ఫ్రస్ట్రేషన్‌తోనే నాపై దాడి: డిప్యూటీ సీఎం మోదీ
పట్నా: తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ పిరికి చర్యగా అభివర్ణించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కొడుకులు, ఆర్జేడీ కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. బుధవారం పట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ ఫ్రస్ట్రేషన్‌తోనే వాళ్లు(ఆర్జేడీ) నాపై దాడి చేశారు. కాన్వాయ్‌లోని మూడు కార్లను ధ్వంసం చేశారు’ అని చెప్పారు.
డిప్యూటీ సీఎం మోదీ మంగళవారం సాయంత్రం వైశాలి జిల్లాలో పర్యటించిన సమయంలో సుమారు 400 మంది.. కాన్వాయ్‌ని అడ్డుకుని, రాళ్లదాడి చేసి, మూడు కార్లను ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలు సైతం ఎదురుదాడికి యత్నించగా, సుశీల్ మోదీ వారిని అడ్డుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. మోదీపై దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. కాగా, దాడికి పాల్పడింది తాము కాదని ఆర్జేడీ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: కాగా, భారీ వర్షం కారణంగా వరదలో చిక్కుకుపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశామని డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నట్లు వివరించారు.