నల్లబజారులో పప్పు మేటలు
5,800 టన్నుల పప్పు పట్టివేత.. తెలంగాణలోనే 2,580 టన్నులు స్వాధీనం
రూ. 210కి చేరిన కందిపప్పు ధర
♦ 20 లక్షల టన్నులమేర ఉత్పత్తి లోటు
♦ విదేశాలనుంచి దిగుమతి, ఖరీఫ్ పంటపైనే సర్కారు ఆశలు
♦ బిహార్ ఎన్నికల్లోనూ ‘పప్పు’ చుట్టూ రాజకీయాలు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల కృత్రిమ కొరతను సహించేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా వేల టన్నుల ధాన్యం దళారుల చేతుల్లోనే ఉంది. దీనిపై దృష్టిపెట్టిన కేంద్రం కొంత కాలంగా ఐదు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో 5,800 టన్నుల కందిపప్పు పట్టుబడగా.. ఇందులో 2,580 టన్నులు ఒక్క తెలంగాణలోనే స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో 2,295 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 600 టన్నులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో పప్పును గుప్పిట్లో పెట్టుకున్న దళారులు మార్కెట్ రేటును శాసిస్తున్నారు.
నల్లబజారు నిల్వలకు తోడు అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణం వల్ల 2014-15 సంవత్సరానికి 20 లక్షల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి లోటు కూడా ధర పెరుగుదలకు కారణమైంది. ధరల అదుపునకు కేంద్రం నడుంబిగించింది. కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన వ్యవసాయం, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్యం, ఇతర శాఖల ముఖ్య అధికారులతో సమావేశంలో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ధర, ఉత్పత్తి, సేకరణ అంశాలపై ఈ భేటీలో చర్చించారు. 40వేల టన్నుల ధాన్యం ప్రభుత్వం వద్ద నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అటు రాష్ట్రాలు కూడా కేంద్రం ఆదేశాలపై వ్యాపారులు, ఎగుమతిదారులు, లెసైన్స్‌డ్ ఫుడ్ ప్రాసెసర్లు, రిటైల్ చైన్ స్టోర్లలో నిల్వలను నియంత్రిస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.
గతవారం ఢిల్లీ మార్కెట్లో కిలో రూ. 181 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు రూ. 210కి చేరింది. దీన్ని నియంత్రించేందుకు దిగుమతి చేసుకున్న విదేశీ పప్పును 500 సెంటర్లలో రూ.120కే అందిస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి వచ్చే పప్పు ఉత్పత్తి ద్వారా.. ఈ కొరతను కొంతవరకైనా తీర్చవచ్చని కేంద్రం భావిస్తోంది.
ధరలపైనే బిహార్ పోరు: పట్నా: బిహార్ ఎన్నికల్లోనూ పెరుగుతున్న పప్పు ధర చుట్టూ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. మోదీ సారథ్యంలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. సామాన్యుడు కడుపునిండా తినే పరిస్థితి కూడా లేదని సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. నితీశ్ అహం వల్లే బిహార్లో ధరలు పెరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ విమర్శించారు. ‘ధరల నియంత్రణ నిధి’ సాయంతో.. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు రూ.120-130కే సబ్సిడీ ద్వారా సామాన్యులకు పప్పును అందుబాటులోకి ఉంచాయన్నారు.
రాష్ట్రాలు నేరుగా విదేశాలనుంచి పప్పు దిగుమతి చేసుకునేందుకు ఎగుమతి సుంకాన్ని తొలగించినా.. నితీశ్ ఎందుకు కొనలేదో చెప్పాలని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. కేంద్రం సబ్సిడీలు ఇస్తున్నా.. బిహారీలకు అవి చేరడం లేదని నితీశ్ సర్కారులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ విమర్శించారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది.