కొవ్వాడ అవుట్‌ఫాల్ స్లూయిస్ నుంచి గోదావరి నదిలోకి తరలిపోతున్న అధిక జలాలు
పోలవరం: భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా పోలవరం మండలంలోని కొవ్వాడ, పేడ్రాల కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొవ్వాడ అధిక జలాలు అవుట్‌ఫాల్ స్లూయిస్ ద్వారా గోదావరి నదిలోకి తరలిపోతున్నాయి. అలాగే మండలంలోని ఎల్‌ఎన్‌డీ పేట వద్ద గల కొవ్వాడ రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. ఈ రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 90.50 మీటర్లు కాగా, ఇప్పటి వరకు 84.30 మీటర్లకు నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో 450 క్యూసెక్కుల నీరు ఉందని, మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున రిజర్వాయర్ నిండుతుందని అధికారులు చెబుతున్నారు.
తగ్గుతున్న వరద గోదారి
పోలవరం: గోదావరి నదిలో వరద నీటిమట్టం క్రమేణా తగ్గుతోంది. పోలవరంలోని కడమ్మ స్లూయిస్ వద్ద నీటిమట్టం సోమవారం 9.23 మీటర్లకు తగ్గింది. ఆదివారం 9.46 మీటర్ల వరకు చేరిన నీటిమట్టం క్రమేణా తగ్గింది. పోలవరం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండలపై నుంచి వచ్చే నీరు కడెమ్మ స్లూయిస్ ద్వారా గోదావరి నదిలో కలిసిపోతోంది.
ఎర్రకాలువ కళకళ..
జంగారెడ్డిగూడెం రూరల్: కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఎరుపెక్కింది. పేరును సార్థకం చేసుకుంది. వరద పోటెత్తినప్పుడు కాలువ రంగు మారడం సహజం. ప్రస్తుతం వర్షాలకు వరదనీరు కాలువలోకి వచ్చి చేరింది. దీంతో ఎర్ర రంగులో గంగమ్మ పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. గత వేసవిలో తెల్లటి స్వచ్ఛమైన రంగులో మెరిసిన కాలువ ఇప్పుడు వరదనీటితో కళకళలాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment