అన్నదాతకు అండగా ప్రభుత్వం | the government stands by the rice donors | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అండగా ప్రభుత్వం

Published Tue, Dec 5 2023 6:29 AM | Last Updated on Tue, Dec 5 2023 6:29 AM

the government stands by the rice donors - Sakshi

సాక్షి, అమరావతి: వరి పంట కోతల సమయమిది. రాష్ట్రంలోని రైతులు పంట కోసం, కల్లాల్లో, రోడ్ల పైన ఆరబెట్టారు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం మిచాంగ్‌ తుపాను ప్రభావం మొదలవడంతో రైతాంగం వణికిపోయింది. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించి, పలు ఆదేశాలు జారీ చేశారు.

ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. గ్రామాల్లో రైతులు కల్లాలు, రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. నిబంధనలను సైతం సడలించి ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకే కొంటోంది. వెనువెంటనే మిల్లులకు తరలిస్తోంది. కేశవరావు లాంటి వేలాది రైతులను ఆదుకుంటోంది. గడిచిన 48 గంటల్లో ఏకంగా 1.07 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని తరలిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు చేర్చింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 75 వేల మంది రైతుల నుంచి రూ.1,211.49 కోట్ల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 55 వేల మంది రైతులకు సుమారు రూ.750 కోట్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది.

అత్యవసర నిధి కింద జిల్లాకు రూ.కోటి 
తుపాను నేపథ్యంలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆన్‌లైన్‌ ద్వారా సాంకేతికంగా వివరాల నమోదులో కొంత జాప్యం జరుగుతుంది. ఈలోగా వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా ఆఫ్‌లైన్‌లో కొనేలా నిబంధనలను సడలించింది. దీనిని మరింత వేగంగా చేపట్టేందుకు అత్యవసర నిధుల కింద అవసరమైన జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది. ఈ నిధులతో కలెక్టర్లు మిల్లర్లు పంపించే వాహనాలకు తోడు ఎక్కడికక్కడ ప్రైవేట్‌ వాహనాలను బుక్‌ చేసి ధాన్యం బస్తాలను శరవేగంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. 

కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షణ
విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల సంస్థ ఎండీ, జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఎంలు, తహసీల్దార్లు కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ, మండల, ఆర్బీకేల్లో ప్రత్యేక అధికారులను సైతం నియమించి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలిస్తున్నారు. తుపాను సమయంలో రైతులు పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని మార్కెట్‌ యార్డుల్లో భద్రపరుస్తున్నారు. 

అంబేడ్కర్‌ కోనసీమలో అత్యధికంగా..
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా ఆన్‌లైన్‌లో 96,965 టన్నులు, ఆఫ్‌లైన్‌లో 48వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఆదివారం ఒక్కరోజే 40 వేల టన్నులకుపైగా కొనడం విశేషం. మాన్యువల్‌గా పుస్తకంలో రైతుల ధాన్యం వివరాలను నమోదు చేసుకుని మిల్లులకు తరలిస్తున్నారు. తేమ 18 శాతం ఉన్నప్పటికీ మిల్లర్లు సహకరిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 2.40 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా ఇప్పటికే 1.43 లక్షల టన్నులు కొనుగోలు చేశారు.

అమలాపురం, కొత్తపేట డివిజన్లలో పంట కోతలకు సమయం ఉంది. ఆలమూరు, మండపేట, రాయవరం ప్రాంతాల్లో మొత్తం ధాన్యాన్ని తుపాను ప్రభావం కంటే ముందే సేకరించారు. ఇప్పుడు మద్దతు ధర ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో  రైతుల వివరాలను వేగంగా ఆన్‌లైన్‌ చేస్తూ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీవో)లు జనరేట్‌ చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం ఎస్‌. సుధా సాగర్‌ చెప్పారు. ఇప్పటివరకు రైతులకు మద్దతు ధరకు సుమారు 15 వేల టన్నులకుపైగా ఎఫ్‌టీవోలు ఇచ్చామన్నారు.

‘14 ఎకరాల పంట. ఈసారి బాగా పండటంతో 30 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. యంత్రంపై కోయడంతో ధాన్యం పచ్చిగా ఉందని కల్లాల్లో ఆర­బెట్టాను. చివరికొ­చ్చే­సరికి తుపాను భయం పట్టుకుంది. వాతావ­రణం ఒక్కసారిగా మారిపో­యింది. వర్షం పడితే ఎలా అనుకుంటున్న దశలో అధికా­రులు వచ్చారు. కంప్యూటర్‌లో ఎక్కించాల్సిన అవసరంలేదని, లోడును వెంటనే పక్కనున్న మిల్లు­లకు పంపించేద్దామని చెప్పా­రు. కూలీలను పిలిపించారు. గోతాల్లోకి నింపి.. నా ట్రాక్టర్‌­లోనే ఆదివారం రాత్రి పంటను తీసుకెళ్లి మిల్లు­లో అప్పజెప్పాను. లేకుంటే సోమ­వా­రం కురిసిన చినుకులకు చేతికొచ్చి­న లాభం తడిసిపోయేది’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరుకు చెందిన కౌలు రైతు శీర్ల వెంకట కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రత్యేక ఏర్పాట్లతో వర్షంలోనూ తరలింపు

► కృష్ణా జిల్లాలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా, రవాణా వాహనాలపై కప్పేందుకు వీలుగా 700కుపైగా టార్పాలిన్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. తేమ శాతం నిబంధనలను సైతం పక్కనబెట్టి 20 వేల టన్నులకుపైగా ధాన్యాన్ని సేకరించింది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉండటంతో వెంటనే గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని డ్రయర్‌ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తోంది.

► ఏలూరు జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 10 వేల టన్నులు తరలించగా సోమవారం వర్షంలోనూ ధాన్యం సేకరణ కొనసాగింది. అయితే తుపాను భయంతో కొంత మంది రైతులు కోతలు చేపడుతున్నారు. మరికొంద­రు కోసిన ధాన్యాన్ని ఇళ్లలో, షెడ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ఆరబోసుకుని విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నట్టు జిల్లా పౌర­సరఫ­రాల శాఖ డీఎం భార్గవి తెలిపారు. వర్షాల్లో కోత మంచిది కాదని, తమ సిబ్బంది సహాయంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో లక్ష టన్నులకు పైగా ధాన్యం సేకరించామన్నారు.

► పశ్చిమ గోదావరి జిల్లాలో కోతలు కోసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని దాదాపు మొత్తం సేకరించారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకూ వాహనాల్లో తరలించారు. ఆ ఒక్కరోజే సుమారు 24,000 టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అక్కడక్కడా మిగిలిన స్వల్ప మొత్తం ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 90 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తవగా 1.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం శివరామ్‌ చెప్పారు. ఇందులో 1.30 టన్నులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశామన్నారు. 

► తూర్పు గోదావరి జిల్లాలో 6,367 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జేసీ తేజ్‌భరత్‌ తెలిపారు. ఇక్కడ అత్యధికంగా బహిరంగ మార్కెట్‌కు తరలిపోగా ఆర్బీకేల ద్వారా 15,272 మంది రైతుల నుంచి 1,04,917  టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు.

► ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావం పెద్దగా లేదు. విజయనగరం జిల్లాలో నూర్పిడి చేసిన ధాన్యం 1,242 టన్నుల వరకు ఉంది. దీనిలో 440 మెట్రిక్‌ టన్నులు సోమవారం ఆఫ్‌లైన్‌లో కొన్నారు.  మంగళవారం మరో వెయ్యి టన్నులు కొనుగోలు చేయనున్నారు. శ్రీకాకుళంలో 700, పార్వతీపురం మన్యంలో 500 టన్నులు కొనుగోలు చేశారు.

► కాకినాడ జిల్లాలో కల్లాల్లో, రోడ్లపై ఉన్న 23 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అల్లూరి సీతారామ­రాజు జిల్లాలోనూ దేవీపట్నం, గంగవరం ప్రాంతాల్లో 300 టన్నులు కొన్నారు.

ఆఫ్‌లైన్‌లో ఆదుకున్నారు..
నేను సొంతంగా, కౌలు­కు కలిపి 70 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు వచ్చింది. ఆఫ్‌లైన్‌లో ఆదివారం 240 బస్తాలు ఆర్బీకేలో విక్రయించాను. ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసే అవకాశమున్నందున తేమ శాతం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం సవరించి కొనుగోలు చేయడం హర్షణీయం.– సేవా సత్యనారాయణ, లొల్ల గ్రామం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

తేమతో సంబంధం లేకుండా..
ఒక్క రోజు ఆలస్యమైనా పంట మొత్తం వర్షార్పణమయ్యేది.  చాలా ఇబ్బందులు పడేవాడిని. సకాలంలో అధికారుల సాయంతో నాలుగు ఎకరాల ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా నేరుగా మిల్లుకే చేర్చాను. ఫలితంగా 10 టన్నుల ధాన్యాన్ని నష్టపోకుండా ఒబ్బి చేసుకోగలిగా.  – చిటికెన పెద సత్యనారాయణ, వడలి, పశ్చిమగోదావరి జిల్లా

కోతలు వాయిదా వేయండి
రైతులు వరికోతలను నాలుగు రోజులు వాయిదా వేస్తే మంచిది. వర్షాల సమయంలో పం­ట కోస్తే తడి ఆరక తేమ పెరిగిపోతుంది. త్వరగా మొల­కలు వచ్చి ధాన్యం దెబ్బతింటుంది. కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే వాటిని డ్రయర్‌ సౌక­ర్యం ఉన్న మిల్లులకు వర్షంలోనూ ప్రత్యేక జాగ్రత్తల నడుమ తరలిస్తున్నాం. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల్లో తీసుకునేలా అవకాశం కల్పిస్తాం.     – హెచ్‌.అరుణ్‌ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ

కల్లాల్లో స్వల్పంగానే..
తుపాను హెచ్చరికలతో వర్షం రాక ముందే ధాన్యాన్ని మిల్లు­లకు తరలించేశాం. ఇంకా అక్కడక్కడా కొద్దిగా ఉంది. దానిని కూడా తరలిస్తాం. కొందరు రైతులు ఆదివారం కూడా యంత్రంపై కోతలు ఎక్కువగా చేశారు. వాటిల్లో చాలా వరకు కొనుగోలు చేశాం. తేమ శాతం ఎక్కువ ఉంటే రైతులకు నష్టం జరగకుండా మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాల్లో ధాన్యం లోడును తరలించాలని కలెక్టర్లకు చెప్పాం.    – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ

ప్రభుత్వ చొరవ కాపాడింది
ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. పంటను మిషన్‌తో కోయించి, ధాన్యం రోడ్డుపై రాశి పోశాను.  తుపాను కారణంగా వర్షం పడుతుందని బరకాలతో కప్పి ఉంచాను. లేదంటే వర్షానికి ధాన్యం తడిసిపోయేది. జేసీగారు వచ్చి మా ధాన్యాన్ని వెంటనే మిల్లుకు పంపించారు. తేమ ఎక్కువ ఉంటే మిల్లరు ధాన్యంలో కోత వేస్తారు. కానీ, ధాన్యంలో ఎటువంటి కోతా పెట్టలేదు. ప్రభుత్వం తీసుకున్న చొరవే నన్ను కాపాడింది  – వాసంశెట్టి అర్జునరావు, గొడ్డటిపాలెం, కాకినాడ జిల్లా

మద్దతు ధర నష్టపోకుండా..
ఎకరాకు 30 బస్తాల పైనే దిగుబడి వచ్చింది. ఈ లోగా తుపాను భయపెట్టింది. ప్రైవేటుగా అమ్మేందుకు ప్రయత్నించా. మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు అడిగారు. ఇంతలోనే వానలు మొదలయ్యాయి. ధాన్యం నిల్వ చేయడానికి సరైన గిడ్డంగులు లేవు. తక్కువకు అమ్మితే బాగా ఆదాయం పోతుందని బాధ పడ్డాను. ఆర్బీకేలో చెబితే ఆఫ్‌లైన్‌లో నా 220 బస్తాల ధాన్యం కొని, మిల్లుకు తరలించారు. పూర్తిగా మద్దతు ధర వస్తుందని వీఏఏ చెప్పారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పంచిరెడ్డి రమణ, గండువల్లిపేట, నరసన్నపేట 

నిబంధనలు సడలించి ఆదుకున్నారు
తుపాను హెచ్చరికలతో పంట కోత కోయించాను. ఆర్‌బీకే వాళ్లు తేమ 22 శాతం ఉందన్నారు. మద్దతు రేటు రాదేమో అనుకున్నా. కానీ ప్రభుత్వం నిబంధనలు మార్చి మేలు చేసింది. తేమ శాతం ఎక్కువ వచ్చినా మద్దతు ధర దక్కేలా చేసింది. కోత చేసిన 495 సారలు (40 కిలోల బస్తాలు) ఆదివారం ముసురులోనే ధాన్యం కాటా వేయించి లారీల్లో పంపించారు.     – సాగి కోటేశ్వరరావు, కౌలురైతు, పునాదిపాడు, కృష్ణాజిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement