Prices of pulses
-
ఉడుకుతున్న పప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై రెండో వారం నుంచి పప్పుల ధరల్లో పెరుగుదల ఉంటుందన్న కేంద్రం అంచనాలకు అనుగుణంగానే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళలో కిలో కందిపప్పు ధర రూ.135–140కి చేరగా, ప్రస్తుత వర్షాలతో జరిగిన పంట నష్టం కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. వరదలతో పెరిగిన నష్టం.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు తగ్గినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 1.27 కోట్ల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కాగా, ఈ ఏడాది అది 1.18 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దేశంలో ఎక్కువగా సాగు చేసే కంది పంట విస్తీర్ణం గత ఏడాది 47 లక్షల హెక్టార్లుంటే అది ఈ ఏడాదికి 41 లక్షల హెక్టార్లకు తగ్గింది. అధికంగా సాగయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగింది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపై ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పప్పుల ధరలను క్రమంగా పెంచుతున్నట్లు కేంద్రం గుర్తించింది. జూలై మొదటి వారంలో కందిపప్పు జాతీయ సగటు ధర కిలో రూ.100 ఉంటే అది ఇప్పుడు రూ.109కి చేరింది. మినప, పెసర, శనగ పప్పులు ధరలు సైతం ఏకంగా రూ.10 మేర పెరిగాయి. కేంద్రం అంచనా వేసిన ధరల కన్నా రూ.10–15 మేర అధికంగా బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్రేడ్–1 రకం కందిపప్పు ధర కిలో రూ.135–140మధ్య ఉంది. ఇక్కడ ధరలు నెల రోజుల వ్యవధిలోనే రూ.20–25 వరకు పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరలు రూ.100 నుంచి రూ.115 మధ్య ఉన్నాయి. ఢిల్లీలోనూ కిలో కందిపప్పు ధర రూ.120 ఉండగా, మినపపప్పు ధర రూ.125గా ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్ మొదలయింది. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు పండగ సీజన్ నేపథ్యంలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టిస్తే ఈ ధరల పెరుగుదల మరింతగా ఉండవచ్చని కేంద్రం అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గట్టి నిఘా ఉంచండి.. ధరల కట్టడిలో భాగంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. పప్పుధాన్యాల స్టాక్ హోల్డర్లు నిల్వలను బహిర్గతం చేసేలా చూడాలని కోరింది. నిల్వల వివరాలను ఆన్లైన్ మానిటరింగ్ పోర్టల్‌లో అప్డేట్ చేసే వివరాలను సమీక్షించాలని తెలిపింది. -
పండుగ పూట ధరల మంట..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ వంట నూనెలు, పప్పుల ధరలు భగ్గున మండుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు తగ్గడంతో ధరలు ఎగబాకుతున్నాయి. అన్ని రకాల వంట నూనెల ధరల్లో 15% నుంచి 20% వరకు పెరుగుదల ఉండటం, పప్పుల ధరలూ అదే రీతిన పెరుగుతుండటంతో సామాన్యుడి పండుగ సంతోషం ఆవిరవుతోంది. కాగుతున్న నూనెలు...వంట నూనెల ధరలకు ఈసారి రెక్కలొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పడిపోవడంతో దిగుమతి సుం కాలు పెరిగి వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో లీటర్‌కు రూ.5 నుంచి 20 దాకా వంట నూనెల ధరలు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం సంక్రాంతి కావడంతో హైదరాబాద్‌లో వంట నూనెల వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో నూనె ధరలు మరింత భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి. సన్ ప్లవర్ ఆయిల్ ధర గతేడాది లీటర్ 90 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ. 98 నుంచి రూ. 100 దాకా ధర పలుకుతోంది. గత నెలతో పోల్చినా ధర రూ. 15 నుంచి రూ. 20కి పెరిగింది. ఇక సామాన్యులు అధికంగా వినియోగించే పాయాయిల్‌కు కూడా కిలో రూ. 85 నుంచి రూ. 90కి పెరిగింది. గత ఏడాది దీని ధర కేవలం రూ.75గా ఉంది. గతంకన్నా రూ. 15 మేర ధరల పెరిగింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం రూ. 100 నుంచి రూ. 120కి పెరిగింది. దేశంలో ఏటా 15 మిలియన్ టన్నుల నూనెలు అవసరం ఉండగా అందులో 8 మిలియన్ టన్నుల నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కువగా మలేసియా, ఇండోనేసియాల నుంచి నూనెలు దిగుమతి అవుతోంది. అయితే ఈ రెండు దేశాల నుంచి నూనెల దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయంగా వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. వందకు అటుఇటూగా కంది, పెసర... గత ఏడాది ఖరీఫ్‌లో కందిసాగు 2.91 లక్షల హెక్టార్లకుగాను 2.60 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపైనే ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. అదీగాక దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలోనూ సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో మేలురకం కందిపప్పు ధర రూ. 95–102 మధ్య ఉంది. నల్లగొండ జిల్లాలో కిలో కందిపప్పు రూ. 102 వరకు ఉండగా మహబూబ్‌నగర్‌లో రూ. వందకు అటుఇటుగా అమ్ముతున్నారు. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో కందిపప్పు ధర రూ. 76–80 మధ్య ఉండగా, ఈసారి పెరుగుదల రూ. 20 వరకు ఉంది. గత 20 రోజుల కిందటి ధరలతో పోల్చినా రూ. 10 వరకు ధర పెరిగింది. గత ఏడాది రెండో రకం కందిపప్పు ధర కిలో రూ. 68–70 పలకగా ఈ ఏడాది రూ. 85–90 మధ్య పలుకుతోంది. ఇక పెసర, మినపపప్పు ధరలు సైతం ఆకాశంలోనే ఉన్నాయి. వాటి సాగులో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20 శాతం నుంచి 25 శాతం వరకు ఉంది. పెసర పప్పు గత ఏడాది రూ. 82 ఉండగా ఈ ఏడాది వందకు దగ్గరగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే కిలో రూ. 105 వరకు విక్రయిస్తున్నారు. అన్నింటికన్నా ఎక్కువగా మినపప్పు ధర ఏకంగా కిలో రూ. 115కిపైనే ఉంది. సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోవడంతో దీని ధర నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోరూ. 120 వరకు విక్రయిస్తున్నారు. -
పప్పుల ధరలు దిగేదెన్నడు?
తేదీని ప్రకటించాలంటూ లోక్‌సభలో రాహుల్ డిమాండ్ * ధరల అంశంలో ప్రధాని మోదీ మౌనంపై విమర్శలు * అప్పుడు హర హర మోదీ... ఇప్పుడు కందిపప్పు మోదీ * తేదీల కంటే విధానాలతోనే సమస్యల పరిష్కారం: జైట్లీ న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడలేదని, పప్పుదినుసుల ధరలు ఎప్పుడు తగ్గుతాయో తేదీ ప్రకటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై చర్చలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల వేళ హర హర మోదీ అని కీర్తిస్తే... ఇప్పుడు కందిపప్పు మోదీ అంటున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో మొదటిసారి పూర్తి స్థాయి చర్చలో పాల్గొన్న రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పప్పులు, కూరగాయల ధరలు చుక్కల్ని తాకాయని, ఆ పెరుగుదలతో రైతులు ఎలాంటి లబ్ధి పొందలేదు’ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 2014న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో ‘తల్లి, బిడ్డ రాత్రంతా ఏడుస్తూ, తమ కన్నీళ్లను తాగుతూ నిద్రపోయారు’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తు చేశారు. తోచిన అర్థంలేని వాగ్దానాలు చేసినప్పటికీ, కందిపప్పు ధర ఎప్పుడు దిగివస్తుందో కచ్చితంగా చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో తనకు కాపలాదారు బాధ్యత ఇవ్వాలని చెప్పిన మోదీకి తెలిసే పప్పుదినుసుల దోపిడీ సాగుతోందని రాహుల్ ఆరోపించారు. ‘పారిశ్రామికవేత్తలకు రూ. 52 వేల కోట్ల రుణాల్ని ఈ ప్రభుత్వం మాఫీ చేసింది. ముడిచమురు ధరల తగ్గుదలతో లాభపడ్డ రూ. 2 లక్షల కోట్లతో రైతులు, గృహిణులకు ఏం చేశారు’ అంటూ రాహుల్ నిలదీశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేశాం: జైట్లీ రాహుల్ ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. ద్రవ్యోల్బణాన్ని ఎన్డీఏ ప్రభుత్వమే అదుపులోకి తెచ్చిందని, మంచి వానలు పడడంతో నిత్యావసర వస్తువుల ధరలు మున్ముందు తగ్గవచ్చని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ హయాం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అధిక ద్రవోల్బణం వారసత్వంగా సంక్రమించిందని, యూపీఏ హాయంలో ద్రవ్యోల్బణం, ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పోల్చి చూడాలన్నారు. ‘తేదీలు ప్రకటించడం కంటే విధానాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. మరింత పప్పుధాన్యాల ఉత్పత్తి కోసం రైతుల్ని ప్రోత్సహించే విధానాలపై ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని అన్నారు. నెలవారీ లెక్కల ప్రకారం పప్పుదినుసుల ద్రవ్యోల్బణం దిగివస్తోందని, ధరల పెరుగుదలలో అవినీతి కోణం చూడకూడదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వంలో జరిగినవేనన్నారు. ఆధార్ తప్పనిసరిపై రాజ్యసభలో ఆందోళన ఎల్పీజీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, పింఛన్లు వంటి పథకాల లబ్ధికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై రాజ్యసభ కార్యకలాపాల్ని ప్రతిపక్షాలు గురువారం అడ్డుకున్నాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి ఆధార్ అంశంపై చర్చించాలంటూ తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీలు సభ ప్రారంభానికి ముందు చైర్మన్‌కు నోటీసులిచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కాగా, అటవీకరణ నిధి బిల్లు, 2016ను రాజ్యసభ ఆమోదించింది. గతేడాది మేలో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో గత నాలుగేళ్లుగా ఖర్చుపెట్టకుండా ఉన్న రూ. 42 వేల కోట్లకు మోక్షం లభించింది. లోక్‌పాల్ చట్ట సవరణ బిల్లునూ రాజ్యసభ ఆమోదించింది. -
పప్పుల ధరలు పైపైకి
* గ్రేడ్-1 కంది కిలో ధర రూ.145 నుంచి రూ.150, గ్రేడ్-2 రూ.125 నుంచి రూ.130 * గత ఏడాదితో పోలిస్తే రూ.50 నుంచి రూ.60 మేర ఎక్కువ * తగ్గిన పప్పుధాన్యాల దిగుబడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగల మాదిరే.. పప్పుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పప్పుధాన్యాల దిగుబడి, పప్పుల దిగుమతి పడిపోయింది. వినియోగదారుల దిగులు పెరిగిపోయింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే కందిపప్పు ధర రూ.10 మేర పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు అదనంగా రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి. గత ఏడాది ఖరీఫ్‌లో మొత్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కావాల్సి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగు చేశారు. పెసర 48 శాతం, మినుములు 45 శాతం, కందులు 78 శాతం మేర సాగు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కంది మొత్తం ఉత్పత్తి లక్ష్యం 1.67 లక్షల మెట్రిక్ టన్నులుండగా అది 1.05 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. మహారాష్ట్రలో కంది సాగు తగ్గిపోవడంతో అక్కడి నుంచి దిగుమతులు పూర్తిగా క్షీణించాయి. దీనికి తోడు రబీలోనూ కంది సాగు తగ్గడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో కంది గ్రేడ్-1 రకం రూ.90 ఉండగా అది ఈ ఏడాది ఏకంగా రూ.145 నుంచి రూ.148 మధ్య ఉంది. ఇక గ్రేడ్-2 కంది ధర గత ఏడాది రూ.82 నుంచి రూ.85 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.125 నుంచి రూ.128 వరకు ఉంది. ఈ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. రంగంలోకి కేంద్రం రాష్ట్రంలో మున్ముందు పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశముంది. డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు నిల్వలను దాచేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటే భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్ర ఆదేశాల అనుగుణంగా ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసి పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలు ఏ మేరకు ఉంటాయో అంచనా ఇవ్వాలని, డిమాండ్‌కు అనుగుణంగా తన బఫర్ స్టాక్ నుంచి పప్పుల విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ అవసరాలు తీరాక మిగులు ఉంటే, రాష్ట్ర సమ్మతి మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్లోకి ఇదే బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తామని తెలిపింది. -
కందిపప్పు మద్దతు ధర రూ.325 పెంపు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల ధరలు ఎగసిపడుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో పప్పు ధాన్యాలకు మద్దతు ధరను రూ. 325 పెంపునకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. గోధుమ మద్దతుధరపై మరో రూ.75 బోనస్ అందించేందుకు ఆర్థికవ్యవహారల కేబినెట్ కమిటీ(సీసీఎఫ్ఏ) ఆమోదం తెలిపింది. దీంతో 2015-16రబీ సీజన్‌కుగాను గోధుమ మద్దతుధర క్వింటాకు రూ.75 పెరిగి రూ.1,525కు చేరుకుంది. నూనెగింజల మద్దతు ధరను క్వింటాకు రూ.250 పెంచారు. పెంపు తర్వాత కందిపప్పు మద్దతుధర రూ.3,325కు, శెనగల మద్దతుధర రూ.3,425కు చేరింది. వ్యవసాయ ఖర్చులు, ధరల సలహా మండలి కమిషన్(సీఏసీపీ) సూచించినట్లుగా ఆరు రబీ పంటలైన గోధుమలు, బార్లీ, శెనగలు, కందిపప్పు, ఆవాలు, కుసుమ నూనె గింజలకు మద్దతుధరను పెంచాలని నిర్ణయించారు. ఆహార బిల్లును ఇంకా అమలుచేయని రాష్ట్రాల్లో పేద, అత్యంత పేద వర్గాలకు 27లక్షల ధాన్యాలను కేటాయించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటికి 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార బిల్లు అమల్లో ఉండగా.. మిగిలిన రాష్ట్రాలు సెప్టెంబర్ 2015 కల్లా. అమలు చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలనుంచి స్పందన రాలేకపోవడంతో కేంద్రమే పేద వర్గాలకు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. మద్దతు ధర పెంపుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హరియాణా సీఎం ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు. బెల్జియం, భారత్ మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధికి సహకారం అందించుకోవటంతోపాటు.. పునరుత్పత్తి శక్తికి సంబంధించిన సాంకేతికత విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
‘రిటైల్’ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్ : ‘అప్పు చేసి పప్పుకూడు తినరా.. ఓ నరుడా..’ అని ఓ సినీ కవి ఎప్పుడో వక్కాణించారు. పప్పన్నం తినాలంటే అప్పు చేయాల్సి వస్తుందని ఆయన ముందుగా ఊహించారేమో..! ప్రస్తుత పరిస్థితి సరిగ్గా అందుకు తగ్గట్టుగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కందిపప్పు ధర రూ.210కి చేరిందన్న వార్తలతో బుధవారం నగరంలో రిటైల్ వ్యాపారులు పప్పుల ధరల్ని అమాంతం పెంచేశారు. ఫస్ట్, సెకెండ్, థర్డ్ క్వాలిటీల పేరుతో విభజించి ఇష్టారీతిన ధరలు నిర్ణయించారు. నాణ్యమై న కందిపప్పు కిలో రూ. 210లు, రెండోరకం రూ. 200, మూడో రకం పప్పు రూ.190ల ప్రకారం వసూలు చేస్తున్నారు. అయితే... ఇక్కడొక మతలబు ఉంది. కొందరు రేషన్ షాపు డీలర్లు కందిపప్పును కేజీ రూ.80-100ల ప్రకారం గుట్టుగా రిటైల్ వ్యాపారులకు చేరవేస్తుండటంతో వాటిని నాణ్యమైన పప్పులో కలిపి విక్రయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు వ్యాపారులు 2 క్వింటాళ్ల గ్రేడ్-1 రకం కందిపప్పులో 1 క్వింటాల్ గ్రేడ్-2 పప్పును కలిపి బెస్ట్క్వాలిటీ పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజంగా పప్పుల ధరల విషయంలో నగరవాసులను నిలువుగా దోచుకుంటున్నది మాత్రం రిటైల్ వర్తకులే. నగర మార్కెట్లో బుధవారం కందిపప్పు ధర రూ.210లకు చేరుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరల్లో భారీ తేడా పప్పుల్లో రారాజైన కందిపప్పు..ధర విషయంలో కూడా తన హవాను కొనసాగిస్తుండగా... మిగతా పప్పుల ధరలు కూడా కాస్త అటూ ఇటుగా దీన్నే అనుసరిస్తున్నాయి. సాధారణంగా హోల్‌సేల్ ధరకు రిటైల్ ధరకు మధ్య తేడా రూ.3 నుంచి రూ.4 కు మించదు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. శనగ, మినప, పెసర పప్పుల ధరల్లో హోల్‌సేల్ ధరలతో పోలిస్తే రిటైల్ వ్యాపారుల వద్ద కేజీ కి రూ.10-16 తేడా కన్పిస్తోంది. హోల్‌సేల్‌గానే ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ రిటైల్ వ్యాపారులు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో మినపప్పు కేజీ రూ.175-180లుండగా రిటైల్‌గా కేజీ రూ.200లు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క మినపప్పేకాదు...పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, పుట్నాలు, పల్లీల ధరల్లో కేజీకి రూ.10-16ల వరకు అదనంగా పిండుకొంటున్నారు. నగరంలో నిత్యం 50-60 టన్నుల కందిపప్పు వినియోగిస్తుండగా, మినపప్పు 60-70 టన్నులు, శనగ, పెసర పప్పులు కూడా రోజుకు 30-35టన్నులు అవసరం అవుతున్నాయి. జనవరిలో కొత్తపంట చేతికందుతుందని, అప్పటివరకు కందిపప్పు ధర దిగివచ్చే అవకాశం లేదని దాల్మిల్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రైతుబజార్లలోనూ... నగరంలోని పలు రైతుబ జార్లలో స్వయం సహాయ క సంఘాలు నడుపుతున్న దుకాణాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. నాణ్యత లో రెండు, మూడు రకాల పప్పుల పేర్లు చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిజానికి వీరు అమ్ముతున్నది రెండు, మూడో రకం కందిపప్పే అయినా...మొదటి రకం పప్పు పేరుతో కేజీ రూ.190-195 ప్రకారం వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రధానమైన ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, కూకట్పల్లి, వనస్థలిపురం, ఫలక్‌నుమా రైతుబజార్లలో పప్పుల ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో లేవు. రేషన్ డీలర్ల నజర్! కంది పప్పు ధర పెరగడంతో కోటా ఇవ్వాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు ప్రతి నెల రూపాయికి కిలో బియ్యం తప్ప..కందిపప్పు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. కానీ ఇప్పుడు వారే కంది పప్పు కోసం డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ ఇవ్వాలంటూ పౌరసరఫరాల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ధరలు మామూలుగా ఉన్నప్పుడు ఇండెంట్ పెట్టని కారణంగా గ్రేటర్‌లోని రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో గల ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో కంది పప్పు కొరత ఏర్పడింది. సివిల్ సప్లయిస్ గోదాముల్లో కంది పప్పు నిల్వలు ఉన్నప్పటికి రేషన్ షాపులకు పూర్తి స్ధాయిలో సరఫరా కాలేదు. నిబంధనల ప్రకారం గత నెల (సెప్టెంబర్) ఆఖరులో అక్టోబర్ కోటా కోసం డీడీ చెల్లించి ఇండెంట్ పెట్టిన షాపులకు మాత్రమే కంది పప్పు విడుదలైంది. అది కూడా మొత్తం ఇండెంట్లో 60 నుంచి 75 శాతం మాత్రమే రేషన్ షాపులకు సరఫరా జరిగింది. రేషన్ షాపుల్లో కందిపప్పు రూ.50 కిలో చొప్పున లబ్ధిదారులకు ఇవ్వాలి. బహిరంగ మార్కెట్ రేటు కంటే ఇది ఎంతో తక్కువ. కృత్రిమ కొరత.. బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర రెండింతలు కావడంతో డిమాండ్ పెరిగినట్లయింది. పర్యవసానంగా రేషన్‌షాపుల్లో కృత్రిమ కొరత ఏర్పడింది. డీలర్ల చేతివాటంతో అక్టోబర్ మాసానికి సరఫరా అయినా కంది పప్పు నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలి పోయాయి. బహిరంగ మార్కెట్ వ్యాపారులకు క్వింటాలు రూ.1000 నుంచి 1400 చొప్పున కంది పప్పు నిల్వలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన కోటా కోసం గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంత రేషన్ డీలర్ల దృష్టి మిగిలిన కంది పప్పు కోటాపై పడింది. గోదాముల్లో నిల్వలు ఉన్న కారణంగా..అక్టోబర్ నెల పూర్తి స్థాయి కోటా సరఫరా చేయాలని అధికారులపై ఒత్తిళ్లు ప్రారంభించారు. -
నల్లబజారులో పప్పు మేటలు
5,800 టన్నుల పప్పు పట్టివేత.. తెలంగాణలోనే 2,580 టన్నులు స్వాధీనం రూ. 210కి చేరిన కందిపప్పు ధర ♦ 20 లక్షల టన్నులమేర ఉత్పత్తి లోటు ♦ విదేశాలనుంచి దిగుమతి, ఖరీఫ్ పంటపైనే సర్కారు ఆశలు ♦ బిహార్ ఎన్నికల్లోనూ ‘పప్పు’ చుట్టూ రాజకీయాలు న్యూఢిల్లీ: పప్పుధాన్యాల కృత్రిమ కొరతను సహించేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా వేల టన్నుల ధాన్యం దళారుల చేతుల్లోనే ఉంది. దీనిపై దృష్టిపెట్టిన కేంద్రం కొంత కాలంగా ఐదు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో 5,800 టన్నుల కందిపప్పు పట్టుబడగా.. ఇందులో 2,580 టన్నులు ఒక్క తెలంగాణలోనే స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో 2,295 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 600 టన్నులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో పప్పును గుప్పిట్లో పెట్టుకున్న దళారులు మార్కెట్ రేటును శాసిస్తున్నారు. నల్లబజారు నిల్వలకు తోడు అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణం వల్ల 2014-15 సంవత్సరానికి 20 లక్షల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి లోటు కూడా ధర పెరుగుదలకు కారణమైంది. ధరల అదుపునకు కేంద్రం నడుంబిగించింది. కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన వ్యవసాయం, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్యం, ఇతర శాఖల ముఖ్య అధికారులతో సమావేశంలో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ధర, ఉత్పత్తి, సేకరణ అంశాలపై ఈ భేటీలో చర్చించారు. 40వేల టన్నుల ధాన్యం ప్రభుత్వం వద్ద నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అటు రాష్ట్రాలు కూడా కేంద్రం ఆదేశాలపై వ్యాపారులు, ఎగుమతిదారులు, లెసైన్స్డ్ ఫుడ్ ప్రాసెసర్లు, రిటైల్ చైన్ స్టోర్లలో నిల్వలను నియంత్రిస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. గతవారం ఢిల్లీ మార్కెట్లో కిలో రూ. 181 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు రూ. 210కి చేరింది. దీన్ని నియంత్రించేందుకు దిగుమతి చేసుకున్న విదేశీ పప్పును 500 సెంటర్లలో రూ.120కే అందిస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి వచ్చే పప్పు ఉత్పత్తి ద్వారా.. ఈ కొరతను కొంతవరకైనా తీర్చవచ్చని కేంద్రం భావిస్తోంది. ధరలపైనే బిహార్ పోరు: పట్నా: బిహార్ ఎన్నికల్లోనూ పెరుగుతున్న పప్పు ధర చుట్టూ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. మోదీ సారథ్యంలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. సామాన్యుడు కడుపునిండా తినే పరిస్థితి కూడా లేదని సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. నితీశ్ అహం వల్లే బిహార్‌లో ధరలు పెరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ విమర్శించారు. ‘ధరల నియంత్రణ నిధి’ సాయంతో.. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు రూ.120-130కే సబ్సిడీ ద్వారా సామాన్యులకు పప్పును అందుబాటులోకి ఉంచాయన్నారు. రాష్ట్రాలు నేరుగా విదేశాలనుంచి పప్పు దిగుమతి చేసుకునేందుకు ఎగుమతి సుంకాన్ని తొలగించినా.. నితీశ్ ఎందుకు కొనలేదో చెప్పాలని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. కేంద్రం సబ్సిడీలు ఇస్తున్నా.. బిహారీలకు అవి చేరడం లేదని నితీశ్ సర్కారులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ విమర్శించారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది. -
కందిపప్పు నిల్వలపై నిఘా పెట్టండి
♦ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ♦ పప్పుల నిల్వల పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం ♦ బ్లాక్‌మార్కెట్ నిలువరించేలా చర్యలు చేపట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాల ధరలు భారీగా పెరిగిన దృష్ట్యా నిల్వలపై నిఘా పెంచాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆకస్మిక దాడులు, విసృ్తత తనిఖీలు నిర్వహించి బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకోవాలని సూచించింది. నిత్యావసర సరుకుల చట్టంలో ఇటీవల చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్రాలు వ్యవహరించాలని పేర్కొంది. రాష్ట్రంలో మేలురకం కందిపప్పు ధర కిలో రూ.200కు చేరుకోగా, మినపపప్పు సైతం రూ.190 వరకు పలుకుతోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏర్పడిన కొరతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర సరుకుల చట్టంలో కేంద్రం మార్పులు చేసింది. లెసైన్స్ పొందిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులతో పాటు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల సంస్థలు నిల్వ చేసుకొనే పప్పు ధాన్యాలపై పరిమితులు విధించింది. దీనికి సంబంధించి సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పప్పుధాన్యాల లభ్యత, ధరలు, నిల్వలు, నిఘా తదితర అంశాలను తెలుసుకున్నారు. నిల్వలపై విధించిన పరిమితిని ధిక్కరించేవారిపై, కొత్తగా తీసుకున్న నిర్ణయాన్ని పాటించని వ్యాపారులపై నిఘా పెట్టాలని, తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రాలు పప్పుధాన్యాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని... ఖరీఫ్‌లో వచ్చే పంటను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ‘కంది’ విక్రయ కేంద్రాలపై మిల్లర్లు విముఖం పెరిగిన ధరల దృష్ట్యా ప్రత్యేకంగా కంది విక్రయ కేంద్రాలను రైతుబజార్లలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల దాల్ మిల్లర్లు విముఖత చూపినట్లు తెలిసింది. అంతర్జాతీ య, జాతీయ డిమాండ్ దృష్ట్యా ధరలు హె చ్చుగా ఉన్నాయని.. ఈ దశలో తాము అధిక ధరకు కొనుగోలు చేసి కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన ధరలకు విక్రయించలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 కందిపప్పు విక్రయ కేంద్రాల్లో సైతం మిల్లర్లు అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిసింది. కందిపప్పు ధర కిలో రూ.200కు చేరడం.. ఈ కేంద్రాల్లో రూ.100కే విక్రయించాల్సి రావడంతో భారం పడుతోం దని.. దీనివల్లే వాటిని దాల్ మిల్లర్లు మూసివేశారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
పప్పు ధరల సెగ
- మేలో రిటైల్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 5.01 శాతానికి అప్ - ఏప్రిల్‌లో ఈ రేటు 4.87 శాతం న్యూఢిల్లీ: పప్పు దినుసుల ధరల భారీ పెరుగుదల ప్రభావం మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై పడింది. రిటైల్ ధరలు వార్షిక ప్రాతిపదికన మేలో 5.01 శాతం పెరిగాయి. అంటే 2014 మేలో ఉన్న మొత్తం రిటైల్ బాస్కెట్ ధర తో పోలిస్తే 2015 మేలో 5.01 శాతం పెరిగిందన్నమాట. ఏప్రిల్‌లో ఈ రేటు 4.87 శాతం. అకాల వర్షాల వంటి అననుకూల వాతావరణం వల్ల 2014-15 పంట కాలంలో (జూలై-జూన్) పప్పు దినుసుల ఉత్పత్తి పడిపోయింది. 2013-14 పంట కాలంలో ఉత్పత్తి 19.78 మిలియన్ టన్నులయితే, తాజాగా ముగుస్తున్న కాలంలో ఈ పరిమాణం దాదాపు 18 టన్నులకే పరిమితమవుతుందని అంచనా. ఈ ప్రభావంతో ఈ కమోడిటీ ధరలు భారీగా పెరిగాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... - ఆహారం, పానీయాలు: ఈ విభాగంలో ధరల పెరుగుదల 5.13 శాతంగా ఉంది. ఈ బాస్కెట్లో ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే- చక్కెర, తీపిపదార్థాల ధరలు మాత్రం వార్షికంగా 7.30 శాతం తగ్గాయి. అలాగే గుడ్ల రేట్లు కూడా 0.78 శాతం తగ్గాయి. ఒక్క పప్పుదినుసుల ధరలు మాత్రం రెండంకెలు పైగా వార్షికంగా 16.62 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం, మాంసం-చేపల ధరలు 5.43 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 7.43 శాతం, చమురు-వెన్న విభాగంలో ధరలు 1.95 శాతం పెరిగాయి. ముఖ్యంగా పండ్ల ధరలు 3.84 శాతం, కూరగాయల ధరలు 4.64 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 8.82 శాతం ఎగశాయి. ఆల్కాహాలేతర పానీయాల ధరలు 4.84 శాతం, హోటల్స్ మీల్స్ ధరలు 7.89 శాతం పెరిగాయి. - పాన్, పొగాకు, మత్తుప్రేరిత పదార్థాలు: ఈ విభాగంలో ధరలు 9.50 శాతం ఎగశాయి. - దుస్తులు, పాదరక్షలు: 6.2 శాతం పెరగుదల -
పప్పుల రేట్లు పైపైకి..
కేజీకి రూ.8-10లు పెరుగుదల రిటైల్ మార్కెట్లో మరింత ఎక్కువ సిటీబ్యూరో : నగర మార్కెట్లో పెసర, మినపప్పుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే వీటి ధర కేజీకి రూ.8-10లు అదనంగా పెరగడం సామాన్య ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రిటైల్ మార్కెట్లో మినపప్పు కేజీ రూ.98, పెసర పప్పు కేజీ రూ.110 ధర పలుకుతోంది. గత నెలలో పెసరపప్పు కేజీ రూ.99, మినపప్పు రూ.90 ఉండేది. కొత్తపంట రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండంతో వ్యాపారులు కూడబలుక్కొని ధరలు పెంచేశారన్న వాదనలు విన్పిస్తున్నాయి. కార్పొరేట్ దుకాణాలతో పోలిస్తే కాస్తో కూస్తో రైతుబజార్లలో పప్పుల ధరలు కొంతమేర తక్కువగా ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు రైతుబజార్లలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పెసరపప్పు కిలో రూ.91, మినపప్పు రూ.103ల ప్రకారం విక్రయించారు. నిత్యం డీఎస్ఓ కార్యాలయం నుంచి పప్పుల ధరలు తెలుసుకొని హోల్ సేల్ ధరకు రూ.2 అదనంగా నిర్ణయిస్తుండటంతో రైతుబజార్లలో ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే కందిపప్పు ధర గత వారం రోజుల్లోనే రూ.2-3 పెరిగింది. రైతుబజార్లలోని గృహ మిత్ర, ఏపీ మార్క్‌ఫెడ్, నాఫెడ్, హాకా, డీసీఎంఎస్ ఏజెన్సీలు కందిపప్పును అందుబాటులో ఉంచడం ద్వారా ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త... మినప, పెసరపప్పు ధరలు పెరుగుతుండటంతో నగరంలోని పలు హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించారు. కొన్ని హోటళ్లలో నాణ్యమైన మినప, పెసర పప్పులో రెండో క్వాలిటీని మిక్స్ చేసి మెనూను యథావిధిగా కొనసాగిస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం భోజనంలో కందిపప్పుకు బదులు శెనగపప్పు, ఎర్రపప్పును, ఇతర కూరగాయల కర్రీని ఇస్తున్నాయి. కందిపప్పును మెనూలో తప్పనిసరిగా ఇచ్చే హోటళ్లలో మాత్రం అది పప్పులా కాకుండా పలుచగా సాంబారులా అందిస్తున్నారు. -
నిత్యావసరాలకు ధరాఘాతం
నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ఒక్క పూట పస్తులుంటున్న పేదజనం బచ్చన్నపేట : నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నారుు. ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. సామాన్య కుటుంబాలు పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారుు. గత నెల బడ్జెట్‌కు వచ్చే నెల రెట్టింపవుతుండడంతో ఒక్కపూటతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. మార్కెట్లో ఈ రోజు ఉన్న ధరలు, రేపు ఉండడం లేదు. పప్పుల ధరలు చుక్కలనంటుతుండగా వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. తెల్ల నువ్వులు కిలో రూ.160, విడి పల్లీ నూనె రూ.85, కాటన్ నూనె కిలో రూ.75, 5 లీటర్ల పల్లి నూనె క్యాన్ రూ.350, సన్‌ఫ్లవర్ క్యాన్ రూ.440, తెల్ల ఉల్లిగడ్డ కిలో రూ.30, ఎర్ర ఉల్లిగడ్డ కిలో రూ.25కు పెరిగిపోయాయి. సన్నరకాలకు చెందిన లోకల్ కొత్త బియ్యం క్వింటాల్‌కు రూ.3వేలు, కోదాడకు చెందిన కొత్త బియ్యం క్వింటాల్‌కు రూ.3150, సన్నరకం బియ్యం పాతవి మొదటి రకం క్వింటాల్‌కు రూ.3800, రెండో రకం రూ.3400 పలుకుతున్నాయి. హెచ్ఎంటీ రకం రైస్‌కు క్వింటాల్‌కు రూ.4500పైగా వరకు ధర పుంది. కిరాణ, బియ్యం ధరలకు తోడు కూరగాయల ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కిలో రూ.40 కావడంతో వారిపై అదనపు భారం పడుతోంది. ధరలు గిట్ల పెరిగితే ఎట్లా నెల రోజులు గడవక ముందే పప్పుల ధరలు పెరిగాయి. నెలనెలా గిట్ల ధరలు పెరగితే బతికేదెట్లా. నెలకు రూ.3 వేలు అయ్యే ఖర్చు. ఇప్పుడు రూ.8 వేలకు వచ్చింది. సామాను తేవాలంటేనే భయమైతాంది. పని చేసుకుంటేనే బతికేటోళ్లం. ధరల భారం మాపై మోపితే ఎట్లా. పెరిగిన ధరలను తగ్గించాలి. - బైరి మంజుల, మహిళ, బచ్చన్నపేట ధరలు తగ్గించాలి నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి. కిలో పప్పు కొనాలంటే కళ్లపొంటి నీళ్లు కారుతున్నయి. రూ.వంద నోటు తీసుకుపోతే ఒక్కపూట తినేందుకు కూడా సరుకులు వచ్చే పరిస్థితి లేదు. దుకాణంలోకి వెళ్లినప్పుడాళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బైక్‌లు బాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. రూ.2500 నుంచి రూ.3వేల వరకు ఇంటి అవసరాలకు ఖర్చు వచ్చేది. ధరలు పెరగడంతో రూ.5 వేలకు పెరిగిపోయింది. దీంతో ఒక్కపైసా కూడా వెనకేసుకోలేకపోతున్నం. - కర్ణాల వేణు, మెకానిక్, బచ్చన్నపేట