పూజల సందర్భంగా నదికి అర్పించే కురిడీ కొబ్బరి కాయలు
కురిడీ కాయను నదులకు అర్పించడం ఉత్తరాది సంప్రదాయం
రికార్డు స్థాయిలో పెరిగిన కురిడీ కొబ్బరి ధర
గండేరా రకం వెయ్యి కాయలు రూ.20 వేలు
ఇప్పటివరకూ ఇదే అతి ఎక్కువ ధర
2016లో రూ.18 వేలు
తమిళనాడు, కేరళ నుంచి తగ్గిన ఎగుమతులు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది.
పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.
ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర
2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్‌లో ఊహించని ధర వచ్చింది.
– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట
Comments
Please login to add a commentAdd a comment