవకాశం..
గతంలో గోదావరి డెల్టాలో మాత్రమే రెండో పంటకు నీటిని విడుదల చేసేవారు. గత మూడేళ్లుగా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపుతున్న ప్రభుత్వం నీటి లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నూర్పిళ్లు కూడా సకాలంలోనే పూర్తవుతాయి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటం, అక్టోబర్ వరకు వరద ప్రవాహం, ఆ తర్వాత సహజ ప్రవాహం నదుల్లో ఉండే అవకాశం ఉన్నందున ఈ ఏడాది నీటి లభ్యత గత మూడేళ్ల కంటే అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో సాగు
మంత్రివర్గ సమావేశంలో సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగానే నీటిని విడుదల చేశాం. జలవనరుల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా చర్యలు చేపట్టాం. ఈ దఫా రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలలో ఏటా కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే అధిక ఆయకట్టులో పంటలు సాగుచేసే అవకాశం ఉంది.
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment