పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం కాలువలకు మంగళవారం సాయంత్రం వరకు 5,500 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. సాయంత్రం మరో 500 క్యూసెక్కులు పెంచారు. దీనిలో నరసాపురం కాలువకు 1,501, జీ అండ్ వీ కెనాల్‌కి 732, ఉండి కాలువకు 1,406, ఏలూరు కెనాల్‌కి 855, అత్తిలి కాలువకి 399 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. సీలేరు నుంచి గోదావరికి నీటి విడుదల పెంచారు. మంగళవారం 728.92 క్యూసెక్కుల నీరు గోదావరికి చేరుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 10,100 క్యూసెక్కుల నీరు విడిచి పెడుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,800, సెంట్రల్ డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు.