సంక్రాంతి పందేలకు నెల్లూరు జిల్లా నుంచి కోడి పుంజులు
రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి విక్రయం
ఒక్కో పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేలు
‘భీమవరం బ్రీడ్’ను నెల్లూరు జిల్లాలో పెంచి.. గోదావరి జిల్లాల్లో అమ్మకాలు
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం
భీమవరం బ్రీడ్‌నే అక్కడ పెంచి..
సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు.
సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు.
భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.
నెల ముందే వ్యాపారుల రాక
వారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు.
పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు.
వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు.
వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.
ఇక్కడే గిరాకీ బాగుంటుంది
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను.
– వెంకటేష్, నెల్లూరు
ముందుగానే వచ్చాం
నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి.
– సంగయ్య, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment