Sankranthi 2020
-
సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం భీమవరం బ్రీడ్నే అక్కడ పెంచి..సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.నెల ముందే వ్యాపారుల రాకవారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు. వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.ఇక్కడే గిరాకీ బాగుంటుంది సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను. – వెంకటేష్, నెల్లూరు ముందుగానే వచ్చాం నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి. – సంగయ్య, నెల్లూరు -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
డల్లాస్: సూర్యుడు మకరరాశిలో చేరగానే వచ్చే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్థానిక నిమిట్స్ హైస్కూల్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కృష్ణాష్టకం, మాస్ ఈజ్ గ్రేట్, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్ పాడిన పాటలు అరించాయి. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. అనంతరం 2020వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండాదన్నారు. తమ కార్యవర్గం, పాలకమండలి, సంస్థ సభ్యులని కలుపుకొని ఈ సంస్థను సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)ను తనకున్న అనుభవంతో, సమాజంలో ఉన్న పరిచయాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. తర్వాత 2020 కార్యవర్గం, పాలక మండలి బృందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ, శరత్ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్ ఇండియన్ రెస్టారెంట్, క్వాంట్ సిస్టమ్స్, ప్రతాప్ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి, డీఎంఆర్ డెవలపర్స్ , గోల్డ్ పోషకదాతలైన పసంద్ విందు, మై ట్యాక్స్ ఫైలర్, రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి , బసేరా హరి, కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి, సిల్వర్ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, ఒమేగా ట్రావెలర్స్, అవాంట్ టాక్స్, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంకక్రాంతి వేడుకులకు సహకరించిన మీడియా పార్ట్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్‌లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందుని సన్మానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుంచి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ జాతీయగీతం ఆలాపనతో అత్యంత శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి. -
అట్లాంటాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అట్లాంటా: అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం (గాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దేసానా మిడిల్ స్కూల్ల్లో ఆదివారం గాటా సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో గాటా వ్యవస్థాపకులు గిరీష్ మేకా, కో ఆర్టీనేటర్ సాయి గొర్రేపాటితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళాలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కైట్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా పలు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ల ద్వారా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నటరాజా నాట్యంజలి, కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గాటా చీఫ్ కో ఆర్డినేటర్ సాయి గొర్రేపాటి మాట్లాడుతూ, తమ కొత్త కార్యనిర్వాహక బృందం సభ్యులు నవీన్ మర్రి, ఉదయ్ ఏటూరు, సుబ్బారెడ్డి, కిషన్ దేవునూరి, సిదార్థ అబ్బాగారి, స్వప్న కాస్వా, లక్ష్మి సానికొమ్ము, సరిత చెక్కిల్ల, సరిత శనిగరపు, వాసవి చిత్తలూరిలను సభకు పరిచయం చేశారు. చివరగా గాటా వ్యవస్థాపకులు గిరీష్ మేకా మాట్లాడుతూ, రంగోలి, కిడ్స్ కైట్ ఫ్లయింగ్ విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేసిన నవీన్, కిషన్, సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కార్యక్రమానికి వాలంటీర్లుగా వ్యవహరించి విజయవంతం చేసిన గోవర్ధనానంద్ జగన్నాథ్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మే నెలలో జరగబోయే గాటా పదవ వార్షిక వేడుకలను ప్రతిఒక్కరూ రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తో కార్యక్రమాన్ని ముగించారు. -
సంక్రాంతి: కను‘మా విందు’
సాక్షి, కడప: కోడి కూయకముందే పల్లె నిద్ర లేచింది.. ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చిన తన బిడ్డలను చూసి పల్లె తల్లి మురిసింది.. పట్టణాలు..నగరాల నుంచి తరలివచ్చిన బంధుమిత్రులతో కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లను చూసి ముచ్చటపడింది. ‘పల్లెల్లో ఏముంది... మట్టి మనుషులు.. వట్టిపోయిన భూములు’ అంటుంటారు కదా.... ఇప్పుడు మీరే చూడండి.. నాలోని ప్రేమ.. ఆప్యాయత ఏపాటిదో.. కను‘మా విందు’ ఎలా ఉంటుందో.. అంటూ తన స్వగతాన్ని ఇలా చెప్పుకొచ్చింది. ‘రేయ్ సంటోడా.. మీ నాయన ఏడిరా...’ తన మనవడిని ఆపి అడిగింది జేజి. ‘అదిగో వస్తున్నాడు చూడు..’ మనవడు సమాధానమిచ్చాడు.. అటు వైపు నుంచి వస్తున్న తన తండ్రిని చూపిస్తూ.. ‘యాడికిపోయినావ్.. నాయనా.. కూచ్చో.. కూచ్చో.. వడలు సల్లారిపోతాండాయ్.. ఓ పల్లెంలో వడలు.. నాటుకోడి కూర తెచ్చి పెట్టింది ప్రేమతో... నువు కూడా రామ్మా.. కోడలిని పిలిచింది.. దగ్గరుండి మరీ వడ్డించింది..’ పండక్కు కొడుకు కోడలు వచ్చినారని ప్రపంచాన్నే జయించానన్న సంతోషం ఆమెది. చూశారా.. కొడుక్కి దగ్గరదగ్గర ఐదు పదుల వయసున్నా.. అమ్మ ప్రేమ ఎలాంటిదో.. అదిగో అటు చూడండి.. ‘నమస్తే సార్.. బాగున్నారా.. ’ తన చిన్ననాటి గురువు సత్యమయ్యకు దండం పెట్టాడు శిష్యుడు శివ. శివ వేరే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. సత్యమయ్య అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవం. ట్యూషన్ పెట్టి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించాడాయన. ‘ఏం శివా.. బాగున్నావా.. ఉద్యోగం ఎలా ఉంది’ బాగున్నా సార్.. మీరెలా ఉన్నారు.. ఇలా వారి సంభాషణ నడిచింది. చాలా ఏళ్ల తర్వాత ఊరికి వచ్చిన శివ తన గురువు కోసం తెచ్చిన కానుక ఇచ్చి.. శాలువాతో సన్మానించాడు.. కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనాలు అందుకున్నాడు. చూశారా.. నా ఒడిలో పెరిగిన బిడ్డ ఎంతెత్తుకు ఎదిగినా ఎలా ఒదిగి ఉన్నాడో.. అంటూ ఆ పల్లె తల్లి గర్వంగా చెప్పింది. ఆ పక్కనే ఉన్న ఇంట్లో ఒకటే నవ్వులు వినిపిస్తున్నాయ్.. హైదరాబాద్ నుంచి వచ్చిన తన సహచర ఉద్యోగులు, మిత్రులతో అనిల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నాడు. ఊర్లో తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ.. అవన్నీ తన మిత్రులతో పంచుకుంటున్నాడు.. అంతలోనే అనిల్ అమ్మ పల్లెం నిండా స్వీట్లు తెచ్చి పెట్టింది. ‘కడుపు నిండిపోయింది.. వద్దు.. వద్దు’ అంటున్న ‘లేదు తినాల్సిందే’ అంటూ వారి ముందు పెట్టింది. మూడు రోజుల నుంచి ఆమె అలుపెరగకుండా వారికి ఏం కావాలో అడిగి మరీ వండి వడ్డిస్తోంది. అదీ నేను నేర్పిన ఆప్యాయత.. ప్రతి ఇంటా చుట్టాలు.. పిల్లల అల్లర్లు.. వంటింట్లో ఘుమఘమలాడే పిండివంటలు.. పంట చేలు.. పిల్ల కాలువలు.. బండెద్దు పోటీలు.. కర్రసాము విన్యాసాలు..ఒక ఇంట ఏంటి.. ఒక చోట ఏంటి.. ఊరు ఊరంతా సంబరం..చూశారా..నాలో ఉన్న అందాల్ని ....నా ఒడిలోని అనురాగ ఆప్యాయతల్ని ..పండుగ వేళ.. నాదొక విన్నపం..నేను పల్లెనే....ఊరికెనే ఎవరికీ పల్లెత్తి మాట అనను.. ‘మాట’ పడను.. అందుకే ఎవరైనా ‘పల్లెల్లో ఏముంటాయి’ అంటే బాధేస్తుంది.. ఏమున్నాయ్ అంటారే.. ఏమి లేవు నాలో.. సంస్కృతికి ప్రతీక నేను.. సంప్రదాయాలకు పట్టుకొమ్మను నేను.. మనిషి నడకకు.. నడతకు ఊపిరిపోసిన‘తల్లి’ని నేను.. ఏదై తేనేం అందరూ వచ్చారు.. ఆడిపాడి ఆనందంగా గడిపారు... సంతోషం.. పండుగ పూ ట నా గురించి చెప్పుకునే అవకాశం కల్పించారు.. ఉంటాను.. మీ పల్లెను.. -
వాడి తగ్గిన కోడి పందెం
సాక్షి, అమరావతి: సంక్రాంతి కోడి పందేల ముచ్చట గురువారంతో ముగిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోను మూడు రోజుల పాటు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పందేల బరుల్లో కోళ్ల హంగామాతో పాటు సమీపంలో పేకాట, గుండాట, కోతాట వంటి జూదం, అనధికార మద్యం షాపులు లెక్కకు మిక్కిలి ఉండేవి. అయితే ఈఏడాది కోడి పందేలు గతానికంటే భిన్నంగా జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘాతో జూదానికి బ్రేక్ పడింది. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందేలు వేసుకోవాలని పోలీసులు సూచించారు. అలా జరపడం వల్ల ఉపయోగంలేదని, కత్తులు కట్టి పందెం వేస్తేనే త్వరగా గెలుపోటములు తేలుతాయని నిర్వాహకులు పట్టుబట్టారు. బరుల వద్ద జూదం, మద్యం విక్రయాలు జరిగితే సహించేది లేదని పోలీసు యంత్రాంగం అల్టిమేటం ఇచ్చింది. దీంతో పందేలు చప్పగా సాగాయని నిర్వాహకులు నిట్టూర్చారు. అయితే కొన్ని చోట్ల చాటుమాటుగా గుండాటలతో పాటు పేకాటలు నిర్వహించారు. మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ షాపుల్లో మద్యం కొని తెచ్చుకుని కొందరు బరుల వద్ద సేవించారు. భోగి రోజు మధ్యాహ్నం మొదలై.. కనుమ రోజున ముగిసిన పందేలలో ఈ ఏడాది క్రేజ్ తగ్గిందని, జూదం కూడా తగ్గడం మంచి పరిణామమని గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కోడి పందెం బరులకు ఆనుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పకోడి దుకాణాలు, బిర్యాని సెంటర్లు, కూల్‌డ్రింక్ షాప్‌లతో పాటు కార్లు, బైక్ పార్కింగ్‌లతో భారీ ఎత్తున వ్యాపారం జరిగింది. పందేలు తిలకించిన పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాల్లో కోడి పందేలను చూసేందుకు గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈసారి కూడా వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన కోడి పందేలను ఆయన తిలకించారు. ఉండి–భీమవరం రోడ్డు పక్కన ఉన్న కోట్ల ఆడిటోరియంలో ఆయనకు ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. సినీ నటుడు శ్రీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాలకు వచ్చి మూడు రోజులపాటు పండుగను సరదాగా గడిపారు. -
కొత్తగా వచ్చారు!
కేవలం మన సినిమాల ప్రభావమే కాదు.. మన సంక్రాంతి పండగ ఎఫెక్ట్ బాలీవుడ్‌పై కూడా పడినట్లుంది. కొన్ని హిందీ సినిమాల ఫస్ట్‌లుక్, కొత్త పోస్టర్స్ మన సంక్రాంతి పండగ సమయంలోనే విడుదలై హిందీ సినిమా అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. బాలీవుడ్ యువ కథానాయిక ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. ‘షేర్ షా’ చిత్రం కోసం సైనికుడిగా మారి సరిహద్దుల్లో శత్రువులపై వీరోచిత పోరాటం చేస్తున్నారు సిద్దార్థ్ మల్హోత్రా. విష్ణువర్థన్ దర్శకత్వం. కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన పరమవీర చక్ర కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. గురువారం (జనవరి 16) సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘షేర్ షా’ చిత్రం ఈ ఏడాది జూలై 3న విడుదల కానుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇంతియాజ్ అలీ. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. వరుణ్ ధావన్ తర్వాతి చిత్రానికి ‘మిస్టర్ లేలే’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కానుంది. మరో సినిమా ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘గో గోవా గాన్’కి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన దినేష్ విజన్ వెల్లడించారు. ఇంకా మరికొన్ని బయోపిక్‌లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ప్రకటనలు గత మూడు రోజుల్లో వెల్లడి కావడం విశేషం. సిద్ధార్ధ్ మల్హోత్రా అలియాభట్ -
సంక్రాంతి సంబరాలు
తెలుగు, తమిళ, కన్నడ సినీ తారల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ఆనందపు జ్ఞాపకాల క్షణాలను ఫొటోల్లో భద్రపరచి అభిమానుల కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవే ఇక్కడున్న ఫొటోలు. కుమార్తె సౌందర్య, అల్లుడు విశగన్లతో రజనీకాంత్, లత చిరంజీవితో అల్లు శిరీష్, అల్లు అర్జున్, కల్యాణ్‌దేవ్, వైష్ణవ్‌తేజ్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ తదితరులు పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్ భక్త, ఆరాలతో మంచు విష్ణు, వెరోనికా దంపతులు భార్య రాధికా పండిట్‌తో ‘కేజీయఫ్’ ఫేమ్ యశ్ తండ్రి సురేశ్‌కుమార్‌తో కీర్తీసురేశ్ -
వెలకట్టలేని ఙ్ఞాపకాలు: ఉపాసన
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వ్యాపారవేత్త, సినీ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన షేర్ చేసిన ఫొటోలు మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. వెలకట్టలేని ఙ్ఞాపకాలు’ అనే క్యాప్షన్‌తో తమ కుటుంబం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి- రామ్‌చరణ్, అత్తాకోడళ్లు సురేఖ- ఉపాసన ఒకే రకమైన దుస్తులు ధరించి ఉన్న ఫొటో.. రామ్‌చరణ్ నానమ్మను ఉపాసన హత్తుకున్న ఫొటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘మీకు కూడా పండుగ శుభాకాంక్షలు వదినా.. మీది పరిపూర్ణ కుటుంబం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సంక్రాంతి పర్వదినాన మెగా కుటుంబమంతా ఒక్కచోట చేరి పండుగ జరుపుకొంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ కూడా కలిసి ఉన్న ఫొటోను రామ్ చరణ్ తేజ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అదే విధంగా చిరంజీవి కుమార్తె శ్రీజ సైతం తన తండ్రి, అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సుస్మితతో పాటు నిహారికా ఇతర మెగా ఆడపడచులు ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. -
చూపరులను కట్టిపడేస్తున్న కళాకృతులు
సాక్షి, హైదరాబాద్: శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు సంక్రాంతి పర్వదినం కావడంతో శిల్పారామానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. పండగ సందర్భంగా శిల్పరామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు, ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే కళారూపాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. శిల్పారామంలో ఎంతో వేడుకగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు రేపటితో ముగియనున్నాయి. చదవండి: ప్రతి రోజూ పండగే -
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ ఎమ్మెల్సీ
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నాంటాయి. రంగురంగుల ముగ్గులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జన జాతరతో బుధవారం ఈడుపు గళ్లు కోలాహలంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన కోడిపందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కాగా తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మల్లేష్ ఈ సంబరాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. -
కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం:తలసాని
సాక్షి, ఉండి: సంక్రాంతి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటుచేసిన కోడిపందాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమని అన్నారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని కొనియాడారు. కోడిపందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని ప్రశంసించారు. -
సంక్రాంతి 2020; పందెం రాయుళ్ల అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి/పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ఈసారి కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాల జాడేలేకుండా పోయింది. గతంలో కోడి పందేల బరుల వద్దే అనధికారికంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. దాంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి పెద్ద ఎత్తున ఆడేవారు. కాగా, 2020 సంక్రాంతి సంబరాల్లో జూదాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల చర్యలు ఫలించాయి. ఇక సంప్రదాయ కోడి పందాల్లో కత్తి కట్టడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. మూడు రోజులపాటు సరదాగా గడిపేందుకు, ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ కోడి పందేల్ని వీక్షించేందుకు వచ్చామని ఔత్సాహికులు వెల్లడించారు. అయితే, అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (చదవండి : కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె) బరిలో నిలిచిన పందెం కోళ్లు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజు కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. భీమవరం, నరసాపురం, ఆచంటతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 100కు పైగా బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఉంగుటూరు మండలం గొల్లగూడెం, బాదంపూడి, నల్లమాడు గ్రామాల్లో కోడిపందాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. 3 కోళ్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసుల అరెస్టు చేశారు. రూ. 4780 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉండి సంక్రాంతి సంబరాల్లో తలసాని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పా ప్రభుత్వం మారుతుందని. మా రాష్ట్రం నుంఛఙ ఒకాయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాం అలాగే ఇచ్చాం. ఒక పెద్ద భవనం కట్టి హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పుకునే తిరిగి ఒకాయన మూలన పడ్డాడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం మంచి పరిణామం. కేసు నమోదు.. సాక్షి, చిత్తూరు : పీలేరులో రెండుచోట్ల (జాండ్ల, యర్రగుంట్ల వద్ద) కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని చుట్టుముట్టి 10 మంది పందెం రాయుళ్లని, 2 కోడి పుంజులను లక్షా వెయ్యి రూపాయల నగదు , 54 కోడి కత్తులు, ఒక కారు , రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని బి.కొత్తకోటలో ఆరు మంది పందెం రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి.. రెండు కోళ్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.15 వేల 620 ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వాజేడు మండలానికి సమీపంలో ఉన్న చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. పందాల్లో పాల్గొనేందకు రాష్ట్రం నుంచి గుట్టుగా పోయేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. అసలే ఏజెన్సీ అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో.. పోలీసులకు కోడి పందాల కట్టడి చేయడం కష్టతరంగా మారింది. -
రైతులను ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ప్రకృతి కూడా ఈ ఏడాది రైతులను ఆశీర్వదించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం మంగళవారం ట్వీట్ చేశారు. -
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్
సాక్షి, మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో మంగళవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పలు పోటీలను ప్రారంభించి తిలకించారు. ముఖ్యమంత్రి తమ మధ్య పండుగ సంబరాల్లో పాల్గొనడం స్థానికులను ఆనందోత్సాహంలో ముంచెత్తింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, చట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చిన ప్రజలు మురిసిపోయారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం మధ్యాహ్నం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం చేరుకున్నారు. అక్కడ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెహ్రూ చౌక్, ఏలూరు రోడ్, నాగవరప్పాడు మీదుగా గుడివాడ మండలం లింగవరం గ్రామంలోని కె.కన్వెన్షన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. దారిపొడవునా వేలాది మంది మహిళలు, యువకులు బారులు తీరి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. సంక్రాంతి స్టాల్స్‌ను తిలకించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తొలుత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆయన సంక్రాంతిని ప్రతిబింబించేలా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, బొమ్మల కొలువు, సంప్రదాయ వంటల తయారీ తీరును తిలకించారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. మహిళల కోలాటాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలను ఆస్వాదించారు. భోగిమంటల వద్ద కొద్దిసేపు నిల్చొన్నారు. పండితులు పండుగ విశిష్టతను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను ప్రారంభించి, కొద్దిసేపు తిలకించారు. పుంగనూరు జాతి గిత్తలను పరిశీలించారు. అనంతరం పొట్టేలు పోటీలను తిలకించారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరం గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, కొడాలి నాని, బాలశౌరి, వెలంపల్లి శ్రీనివాస్, ఏఎండీ ఇంతియాజ్ (ఎడమ నుంచి కుడికి) హోరెత్తిన జగన్నినాదాలు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో కేరింతలు కొట్టారు. గౌండ్‌కు ఇరువైపులా గ్యాలరీలో కూర్చున్న ప్రజలకు సీఎం అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జై జగన్.. జైజై జగన్.. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. అందరికీ విద్య ‘అమ్మ ఒడి’తో సాధ్యం, మన బడి నాడు – నేడు.. తదితర నవరత్నాలను ప్రతిబింబించే ప్లకార్డులను గ్రౌండ్‌కు ఇరువైపులా కూర్చున్న ప్రజలు చేతబట్టి సీఎం జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. వేదికపై కూర్చున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరించారు. వేదికపై కూర్చున్న వారితో ఫొటోలు దిగారు. ఎడ్ల బండ లాగుడు పోటీల నిర్వాహకులతో మాట్లాడారు. హెలిప్యాడ్, లింగవరం వద్ద ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణ సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. గ్రామీణ సంప్రదాయాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి çసంబరాల్లో పాల్గొన్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కృష్ణా జిల్లా గుడివాడలో తొలిసారి కాలుపెట్టిన వైఎస్ జగన్‌కు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారన్నారు. గత ఐదేళ్లుగా బందరు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, ఇకపై అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ ఏడాది అన్ని విధాలా అన్నదాతలకు కలిసి వచ్చిందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, గిట్టుబాటు ధర కల్పన, ధరల స్థిరీకరణ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం తమ మధ్య పండుగ జరుపుకోవడంతో అన్నదాతలు ఉప్పొంగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. గుడివాడ మండలం లింగవరంలో ఎడ్ల బండ లాగుడు పోటీలను ఆసక్తిగా తిలకిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
కోడి పందేల చరిత్రలో ఈ పరిస్థితి ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గతంలో కోడిపందేల బరుల వద్దే అనధికారంగా ఏర్పాటుచేసే షాపుల్లో మద్యం ఏరులై పారేది. దీంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి కూడా పెద్దఎత్తున సాగేవి. కానీ, గతానికి కన్నా భిన్నంగా ఈ ఏడాది పందేలు జరిగే ప్రతిచోటా మద్యం అమ్మకాలు, జూదం నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వైర్లెస్ మెసేజ్‌లు పంపించారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ సోమవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వైర్లెస్ కాన్ఫరెన్స్‌లోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరి ప్రాంతంలోనైనా మద్యం అమ్మకాలు, పేకాటలు జరిగితే అక్కడి పోలీసులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పంతం నెగ్గించుకున్న పోలీసులు కోడి పందేల చరిత్రలో తొలిసారిగా పోలీసులు భోగి రోజున ఒక పూట అయినా వాటిని అడ్డుకుని రికార్డు సృష్టించారు. ఏటా పోలీసులు హడావుడి చేయడం.. చివరికి భోగి రోజు ఉదయమే పందేలు మొదలు కావడం ఎప్పుడూ జరిగే తంతే. అయితే, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కొంతమేర వాటిని నిలువరించగలిగారు. భీమవరం, ఎదుర్లంక, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత పందేలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. కోడి పందేలు, పేకాట కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అతిథులు పోలీసు ఆంక్షల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు భీమవరం, తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమయ్యారు. ఆలస్యంగా.. అరకొరగా కోడిపందేలు మరోవైపు.. పోలీసు ఆంక్షల నడుమ తొలిరోజున పందెం కోళ్లు ఆలస్యంగా ఎగిరాయి. కోడి పందేలు జరుగుతాయో లేదోనని భోగి రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే.. పందేలను అడ్డుకుంటామంటూ పోలీసులు బరుల వద్ద పికెట్లు ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కోడి పందేల నిర్వాహకులు, కత్తులు కట్టే వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇది ఎప్పుడూ ఉండే తంతే అనుకున్న నిర్వాహకులు చివరకు భోగి రోజున కోడి పందేలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆయా బరుల వద్ద పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బరుల వద్ద పందేలు ప్రారంభించుకోవడానికి నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పలేదు. అనుమతి కోసం వారు పడిగాపులు కాసారు. చివరికి మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఒంటి గంట నుంచి మూడు గంటలలోపు అరకొరగానే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి రోజు పందేల రాయుళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. -
ఇంటింటా సంక్షేమ సంక్రాంతి
సాక్షి, అమరావతి: చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కొత్త కళ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తెలుగింట అతి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. పండుగ కొనుగోళ్లతో దుకాణాలు కిటకిటలాడటంతో వ్యాపారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కాలం కలిసి రావడం, ప్రభుత్వం అండగా నిలవడంతో సాగుతోపాటు వ్యవసాయ దిగుబడులు పెరిగాయి. వైఎస్ జగన్ సర్కారు ‘నవరత్నాల’ పథకాలతో గడప గడపకూ కొత్త కొత్త సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. లక్షలాది మంది చిరుద్యోగులకు వేతనాలు / గౌరవ వేతనాలు పెరిగాయి. వార్డు, గ్రామ సచివాలయాలతో నిరుద్యోగులకు లక్షలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. రైతులతోపాటు అన్ని వర్గాలకు ఆర్థిక బాసట లభించింది. మొత్తమ్మీద ‘నవరత్నా‘లు ప్రతిఫలించి సంక్షేమ సం‘క్రాంతి’ వెల్లివిరిసింది. వెరసి రాష్ట్రమంతటా వస్త్ర, కిరాణా సరుకుల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు కిటకిటలాడిన దుకాణాలు రుజువు చేశాయి. పిండి వంటలతో వీధులు ఘుమ ఘుమలాడుతున్నాయి. రంగవల్లులు, గొబ్బమ్మలతో ప్రతి గడపా కొత్త శోభ సంతరించుకుంది. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు ఇంటిల్లిపాదికీ కొత్త వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆడపడుచులను ఆహ్వానించి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. రైతు భరోసా, ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలకు తోడు.. వరుణుడు కరుణించడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. వీటన్నింటికీ తోడు ప్రతి కుటుంబానికి రెండు మూడు సంక్షేమ పథకాల ఫలాలు అందడం వల్ల ఈ ఏడాది ప్రజలు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఎడ్ల పందేలు, రంగవల్లులు, గంగిరెద్దులు, ఆట, పాటల మధ్య ఊరూరా.. ఇంటింటా.. సంక్రాంతి సంబరం అంబరం అంటింది. రైతు లోగిళ్లలో లక్ష్మీకళ మంచి వర్షాలతో కాలం కలిసి రావడం, రైతు పక్షపాతి వైఎస్ జగన్ సర్కారు తన వంతు పూర్తి స్థాయి ప్రోత్రాహం అందించడంతో అన్నదాతలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కడం, రిజర్వాయర్లు నిండటం, ప్రభుత్వం రైతు భరోసా కింద ఆర్థిక దన్ను కల్పించడంతో ఖరీఫ్‌లో పంటల సాగు పెరిగింది. దీంతో వ్యవసాయోత్పత్తుల దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. దీంతో రైతు లోగిళ్లు లక్ష్మీకళ సంతరించుకున్నాయి. రబీలోనూ సాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరుకుంది. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద పంటల సాగుకు ఖర్చుల నిమిత్తం ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. రూ.13,500 చొప్పున తొలి ఏడాది అందజేసింది. ఈ పథకం కింద 44,92,513 మంది రైతులు, 1,58,116 మంది కౌలు రైతులు.. మొత్తం 46,50,629 మంది లబ్ధి పొందారు. మొదటి ఏడాది కింద ప్రభుత్వం రూ.6,298.98 కోట్లు చెల్లించింది. మరోవైపు ధరల స్థిరీకరణ కోసం కేటాయించిన రూ.3 వేల కోట్ల నిధి నుంచి శనగ రైతులకు సాయం అందించింది. 22 పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి అండగా నిలిచింది. కనీస గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి వాటికి దేశంలో ఎక్కడా లేని విధంగా సేకరణ ధరలను ప్రకటించడమే కాకుండా వీటిని ప్రతి గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు 217 మార్కెట్ యార్డులు, 150 సబ్ మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేసింది. ఇంతకన్నా ఏం కావాలి? వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగుంది. శానా సంవత్సరాల తర్వాత వర్షాలు బాగా పడ్డాయి. పంటలు సేతికొచ్చాయి. మొన్న నాణ్యమైన వేరుశనగ కాయలు ఇచ్చారు. నల్లరేగడి భూముల రైతులకు పప్పుశెనగ విత్తనాలు ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో మా లాంటి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్న కారు రైతులకు చాలా ప్రయోజనం కలిగింది. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. ఇంకా ఉచిత బోర్లు, గిట్టుబాటు ధరలు.. ఇవి కాకుండా అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పల్లెల్లో చాలా మంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. రైతులకు ఇంతకన్నా ఏమి కావాలి? – ఎస్.గోవిందప్ప, దేవాదులకొండ గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ఉద్యోగులందరిలోనూ నూతనోత్సాహం ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ సంఘం గడువు ముగిసినందున జగన్ సర్కారు 27 శాతం మధ్యంతర భృతిని గత ఏడాది జూలై నుంచే అమలు చేస్తోంది. దీంతో ఉద్యోగవర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఆశ వర్కర్లు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య మిత్రలు, లాంటి చిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం/ వేతనం పెంచింది. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఐఆర్ ఒకేసారి ఇవ్వడం సంతోషం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ఇవ్వడం సంతోషంగా వుంది. పాదయాత్ర సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ప్రకటించిన ఐఆర్‌ను అయిదు నెలల తర్వాత అమలు చేశాయి. ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. – బి.వి.రాణి, తహసీల్దార్, గోపాలపట్నం, జేఏసీ ఉమెన్ వింగ్, విశాఖపట్నం సచివాలయాలతో ఉద్యోగ జాతర ప్రజల గడపకే సంక్షేమ ఫలాలు అందించాలనే ఉదాత్త లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2.70 లక్షల మందికి గ్రామ వలంటీర్లుగా ఉపాధి లభించింది. 1,34,000 మందికి శాశ్వత ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత మందికి అతి తక్కువ కాలంలో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకూ లేకపోవడం గమనార్హం. జగన్ చలువతోనే ఉద్యోగం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మాట నిలుపుకున్నారు. స్వల్ప కాలంలోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారు. నేను బీఎస్సీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి కాగానే నాకు ఉద్యోగం వచ్చింది. నాలా ఎందరో ఉద్యోగాలు పొందారు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోలేం. మేము ఎప్పటికీ సీఎంకు రుణపడి ఉంటాం. – బండారి లక్ష్మీలావణ్య, సచివాలయం కార్యదర్శి, పెదపట్నంలంక, మామిడికుదురు మండలం, తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ వాహన మిత్ర.. ఎంతో అండ ఆటో/ మ్యాక్సీ క్యాబ్‌లను సొంతంగా నడుపుకునే వారికి ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర కింద రూ.10,000 ఆర్థిక సాయం అందించింది. ఈ పథకం ఆటో డ్రైవర్లకు ఎంతగానే అండగా నిలిచింది. ఆటో రిపేర్లకు, ట్యాక్స్ చెల్లింపులకు ఈ మొత్తం బాగా ఉపయోగపడుతుందని పలువురు ఆటో, ట్యాక్రీ డ్రైవర్లు కొనియాడుతున్నారు. ఇదివరకెవ్వరూ ఇలా ఆదుకోలేదు నా కుటుంబానికి నేనే ఆధారం. నాకు ఒక పాప, బాబు ఉన్నారు. వారిని చదివిస్తున్నాను. ఆటో నడిపితే గానీ పూటగడవని పరిస్థితి. ఒక్కో రోజు వచ్చే మొత్తం గిట్టుబాటు కావడం లేదు. ఆటోకు ఏవైనా మరమ్మతులు చేయించాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్నా. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో రూ.10 వేలు నా బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. నాలాంటి ఎంతో మంది పేదలకు ఈ పథకం వరం. సీఎం జగన్‌కు మేమంతా రుణపడి ఉంటాం. – బాగుల బాలాజీ, ఆటో డ్రైవర్, రేఖపల్లి, వీఆర్‌పురం మండలం, తూర్పు గోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితులకు బాసట నేను గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తుంటాను. అగ్రిగోల్డ్ సంస్థ లక్షలాది మంది ఖాతాదారులను నిలువునా ముంచింది. గత ప్రభుత్వానికి బాధితులు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ మాత్రం.. నేనున్నానంటూ బాధితుల తరఫున న్యాయం చేసేందుకు పూనుకున్నారు. అధికారంలోకి రాగానే తొలి విడతగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ.269 కోట్లు ఇచ్చి ఆదుకున్నారు. నేను రూ.10 వేల సాయం అందుకున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ప్రజల అదృష్టం. ఇకపై అగ్రిగోల్డ్ బాధితులు ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. రానున్న రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులందరి కష్టాలు పూర్తిగా తీరుస్తారనే భరోసా వచ్చింది. – జి.సుబ్రమణ్యం, నూజెండ్ల, వినుకొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఒక వరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించారు. ఇది నిజంగా పోలీసులకు ఓ వరం లాంటిది. ఎప్పుడూ ఉద్యోగ ఒత్తిడిలో ఉండే పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండగలుగుతున్నాం. బ్రిటిష్ కాలం నాటి నుంచి పోలీస్ వ్యవస్థలో వీక్లీ ఆఫ్ అనేది లేదు. ఆ చరిత్రను ఈ సీఎం తిరగరాశారు. – కొప్పిశెట్టి శ్రీహరి, ట్రాఫిక్ కానిస్టేబుల్, రాజమహేంద్రవరం ఎన్నెన్నో పథకాలతో కోట్లాది మందిలో సంక్రాంతి – పిల్లలను చదివించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి పేద విద్యార్థి తల్లికి ప్రోత్సాహకంగా ఏటా రూ.15,000 అందించడం ఈ పథకం ఉద్దేశం. 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో ఈ పథకం కింద రూ.6,456 కోట్లు జమ అయింది. – మగ్గం ఉన్న నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద ప్రతి లబ్ధిదారు కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. – ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని రూ.2,250కి పెంచింది. దీనిని ఏటా రూ.250 చొప్పునా పెంచుకుంటూ వెళ్తుంది. – డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలను అమల్లోకి తెచ్చింది. రాబడి రాగానే వడ్డీ లేకుండా అసలు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించింది. – కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. – ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడం వల్ల రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. రాష్ట్రంలోని ఆసుపత్రులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం వైద్యం పొందేలా విప్లవాత్మక మార్పులు చేసింది. – జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు పేద విద్యార్థుల పాలిట నిజంగా వరం. పేద విద్యార్థులు ఎంత వరకైనా చదువుకునేలా ఉన్నత చదువులకు అవసరమైన ఫీజు మొత్తాన్ని విద్యా దీవెన పథకం ద్వారా అందజేస్తుంది. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల సాయాన్ని వసతి దీవెన పథకం కింద ఇస్తుంది. -
బండి నిండుగా పండుగ
సంక్రాంతి పండుగ వచ్చింది. వస్తూ వస్తూ బండెడు ధాన్యాన్ని మోసుకొచ్చింది. ఏడాదంతా రైతులు పొలంలో పడిన కష్టానికి ప్రతిఫలం. ఈ పండుగ సందర్భంగా.. ‘రాబోయే ఏడాదికి ఈ పంటలు వేసి చూడండి..’ అంటూ అంతరించి పోతున్న పంట విత్తనాల ప్రదర్శన పెట్టారు మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్ గ్రామ మహిళా రైతులు. సంక్రాంతి.. పంటల పండుగే కాదు, విత్తనాల పండుగ కూడా అంటున్నారు ఈ మహిళా రైతులు. బండిని, ఎడ్లను అలంకరించి అరుదైన విత్తనాలను పెట్టెల్లో పెట్టి ఊరూరా తిప్పుతున్నారు. ఈ వేడుకను చూడడానికి విదేశాల నుంచి కూడా మహిళా రైతు ప్రతినిధులు పస్తాపూర్ వచ్చారు. వెస్ట్ ఆఫ్రికాలోని మాలి అనే చిన్న దేశం నుంచి వచ్చిన అలిమాత ట్రావోరే... మెదక్ జిల్లాలో ఇరవై ఏళ్లుగా జీవ వైవిధ్య పంటల సాగు చేస్తున్న మహిళా రైతులతో సమావేశమయ్యారు. నిన్న భోగి పండుగ రోజు ప్రారంభమైన జీవ వైవిధ్య సంచార జాతర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. మీ నుంచి నేర్చుకున్నాం ‘‘భారతదేశం నుంచి అనేక మంది మహిళలు 2014లో వెస్ట్ ఆఫ్రికాలోని డిజిమినిలో జరిగిన విత్తన మేళాకు హాజరయ్యారు. డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) మహిళలు అవలంబిస్తున్న విత్తన బ్యాంకు విధానాన్ని మేము కూడా అనుసరిస్తున్నాం. ఈ గ్రామీణ మహిళల స్పూర్తితో మా దేశాల్లో కూడా గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయగలిగాం. విత్తనాలను భద్రపరుస్తున్నాం. చిరు ధాన్యాల ప్రాసెసింగ్, మిల్లెట్ మార్కెటింగ్, చెట్ల మందులు తదితర వాటిపై వీడియోలు తీయడం కూడా నేర్చుకున్నారు’’ అని చెప్పారు ట్రావోరే. ఈ సమావేశానికి వచ్చిన సెనెగల్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్టర్, మహిళా రైతు ఫ్రాన్సిస్కాడౌఫ్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ మహిళల ఆహార పంటల సేద్యం చాలా బాగుంది. సేంద్రీయ వ్యవసాయం చేయడం ఎంతో గొప్ప విషయం. జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, ఇక్కడి అనుభవాల గురించి తెలుసుకునేందుకు వచ్చాను’’ అన్నారు. ప్రాన్స్ కు చెందిన జీవ వైవిద్య వినిమయం, అనుభవాలను పంచుకునే సంస్థ ప్రతినిధి ఆనె బర్సో మాట్లాడుతూ ‘‘మేము జీవ వైవిద్యం, ఆహారం కోసం పనిచేసే ఇతర సంస్థలను కలుపుకుని పనిచేస్తున్నాం. మా వ్యవసాయానికి, ఆహార భద్రతకు వాణిజ్య సంస్థల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలో ఒక కొత్త గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలన్నదే మా ప్రయత్నం’’ అని పేర్కొన్నారు. జీవ వైవిద్యాన్ని పరిరక్షించుకునేందుకు గాను మనమంతా కలిసి మన గొంతుకలను పెద్దవిగా చేసి వినిపించాల్సిన అవసరం ఉందని మహిళా రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. – శ్రీనివాసరెడ్డి, సాక్షి, జహీరాబాద్ ఫొటోలు : బి. శివప్రసాద్ సాక్షి, సంగారెడ్డి -
మానవతా స్ఫూర్తి
తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడే ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. సూర్యరశ్మి ప్రభావం భూగోళంపై క్రమంగా పెరుగుతుంది. ఆ సమయంలో దానధర్మాలు ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంధాలు చెప్పాయి. అందుకే మకర సంక్రాంతి మనవతా స్ఫూర్తి అయింది. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి ‘ధనుర్మాసం’గా అనేక రూపాలలో.. తెలుగు లోగిళ్లలో స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు అందరూ పాలుపంచుకునే విధంగా కళలు, సంస్కృతి, సంప్రదాయలు రూపొందాయి. వీటిల్లో రంగవల్లులు, జానపద కళారూపాలు, పొంగలి, పిండివంటలు ప్రధానమైనవి. రంగవల్లులు సంప్రదాయంలో సూచించిన విధంగా బియ్యప్పిండితో ఎనిమిది రేకుల పద్మం ముగ్గు మొదలు అనేక ముగ్గులను పోటీపడి మరీ మహిళలు నెలంతా తీర్చిదిద్దుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అమ్మవారికి సంకేతంగా పసుపు, కుంకుమ వంటి రంగులు చల్లుతారు. పర్యావరణ పరిశుభ్రత, పరిరక్షణ వంటి ఐహిక ప్రయోజనాలు కూడా ఈ ముగ్గులు వేయడంలో ఉన్నాయి. కళారూపాలు తెలుగు సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైనవి జానపద కళారూపాలు. కళాకారులు భారతీయ సంస్కృతి, పురాణాలు, కథలు, గాథలు అన్నీ ఈ నెలరోజులు ఇంటి ముందుకు వచ్చి పిల్లలను, స్త్రీలను అక్కడికక్కడే విజ్ఞానవంతులను చేసేవిధంగా వీధి ప్రదర్శనలు ఇస్తారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తన చిన్నతనంలో ఇంటి ముందుకు వచ్చే జానపదకళారూపాలను చూసి భారత భాగవత రామాయణాలు, శాస్త్రీయ విషయాలు తెలుసుకున్నానని వాటి ఆవ«శ్యకతను వివరించారు. పొంగలి ధర్మశాస్త్రం చెప్పిన పాయసం తెలుగు నేలలో పొంగలి అయింది. అదీ కొత్త బియ్యంతో, ఆవు పాలతో ఉడికించిన పొంగలి. తెలుగువారికి ఇది పొంగలి పండుగ. రైతులకు, వ్యవసాయ కూలీలకు, వ్యవసాయంపై ఆధారపడిన అన్ని వృత్తులవారికీ, పశువులకు అందరికీ ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే సామాజిక పర్వం ఇది. ధాన్యపురాశులను ఇంటికి చేర్చటం, పనివారికి ధాన్యాన్ని పంచటం, కొత్త బియ్యం పొంగలి చేసి బంధుమిత్రులకు, పనివారికి అందరికీ పంచటమే అసలైన ప్రధానమైన పండుగ అయింది. పిండివంటలు ‘వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి’ అనుకునే తెలుగువారు.. సంక్రాంతి నాడు గారెలు తప్పనిసరిగా వండుతారు. అరిసెలు సంక్రాంతికి సంకేతమైన పిండివంట. ఈ రోజు కోసం ఎవరు ఏం చేసుకున్నా చుట్టుపక్కల వాళ్లందరికీ పంచుతారు. ఇవ్వడంలోని తీపిదనాన్ని పంచుకుంటారు. – డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
సంక్రాంతి శోభ..
ఏ పండగైనా ఊరూరా, ఇంటింటా కళాకాంతులు తీసుకొస్తుంది. కానీ సంక్రాంతి ప్రత్యేకతే వేరు. ఎటుచూసినా ప్రకృతి పచ్చగా, హాయిగా, ఆహ్లాదంగా కన బడే కాలమిది. ఈ పండగ సమయానికల్లా పంటలు రైతు లోగిళ్లకు చేరతాయి. గ్రామ సీమలన్నీ పాడిపంటలతో తుల తూగుతాయి. పొలం పనులన్నీ పూర్తి కావ డంతో రైతులు, వ్యవసాయ కూలీలకు కాస్తంత తీరిక లభిస్తుంది. అందుకే అం దరూ తమ బంధుమిత్రులతో, ఇరు గుపొరుగుతో పండగ సంబరాలను పంచు కుంటారు. ఈ శోభనంతటినీ తిలకిం చడానికి, తమ మూలాలను ప్రేమగా స్పృశించడానికి చదువు కోసం, ఉద్యోగం కోసం నగరాలకు చేరినవారంతా సంక్రాంతి వచ్చేసరికి పల్లెటూళ్లకు తరలివెడతారు. వీధులన్నీ రకరకాల రంగవల్లికలతో కళ కళలాడటం సంక్రాంతినాడు కనబడే ప్రత్యే కత. రోజూ కళ్లాపి జల్లడం, ముగ్గు పెట్టడం ఏడాది పొడవునా పాటించే సంప్రదాయమే. కానీ సంక్రాంతి ముగ్గులు విలక్షణమైనవి. వాటికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎంతో సాధన చేసి, మెలకువలు నేర్చుకుని, ఊహలకు పదునుపెట్టి ఈ రంగవల్లికలను అల్లుతారు. చెప్పాలంటే ఇదొక చిత్రలిపి. వేకువజాములో నేల మీద పరుచుకునే రంగ వల్లికలు వాటిని అందంగా తీర్చిదిద్దే మగు వల అభివ్యక్తికి, అభిరుచికి అద్దం పడ తాయి. కళ్లాపి జల్లి, ముందుగా దానిపై చుక్కలు వేసి, వాటిని అలవోకగా కలుపుతూ ముగ్ధమనోహరమైన ఆకారాలను వారు సృజిస్తుంటే, ఆ కళను చూసి తరించాల్సిందే. వారి వేలికొసల నుంచి ఒక పద్ధతి ప్రకారం నేలపై వాలే ముగ్గు పిండి కాసేపట్లోనే ఒక రూపం సంతరించుకుని అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇలా ఒకరోజు కాదు...ప్రతిరోజూ ప్రతి ముంగిటా రక రకాల వర్ణచిత్రాలు ఆవిష్కారమవుతుంటాయి. ఇతర పండగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునేవికాగా, సంక్రాంతి సూర్యమానాన్ని అనుసరించి జరుపుకుంటాం. ఈ పండగతో మొదలుపెట్టి సూర్యుడి గమన దిశ మారుతుంది. అప్పటివరకూ దక్షిణ దిశగా ఉన్న సూర్యుడి రథగమనం, సంక్రాంతి మొదలుకొని ఉత్తర దిక్కువైపు మొదలవుతుందంటారు. అందుకే ఈ పండగతో మొదలై ఆరునెలలనూ ఉత్తరాయనం అంటారు. ఈ ఉత్తరాయనం మొదలయ్యే రోజును పుణ్యకాలంగా భావించి పితృదేవతలకు తృప్తి కలిగించేందుకు వారికి తర్పణాలు వదులుతారు. సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతోసహా దేశవ్యాప్తంగా వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. పొరుగునున్న నేపాల్లోనూ ఈ పండగ సందడి ఉంటుంది. పంజాబ్, హర్యానాల్లో దీన్ని లోహ్రి పండగ అని, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఖిచిడి అని, తమిళనాడులో పొంగల్‌గా, మహారాష్ట్రలో సంక్రాంత్‌గా ఈ పండగ వేడుకను జరుపుకుంటారు. – అద్దంకి మహాలక్ష్మి -
పండగ పోస్టర్లు
పండగ అనగానే సినిమా వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందులోను సంక్రాంతి అనగానే ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. కారణం వాళ్ల సినిమాలను విడుదల చేయటమే కాకుండా అనేక సినిమా ప్రమోషన్లను ఈ పండగకి ప్రారంభించటం ఆనవాయితీ. కొందరు తమ సినిమాల లుక్స్‌ను ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. రవితేజ, శ్రుతీహాసన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మలినేని గోపిచంద్ దర్శకుడు. సాయి మాధవ్ బుర్రా మాటల రచయిత. ఎస్. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘క్రాక్’ చిత్రం వేసవిలో విడుదల కానుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. మంగళవారం ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2న ‘లవ్‌స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలను పోషించి మంచి మార్కులు కొట్టేసే నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను పండగ సందర్భంగా విడుదల చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా వేసవి సందర్భంగానే విడుదల చేయాలనుకుంటున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న వృద్ధులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా అనాథాశ్రమాల్లోని వృద్ధులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ ప్రేమ ఆశ్రమం, వృద్ధుల సంక్షేమాశ్రమం నుంచి సుమారు 150 మంది వృద్ధులు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి ప్రసాదాలతోపాటు దుర్గమ్మ చీరలను ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు దగ్గరుండి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ రోజు వృద్ధులకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని సంకల్పించామన్నారు. అందులో భాగంగానే అనాధాశ్రమంలోని 150 మంది వృద్ధులకు అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు దుర్గమ్మ చీరలను ఇచ్చామని పేర్కొన్నారు. వారికి దుర్గమ్మ అండగా ఉంటుందన్న భరోసా కల్పించేందుకే అమ్మవారి దర్శనం చేయించామన్నారు. అనంతరం వృద్ధులు మాట్లాడుతూ ‘గతంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను ఎంతో వైభవంగా జరుపుకునేవాళ్లం. ప్రస్తుతం పిల్లలు, కుటుంబ సభ్యులతో కాకుండా వృద్ధాశ్రమంలోనే సంక్రాంతి జరుపుకోవడం బాధగా ఉన్నా తప్పదు. ఒంటరిగా పండగ జరుపుకున్నప్పటికీ మాకు దుర్గమ్మ అండగా ఉందన్న నమ్మకం కలిగింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: జీన్స్ వేసుకుంటే అంతరాలయ దర్శనం కల్పించం -
‘బాబులాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదు’
సాక్షి, విజయవాడ : తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పడుగను చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం దౌర్భాగ్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూడలేక బాబు రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై భోగి మంటలు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ఈ ఏడాది అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలే దీనికి నిదర్శనమన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ సంక్రాంతి శోభ ఉట్టిపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం అమరావతి ముసుగులో అభూత కల్పనలతో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పండుగ జరుపు కోవద్దని పిలుపునిచ్చే బాబులాంటి నాయకుడ్ని తానెక్కడా చూడదలేదన్నారు. చంద్రబాబు ఒక మాట మీద నిలడలేని వ్యక్తి అని మరోసారి రుజువైందని వెల్లంపల్లి చెప్పారు. సంక్రాంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. -
సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని పేర్కొన్నారు. గుడివాడకు వెళ్లనున్న సీఎం జగన్ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 గంటల నుంచి 4.45 వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి 5.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. (చదవండి : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది) -
పల్లె మేలుకునే వేళ..!
పల్లె మేలుకునే వేళయ్యింది. భోగి మంటల వెలుతురులో తన వైభవాన్ని తిరిగి చూసుకునేందుకు సిద్ధమైంది. నయనాందకరమైన రంగు, రంగుల రంగువళ్లులు.. వేకువజామునే వీనుల విందుగా వినిపించే హరిదాసుల సంకీర్తలు.. జంగమదేవరల సిద్ధేశాల ఘంటారావం.. డూడూ బసవన్నల శోభాయమాన అలంకారం.. కొత్త అల్లుళ్లు, బంధువులతో గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి పండగకు ముస్తాబయ్యాయి. అచ్చతెలుగుదనం ఉట్టిపడే పెద్ద పండగకు సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రం సంక్రాంతి పండుగకు ముస్తాబైంది. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలు, వెళ్లిన వారంతా స్వస్థలాలకు చేరుకుంటుండటంతో పండుగ ముందే వచ్చిందా అన్న చందంగా పల్లెలు కళకళలాడుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను ఆనందంతో జరుకునేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు జనం మార్కెట్లకు ఎగబడటంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. కొత్త ఆలోచనలు చిగురించాలి... భోగభాగ్యాల భోగి..సాంప్రదాయాల సంక్రాంతి..కష్టాలను తీర్చే కనుమ పండుగల సమయంలో ప్రజలు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. సూర్యోదయం వేళ ప్రజలంతా చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవున్ని వేడుకుంటూ, ఇందుకు గుర్తుగా ఇళ్లల్లో పాత చెక్క సామగ్రి బోగిమంటల్లో వేస్తుంటారు. భోగి రోజునే చిన్నారులపై రేగిపండ్లు, చిల్లరనాణేలను తలపై పోసి ముత్తయిదువులు దీవించడం విశేషం. ముత్యాల్లాంటి ముగ్గులు.. లక్ష్మీదేవి ప్రతీకగా భావించే రంగవల్లులు సంక్రాంతి వేళ ఇళ్లముందు కొలువుదీరుతుంటాయి. కల్లాపి జల్లి విభిన్న ఆకృతుల్లో పండగకు స్వాగతం పలుకుతూ ముగ్గులు వేస్తుంటారు. పూలతో అలంకరించి గొబ్బెమ్మలను పెట్టి భక్తిపాటలను ఆలపిస్తారు. పుణ్యప్రదమైన సంక్రాంతి... ధనురాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన పర్వదినమే మకర సంక్రమణంగా పెద్దలు చెబుతారు. ధాన్యరాసులు రైతన్న ఇంటికి చేరి పాడిపంటలతో వెలుగులను నింపేది ఈ పెద్దపండుగ. పలు రకాల పిండివంటలను చేసి సూర్యభగవానికి నివేదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కాడెద్దులకు పూజలు చేస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలుచేసి పెద్దలకు చూపించడం ఆనవాయితీగా వస్తోంది. అలరించే హరిదాసుల కీర్తనలు హరిలోరంగ హరి అంటూ హరిదాసుల కంచుగజ్జెలు ఘల్లుఘల్లుమనగ చిందులు తొక్కుతూ చిడతలు, తలపై రాగి పాత్రలతో హరిదాసులు ప్రత్యక్షమవుతారు. మరోవైపు జంగమదేవరలు, బుడబుక్కలదొరలు ఇంటింటికీ తిరుగుతూ పెద్దలను కీర్తిస్తుంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేయిస్తారు. స్నేహానికి చిహ్నం నేస్తరికం మిత్తమ్మ.. మొఖర.. వరిపండు.. గాదె.. ఇవేవో కొత్త పదాల్లా ఉన్నాయి కదూ.. అదేం కాదండి.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంజిల్లా ప్రజల స్నేహానికి ప్రతీక పదాలు. వేరే కులానికి చెందిన అమ్మ కాని అమ్మలను మిత్తమ్మ అని, బావ వరుసయ్యే వ్యక్తులను మొఖర, మహిళల్లో వదినె వరుసయ్యే వారిని వరిపండు, గాదె అంటూ ఆప్యాయతతో పిలుచుకుంటారు. ఇకపోతే నేస్తరికంగా దైవసాక్షిగా కట్టుకుని, జీవితాంతం నేస్తం అంటూ పిలుచుకుంటారు. వీరంతా సంక్రాంతికి ఆతిధ్యం ఇవ్వడం.. వస్త్రాలు, దుస్తులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. ప్రత్యేక వంటలను వండి భోజనాలకు పిలుచుకుంటారు. ఆనందాన్నిచ్చే పండగ ఆరోజుల్లో సంక్రాంతి అంటే ఇంట్లో ఒక పండుగ వాతావరణంలా ఉండేది..పెద్దపండుగ వచ్చిందంటే ఆ నెలంతా ఇంట్లో పండుగలా ఉండేది. ఉమ్మడికుటుంబాల వ్యవస్థ నుంచి ఉద్యోగ, ఉపాది దృష్యా ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా మారింది. సెల్ఫోన్ల ప్రభావం పండుగల మీద పడింది. ఆ నాటి ఆప్యాయ పలకరింపులు నేడు సెల్ఫోన్లకే పరిమితమైయ్యాయి. బోగి బోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. రైతాంగానికి, ప్రజానీకానికి ఎంతో ఆనందాన్నిచ్చే పండుగ. – తెన్నేటి నర్సింగరావు, జ్యోతిష్యుడు -
పండుగ పూట ధరల మంట..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ వంట నూనెలు, పప్పుల ధరలు భగ్గున మండుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు తగ్గడంతో ధరలు ఎగబాకుతున్నాయి. అన్ని రకాల వంట నూనెల ధరల్లో 15% నుంచి 20% వరకు పెరుగుదల ఉండటం, పప్పుల ధరలూ అదే రీతిన పెరుగుతుండటంతో సామాన్యుడి పండుగ సంతోషం ఆవిరవుతోంది. కాగుతున్న నూనెలు...వంట నూనెల ధరలకు ఈసారి రెక్కలొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పడిపోవడంతో దిగుమతి సుం కాలు పెరిగి వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో లీటర్‌కు రూ.5 నుంచి 20 దాకా వంట నూనెల ధరలు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం సంక్రాంతి కావడంతో హైదరాబాద్‌లో వంట నూనెల వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో నూనె ధరలు మరింత భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి. సన్ ప్లవర్ ఆయిల్ ధర గతేడాది లీటర్ 90 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ. 98 నుంచి రూ. 100 దాకా ధర పలుకుతోంది. గత నెలతో పోల్చినా ధర రూ. 15 నుంచి రూ. 20కి పెరిగింది. ఇక సామాన్యులు అధికంగా వినియోగించే పాయాయిల్‌కు కూడా కిలో రూ. 85 నుంచి రూ. 90కి పెరిగింది. గత ఏడాది దీని ధర కేవలం రూ.75గా ఉంది. గతంకన్నా రూ. 15 మేర ధరల పెరిగింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం రూ. 100 నుంచి రూ. 120కి పెరిగింది. దేశంలో ఏటా 15 మిలియన్ టన్నుల నూనెలు అవసరం ఉండగా అందులో 8 మిలియన్ టన్నుల నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కువగా మలేసియా, ఇండోనేసియాల నుంచి నూనెలు దిగుమతి అవుతోంది. అయితే ఈ రెండు దేశాల నుంచి నూనెల దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయంగా వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. వందకు అటుఇటూగా కంది, పెసర... గత ఏడాది ఖరీఫ్‌లో కందిసాగు 2.91 లక్షల హెక్టార్లకుగాను 2.60 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపైనే ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. అదీగాక దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలోనూ సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో మేలురకం కందిపప్పు ధర రూ. 95–102 మధ్య ఉంది. నల్లగొండ జిల్లాలో కిలో కందిపప్పు రూ. 102 వరకు ఉండగా మహబూబ్‌నగర్‌లో రూ. వందకు అటుఇటుగా అమ్ముతున్నారు. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో కందిపప్పు ధర రూ. 76–80 మధ్య ఉండగా, ఈసారి పెరుగుదల రూ. 20 వరకు ఉంది. గత 20 రోజుల కిందటి ధరలతో పోల్చినా రూ. 10 వరకు ధర పెరిగింది. గత ఏడాది రెండో రకం కందిపప్పు ధర కిలో రూ. 68–70 పలకగా ఈ ఏడాది రూ. 85–90 మధ్య పలుకుతోంది. ఇక పెసర, మినపపప్పు ధరలు సైతం ఆకాశంలోనే ఉన్నాయి. వాటి సాగులో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20 శాతం నుంచి 25 శాతం వరకు ఉంది. పెసర పప్పు గత ఏడాది రూ. 82 ఉండగా ఈ ఏడాది వందకు దగ్గరగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే కిలో రూ. 105 వరకు విక్రయిస్తున్నారు. అన్నింటికన్నా ఎక్కువగా మినపప్పు ధర ఏకంగా కిలో రూ. 115కిపైనే ఉంది. సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోవడంతో దీని ధర నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోరూ. 120 వరకు విక్రయిస్తున్నారు.