AP: పండగపూట సరుకుల్లేవ్‌! | The coalition government is reducing the goods distributed on subsidy | Sakshi
Sakshi News home page

AP: పండగపూట సరుకుల్లేవ్‌!

Published Sat, Oct 12 2024 3:49 AM | Last Updated on Sat, Oct 12 2024 7:10 AM

The coalition government is reducing the goods distributed on subsidy

నెలవారీ రేషన్‌లో నిత్యావసరాలు మాయం

పేదలకు కనీసం కందిపప్పు కూడా ఇవ్వని ప్రభుత్వం 

ఇప్పటికే గోధుమ పిండికి మంగళం 

బియ్యం మాత్రమే ఇచ్చి పండుగ చేసుకోండి అంటున్న ప్రభుత్వం 

ఆ బియ్యం కూడా సగానికి పైగా కార్డుదారులకు కేంద్రం ఉచితంగా ఇచ్చేవే..  

సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘కోతల పర్వం’ నడుస్తోంది. పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను కూటమి ప్రభుత్వం కుదించేస్తోంది. ఎన్నికలకు ముందు రేషన్‌ షాపుల్లో 18 రకాల సరుకులను ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు... అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కొక్కటిగా తగ్గించేస్తున్నారు. 

ఇప్పటికే గోధుమ పిండి సరఫరాకు మంగళం పాడేశారు. కందిపప్పును కూడా అటకెక్కించారు. కేవలం బియ్యం పంపిణీ చేసి పేదలను పండుగ చేసుకోండని చెబుతున్నారు. వాస్తవానికి ఆ బియ్యంలో కూడా సగానికి పైగా కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఉచితంగా ఇస్తోంది. అంటే... కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొర పంచదార మినహా సొంతంగా పేదలకు పంపిణీ చేసిందేమీ లేదు.   

మూడు నెలల్లో ఇచ్చిన కందిపప్పు 249 టన్నులే... 
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్‌లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై రేషన్‌ కార్డులు ఉండగా, గడిచిన మూడు నెలల్లో కేవలం 2శాతం.. అంటే 2.50లక్షల కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందింది. మొత్తం కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, మూడు నెలల్లో ఇచ్చింది 249 టన్నులు మాత్రమే కావడం గమనార్హం.    

పండుగ వేళ ప్రచారం ఎక్కువ.. పంపిణీ తక్కువ 
సెపె్టంబర్‌ నెలలో వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ రేషన్‌లో కందిపప్పు పంపిణీ చేయలేదు. అదే సమయంలో అకాల వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మూడు నెలలుగా ఇసుక దొరక్క... పనులు లేక సుమారు 45లక్షల మంది భవన నిర్మాణ కారి్మకుల కుటుంబాలు పస్తులుండే దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో రూ.160 నుంచి రూ.220 వరకు వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

దీంతో ప్రభుత్వం కంటితుడుపుగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కందిపప్పు పంపిణీని ప్రారంభించింది. కానీ, 11 రోజుల్లో 1.19 కోట్ల మంది కార్డుదారులు బియ్యం తీసుకుంటే... కేవలం 21.70లక్షల కార్డులకు మాత్రమే కందిపప్పు పంపిణీ చేసింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు మాత్రం పండుగ వేళ ఇప్పుడే కొత్తగా కందిపప్పు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.   

బాబు హయాంలో ఇది కొత్తేమీ కాదు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపివేయడం కొత్తేమీ కాదు. ఆయన అధికారంలో ఉండగా, 2014 సెపె్టంబర్‌ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. ఇక 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. 
  
జగన్‌ హయాంలో క్రమం తప్పకుండా పంపిణీ 
» వైఎస్‌ జగన్‌ పాలనలో ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా కందిపప్పు పంపిణీ చేశారు.  
»   బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రేటు రూ.170కి పైగా ఉన్నా.. రాయితీపై కిలో రూ.67లకే అందించారు. 
»   టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్‌ చేసినా... వారితో సంప్రదింపులు జరిపి అవసరమైతే మార్కెట్‌ రేటు ఇచ్చిమరీ కందిపప్పు కొనుగోలు చేసి కార్డుదారులకు 
రూ.67లకే అందించారు.  
»  స్థానిక రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి కందిపప్పుగా మార్చి ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు సరఫరా చేశారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా రేటు పెంచలేదు. 
» జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్లు విలువైన 3.28లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. 

గతంలోనే బాగుంది  
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్‌ సరుకులు బాగా పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటి వద్దకే సరుకుల పంపిణీని ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించింది. పేదలకు నాణ్యమైన సరుకులు పారదర్శకంగా అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు అవసరమైన నిత్యావసర సరకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలకు అందాల్సిన బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయి.    – మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నకరికల్లు, పల్నాడు జిల్లా 

ప్రహసనంగా రేషన్‌ పంపిణీ 
కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్‌ సరకుల పంపిణీ ప్రహసనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ పంపిణీ బాగుంది. అధికారంలో వచ్చిన వెంటనే కందిపప్పు, ఇతర నిత్యవసరాలు పంపిణీ చేస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించింది. పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.   – కోట బూరయ్య, మాజీ సర్పంచ్, పినపళ్ల, ఆలమూరు మండలం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

4 నెలలుగా బియ్యం మాత్రమే
మేము కర్నూలులో నివాసం ఉంటున్నాం. 4 నెలలుగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదార, కందిపప్పు ఇవ్వాలని కోరినా స్టాక్‌ లేదంటున్నారు. గతంలో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు ఇచ్చేవారు. ఇప్పుడు పండుగకు అయినా ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. ఈ ప్రభు­త్వంలో పేదలకు న్యాయం జరగడంలేదు.  – గొల్ల లలితమ్మ, కేసీ కెనాల్‌ ఏరియా, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement