కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం' | Innovative service program at Ganapavaram Government Degree College | Sakshi
Sakshi News home page

కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'

Published Mon, Dec 23 2024 4:34 AM | Last Updated on Mon, Dec 23 2024 12:26 PM

Innovative service program at Ganapavaram Government Degree College

 పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినూత్న సేవా కార్యక్రమం

ప్రతి నెలా 3వ మంగళవారం విద్యార్థుల నుంచి బియ్యం సేకరణ 

కళాశాలలో 300 మంది వరకు విద్యార్థులు 

నెలనెలా 100–120 కేజీల వరకు సేకరణ 

5 కేజీల చొప్పున ప్యాకింగ్‌ చేసి పేదలకు అందజేస్తున్న విద్యార్థులు 

రెండున్నరేళ్లుగా నిరాటంకంగా నిర్వహణ

నెలలో మూడో మంగళవారం వచ్చిoదంటే..భుజాన పుస్తకాల బ్యాగే కాదు.. ప్రతి విద్యార్థి చేతిలోని బాక్సు నిండా ఇంటి వద్ద నుంచి బియ్యం నింపుకొని కాలేజీకి తెస్తారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వాటిని పోస్తారు.

వచ్చిన బియ్యం మొత్తాన్ని మూడు నుంచి ఐదు కేజీల చొప్పున ప్యాకెట్లుగా చేసి వాటిని పేదలకు అందజేసి వారి ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. 

హ్యాండ్‌ ఫుల్‌ ఆఫ్‌ రైస్‌ (గుప్పెడు బియ్యం) పేరిట రెండున్నరేళ్లుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.   
– సాక్షి, భీమవరం

విద్యార్థుల్లో మానవత్వం పెంపుదల.. 
కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉండగా వాటిలో 300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. విద్యతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, రెడ్‌క్రాస్‌ సంబంధిత సేవా కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రాధాన్యమిస్తుంటారు. అందులో భాగంగానే 2022లో ‘దోసెడు బియ్యం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా­రు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం భాగం ఇతరులకు ఇవ్వడం, విద్యార్థుల్లో మానవత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 

ప్రతి విద్యా­ర్థీ నెలలో నిర్ణీత రోజున తమ ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యాన్ని తెచ్చి కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వేస్తే.. సేకరించిన మొత్తాన్ని అవసరమైన నిరుపేదలకు అందించాలి. ప్రతినెలా మూడో మంగళవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైనా నెలలో ఆ రోజు సెలవు వస్తే ముందురోజున లేదా మరుసటి రోజున అమలు చేస్తున్నారు. 

నెలకు దాదాపు 100 నుంచి 120 కేజీల వరకు బియ్యం వస్తుండగా, వాటిని మూడు నుంచి ఐదు కేజీల వరకు బ్యా­గు­లుగా ప్యాక్‌ చేసి గ్రామంలోని మార్కెట్‌ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.నిర్మలకుమారి నేతృత్వంలో వైస్‌ ప్రిన్సిపల్‌ పి.మధురాజు, కామర్స్, బోటనీ లెక్చరర్లు బి.రాణిదుర్గ, డాక్టర్‌ సీహెచ్‌ చైతన్యల పర్యవేక్షణలో రెండున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

మూడో మంగళవారం వచ్చిందంటే చాలు తమకంటే ముందే తమ పేరెంట్స్‌ బాక్సులో బియ్యం పోసి సిద్ధం చేయడం ద్వారా ఇప్ప‌టికే తమ కళాశాలలో చేస్తున్న ఈ సేవలో భాగస్వాములయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. మిగిలినచోట్ల విద్యార్థులు ప్రయత్నిస్తే ఒక పెద్ద సేవగా మారుతుందని వారు ఆశిస్తున్నారు.  

ఆనందంగా అనిపిస్తుంది 
ప్రతినెలా విద్యార్థుల­మంతా కలసి బియ్యం తె­చ్చి పేదలకు పంచడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ హ్యాండ్‌ ఫుల్‌ ఆఫ్‌ రైస్‌ ప్రోగ్రాం మరింత విస్తరించి ప్రతి ఒక్కరూ ఇతరులకు పంచే సేవ చేయటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.     
– పి.హర్షిత, బీకాం సెకండియర్‌ 

బియ్యం ఇచ్చి పంపుతారు 
నెలలో మూడో మంగళవారం వచ్చి0దంటే చాలు కాలేజీకి ఈ­రో­జు బియ్యం తీసుకువెళ్లాలి ఇవిగో అంటూ బాక్సులో పోసి పేరెంట్స్‌ పంపిస్తుంటారు. మా స్టూడెంట్సే కాదు మా పేరెంట్స్‌ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.  
– కె.జాయ్, బీకాం కంప్యూటర్స్, సెకండియర్‌

మార్పుకోసం చిన్న ప్రయత్నం 
ఇది కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదు. పేదరికాన్ని తగ్గించేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు, సమాజంలో మార్పు కోసం మా విద్యార్థులు చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు అప్పగించడచాలా ఆనందంగా ఉంది.   
– బి.రాణి దుర్గ, కామర్స్‌ లెక్చరర్‌  

పంచే గుణాన్ని అలవాటు చేసేందుకు 
తమకు ఉన్న దానిలో ఇతరులకు కొంచెం పంచే గుణాన్ని విద్యార్థులకు అలవాటు చేయ­డం హ్యాండ్‌ ఫుల్‌ ఆఫ్‌ రైస్‌ ము­ఖ్య ఉద్దేశం. మా కళాశాలలో ప్రి­న్సి­పల్‌ నిర్మలకుమారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. 
– డాక్టర్‌ సీహెచ్‌ చైతన్య, బోటనీ లెక్చరర్‌ 

విద్యతో పాటు విలువలు 
మా కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో మంచి విలువలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. పేద­వారి ఆకలిని తీర్చడంలో ఉండే సంతృప్తిని వారు ఆనందిస్తు­న్నా­రు. ప్రతినెలా అందరూ ఎంతో ఉత్సాహంగా హ్యాండ్‌ ఫుల్‌ ఆఫ్‌ రైస్‌ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.  
– డాక్టర్‌ పి.నిర్మలాకుమారి, ప్రిన్సిపల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement