
ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి
జలవనరుల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి కాలువల నిర్వహణ, నియంత్రణను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) కింద ఉన్న వెయ్యికిపైగా చిన్న లిఫ్ట్‌లను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ఆయన పునరుద్ఘాటించారు.
వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు సమీక్షించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,379 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని.. జనవరి 18న ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటి వరకు 35 మీటర్లు పూర్తయిందని అధికారులు వివరించారు.
ఇంకా 1,344 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను విశాఖకు తీసుకువెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పనులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి.. పనులు గాడిన పెట్టాలని సూచించారు.
భూగర్భజలాల పెంపుపై మంత్రులతో కమిటీ..
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. నిధుల సమీకరణకు కేంద్రంతో చర్చిస్తున్నామన్నారు.
భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక కోసం పంచాయతీరాజ్, అటవీ, జలవనరులు, వ్యవసాయ, పురపాలక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమీక్షలో మంత్రి రామానాయుడు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు.
పర్యాటక శాఖ 20 శాతం వృద్ధి సాధించాలి
పర్యాటక శాఖ 2025–26 మధ్య 20 శాతం వృద్ధిరేటును సాధించాలని, ఆ దిశగా అధికారులు పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో పర్యాటకశాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. పర్యాటక శాఖకు ఎంత విలువైన ఆస్తులున్నాయో అంచనా వేయాలని, ఎక్కడ రెవెన్యూ ఎక్కువగా వస్తుందో... అక్కడ ప్రోత్సాహకాలు పెంచాలని చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలను ఎస్క్రో అకౌంట్ ద్వారా వెంటనే మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment