సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ వంట నూనెలు, పప్పుల ధరలు భగ్గున మండుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు తగ్గడంతో ధరలు ఎగబాకుతున్నాయి. అన్ని రకాల వంట నూనెల ధరల్లో 15% నుంచి 20% వరకు పెరుగుదల ఉండటం, పప్పుల ధరలూ అదే రీతిన పెరుగుతుండటంతో సామాన్యుడి పండుగ సంతోషం ఆవిరవుతోంది. కాగుతున్న నూనెలు...వంట నూనెల ధరలకు ఈసారి రెక్కలొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పడిపోవడంతో దిగుమతి సుం కాలు పెరిగి వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో లీటర్‌కు రూ.5 నుంచి 20 దాకా వంట నూనెల ధరలు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం సంక్రాంతి కావడంతో హైదరాబాద్‌లో వంట నూనెల వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో నూనె ధరలు మరింత భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి.
సన్ ప్లవర్ ఆయిల్ ధర గతేడాది లీటర్ 90 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ. 98 నుంచి రూ. 100 దాకా ధర పలుకుతోంది. గత నెలతో పోల్చినా ధర రూ. 15 నుంచి రూ. 20కి పెరిగింది. ఇక సామాన్యులు అధికంగా వినియోగించే పాయాయిల్‌కు కూడా కిలో రూ. 85 నుంచి రూ. 90కి పెరిగింది. గత ఏడాది దీని ధర కేవలం రూ.75గా ఉంది. గతంకన్నా రూ. 15 మేర ధరల పెరిగింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం రూ. 100 నుంచి రూ. 120కి పెరిగింది. దేశంలో ఏటా 15 మిలియన్ టన్నుల నూనెలు అవసరం ఉండగా అందులో 8 మిలియన్ టన్నుల నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కువగా మలేసియా, ఇండోనేసియాల నుంచి నూనెలు దిగుమతి అవుతోంది. అయితే ఈ రెండు దేశాల నుంచి నూనెల దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయంగా వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి.
వందకు అటుఇటూగా కంది, పెసర...
గత ఏడాది ఖరీఫ్‌లో కందిసాగు 2.91 లక్షల హెక్టార్లకుగాను 2.60 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపైనే ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. అదీగాక దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలోనూ సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మేలురకం కందిపప్పు ధర రూ. 95–102 మధ్య ఉంది. నల్లగొండ జిల్లాలో కిలో కందిపప్పు రూ. 102 వరకు ఉండగా మహబూబ్‌నగర్‌లో రూ. వందకు అటుఇటుగా అమ్ముతున్నారు. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో కందిపప్పు ధర రూ. 76–80 మధ్య ఉండగా, ఈసారి పెరుగుదల రూ. 20 వరకు ఉంది.
గత 20 రోజుల కిందటి ధరలతో పోల్చినా రూ. 10 వరకు ధర పెరిగింది. గత ఏడాది రెండో రకం కందిపప్పు ధర కిలో రూ. 68–70 పలకగా ఈ ఏడాది రూ. 85–90 మధ్య పలుకుతోంది. ఇక పెసర, మినపపప్పు ధరలు సైతం ఆకాశంలోనే ఉన్నాయి. వాటి సాగులో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20 శాతం నుంచి 25 శాతం వరకు ఉంది. పెసర పప్పు గత ఏడాది రూ. 82 ఉండగా ఈ ఏడాది వందకు దగ్గరగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే కిలో రూ. 105 వరకు విక్రయిస్తున్నారు. అన్నింటికన్నా ఎక్కువగా మినపప్పు ధర ఏకంగా కిలో రూ. 115కిపైనే ఉంది. సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోవడంతో దీని ధర నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోరూ. 120 వరకు విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment