canals
-
కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?
భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్ పనులను చేపట్టారు. ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్‌లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్‌లు, సైకిళ్లు ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇన్ని సైకిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు? Finding some surprises while cleaning the canals of Amsterdam. pic.twitter.com/QsEJgj5GHM — Fascinating (@fasc1nate) September 18, 2023 -
ఫలితాలిస్తున్న మిషన్ క్లీన్ కెనాల్స్
-
నాలాలు, వరద నీటి కాలువల శుభ్రతపై దృష్టి సారించాలి
రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పి.జి.శాస్త్రి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ కె.కిషన్, జేఎన్టీయూఏ వాటర్ రిసోర్సెస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.గోపాల్‌నాయక్, సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నర్సింగ్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతమున్న మొత్తం 974 కి.మీలను వినియోగిస్తూ ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులను నిరి్మస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వీటిని నదులు, కాలువల ద్వారా అనుసంధానించే ప్రక్రియపై దృష్టిపెట్టింది. రోడ్డు మార్గంతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయంతో వేగంగా సరుకు రవాణాకు అంతర్గత జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటుచేస్తూ చట్టాన్ని తీసుకురావడమే కాక బోర్డును సైతం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సుమారు 1,555 కి.మీ మేర జలరవాణా మార్గాలున్నప్పటికీ.. అందులో వినియోగంలో ఉన్నది చాలా తక్కువే. పర్యావరణ హితం, తక్కువ వ్యయంతో కూడిన జలరవాణా పెంపుపై కేంద్రంప్రత్యేక దృష్టిసారించడంతో దానితో కలిసి పలు ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధంచేస్తోంది. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత జలరవాణా మార్గాలు 22.93 లక్షల కి.మీ.లు ఉండగా అందులో భారత్ కేవలం 0.20 లక్షల కి.మీ మాత్రమే కలిగి ఉంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 4,543 కి.మీ మేర జలరవాణా మార్గాలుండగా, ఏపీ 1,555 కి.మీ.లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ వాటర్‌వేస్ ప్రాజెక్టుల కింద కృష్ణా–గోదావరి–కాకినాడ–ఏలూరు, బకింగ్‌హామ్ కెనాల్‌ను అభివృద్ధిచేయడానికి ఎన్‌డబ్ల్యూ–4 కింద ప్రకటించింది. ఎన్‌డబ్ల్యూ–79 కింద పెన్నా నదిలో, ఎన్‌డబ్ల్యూ–104 కింద తుంగభద్ర నదిలో జలరవాణా మార్గాలను కేంద్రం చేపట్టనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. తొలుత ముక్త్యాల–మచిలీపట్నం రూట్ ఇక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ముక్త్యాల నుంచి అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీ వద్ద బందరు కాలువ లాకులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట వద్ద ఉన్న సిమెంట్ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, బియ్యంను తీసుకెళ్లడంతోపాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న థర్మల్ పవర్ కేంద్రానికి దిగుమతి చేసుకున్న బొగ్గును చౌకగా రవాణా చేయవచ్చు. రెండో దశలో ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు, కాకినాడ కాలువల ద్వారా కాకినాడ పోర్టును అనుసంధానించే ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే, పెన్నా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాలను వినియోగించుకుంటూ కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానిస్తారు. ఇప్పటికే ముక్త్యాల–మచిలీపట్నం జలరవాణా మార్గానికి డీపీఆర్ సిద్ధంచేయగా కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ‘పెన్నా’లో 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా.. పెన్నా నది పరీవాహక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఏటా 16 మిలియన్ టన్నుల సరుకు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా. ఇదే జలమార్గం ద్వారా రవాణాచేస్తే టన్నుకు కి.మీ.కు రూ.2.50 తగ్గడంతో పాటు డీజిల్ వినియోగం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో పలు నౌకాశ్రయాలు నిర్మాణం జరుగుతుండటంతో వాటికి అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈఓ, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
ఏపీ నంబర్–1.. సూపర్ మత్స్యం
సాక్షి, అమరావతి: చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల్లో (ఇన్‌ల్యాండ్) చేపలను ఉత్పత్తి చేయడంలో అగ్రపథాన నిలిచింది. ఇన్‌ల్యాండ్‌లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్ వరుస స్థానాలు పొందాయి. కాగా, సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో 7.02 లక్షల టన్నులతో గుజరాత్ మొదటి స్థానం, 6.01 లక్షల టన్నులతో కేరళ రెండోస్థానం, 5.95 లక్షల టన్నులతో తమిళనాడు మూడో స్థానంలో ఉండగా.. 5.94 లక్షల టన్నులతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ టాప్ చేపల ఉత్పత్తిలో 2021–22 సంవత్సరానికి సంబంధించి జాతీయ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ దాదాపు రెట్టింపు వృద్ధి రేటు నమోదు చేసింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 12.57 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. 20కి పైగా రాష్ట్రాల్లో ఏపీలో ఉత్పత్తి అవుతున్న చేపలకే డిమాండ్ అధికంగా ఉంది. స్థానికంగా ఉత్పత్తి అయ్యే చేపల్లో 20 లక్షల టన్నులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. 2021–22లో 48.13 లక్షల టన్నుల ఉత్పత్తితో రూ.59,188 కోట్ల జీవీఏ (జోడించబడిన స్థూల విలువ) సాధించింది. (చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్ హోల్డర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు) -
Telangana: ఇక నీటితోపాటు కరెంటు ప్రవాహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన కొత్త రుణాల సమీకరణ అసాధ్యంగా మారిన నేపథ్యంలో.. సొంత ఆదాయ వనరుల సమీకరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నిరుపయోగంగా ఉన్న వాలంతరి, ఇంజనీరింగ్ ల్యాబ్ వంటి సంస్థలకి చెందిన 100 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని జలాశయాలు, సాగునీటి కాల్వలపై భారీ ఎత్తున సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 16 జలాశయాలపై 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు, కాల్వలపై మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు, నదులపై మరో 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలు కలిపి 13,800 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి అవకాశముందని ..తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఇటీవల నివేదిక సమర్పించింది. ఈ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేస్తే ఏటా రూ.13 వేల కోట్ల ఆదాయం రానుందని, పీపీపీ పద్ధతిలో ఏటా రూ.431 కోట్లను రాయల్టీగా పొందవచ్చని అంచనా వేసింది. జలాశయాలతో రూ.100 కోట్ల ఆదాయం రాష్ట్రంలోని 16 జలాశయాలు 1,675 చ.కి.మీల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. చ.కి.మీటర్‌కు 40 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 10 శాతం విస్తీర్ణంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఒక మెగావాట్‌కి రూ.5.5 కోట్లు చొప్పున 6,700 మెగావాట్లకు రూ.36,850 కోట్ల వ్యయం కానుంది. ఏటా 10వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, రూ.3 వేల కోట్ల ఆదాయం రానుంది. జలాశయాలను అద్దెకు ఇచ్చినందుకు ప్రతి యూనిట్‌పై 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.100 కోట్లను నీటిపారుదల శాఖ పొందవచ్చు. కాల్వలతో రూ.31 కోట్లు రాష్ట్రంలో 40 వేల కి.మీ సాగునీటి కాల్వలుండగా, మరో 40 వేల కి.మీ కాల్వలు నిర్మాణంలో ఉన్నాయి. 8 వేల ఎకరాల్లోని కాల్వపై పీపీపీ పద్ధతిలో 2వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.9వేల కోట్ల వ్యయం కానుండగా, ఏటా 3,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. యూనిట్ విద్యుత్‌ను రూ.2.5 చొప్పున విక్రయించినా కనీసం ఏడాదికి రూ.775 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రైవేటు డెవలపర్ల నుంచి యూనిట్‌కి 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.31 కోట్లను నీటిపారుదల శాఖ అర్జించవచ్చు. పంప్డ్ స్టోరేజీతో రూ.300 కోట్ల రాయల్టీ ములుగు అడవుల్లో 3,960 మెగావాట్లు, నిర్మల్ అడవుల్లో 1,200 మెగావాట్లు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి వీలుంది. అక్కడి జలాశయాలను ఆధారం చేసుకుని 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మెగావాట్‌కి రూ.6.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల చొప్పున రూ.35 వేల కోట్ల వ్యయం కానుంది. ఏటా 30,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, యూనిట్‌కి రూ.3 ధరతో ఏటా రూ.9,200 కోట్ల ఆదాయం రానుంది. యూనిట్‌కు 10 పైసలను ప్రైవేటు డెవలర్ల నుంచి రాయల్టీగా పొందినా ఏటా రూ.300 కోట్లు రానున్నాయి. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?
చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. బెంగళూరు: నాలుగు వందల ఏళ్ల కిందటే నాడప్రభు కెంపేగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు నేడు మామూలు వర్షానికే గజగజ వణికిపోవడం చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువలు వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయి విపత్తులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం మరో కారణం. వర్షపు నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడటంతో ముంపు తలెత్తుతోంది. బెల్లందూరు చెరువు దుస్థితి బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన కట్టడాల వివరాలు ►శూలె చెరువులో ఇప్పుడు ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణమైంది. అక్కితిమ్మనహళ్లి చెరువు– హాకీ స్టేడియంగా, సంపంగి చెరువు –కంఠీరవ స్పోర్ట్ కాంప్లెక్సా్గ, ధర్మాంబుధి చెరువు–కెంపేగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువు–కర్ణాటక గోల్ఫ్ మైదానంగా మారిపోయాయి. ►కోరమంగల చెరువు– నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్ మైదానం, సిద్దికట్టె చెరువు–కేఆర్.మార్కెట్‌గా, కారంజీ చెరువు–గాంధీ బజార్, కెంపాబుధి చెరువు–భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్‌గా మారిపోయాయి. ►నాగశెట్టిహళ్లి చెరువు– స్పేస్ డిపార్టుమెంట్, కాడుగొండనహళ్లి చెరువు–అంబేడ్కర్ మెడికల్ కాలేజీ, దుమ్మలూరు చెరువు–బీడీఏ లేఔట్, మిల్లర్స్ చెరువు–గురునానక్ భవన్ అయ్యాయి, ►సుభాష్ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు, మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయి. ►శివనహళ్లి చెరువు–క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయి. ►చెన్నమనచెరువు –స్మశానం, పుట్టేనహళ్లి చెరువు– జేపీ నగర 6వ ఫేజ్, జక్కరాయనచెరువు – క్రీడా మైదానం అయ్యింది. మారతహళ్లిలో బోటులో వెళ్తున్న జనం నగరానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్ సుమారు రూ.11 వేల కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో రూ.10 వేల కోట్ల నిధులు లభిస్తాయి. ఇలా ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లను బెంగళూరుపై ఖర్చు చేసినప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఒకనాటి పొలాలు, చిట్టడవులు మాయం ►అందుకే ఇంత ముప్పు! ప్రకృతిని కాపాడుకోకపోవడమే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించారు. ఇప్పుడు కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయి. ఏ ప్రాంతంలో ముందు చెరువు ఉండేది, ఎక్కడ రాజ కాలువ ఉండేది అనేదానిని ప్రస్తుత ముంపు చాటిచెబుతోందని పరిసరవాదులు అభిప్రాయపడ్డారు. రెయిన్ బో లేఔట్లో తీరని ముంపు కష్టం ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు
సాక్షి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు కాజ్‌వేల పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడంతో నిత్యావసరాలు, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్ రామన్నగూడెం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి మత్తడి పోస్తున్న లక్నవరం సరస్సు సరస్సులో నీటిపై తేలియాడుతున్నట్లుగా ఉన్న వంతెన కొండాయివద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు కొత్తగూడ: తాడు సాయంతో కత్తెర్ల వాగు దాటుతున్న వేలుబెల్లి గ్రామస్తులు వాజేడు: చింతూరుకు చెందిన మహిళ వైద్యం కోసం వెళ్తుండగా రోడ్డు దాటిస్తున్న యువకులు కోతకు గురైన నర్సింగాపూర్–బోర్లగూడెం ప్రధాన రహదారి కొత్తగూడెం: బూర్కపల్లి వాగు దాటుతున్న రామన్నగూడెం గ్రామస్తులు వాజేడు: భువనపల్లి–లక్ష్మీపురం రోడ్డుపై ప్రవహిస్తున్న వరద దొంగలగట్టు వాగు లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న నది మహాముత్తారం: గండికామారం రోడ్డుపై వరద ఉధృతి కాటారం: గంగారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు కోతకు గురైన నర్సింగాపూర్–మీనాజిపేట రహదారి బూర్గుపేట–లక్ష్మీదేవిపేట మధ్య మారేడుగొండ చెరువు ఉధృతి ఏటూరునాగారం: చెల్పాక రోడ్డుపై నాగులమ్మ ఒర్రె వరద -
ఎల్లెల్సీ ఆధునికీకరణతోనే జలచౌర్యానికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: కాలువలను ఆధునికీకరించడం ద్వారా జలచౌర్యానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసే దిశగా తుంగభద్ర బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) రాష్ట్ర సరిహద్దు వరకూ కర్ణాటక పరిధిలో 105.435 కి.మీ. పొడవునా ఆధునికీకరణ పనులను పూర్తి చేసింది. దీంతో ఏపీ సరిహద్దుకు హెచ్చెల్సీ ద్వారా 2,200 క్యూసెక్కులను సరఫరా చేసేలా కాలువ ప్రవాహ సామర్థ్యం పెరిగింది. సిమెంటు లైనింగ్ చేయడం వల్ల హెచ్చెల్సీలో జలచౌర్యానికి అడ్డుకట్ట పడింది. ఇదే తరహాలో ఎల్లెల్సీ (దిగువ కాలువ)ను ఆధునికీకరించడం ద్వారా జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో కర్ణాటక పరిధిలో 115 కి.మీ. వరకూ ఆధునికీకరించే పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2021–22, 2022–23లో 115 కి.మీ. నుంచి ఏపీ సరిహద్దు వరకూ 250.58 కి.మీ. వరకూ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రచించింది. తద్వారా రాష్ట్ర సరిహద్దుకు ప్రస్తుత డిజైన్ ప్రకారం 725 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తుంగభద్ర బోర్డు ఆమోదించింది. దీంతో కర్నూలు జిల్లాలో 1,51,134 ఎకరాలకు నీటిని అందించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జలచౌర్యంతో ఆయకట్టుకు కష్టాలు.. తుంగభద్ర జలాశయం దిగువ కాలువకు 43 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఇందులో కర్ణాటక వాటా 19 టీఎంసీలు.. ఏపీ వాటా 24 టీఎంసీలు. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువ 250.58 కి.మీ. వరకూ కర్ణాటక పరిధిలో ఉండగా 250.58 కి.మీ. నుంచి 324 కి.మీ. వరకూ రాష్ట్ర పరిధిలో ఉంది. కర్ణాటక వాటాపోనూ రాష్ట్ర సరిహద్దుకు 725 క్యూసెక్కులు చేరాలి. కానీ కర్ణాటక పరిధిలో రైతులు కాలువకు గండ్లు కొట్టడం, పైపింగ్ ద్వారా భారీ ఎత్తున జలచౌర్యం చేస్తుండటంతో రాష్ట్ర సరిహద్దుకు 400 నుంచి 450 క్యూసెక్కుల మేర కూడా చేరడం లేదు. దాంతో కర్నూలు జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. -
నాలాల దురాక్రమణపై హైకోర్టుకు వెళ్లండి..
సాక్షి, చెన్నై: హైదరాబాద్‌లో వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. నాలాలు, చెరువుల దూరాక్రమణల విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చెయాలని తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో భారీ వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణకు సంబంధించి జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆక్రమణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కిర్లాస్కర్ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు కావడం లేదని ఎన్జీటీకి విన్నవించారు. ఈ విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. దాంతో పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. (చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్జీటీ షాక్) -
ప్రమాదకర స్థాయిలో హైదరాబాద్ చెరువులు
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. భారీ వరదల నేపథ్యంలో బండ్ల గూడ చెరువు నిండిపోయింది. దీంతో అయ్యప్ప కాలనీ మునిగిపోవడంతో బండ్ల గూడ చెరువుకి గండి కొట్టడానికి అయ్యప్ప కాలనీ వాసులు వచ్చారు. అయితే గండికొడితే చెరువు కింద ఉన్న ఆరు కాలనీలు మునిగిపోతాయంటూ పలు కాలనీ వాసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఎల్బీనగర్ నగర్ పోలీసుల సహాయంతో వారు చెరువుకు గండికొడుతున్నారంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ మాట్లాడతూ, భాగ్యనగరంలో 185 చెరువులు ఉన్నాయని, చెరువులు అన్ని ఓవర్ ఫ్లో అవుతున్నాయని తెలిపారు. ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని వెల్లడించారు. సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో 15 టీమ్స్ ఏర్పాటు చేశామని, జోనల్ కమిషనర్ స్థాయి అధికారికి చెరువుల మరమ్మతుల కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసే అధికారం ఇచ్చినట్లు ప్రకటించారు. అక్కడికక్కడే చెరువుల మరమ్మతులు చేసేలా ఆదేశాలు జారీచేశామన్నారు. 53 చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయని, మరమ్మతులు పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. చదవండి: శాంతించవమ్మా.. గంగమ్మా -
నీటి నిర్వహణ కత్తిమీద సామే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వలకు గండ్లు పడుతున్నా... గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద గుంటూరు కాలువలో ఇంటర్మీడియట్ విద్యార్థి బి. విద్యాసాగర్(17) గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివీ.. తాడేపల్లి డొల్లాస్ నగర్‌కు చెందిన విద్యాసాగర్ ఆదివారం స్నేహితుతడు జగదీష్ పుట్టిన రోజు కావడంతో మరో ఏడుగురు స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ చినకాకానిలోని గుంటూరు కాలువ వద్దకు సరదాగా వెళ్లాడు. అక్కడ విద్యాసాగర్ ఫోటోలు కోసం కాలువలోకి దిగగా లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు అరుణ్ ప్రమాదంలో చిక్కుకోగా.. అక్కడే ఉన్న అయ్యప్ప మూలధారుల్లో ఒకరు వెంటనే కాలువలోకి దూకి అతడిని కాపాడారు. విద్యాసాగర్ గల్లంతు కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రివేళ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. -
చెరువులకు నీరు చేరేలా..!
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ పరిధిలో ఉండి.. ఇప్పటి వరకు నీరందని చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసిన సమయంలో వంద కిలోమీటర్ల ప్రధానకాల్వ పొడవునా గల 129 చెరువుల్లో వంద చెరువులకు ఏదో విధంగా ఎంతోకొంత నీరు చేరుతోంది. కాగా అసలే నీరు చేరని 29 చెరువులను గుర్తించి వాటికి మేజర్, మైనర్ కాల్వలపై తూములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఏఎమ్మార్పీ డివిజన్ పరిధిలో 29 చెరువులు నింపేలా తూములకు 13 పనులకుగాను రూ.74 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. 45 రోజుల్లో పనులు పూర్తి చేసి ఖరీఫ్ నాటికి తూములు సిద్ధం చేయనున్నారు. తూముల నిర్మాణాలతో రైతుల ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. గతంలో ఇలా.. ఏఎమ్మార్పీ ద్వారా పంటలకు నీరందక.. ఇటు చెరువులూ నిండక వదిలిన నీరెటుపోతుందో అర్థంగాక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడేవారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఏఎమ్మార్పీ కాల్వలను ఆరుతడికి పంటలకు మాత్రమే డిజైన్ చేసి తవ్వారు. ఏఎమ్మార్పీకి నీటి కేటాయింపులు సరిపడా లేనందున పూర్తి ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందించడం కష్టసాధ్యమవుతుంది. కనీసం చెరువులైనా నింపాలని ప్రజాప్రతినిధులు, రైతుల డిమాండ్ మేరకు అధికారులు నెల రోజులుగా ఆయకట్టు చెరువులన్నింటినీ పరిశీలించారు. ఏఎమ్మార్పీ కాల్వల నుంచి నీరు చేరని చెరువులను గుర్తించి ప్రత్యేకంగా తూముల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొత్తగా తూములు నిర్మించనున్న ప్రాంతాలు ఇవే.. ఏఎమ్మార్పీ పరిధిలోని డి–23 కాల్వపైన చెరువులకు నీటి విడుదలకుగాను కొత్తగా తూములు నిర్మించి చామలోనిబావి, పెద్దబావి కుంట, తాటి చెరువు, డి–25 మేజర్‌పై ఆప్టేక్ గేట్ నిర్మించి కొప్పోలులోని చింతలచెరువు, కొత్తకుంట, నడికూడ చెరువులను నింపనున్నారు. డి–22 కాల్వలో కొత్తగా నిర్మించే తూము వల్ల పిట్టలగూడెం వద్ద గల బలుచకుంట, చవుటకుంట నింపడానికి వీలుంటుంది. ఇదే మేజర్‌పై మరో రెండు చోట్ల తూములు నిర్మించి ఆమలూరు, బొల్లారం, గుర్రంపోడు గ్రామాల కుంటలను నింపనున్నారు. డి–37లో 23వ కిలోమీటరు వద్ద తూము నిర్మాణంతో మావిండ్ల వారికుంట, మోదుగులకుంట, వేములచెరువు, ఇదే కాల్వపై 8వ కిలోమీటరు వద్ద తూముతో మంచినీళ్ల బావి, పెద్ద చెరువు, 11వ కిలోమీటరు వద్ద తూముతో తిమ్మరాజుకుంట, కొండయ్యకుంట, అన్నయ్యకుంట, ఊరకుంటలకు నీరు చేరనుంది. 3వ కిలోమీటరు వద్ద తూముతో ముత్యాలమ్మ కుంట, యాదయ్య చెరువులకు నీరు చేరునుంది. ఒక చెరువు కింద గల మిగతా చెరువులు కూడా ఈ తూముల వల్ల నిండి ప్రయెజనం చేకూరుతుంది. భూసేకరణ సమస్య లేని చోటే తూములు మొదటి దశలో ఎలాంటి సమస్య లేకుండా చెరువులకు నీరు చేరే వీలున్న ప్రాంతాలను గుర్తించి కాల్వలపై తూము ఏర్పాట్లకు టెండర్లు పిలిచాం. 45రోజుల్లో పనులు పూర్తి చేయించి ఈ సారి నీటిని విడుదల చేయగానే చెరువులకు నీరు చేరేలా సిద్ధం చేస్తాం. ఏఎమ్మార్పీ ఆయకట్టులో నీరు చేరని చెరువులను పరిశీలించి ఎలాంటి వివాదాలు, భూసేకరణ సమస్య లేకుండా తాము ఇక్కడి నుంచి నీటిని చెరువులకు, కుంటలకు మళ్లించుకుంటామని రైతులు కోరిన చోట్ల తూములు ఏర్పాటు చేస్తున్నాం. మిగతా విడతల్లో మరికొన్నింటిని పరిశీలిస్తాం. – అజయ్‌కుమార్, డివిజన్ ఈఈ -
నాడు వెలవెల.. నేడు జలకళ
సాక్షి, అడవిదేవులపల్లి :మూడేళ్లుగా చెరువు కింద బీడుగా మారిన పొలాలు నేడు పంటలతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు నిండా జలకళ ఏర్పడి, తాగు, సాగుకు ఎంతో ఉపయుక్తంగా మారడంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని భాస్కర్‌రావు చెరువు 111.26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈచెరువు కింద 72 ఎకరాల వరిసాగు అవుతోంది. దశాబ్దాలుగా చెరువు నిండా మట్టి పూడిక ఏర్పడి అరకొరగానే నీల్లు నిలుస్తున్నాయి. దీంతో మూడేళ్లుగా చెరువు కింద ఉన్న భూములన్నీ బీళ్లుగా మారాయి. మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం ఈచెరువుకు రూ.51లక్షలు మంజూరు చేసింది. ఈనిధులతో చెరువు పూడికను తీసి ఆమట్టిని రైతులు తమ పొలాల్లో పోయించుకున్నారు. చెరువు మట్టికట్ట, రోలింగ్ చేశారు. తూముల మరమ్మతులు చేశారు. దీంతో చెరువు నిండి జలకళ ఏర్పడింది. చేతికి వస్తున్న పంటలు చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో రబీ సీజన్లో ఆలస్యంగానైనా రైతులు సాగు చేశారు. చెరువుల్లో నీళ్లు ఉన్నాయన్న భరోసాతో చెరువు కింద ఉన్న భూములన్నీ వరి సాగు చేశారు. రైతుల నమ్మకం వమ్ముకాలేదు. సీజన్ పొడవునా చెరువులో నీరు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. వరి పంటలు చేతి కొస్తున్నాయి. చెరువు కింద సాగు చేసిన భూముల్లో వరి కోతలు ప్రారంభించారు. చెరువులో నీరు వృథాగా పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చేపల వేటకు సైతం పడవలు, వలలే ఉపయోగించాలని రైతులు కోరుతున్నారు.చెరువులో జలకళ ఈవిధంగానే కొనసాగితే గ్రామంలో సాగుతో పాటుగా తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదన్న అబిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఆనందంగా ఉంది నాకు చెరువు కింద మూడు ఎకరాల పొలం ఉంది. చెరువులో నీరు లేకపోవడంతో గత మూడేళ్లుగా పొలాలను బీల్లుగానే ఉంచాం. మిషన్ కాకతీయ పథకంతో చెరువులో పూడిక తీయడం వలన భారీగా నీరు చేరింది. దీంతో వరి సాగు చేశాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా పంట చేతికి వచ్చింది. – మంత్రాల అశోక్‌రెడ్డి, రైతు -
ఉధృతంగా కొండవాగులు
పోలవరం: భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా పోలవరం మండలంలోని కొవ్వాడ, పేడ్రాల కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొవ్వాడ అధిక జలాలు అవుట్‌ఫాల్ స్లూయిస్ ద్వారా గోదావరి నదిలోకి తరలిపోతున్నాయి. అలాగే మండలంలోని ఎల్ఎన్డీ పేట వద్ద గల కొవ్వాడ రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. ఈ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 90.50 మీటర్లు కాగా, ఇప్పటి వరకు 84.30 మీటర్లకు నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో 450 క్యూసెక్కుల నీరు ఉందని, మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున రిజర్వాయర్ నిండుతుందని అధికారులు చెబుతున్నారు. తగ్గుతున్న వరద గోదారి పోలవరం: గోదావరి నదిలో వరద నీటిమట్టం క్రమేణా తగ్గుతోంది. పోలవరంలోని కడమ్మ స్లూయిస్ వద్ద నీటిమట్టం సోమవారం 9.23 మీటర్లకు తగ్గింది. ఆదివారం 9.46 మీటర్ల వరకు చేరిన నీటిమట్టం క్రమేణా తగ్గింది. పోలవరం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండలపై నుంచి వచ్చే నీరు కడెమ్మ స్లూయిస్ ద్వారా గోదావరి నదిలో కలిసిపోతోంది. ఎర్రకాలువ కళకళ.. జంగారెడ్డిగూడెం రూరల్: కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఎరుపెక్కింది. పేరును సార్థకం చేసుకుంది. వరద పోటెత్తినప్పుడు కాలువ రంగు మారడం సహజం. ప్రస్తుతం వర్షాలకు వరదనీరు కాలువలోకి వచ్చి చేరింది. దీంతో ఎర్ర రంగులో గంగమ్మ పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. గత వేసవిలో తెల్లటి స్వచ్ఛమైన రంగులో మెరిసిన కాలువ ఇప్పుడు వరదనీటితో కళకళలాడుతోంది. -
‘ఆయకట్టు’ ఆవేదన
సాక్షి, కొత్తగూడెం : కిన్నెరసాని రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ద్వారా పాల్వంచ, బూర్గంపాడు మండలాలకు సాగునీరందడంలేదు. నీటిపారుదల శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీపీఎస్ అవసరాల నిమిత్తం నిర్మించిన కిన్నెరసాని రిజర్వాయర్ ద్వారా రెండు మండలాల్లోని పదివేల ఎకరాలకు సాగునీరు అందించాలని.. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 డిసెంబరు 31న కాలువలకు శంకుస్థాపన చేశారు. ఎడమ కాలువ ద్వారా పాల్వంచ మండలంలోని యానంబైలు, పాండురంగాపురం, బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక, పినపాక పట్టీనగర్, అంజనాపురం, టేకులచెరువు, జింకలగూడెం, మోరంపల్లి బంజర గ్రామాల వరకు 7వేల ఎకరాలకు నీరందించేలా, కుడి కాలువ ద్వారా పాల్వంచ మండలంలోని పాయకారి యానంబైలు గ్రామం వరకు 3వేల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్ణయించారు. కాలువ దోమలవాగు చెరువులో కలిసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కాల్వల నిర్మాణం చేపట్టారు. రైతుల కోరిక మేరకు రాజశేఖరరెడ్డి సూచనతో బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, నాగినేనిప్రోలు గ్రామాలకు కూడా నీరందించేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు కాలువల పనులు పూర్తికాలేదు. నీటి సరఫరా కూడా సక్రమంగా చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి వస్తున్నారని ఒక్క రోజు వదిలారు ఎడమ కాలువ ద్వారా ఇప్పటివరకు ఒక్కసారి కూడా నీరు వదిలిన దాఖలాలు లేవు. గత ఏడాది మంత్రి హరీష్‌రావు వస్తుండడంతో మొక్కుబడిగా ఆ రోజు నీరు వదిలి చేతులు దులుపుకున్నారు. రాజన్న హయాంలో అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో లక్ష్మీపురం, నాగినేనిప్రోలు గ్రామం వరకు 4 కిలోమీటర్ల మేర కాలువ కోసం ఇప్పటివరకు భూసేకరణ సైతం చేయలేదు. మహానేత మరణానంతరం మళ్లీ పాత పద్ధతి ప్రకారం దోమలవాగులోనే కాలువ ముగిసేలా తంతు పూర్తి చేశారు. ఇప్పుడున్న కాలువ ద్వారా కూడా నీటిపారుదల చేస్తున్న దాఖలాలు లేవు. నీటిపారుదల అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. ఇక కొత్తగా వస్తున్న సీతారామ కాలువ 19.1(కిలోమీటర్) వద్ద కిన్నెరసాని కాలువను క్రాస్ చేసుకుంటూ వెళుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటరీ కాలువలు సీతారామ కాలువ కింద పోతున్నాయని, దీంతో కిన్నెరసాని నీరు వచ్చే అవకాశం లేదని బూర్గంపాడు మండల రైతులు గగ్గోలు పెడుతున్నారు. సీతారామ కెనాల్ క్రాసింగ్ వద్ద స్ట్రక్చర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సదరు కాలువ క్రాస్ చేస్తున్న 19.1 వద్ద కిన్నెరసాని నీరు పైనుంచి వెళ్లేవిధంగా ప్రత్యేక స్ట్రక్చర్ నిర్మించేందుకు నిర్ణయించాం. గత ఏడాది ఎడమ కాలువకు నీరివ్వడం ప్రారంభించగా ఈ ఏడాది నుంచి కొనసాగిస్తాం. దోమలవాగు వద్ద కిన్నెరసాని కాలువ ముగుస్తుంది. –వెంకటేశ్వరరెడ్డి, ఇరిగేషన్ ఈఈ -
..అయితే ఓకే!
కర్నూలు సిటీ: ఎక్కడైనా పాత పనులు పూర్తయిన తరువాత కొత్తవి మంజూరు చేయడం మనం చూస్తుంటాం. అలా కాకుండా కొత్త పనులు మంజూరు చేసుకుంటూ పోతే పాతవి పూర్తికాకపోగా..వాటిపై పర్యవేక్షణ కొరవడుతుంది. ఫలితంగా పనులు నాసిరకంగా కొనసాగే అవకాశం ఉంది. నీరు– చెట్టు పనుల్లో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఆదాయం పెంపు కోసమే అన్నట్లు ఈ పనులకు అనుమతులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా... చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలోని పూడికతీత, జంగిల్ క్లియరెన్స్‌కు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఒకే చెరువు కానీ, కుంట కానీ, వాగు పరిధిలోని పనులకు మొత్తంగా అంచనాలు వేసి టెండర్ల ద్వారా చేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఇంజినీర్లు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికార పార్టీ నేతలు ఈ విషయంపై సీఎం దగ్గర పంచాయితీ చేశారు. రూ.10 లక్షలలోపు నామినేషన్ కింద పనులను టీడీపీ అనుచరులకు కేటాయించేలా చేశారు. విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా.. ఒకే పనిని విభజించి పంచి పెట్టారు. ఆ తరువాత.. సాగునీటి కాలువల్లోని పూడికతీత, మరమ్మతులు సైతం నీరు–చెట్టు కింద చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో కేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర దిగువ కాల్వల పరిధిలోని మరమ్మతులు, పూడికతీతకు అంచనాలు వేసి, అనుమతులు తీసుకున్నారు. అయితే ఈ పనులే నేటికీ పూర్తి కాలేదు. తాజాగా కేసీ పరిధిలో మరో 174 పనులకు అనుమతులు తీసుకున్నారు. అయితే పనులు ఎక్కడ చేయాలో కూడా ఇంజినీర్లకు అర్థంకాని పరిస్థితులు ఉన్నాయి. ఒత్తిడి తెచ్చి.. కర్నూలు–కడప కాలువ.. 305.60 కి.మీ దూరం ప్రయాణిస్తూ.. 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది. కాలువ పూర్తి స్థాయి సామర్థ్యం 4500 క్యూసెక్కులు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 2500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఆయకట్టు అభివృద్ధి కోసమని నీరు–చెట్టు కింద 2016–17లో 240 పనులను రూ.19 కోట్లతో చేపట్టారు. వాటిలో 198 పూర్తి కాగా, 26 పురోగతిలో ఉన్నాయి. 2017–18 సంవత్సరంలో 734 పనులను రూ. 91.13 కోట్లతో చేపట్టగా.. 270 పూర్తి కాగా, 197 పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. పనులు అధిక శాతం ఆళ్లగడ్డ, నంద్యాల, మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోనే చేపట్టారు. మంజూరైన పనులే పూర్తి చేసేందుకు ఇంజినీర్లు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి చేసి రూ.17 కోట్లతో 174 పనులకు అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అనుమతులు ఇచ్చిన పనులు ఎక్కడెక్కడ చేయాలో తెలియక ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు మాత్రం అధికార పార్టీ నేతలు కోరిన పనులు చేసి పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు జల వనరుల శాఖలో చర్చ జరుగుతుంది. నా దృష్టికి రాలేదు కడప–కర్నూలు కాలువ పరిధిలో నీరు–చెట్టు కింద తాజాగా చేసిన ప్రతిపాదనలు నా దృష్టికి రాలేదు. అయితే కేసీ, కుందూ నదికి సంబంధించిన వాటిలో పూడికతీత పనుల ప్రతిపాదనల గురించి చూడాలని కేసీ ఇంజనీర్లకు సూచించాను. ప్రతిపాదించే పనులు అవసరమో లేదో విచారించేందుకు ఆర్డీఓలకు అప్పగించారు. అక్కడి నుంచి వచ్చాక చూస్తాం. – శ్రీరామ చంద్రమూర్తి, జలవనరుల శాఖ ఎస్ఈ -
‘మోటార్ల’పై నియంత్రణ!
సాక్షి, హైదరాబాద్: ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు కాల్వల పరిధిలోని మోటార్లను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లకు మంగళవారం నీటి పారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాల్వల పరిధిలోని 180 కి.మీ. మేర పో లీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పర్యవేక్షించాలని ఆదేశించింది. మోటార్ల పరిస్థితిని సమీక్షించి, తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎస్సారెస్పీ పరిధిలో 3 వేలకు పైగా మోటార్లు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరందటం లేదు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ పైఆయకట్టు పరిధిలో విద్యుత్ ను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
డిజైన్లే ఆమోదం కాలేదు
కీలక పనులకు దొరకని ఆమోదం పోలవరం పనులు నత్తనడక 2018 జూన్‌కు నీరు ప్రశ్నార్థకమే సాక్షి ప్రతినిధి, ఏలూరు 2018 జూన్ నాటికి గ్రావిటీపై కుడి, ఎడమ కాల్వలకు నీరు ఇస్తాం. దీని కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అందుకే 19 సార్లు ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం వచ్చాను. 40 సార్లు అమరావతి నుంచి రివ్యూ చేశాను.... ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా చేసిన ప్రకటన. అయితే ఇప్పటికీ 21 కీలకమైన పనులకు సంబంధించి డిజైన్లకు సెంట్రల్ వాటర్ కమిటీ (సీడబ్ల్యుసీ) నుంచి ఆమోదం రాలేదు. డిజైన్లు రాకుండా పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాంకేతిక ఇబ్బందుల వల్ల డిజైన్లు రావడంలో జాప్యం జరుగుతోంది. అసలు డిజైన్లే ఆమోదం పొందకుండా షెడ్యూల్ టైంలో ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నగా మారుతోంది. ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్‌వేకు సంబంధించి కూడా కొన్ని బ్లాక్‌లకు సంబంధించిన డిజైన్లకు ఆమోదం రాలేదు. స్పిల్‌వే పూర్తి అయితేగాని గేట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండదు. స్పిల్‌వే పనులు ప్రస్తుతం జరుగుతున్న వేగంతో చూస్తే వచ్చే డిసెంబర్ 31కి పూర్తి చేయడం అసాధ్యంగా కనపడుతోంది. స్పిల్‌వేకి 11.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం 2.06 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ మాత్రమే పూర్తి అయ్యింది. ఇంకా 9.55 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సి ఉంది. ప్రధానమైన ఈ పనికి సంబంధించే సుమారు తొమ్మిది డిజైన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. స్పిల్‌వే బ్లాక్2కు సంబంధించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్, సీఐఎఫ్ఆర్ఐ ఇచ్చిన నివేదికలను ఫైనల్ డిజైన్ కోసం పంపించారు. స్పిల్‌వే డీపర్ బ్లాక్26 కోసం పంపిన ప్రతిపాదనలు సీడబ్ల్యుసీ వద్ద పరిశీలనలో ఉన్నాయి. స్పిల్‌వేకు సంబంధించి సైడ్స్లోప్కు సంబంధించి జియలాజికల్ సర్వే, డిజైన్లు, రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలనేదానికి సంబంధించి న్యూఢిల్లీకి చెందిన ఈజిఈ కన్సల్టెంట్ తయారు చేస్తోంది. వీటిని బుధవారం సీడబ్ల్యుసీకి అందచేయాల్సి ఉంది. బ్లాక్50 డిజైన్లు సీడబ్ల్యుసీ పరిశీలనలో ఉన్నాయి. స్పిల్వేపైన నిర్మించే బ్రిడ్జికి సంబంధించిన డిజైన్లు ఢిల్లీకి చెందిన ఐసిసిఎస్ సంస్థ తయారు చేస్తోంది. డ్రైనేజి, సంప్‌వెల్ ఇతర ప్రతిపాదనలు సీడబ్ల్యుసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్పిల్‌వే కుడి, ఎడమ అబట్మెంట్స్ (ఆసరా కోసం నిర్మించే దిమ్మెలు), డివైడ్ వాల్స్, ట్రైనింగ్ వాల్స్ ఇంకా అమోదం పొందాల్సి ఉంది. రివర్ స్లూయిజ్ గేట్లకు సంబంధించి సీడబ్ల్యుసీ చేసిన సూచనలకు అనుగుణంగా రివైజ్డ్ డిజైన్ అనుమతి సీడబ్ల్యుసీ వద్ద పెండింగ్‌లో ఉంది. స్పిల్‌వేలో ఏర్పాటు చేయాల్సిన రేడియల్ గేట్స్‌ను అమర్చేందుకు కాంట్రాక్ట్ సంస్థ చెబుతున్న హైడ్రాలిక్ పద్ధతిపై సీడబ్ల్యుసీ కొన్ని వివరణలు కొరింది. ఇవి సమర్పించిన తర్వాత డిజైన్లు ఇస్తారు. ఇవి కాకుండా స్పిల్ఛానల్కు సంబంధించి, కాఫర్ డ్యాంకు సంబం«ధించి ప్రొఫెసర్ రమణ, ఫ్రొఫెసర్ రాజుల బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటన్నింటిని ముఖ్యమంత్రి వచ్చేవారం ఢిల్లీ పర్యటనలో కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు డిజైన్లు ఆమోదం పొందాల్సి వస్తుందని, అందువల్ల కొంత జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ డిజైన్లన్నీ సకాలంలో అమోదం పొందితేనే పనులు ముందుకు వెళ్తాయని, లేకపోతే జాప్యం తప్పదని చెబుతున్నారు. -
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం కాలువలకు మంగళవారం సాయంత్రం వరకు 5,500 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. సాయంత్రం మరో 500 క్యూసెక్కులు పెంచారు. దీనిలో నరసాపురం కాలువకు 1,501, జీ అండ్ వీ కెనాల్‌కి 732, ఉండి కాలువకు 1,406, ఏలూరు కెనాల్‌కి 855, అత్తిలి కాలువకి 399 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. సీలేరు నుంచి గోదావరికి నీటి విడుదల పెంచారు. మంగళవారం 728.92 క్యూసెక్కుల నీరు గోదావరికి చేరుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 10,100 క్యూసెక్కుల నీరు విడిచి పెడుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,800, సెంట్రల్ డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. -
ఎట్టకేలకు కదిలారు
- స్పందించిన నీటిపారుదల అధికారులు - పంట కాలువలకు నీటి విడుదల - ‘సాక్షి’ ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలు నీటిపారుదల శాఖలో కదలిక తెచ్చాయి. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి కాలువలకు సాగునీరు విడుదల చేయకుండా క్లోజర్ పనులు చేస్తున్న తీరుపై ‘సస్యశ్యామలంపై స్వార్థపు నీడ’, ‘ముందస్తు నీరు.. అందని తీరు’ శీర్షికలతో ఈ నెల 7, 10 తేదీల్లో ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. అమాత్యులు, వారి బంధుగణం, వందిమాగదులు వ్యక్తిగత స్వార్థంతో సామర్లకోట గోదావరి కాలువ, అమలాపురం - చల్లపల్లి, ఎదుర్లంక - కొమరగిరి, శానపల్లిలంక తదితర పలు పంట కాలువలకు సాగునీరు విడుదల చేయకుండా అడ్డుకట్టలు వేసి మరీ క్లోజర్ పనులు చేసుకుంటున్నారు. రైతులు ఎలా పోయినా ఫర్వాలేదు తమ పనులు పూర్తయిపోవాలనుకుంటున్న అధికార పార్టీ నేతలు, వారి వందిమాగదులు, కాంట్రాక్టర్ల స్వార్థాన్ని ఫొటోలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’ కథనాలు ప్రచురితమయ్యాక రైతుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు రావడంతో అధికారులు భయపడ్డారు. వాస్తవానికి ఈ ఖరీఫ్‌లో వారం రోజులు ముందుగానే పంటకాలువలకు నీటిని విడుదల చేశామమని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా ప్రకటించుకుని ఎక్కడికక్కడ ఏరువాక కూడా ఆర్భాటంగా చేపట్టారు. తీరా ఏరువాకకు సహితం పలు ప్రాంతాల్లో సాగునీరు లేకపోవడం, అదే సమయంలో ‘సాక్షి’ కథనాలు ప్రచురితమవ్వడంతో నాలుగు రోజుల క్రితమే అమలాపురం - చల్లపల్లి పంటకాలువకు నీరు విడుదల చేశారు. సామర్లకోట కెనాల్లో చేపడుతున్న వంతెన పనుల్లో ఒక అమాత్యుని కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందనే ఉద్దేశంతో అధికారులు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. సామర్లకోట కెనాల్లో వంతెన పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మరోపక్క ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, తిళ్లకుప్ప గ్రామాల రైతులు పంట విరామ హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో సమస్య జటిలమవుతుందన్న ఆందోళనతో ఇరిగేషన్ అధికారులు గురువారం జిల్లాలోని పలు పంటకాలువలకు నీరు విడుదల చేశారు. ప్రధానంగా రూ.2.50 కోట్లతో పనులు జరుగుతున్న సామర్లకోట పంటకాలువకు సహితం నీరు విడుదల చేశారు. సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో ప్రజలకు దాహార్తి తీరడంతోపాటు, పిఠాపురం బ్రాంచి కెనాల్, కాకినాడ రూరల్‌లో ఆయకట్టులో నీటి విడుదలకు సహకరించిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. -
సమయం లేదు మిత్రమా !
పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు చోట్ల రిటెయినింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది. జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్ శివారు నుంచి ఎర్త్‌వర్క్ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు కంటి‘తూడు’పు చర్యలే నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్ ఎం (ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో 2017–18 సంవత్సరానికి పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇదే తంతు ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్, స్లూయిస్ల అడుగు భాగంలో పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు. తూడు పనులు.. నీటి సంఘాలకే... ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు. అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి భీమవరం టౌన్ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్విడెక్టు నిర్మాణం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. -
జూన్ 1నుంచి కాలువలకు నీరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని కాలువలకు జూన్ 1నుంచి నీరు విడుదల చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఖరీఫ్ పంటకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూ సేకరణ తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 10లోగా నారుమడులు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇందుకు అనువుగా 7 నుంచి 10 టీఎంసీల వరకు సీలేరు జలాలను అదనంగా రప్పిస్తామని తెలిపారు. శివారు ప్రాంత భూములకు సమృద్ధిగా నీటిని అందించి జూన్ నెలాఖరు నాటికి జిల్లా అంతటా వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 15 నాటికి పనులు పూర్తి కావాలి చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తప్ప మిగిలిన ఇరిగేషన్ పనులన్నిటినీ జూన్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు కురిస్తే డెల్టా ఆధునికీకరణ పనులు చేయడం కష్టమవుతుందని, ఈలోగా ఎర్రకాలువ, నందమూరు అక్విడెక్ట్, ఎస్‌కేకేవైఆర్ వంటి ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. తాడిపూడి ఎత్తిపోతల కోసం సేకరించిన భూమిలో పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, వేస్తే తొలగిస్తామనే విషయాన్ని రైతులకు చెప్పాలని అన్నారు. ఆ భూములను సాగుకు పనికిరాకుండా గుంతలు తవ్వాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. శేషావతారం చానల్ నుంచి జూన్ 15 నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. జూన్ 5 నాటికి పోణంగి పుంత పనులు పూర్తి చేయాలని కోరారు. లబ్బీపేట స్లూయిజ్ 19 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో పాతబడిన లాకుల షట్టర్లను తొలగించి కొత్తవి వేయాలని, వచ్చే మంగళవారం ప్రతి ప్రాంతానికి వెళ్లి తాను చూస్తానని అన్నారు. ఎక్కడైనా పాత షట్టర్లు కనిపించినా, పనులు కాకున్నా చర్యలు తప్పవని శెట్టిపేట డ్రెయినేజీ ఈఈ శ్రీనివాసరావును హెచ్చరించారు. హైవేను పొడిగించండి జాతీయ రహదారి–65ను కొవ్వూరు నుంచి నరసాపురం వరకు పొడిగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మలను కలెక్టర్ ఆదేశించారు. దీనివల్ల జాతీయ రహదారులకు కనెక్టివిటీ వస్తుందన్నారు. -
ఎన్నాళ్లీ ఎక్కిళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తప్పేట్టు లేదు. కాలువలకు నీటి విడుదల గడువు పొడిగించినా జిల్లాలోని అన్ని చెరువులు పూర్తిగా నిండలేదు. ఫలితంగా ఈ వేసవిలో నీటి అవసరాలు తీరే అవకాశం కనిపించటం లేదు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతో నీరు భారీగా ఆవిరయ్యే పరిస్థితి ఉంది. దీనికి తోడు వాడకం కూడా పెరుగుతుంది. బుధవారం నుంచి కాలువలు మూసివేస్తున్నారు. 45 రోజులపాటు కాలువలకు నీటి సరఫరా ఉండదు. ఈ దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. డెల్టా ప్రాంతంలో 441 మంచినీటి చెరువులు ఉండగా.. అందులో 426 చెరువుల్ని నింపామని, మిగిలిన చెరువుల్లోనూ నీరు నింపేందుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే చాలా చెరువుల్లో 70 నుంచి 80 శాతం వరకే నీరు నిండింది. మరోవైపు గ్రామాల్లోని జనాభాతో పోలిస్తే చెరువులు తక్కువ సామర్థ్యంతో ఉండటంతో 45 రోజులపాటు నీటిని అందించే పరిస్థితి లేకుండాపోతోంది. కాలుష్యం కాటు చెరువులు పూర్తిగా నిండకపోవడం ఒక సమస్య అయితే.. చాలాచోట్ల నీరు కలుషితమై రంగు మారుతోంది. ఉంగుటూరులో చెరువులో నీరు నిండుగా ఉన్నా రంగు మారిందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. చెరువుల్ని ఆరబెట్టకుండా నీటితో నింపారు. ఫలితంగా జలాలు కలుషితమవుతున్నాయి. నీళ్లు పసర్లెక్కి చెత్తా చెదారంతో నిండుతున్నాయి. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ పూర్తిగా పాడైపోయాయి. అందువల్ల నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. పోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో నీటికొరతను ఎదుర్కొనేందుకు వేసవిలో ఒక్కపూట మాత్రమే కుళాయిల ద్వారా నీరు సరఫరా చేసేవారు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి తలెత్తేలా ఉంది. ఆచంట ప్రాంతంలో వేసవికి ముందే తాగునీటి ఎద్దడి తలెత్తింది. ఆచంట, పెనుమంచిలి, ఎ.వేమవరం, శేషమ్మచెరువు గ్రామాలకే తాగునీరు సరఫరా చేస్తున్నారు. అదికూడా కలుషితం కావడంతో వాడకానికి మాత్రమే వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంబడి ఉన్న పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం గ్రామాల్లో బోర్లు పడని పరిస్థితి. ఫలితంగా ఆ గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో బోర్లు పని చేయడం లేదు. ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి మంచినీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొల్లేరు గ్రామాల్లోని చెరువుల్లో నింపిన నీరు 15 నుంచి 20 రోజులకే రంగు మారుతుండటంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. గుండుగొలను సమగ్ర మంచినీటి పథకం ద్వారా 20 వేల మందికి మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా కొల్లేరు శివారున ఉన్న చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాలకు నేటికి నీరు చేరడం లేదు. కొంతకాలం క్రితం పైపులైన్ ధ్వంసం కావడంతో కోరుకల్లుకు నీరందటం లేదు. భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తుందుర్రు, చినఅమిరం, కొమరాడ, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, లోసరి తదితర 25 గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లో నీళ్లు నింపినా వారం రోజులకే ఇంకిపోతోంది. గ్రామాల్లో జనాభాకు సరిపడా విస్తీర్ణంలో రక్షిత మంచినీటి చెరువులు లేకపోవడంతో ఏటా వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే నీటిఎద్దడి నుంచి గ్రామీణ ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది.